అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత పర్యటన సందర్భంగా ఇరు దేశాల సంబంధాల్లోని ఐదు చిక్కుముడులు ఏమిటన్నది చూస్తే..
వాణిజ్య పన్నుల వివాదాలు: భారత్‌ను టారిఫ్ కింగ్ అని ఇటీవలే ట్రంప్ చేసిన వ్యాఖ్య పరిస్థితిని మరింత ఇబ్బందికరంగా మార్చింది. 2018 నాటికి ఇరుదేశాల మధ్య వాణిజ్యం విలువ 142.6 బిలియన్ డాలర్లకు చేరుకున్నా గత ఏడాది అమెరికా స్టీలు, అల్యూమినియం దిగుమతులపై పన్నులు పెంచింది. భారత్‌కిచ్చే కొన్ని ప్రత్యేక రాయితీలను కూడా ఉపసంహరించుకుంది. భారత్ ఎగుమతు లపై ఈ నిర్ణయం ప్రభావం సుమారు 5600 కోట్ల డాలర్ల వరకూ పడింది. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో భారత్ బాదంపప్పు, వాల్‌నట్, ఆపిల్‌పండ్ల వంటి 28 వస్తువుల దిగుమతులు కొన్నింటిపై పన్నులు పెంచడం అమెరికా గుర్రుగా ఉంది.
హెచ్–1బీ వీసాలు:అమెరికన్లకు దక్కాల్సిన ఉద్యోగాలను విదేశీయులు కొల్లగొట్టేందుకు కారణమైన హెచ్–1బీ వీసాలపై నియంత్రణలు విధిస్తామన్న హామీతోనే ట్రంప్ గద్దెనెక్కారు. ఇందుకు తగ్గట్టుగానే ట్రంప్ ప్రభుత్వం హెచ్–1బీ వీసాల సంఖ్యను తగ్గించడంతో పాటు తాజాగా వీసా చార్జీలను రెండు వేల డాలర్ల నుంచి రెట్టింపు చేసేందుకు ప్రతిపాదనలను సిద్ధం చేసింది. త్వరలోనే హెచ్–1బీ వీసా పొందిన వ్యక్తుల భార్య/భర్తలు అక్కడ ఉద్యోగం చేసే అంశంపైనా త్వరలో సమీక్ష చేపట్టనున్నట్లు చెబుతోంది. భారతీయ ఐటీ కంపెనీలు దాఖలు చేసే హెచ్–1బీ వీసాల్లో 24% తిరస్క రణకు గురవుతున్నాయి. ఈ పరిణామాలన్నీ భారతీయులకు ఇబ్బంది కలిగించేవే.
డేటా లోకలైజేషన్: పౌరుల సమాచారంపై హక్కు తమదేనన్న భారత ప్రభుత్వ వాదన అమెరికాతో సంబంధాలను కొంతవరకూ ప్రభావితం చేస్తోంది. 2018లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొన్ని ఆదేశాలు జారీ చేస్తూ చెల్లింపులకు సంబంధించిన సమాచారాన్ని స్థానికంగానే స్టోర్ చేయాలని స్పష్టం చేసింది. ఈ నిర్ణయం అమెరికన్ కంపెనీలు వీసా, మాస్టర్‌కార్డ్‌లపై తీవ్రంగా ఉంది. ఆర్‌బీఐతోపాటు ఇతర ప్రభుత్వ విభాగాలు కూడా డేటా విషయంలో నియంత్రణలు విధించడం మొదలు పెట్టడంతో అమెరికన్ కంపెనీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. వీటి వల్ల ఆ కంపెనీలకు 780 కోట్ల డాలర్ల అదనపు ఖర్చులు వచ్చినట్లు అంచనా.
ఇరాన్, రష్యాలు: ముడిచమురు విషయంలో భారత్ ఎక్కువగా ఆధారపడ్డ ఇరాన్‌పై గత ఏడాది అమెరికా ఆంక్షలు విధించడంతో సమస్య మొదలైంది. అమెరికా ఒత్తిడితో భారత్ కూడా ఇరాన్ నుంచి చమురు దిగుమతులను తగ్గించుకుంది. రష్యా నుంచి దూరశ్రేణి క్షిపణులు (ఎస్–400) కొనుగోలు చేయాలన్న భారత్ లక్ష్యం కూడా అమెరికా ఆంక్షల కారణంగా సందిగ్ధంలో పడుతోంది.
5జీ పరీక్షలపై కూడా నీడలు: భారత్‌లో 5జీ సర్వీసుల పరీక్షలను చేపట్టనున్న హువాయి విషయమూ ఓ చిక్కుముడిగా మారింది. చైనా మద్దతుతో హువాయి ప్రపంచ టెలికామ్ నెట్‌వర్క్‌లో రహస్య సాఫ్ట్‌వేర్‌లను పెట్టి ఇతర దేశాలపై నిఘా పెడుతోందని ఆరోపిస్తూ అమెరికా ఆ కంపెనీపై నిషేధం విధించింది. అటువంటి సంస్థ భారత్‌లో 5జీ సర్వీసులను చేపట్టడం అగ్రరాజ్యానికి రుచించడం లేదు.
భారత్– అమెరికా.. 5 చిక్కుముళ్లు!
Published Sun, Feb 23 2020 4:59 AM | Last Updated on Mon, Feb 24 2020 1:59 PM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment