trade tax
-
భారత్– అమెరికా.. 5 చిక్కుముళ్లు!
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత పర్యటన సందర్భంగా ఇరు దేశాల సంబంధాల్లోని ఐదు చిక్కుముడులు ఏమిటన్నది చూస్తే.. వాణిజ్య పన్నుల వివాదాలు: భారత్‌ను టారిఫ్ కింగ్ అని ఇటీవలే ట్రంప్ చేసిన వ్యాఖ్య పరిస్థితిని మరింత ఇబ్బందికరంగా మార్చింది. 2018 నాటికి ఇరుదేశాల మధ్య వాణిజ్యం విలువ 142.6 బిలియన్ డాలర్లకు చేరుకున్నా గత ఏడాది అమెరికా స్టీలు, అల్యూమినియం దిగుమతులపై పన్నులు పెంచింది. భారత్‌కిచ్చే కొన్ని ప్రత్యేక రాయితీలను కూడా ఉపసంహరించుకుంది. భారత్ ఎగుమతు లపై ఈ నిర్ణయం ప్రభావం సుమారు 5600 కోట్ల డాలర్ల వరకూ పడింది. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో భారత్ బాదంపప్పు, వాల్నట్, ఆపిల్‌పండ్ల వంటి 28 వస్తువుల దిగుమతులు కొన్నింటిపై పన్నులు పెంచడం అమెరికా గుర్రుగా ఉంది. హెచ్–1బీ వీసాలు:అమెరికన్లకు దక్కాల్సిన ఉద్యోగాలను విదేశీయులు కొల్లగొట్టేందుకు కారణమైన హెచ్–1బీ వీసాలపై నియంత్రణలు విధిస్తామన్న హామీతోనే ట్రంప్ గద్దెనెక్కారు. ఇందుకు తగ్గట్టుగానే ట్రంప్ ప్రభుత్వం హెచ్–1బీ వీసాల సంఖ్యను తగ్గించడంతో పాటు తాజాగా వీసా చార్జీలను రెండు వేల డాలర్ల నుంచి రెట్టింపు చేసేందుకు ప్రతిపాదనలను సిద్ధం చేసింది. త్వరలోనే హెచ్–1బీ వీసా పొందిన వ్యక్తుల భార్య/భర్తలు అక్కడ ఉద్యోగం చేసే అంశంపైనా త్వరలో సమీక్ష చేపట్టనున్నట్లు చెబుతోంది. భారతీయ ఐటీ కంపెనీలు దాఖలు చేసే హెచ్–1బీ వీసాల్లో 24% తిరస్క రణకు గురవుతున్నాయి. ఈ పరిణామాలన్నీ భారతీయులకు ఇబ్బంది కలిగించేవే. డేటా లోకలైజేషన్: పౌరుల సమాచారంపై హక్కు తమదేనన్న భారత ప్రభుత్వ వాదన అమెరికాతో సంబంధాలను కొంతవరకూ ప్రభావితం చేస్తోంది. 2018లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొన్ని ఆదేశాలు జారీ చేస్తూ చెల్లింపులకు సంబంధించిన సమాచారాన్ని స్థానికంగానే స్టోర్ చేయాలని స్పష్టం చేసింది. ఈ నిర్ణయం అమెరికన్ కంపెనీలు వీసా, మాస్టర్‌కార్డ్‌లపై తీవ్రంగా ఉంది. ఆర్బీఐతోపాటు ఇతర ప్రభుత్వ విభాగాలు కూడా డేటా విషయంలో నియంత్రణలు విధించడం మొదలు పెట్టడంతో అమెరికన్ కంపెనీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. వీటి వల్ల ఆ కంపెనీలకు 780 కోట్ల డాలర్ల అదనపు ఖర్చులు వచ్చినట్లు అంచనా. ఇరాన్, రష్యాలు: ముడిచమురు విషయంలో భారత్ ఎక్కువగా ఆధారపడ్డ ఇరాన్‌పై గత ఏడాది అమెరికా ఆంక్షలు విధించడంతో సమస్య మొదలైంది. అమెరికా ఒత్తిడితో భారత్ కూడా ఇరాన్ నుంచి చమురు దిగుమతులను తగ్గించుకుంది. రష్యా నుంచి దూరశ్రేణి క్షిపణులు (ఎస్–400) కొనుగోలు చేయాలన్న భారత్ లక్ష్యం కూడా అమెరికా ఆంక్షల కారణంగా సందిగ్ధంలో పడుతోంది. 5జీ పరీక్షలపై కూడా నీడలు: భారత్‌లో 5జీ సర్వీసుల పరీక్షలను చేపట్టనున్న హువాయి విషయమూ ఓ చిక్కుముడిగా మారింది. చైనా మద్దతుతో హువాయి ప్రపంచ టెలికామ్ నెట్‌వర్క్‌లో రహస్య సాఫ్ట్వేర్లను పెట్టి ఇతర దేశాలపై నిఘా పెడుతోందని ఆరోపిస్తూ అమెరికా ఆ కంపెనీపై నిషేధం విధించింది. అటువంటి సంస్థ భారత్‌లో 5జీ సర్వీసులను చేపట్టడం అగ్రరాజ్యానికి రుచించడం లేదు. -
26 మందిపై వేటు?
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: బోధన్ వాణిజ్య పన్నుల శాఖ కుంభకోణంలో బాధ్యులపై సర్కారు ఎట్టకేలకు చర్యలకు ఉపక్రమించింది. కుంభకోణం సూత్రధారి, ట్యాక్స్ కన్సల్టెంట్ శివరాజ్‌తో చేతులు కలిపి సర్కారు కు రూ.వందల కోట్ల పన్ను ఎగవేతకు సహకరించిన ఆ శాఖ ఉన్నతాధికారులు, సిబ్బందిపై వేటు వేసేందుకు రంగం సిద్ధమైంది. మొత్తం 26 మం దిపై సస్పెన్షన్, క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని సర్కారు నిర్ణయించింది. అదనపు కమిషనర్ల నుంచి, జూనియర్ అసిస్టెంట్ వరకు వివిధ స్థాయి అధికారులు ఈ జాబితాలో ఉన్నారు. క్రమశిక్షణ చర్యలకు సంబంధించి న ఫైలుపై ఈ శాఖకు ప్రాతినిధ్యం వహిస్తున్న ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు కూడా సంతకం చేసినట్లు సమాచారం. రెండు, మూడు రోజుల్లో ఈ మేరకు సస్పెన్షన్లు, చార్జిమెమోలకు సంబంధించిన ఆదేశాలు జారీ కానున్నట్లు సమాచారం. కొనసాగిన శాఖాపరమైన విచారణ ఈ కుంభకోణంపై ఆ శాఖ ఎన్ఫోర్స్మెంట్ విభాగం శాఖా పరమైన విచారణ చేపట్టింది. ప్రత్యేక కమిషనర్ ఎం.సత్యనారాయణ రెడ్డి నేతృత్వంలోని బృందం విచారణ జరిపింది. ఈ కుంభకోణంతో సంబంధమున్న అధికారులు, సిబ్బంది పాత్రపై విచారణ చేపట్టింది. కార్యాలయంలోని కంప్యూటర్లు, భారీ సంఖ్యలో రికార్డులను స్వాధీనం చేసుకుని సుమారు నాలుగు నెలల పాటు విచారణ జరిపింది. ఈ మేరకు సెప్టెంబర్ మొదటివారంలో ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. ఈ నివేదిక ఆధారంగా ప్రభుత్వం శాఖాపరమైన చర్యలకు ఉపక్రమించింది. అదనపు కమిషనర్లపై సైతం.. ప్రభుత్వం తీసుకోనున్న చర్యల జాబితాలో ఇద్దరు అదనపు కమిషనర్లు ఉన్నారు. అలాగే, ముగ్గురు జాయింట్ కమిషనర్లు ఉన్నారు. వీరితో పాటు కుంభకోణం జరిగిన బోధన్ సీటీవో కార్యాలయం పరిధిలోకి వచ్చే నిజామాబాద్ డిప్యూటీ కమిషనర్‌గా పనిచేసిన ఇద్దరిపై కూడా చర్యలు చేపట్టనున్నారు. అదేవిధంగా ఈ కార్యాలయంలో పనిచేసిన ఆరుగురు అసిస్టెంట్ కమిషనర్లపైనా సస్పెన్షన్ వేటు పడనుంది. కుంభకోణం జరిగిన కాలంలో బోధన్ సీటీవో కార్యాలయంలో పనిచేసిన నలుగురు సీటీవోలపై, తొమ్మిది మంది ఏసీటీవోలపై చర్యలు ఉండే అవకాశాలున్నాయి. 2005 నుంచి కుంభకోణం వెలుగుచూసే వరకు ఇక్కడ పనిచేసిన దాదాపు అందరు అధికారులపై చర్యలకు ఉపక్రమించింది. ఇప్పటికే ఈ కేసులో ఓ జాయింట్ కమిషనర్ డి.శ్రీనివాస్‌రావుపై సస్పెన్షన్ వేటు పడగా, మరో డిప్యూటీ కమిషనర్ ఇంకా పరారీలోనే ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే బోధన్‌లో సీటీవోగా పనిచేసిన రిటైర్డు అధికారిని అరెస్టు చేశారు. వీరంతా శివరాజ్‌తో అంటకాగిన వారుగా విచారణలో తేలింది. ఆంధ్రాకు వెళ్లిన వారిపైనా.. ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించిన వారిలో ఇద్దరు అదనపు కమిషనర్లు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో పనిచేస్తున్నారు. శివరాజ్‌తో చేతులు కలిపిన ఈ ఉన్నతాధికారులిద్దరూ రూ.లక్షలు దండుకుని రాష్ట్ర విభజన సమయంలో ఆంధ్రాకు ఆప్షన్ పెట్టుకుని వెళ్లిపోయారు. వీరిపై కూడా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం. -
ప్రైవేటు స్కూల్స్‌పై వాణిజ్య శాఖ నజర్!
పుస్తకాలు, యూనిఫాంల అమ్మకాలపై ఆరా అమ్మకం పన్ను ఎగవేయకుండా చర్యలు {పైవేటు యాజమాన్యాలతో సమావేశం సెప్టెంబర్‌లోగా వివరాలు సమర్పించాలని ఆదేశాలు సిటీబ్యూరో: గ్రేటర్ హైదరాబాద్‌లోని ప్రైవేటు విద్యా సంస్ధలపై వాణిజ్య పన్నుల శాఖ దృష్టి సారించింది. ప్రైవేటు స్కూల్స్ ప్రతి యేట విద్యా సంవత్సరం ప్రారంభంలో తమ స్టాల్స్ ద్వారా కోట్లాది రూపాయల విలువ గల పుస్తకాలు, యూనిఫామ్స్, స్టేషనరీ తదితర అమ్మకాలు సాగిస్తూ వ్యాట్ చెల్లించకపోవడాన్ని వాణిజ్య పన్నుల శాఖ గుర్తించింది. గ్రేటర్లో సుమారు నాలుగు వేలకు పైగా ప్రైవేటు పాఠశాలలు ఉన్నప్పటికి కనీసం వ్యాట్ పన్ను చెల్లించక పోవడాన్ని తీవ్రంగా పరిగణించింది. వాణిజ్య పన్నుల శాఖ రాబడి పెంచుకునే పనిలో భాగంగా 2015-16 విద్యా సంవత్సరం అమ్మకాలపై ముక్కుపిండి వసూలు చేయాలని నిర్ణయించింది. అందులో భాగంగానే మహానగరంలోని ఏడు ఉప వాణిజ్య పన్నుల శాఖల పరిధిలో ప్రైవేటు స్కూల్స్ యాజమాన్యాలతో ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసి, స్టాల్స్ ద్వారా జరిగే అమ్మకాలపై వ్యాట్ చెల్లించే విధంగా అవగాహన కల్పించేందుకు చర్యలు చేపట్టింది. ఇప్పటికే పాఠశాలలకు నమూనా పత్రంతో కూడిన సర్కులర్ కూడా జారీ చేసింది. ప్రైవేటు స్కూల్స్ యాజమాన్యాలు స్టాల్స్ ద్వారా జరిగిన అమ్మకాల వివరాలను నిర్దేశిత నమూనా పత్రంలో సమగ్రంగా పూరించి సెప్టెంబర్‌లోగా సమర్పించాలని వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్ ఆదేశించారు. పూర్తి వివరాలకు సర్కిల్, డిప్యూటీ కమిషనర్ కార్యాలయాలను సంప్రదించవచ్చని ఆయన సూచించారు. ఇదిలా ఉండగా ప్రైవేటు స్కూల్స్‌లో స్టాల్స్ ఏర్పాటు చేసి బలవంతపు అమ్మకాలు సాగించ వ ద్దని విద్యా శాఖ ఆదేశాలు జారీ చేసింది. -
వర్తకంపై మరింత వాయింపు
సాక్షి, రాజమండ్రి : నగరపాలక సంస్థల్లో వర్తకులపై ఏటా విధించే వర్తకపు పన్ను (ట్రేడ్ ట్యాక్స్) 50 శాతం వరకూ పెంచుతూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. వచ్చే ఆర్థిక సంవత్సరం పెరిగిన పన్నులు చెల్లించాల్సిందిగా వర్తకులకు నోటీసులు జారీ చేస్తున్నారు. నగరపాలక సంస్థల్లో వ్యాపారాలు చేసేవారు ఏటా ట్రేడ్ ట్యాక్స్ చెల్లించాలి. దీనిని ప్రతి మూడేళ్లకు 33.3 శాతం మించకుండా పెంచుతారు. కానీ పురపాలక శాఖ ఈ ఏడాది కొన్ని రకాల వ్యాపారాలపై 50 శాతం పన్నులు పెంచేసి, వాటిని చెల్లించి తీరాలని ఆదేశించింది. ఈ మేరకు రాజమండ్రి నగరపాలక సంస్థ అధికారులు వర్తకులకు నోటీసులు జారీ చేశారు. సుమారు 390 పైగా రకాల వ్యాపారాలపై ఉన్న పన్నులను 50 శాతం పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. చివరికి ఇంటింటికీ తిరిగి పాలమ్ముకునేవారిని కూడా వదల్లేదు. ఈ అడ్డగోలు పెంపుదలను వర్తకులు తీవ్రంగా ఖండిస్తున్నారు. పన్నుల పెంపు శాతాన్ని తగ్గించాలని కోరుతూ రాజమండ్రి చాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులు మంగళవారం నగరపాలక సంస్థ అధికారులకు వినతిపత్రం అందజేశారు. పెంచిన పన్నులు తగ్గించకుంటే చాంబర్ పరిధిలోని వర్తక సంఘాలతో సంప్రదించి ఉద్యమించడానికి కూడా వెనుకాడబోమని చాంబర్ కార్యదర్శి బూర్లగడ్డ వెంకట సుబ్బారాయుడు అన్నారు. సమైక్యాంధ్ర ఉద్యమంతో ఇప్పటికే వర్తకులు నష్టపోయారని, ఈ సమయంలో పన్నులతో మరింత ఇబ్బంది పెట్టడం సరి కాదని అన్నారు. పన్ను పెంపు ప్రతిపాదనను ఈ ఏడాదికి విరమించుకోవాలని డిమాండ్ చేశారు. వివిధ వ్యాపారాలపై పన్నుల పెంపు ఇలా.. వ్యాపారం అమలులో పెంచిన పన్ను ఉన్న పన్ను (రూ.లలో) కిరాణా దుకాణాలు 593 890 హోల్‌సేల్ కిరాణా 354 531 నూనె వ్యాపారం (హోల్‌సేల్) 806 1209 నూనె వ్యాపారం (రిటైల్) 354 531 అపరాల వ్యాపారం (హోల్‌సేల్) 1000 1500 అపరాల వర్తకులు (రిటైల్) 470 876 ఉల్లి, చింతపండు (హోల్‌సేల్) 983 1475 ఉల్లి, చింతపండు (రిటైల్) 283 425 స్టేషనరీ దుకాణాలు 761 1142 వస్త్రాలు 806 1209 చిన్న వస్త్ర వ్యాపారులు 470 705 మొబైల్ పాల వ్యాపారులు 335 452 పాలు, పెరుగు, నెయ్యి దుకాణాలు 470 705 -
విధుల బహిష్కరణ!
సాక్షి, చెన్నై: వాణిజ్య పన్నుల శాఖలో ఖాళీలు భర్తీ చేయాలని, తమ శాఖ పరిధిలోని రిజిస్ట్రేషన్ విభాగంతో సమానంగా వసతులు కల్పించాలని, పదోన్నతుల్లో, ఇతర వ్యవహారాల్లో నెలకొన్న గందరగోళాన్ని చక్కదిద్దాలని, తాత్కాలిక ఉద్యోగులను పర్మినెంట్ చేయాలన్న 25 రకాల డిమాండ్లను వాణిజ్య పన్నుల శాఖ ఉద్యోగులు ఇటీవల తెరపైకి తెచ్చారు. ఈ ఏడాది మార్చిలో అసెంబ్లీ వేదికగా తమ సంక్షేమాన్ని కాంక్షిస్తూ చేసిన ప్రకటనల్ని అమలు చేయాలన్న డిమాండ్‌తో ఆందోళనలు చేస్తూ వస్తున్నారు. ఈ ఆందోళనలు ఆ శాఖ మంత్రి బివి రమణకు శిరోభారంగా మారాయి. ఉద్యోగుల్ని బుజ్జగించే ప్రయత్నాలు చేసినా ఆందోళనలు మాత్రం ఆగలేదు. చివరకు బివి రమణ పదవిలో మార్పు చోటుచేసుకుంది. వాణిజ్య శాఖలో నెలకొన్న పరిస్థితులు చక్కదిద్దడం కొత్త మంత్రి ఎంసి సంపత్‌కు సవాల్‌గా మారింది. అయితే, తాము మాత్రం మెట్టు దిగే ప్రసక్తే లేదన్నట్టుగా ఉద్యోగులు ముందుకెళ్లున్నారు. విధుల బహిష్కరణ: తమ డిమాండ్ల సాధనే లక్ష్యంగా మంగళవారం నుంచి ఆందోళన ఉధృతం చేశారు. రాష్ట్రంలో 500 వరకు ఉన్న వాణిజ్య పన్నుల శాఖ కార్యాలయాల్లోని ఏడు వేల మంది సిబ్బంది విధుల్ని బహిష్కరించారు. బుధ, గురు వారాల్లో సైతం ఈ సమ్మె కొనసాగనుంది. ఉద్యోగులందరూ విధుల్ని బహిష్కరించడంతో ఉన్నతాధికారులు మొక్కుబడిగా తమ సీట్లలో వచ్చి కూర్చుని వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. అన్ని కార్యాలయాలు బోసిపోయాయి. వ్యవహారాలు పూర్తిగా స్తంభించాయి. వాణిజ్య పన్నుల వసూళ్లు ఆగడంతో ప్రభుత్వ ఆదాయానికి గండి పడింది. ఈ విషయమై ఆ ఉద్యోగుల సంఘం నాయకుడు జనార్దన్ మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వ పథకాల అమల్లో 25 శాతం నిధులు వాణిజ్య పన్నుల సిబ్బంది శ్రమ ఫలితంగా వచ్చినవేనని చెప్పారు. ఆదాయన్ని సమకూర్చే తమకు ఎలాంటి వసతుల్ని కల్పించక పోవడం విచారకరమన్నారు. అసెంబ్లీ వేదికగా తాత్కాలిక ఉద్యోగుల్ని పర్మినెంట్ చేయనున్నట్టు ఇది వరకు మంత్రిగా ఉన్న బివి రమణ ప్రకటించారని గుర్తు చేశారు. ఈ ప్రకటన వెలువడి ఏడు నెలలు అవుతున్నా, ఆచరణకు మాత్రం నోచుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ డిమాండ్లు పరిష్కరించే విధంగా కొత్త మంత్రి చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రభుత్వం దిగి రావాలన్న కాంక్షతో మూడు రోజుల పాటుగా విధుల్ని బహిష్కరిస్తున్నామని, రాని పక్షంలో ఆందోళన ఉధృతం అవుతుందని హెచ్చరించారు.