ప్రైవేటు స్కూల్స్‌పై వాణిజ్య శాఖ నజర్!
పుస్తకాలు, యూనిఫాంల అమ్మకాలపై ఆరా
అమ్మకం పన్ను ఎగవేయకుండా చర్యలు
{పైవేటు యాజమాన్యాలతో సమావేశం
సెప్టెంబర్‌లోగా వివరాలు సమర్పించాలని ఆదేశాలు
సిటీబ్యూరో: గ్రేటర్ హైదరాబాద్‌లోని ప్రైవేటు విద్యా సంస్ధలపై వాణిజ్య పన్నుల శాఖ దృష్టి సారించింది. ప్రైవేటు స్కూల్స్ ప్రతి యేట విద్యా సంవత్సరం ప్రారంభంలో తమ స్టాల్స్ ద్వారా కోట్లాది రూపాయల విలువ గల పుస్తకాలు, యూనిఫామ్స్, స్టేషనరీ తదితర అమ్మకాలు సాగిస్తూ వ్యాట్ చెల్లించకపోవడాన్ని వాణిజ్య పన్నుల శాఖ గుర్తించింది. గ్రేటర్‌లో సుమారు నాలుగు వేలకు పైగా ప్రైవేటు పాఠశాలలు ఉన్నప్పటికి కనీసం వ్యాట్ పన్ను చెల్లించక పోవడాన్ని తీవ్రంగా పరిగణించింది. వాణిజ్య పన్నుల శాఖ రాబడి పెంచుకునే పనిలో భాగంగా 2015-16 విద్యా సంవత్సరం అమ్మకాలపై ముక్కుపిండి వసూలు చేయాలని నిర్ణయించింది. అందులో భాగంగానే మహానగరంలోని ఏడు ఉప వాణిజ్య పన్నుల శాఖల పరిధిలో ప్రైవేటు స్కూల్స్ యాజమాన్యాలతో ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసి, స్టాల్స్ ద్వారా జరిగే అమ్మకాలపై వ్యాట్ చెల్లించే విధంగా అవగాహన కల్పించేందుకు చర్యలు చేపట్టింది.
ఇప్పటికే పాఠశాలలకు నమూనా పత్రంతో కూడిన సర్కులర్ కూడా జారీ చేసింది. ప్రైవేటు స్కూల్స్ యాజమాన్యాలు స్టాల్స్ ద్వారా జరిగిన అమ్మకాల వివరాలను నిర్దేశిత నమూనా పత్రంలో సమగ్రంగా పూరించి సెప్టెంబర్‌లోగా సమర్పించాలని వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్ ఆదేశించారు. పూర్తి వివరాలకు సర్కిల్, డిప్యూటీ కమిషనర్ కార్యాలయాలను సంప్రదించవచ్చని ఆయన సూచించారు. ఇదిలా ఉండగా ప్రైవేటు స్కూల్స్‌లో స్టాల్స్ ఏర్పాటు చేసి బలవంతపు అమ్మకాలు సాగించ వ ద్దని విద్యా శాఖ ఆదేశాలు జారీ చేసింది.