న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సతీమణి మెలానియా చేపట్టనున్న పాఠశాల సందర్శన కార్యక్రమానికి ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాలకు ఆహ్వానం అందలేదు. ఆ జాబితా నుంచి వీరి పేర్లను తొలగించినట్లు అమెరికా ఎంబసీ శనివారం సాయంత్రం ఢిల్లీ యంత్రాంగానికి తెలియజేసింది. కేజ్రీవాల్ ప్రారంభించిన ‘హ్యాపీనెస్ క్లాసెస్’ను పరిశీలించేందుకే మెలానియా పాఠశాలను సందర్శిస్తున్నారు.
ఈ సందర్శనకు కేజ్రీవాల్ హాజరై హ్యాపీనెస్ క్లాసెస్ గురించి వివరించాల్సి ఉంది. అయితే తాజాగా ఆయన పేరును తొలగించడంతో వాటి గురించి ఎవరు చెబుతారన్న సందేహం వ్యక్తమవుతోంది. ఢిల్లీ పాఠశాలల్లో మార్పులు తీసుకొచ్చింది తామేనంటూ సిసోడియా వరుస ట్వీట్లు చేశారు. తాము ప్రారంభించిన హ్యాపీనెస్ క్లాసులు ఎలా ఉన్నాయో తెలుసుకోవాలని ప్రపంచమే ఉబలాటపడుతోందని అన్నారు. ప్రభుత్వం ప్రారంభించిన కార్యక్రమం గురించి ప్రభుత్వం కాకపోతే మరెవరు చెబుతారంటూ ఆప్ వర్గాలు పేర్కొంటున్నాయి.
ఇది బీజేపీ పనే: ఆప్
కార్యక్రమం నుంచి కేజ్రీవాల్, సిసోడియాల పేర్లు తొలగించడంపై ఆప్ అధికార ప్రతినిధి సౌరభ్ భరధ్వాజ్ స్పందించారు. ఇలాంటి కార్యక్రమాలు జరిగినపుడు స్థానిక అధికారులు హాజరు కావడం ప్రొటోకాల్ అని చెప్పారు. కేంద్రంలో బీజేపీ ఉండటం వల్లే వారిద్దరి పేర్లు తొలగించినట్లు ఆయన ఆరోపించారు. కేజ్రీవాల్, సిసోడియాల పేర్లు తొలగించాల్సిందిగా తాము యూఎస్ ఎంబసీని కోరలేదని బీజేపీ అంటోందని, అలా చెప్పడంలోనే ఏదో మతలబు ఉందని ఆరోపించారు.
Comments
Please login to add a commentAdd a comment