ఉగ్ర సంస్థలకు రక్షణ కల్పించొద్దు
పాక్ ఆర్మీకి ప్రధాని నవాజ్ షరీఫ్ ఆదేశం
♦ పాకిస్తాన్ వైఖరిలో అసాధారణ మార్పు!
ఇస్లామాబాద్: అంతర్జాతీయంగా ఏకాకి కావడంతో కంగుతిన్న పాకిస్తాన్ దిగివచ్చింది. నిషేధిత ఉగ్రవాద సంస్థలకు రక్షణ కల్పించవద్దంటూ తమ సైన్యాన్ని పాక్ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ అసాధారణ రీతిలో గట్టిగా హెచ్చరించారు. అదే సమయంలో పఠాన్‌కోట్ ఉగ్రవాద దాడి, 2008 ముంబై దాడుల కేసుల విచారణను త్వరగా ముగించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. పాక్ పత్రిక ‘డాన్’ విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ గురువారం ఈ మేరకు కథనాన్ని వెలువరించింది. సైనిక, పౌర నాయకులతో వరుసగా జరిపిన పలు సమావేశాల అనంతరం షరీఫ్ నుంచి ఈ ఆదేశాలు జారీ అయినట్టు తెలిపింది.
ఇటీవల జరిగిన సమావేశం ఫలితంగా రెండు కీలక చర్యలకు సంబంధించి అంగీకారం వచ్చినట్టు వెల్లడించింది. ఈ మేరకు నిషేధిత ఉగ్రవాద సంస్థలపై చట్ట అమలు సంస్థలు చర్యలు చేపట్టినపక్షంలో ఆర్మీ సారథ్యంలోని నిఘా సంస్థలు జోక్యం చేసుకోరాదన్న సందేశంతో ఐఎస్‌ఐ డెరైక్టర్ జనరల్ రిజ్వాన్ అక్తర్, జాతీయ భద్రతా సలహాదారు నాసర్ జాంజువాలు అన్ని ప్రావిన్స్‌లకు వెళ్లి వివరిస్తారు. పంజాబ్ సీఎం షాబాజ్ షరీఫ్, ఐఎస్‌ఐ డీజీ మధ్య అసాధారణ స్థాయిలో కొనసాగిన వాగ్యుద్ధం అనంతరం ఈ చర్యలకు పూనుకున్నట్టు ‘డాన్’ తెలిపింది. ఇదిలాఉండగా డాన్ కథనాన్ని ఊహాకల్పితమైనదిగా పాక్ విదేశాంగ శాఖ ప్రతినిధి నఫీజ్ జకారియా అభివర్ణించారు. ఇలాంటి కథనాలు జాతీయ ప్రయోజనాలకు తోడ్పడవన్నారు.
అమెరికా ఆధిపత్యం తగ్గిపోతోంది
వాషింగ్టన్: కశ్మీర్, భారత్‌లపై తాము లేవనెత్తుతున్న అంశాలను పట్టించుకోకపోతే చైనా, రష్యాలతో కలసి నడవాల్సి వస్తుందని అమెరికాను పాకిస్తాన్ హెచ్చరించింది. అమెరికా ఆధిపత్యం క్రమంగా తగ్గుతోందని, ప్రపంచ శక్తిగా ఆ దేశం మరెంతో కాలం ఉండలేదని షరీఫ్ ప్రత్యేక దూత సయ్యద్ వెల్లడించారు.