![S Jaishankar defended India democracy at the Munich Security Conference](/styles/webp/s3/article_images/2025/02/16/150220251415-PTI02_15_2025_.jpg.webp?itok=E1HMYiJz)
మీది మాత్రమే ప్రజాస్వామ్యం కాదు
పశ్చిమ దేశాలకు జైశంకర్ చురకలు
జర్మనీ భద్రతా సదస్సులో ప్రసంగం
మ్యూనిచ్: తాము మాత్రమే ప్రజాస్వామ్య విలువల్ని పాటిస్తామని, మిగతా దేశాలకు వాటి గురించి కొత్తగా నేరి్పస్తున్నట్లు తరచూ హితబోధ చేసే పశ్చిమదేశాలకు భారత విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ గట్టి సమాధానమిచ్చారు. జర్మనీలోని మ్యూనిచ్ నగరంలో జరుగుతున్న భద్రతా సదస్సులో ‘‘ఓటేసేందుకు జీవించే ఉందాం: ప్రజాస్వామ్య సవాళ్లను ఎదుర్కొందాం’’అంశంపై బృందచర్చలో ఆయన ప్రసంగించారు.
తమ దేశాల్లో మాత్రమే ప్రజాస్వామ్యం ఉన్నట్లు పశ్చిమ దేశాలు భావిస్తున్నాయని ఆయన విమర్శించారు. ఈ సందర్భంగా పశ్చిమదేశాల వైఖరిని ఖండిస్తూ పలు వ్యాఖ్యలు చేశారు. ‘‘ప్రజాస్వామ్యం పరిఢవిల్లాలని మీరు(పశ్చిమదేశాలు) నిజంగా భావిస్తే వివిధ దేశాల్లో విజయవంతంగా అమలవుతున్న ప్రజాస్వామ్య విధానాలను మీరూ ఆదరించాల్సిందే.
కుండబద్దలు కొట్టినట్లు చెప్పాలంటే పశ్చిమదేశాలు తమ దేశాల్లో మాత్రమే ప్రజాస్వామ్యం ఉన్నట్లు మాట్లాడుతున్నాయి. గ్లోబల్ సౌత్ దేశాలపై ప్రజాస్వామ్యేతర విధానాలను ఈ పశ్చిమదేశాలు రుద్దుతున్నాయి. పశ్చిమదేశాలు సొంత గడ్డపై ప్రజాస్వామ్యానికి ఎంత విలువ ఇస్తాయో గ్లోబల్ సౌత్ దేశాల ప్రజాస్వామ్యానికీ అంతే విలువ ఇవ్వాలి. ఇంటి విధానాలను బయటా ఆచరించి చూపండి’’అని వ్యాఖ్యానించారు. ఇతర దేశాల్లోని విజయాలను గ్లోబల్ సౌత్ దేశాలూ అందిపుచ్చుకుంటాయని ఆశాభావం వ్యక్తంచేశారు.
ప్రజాస్వామ్యం అన్నం పెడుతుంది
ప్రజాస్వామ్యం అన్నం పెట్టదని సెనేటర్ ఎలిసా చేసిన వ్యాఖ్యలను జైశంకర్ పరోక్షంగా తప్పుబట్టారు. ‘‘మీరు చెప్పేది తప్పు. వాస్తవానికి ప్రపంచంలో ప్రజాస్వామ్యం ఆహారాన్ని అందించగలదు. భారత ప్రజాస్వామ్య సమాజంలో ప్రజలకు మేం పౌష్టికాహారం అందిస్తున్నాం. 80 కోట్ల మందికి(రేషన్ ద్వారా) ఆహార భరోసా కల్పించాం. వాళ్లిప్పుడు ఎంతో ఆరోగ్యంగా ఉన్నారు, వాళ్ల కడుపులు నిండాయా లేదా అనేది ప్రధానం’’అని అన్నారు.
భారత ప్రజాస్వామ్యంపై..
‘‘ఇటీవలే నా సొంత రాష్ట్రం ఢిల్లీ(అసెంబ్లీ ఎన్నిక)లో ఓటేశా. నా వేలికి ఉన్న ఈ సిరా గుర్తు ఆ ఓటుదే. గత ఏడాది భారత్‌లో సార్వత్రిక ఎన్నికలు జరిగాయి. అర్హులైన ఓటర్లలో మూడింట రెండొంతుల మంది ఓటేశారు. అంటే 90 కోట్ల మందిలో ఏకంగా 70 కోట్ల మంది ఓటేశారు. ఇన్ని కోట్ల ఓట్లను మేం ఒకే రోజులో లెక్కించాం’’అని అన్నారు. ఈ చర్చలో జైశంకర్‌తోపాటు నార్వే ప్రధాని జొనాస్ గహర్ స్టోర్, అమెరికా సెనేట్ సభ్యురాలు ఎలిసా స్లోట్‌కిన్, వార్సా నగర మేయర్ రాఫల్ ట్రజస్కోవ్క్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment