security conference
-
ఇతర దేశాలనూ గౌరవించండి
మ్యూనిచ్: తాము మాత్రమే ప్రజాస్వామ్య విలువల్ని పాటిస్తామని, మిగతా దేశాలకు వాటి గురించి కొత్తగా నేరి్పస్తున్నట్లు తరచూ హితబోధ చేసే పశ్చిమదేశాలకు భారత విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ గట్టి సమాధానమిచ్చారు. జర్మనీలోని మ్యూనిచ్ నగరంలో జరుగుతున్న భద్రతా సదస్సులో ‘‘ఓటేసేందుకు జీవించే ఉందాం: ప్రజాస్వామ్య సవాళ్లను ఎదుర్కొందాం’’అంశంపై బృందచర్చలో ఆయన ప్రసంగించారు. తమ దేశాల్లో మాత్రమే ప్రజాస్వామ్యం ఉన్నట్లు పశ్చిమ దేశాలు భావిస్తున్నాయని ఆయన విమర్శించారు. ఈ సందర్భంగా పశ్చిమదేశాల వైఖరిని ఖండిస్తూ పలు వ్యాఖ్యలు చేశారు. ‘‘ప్రజాస్వామ్యం పరిఢవిల్లాలని మీరు(పశ్చిమదేశాలు) నిజంగా భావిస్తే వివిధ దేశాల్లో విజయవంతంగా అమలవుతున్న ప్రజాస్వామ్య విధానాలను మీరూ ఆదరించాల్సిందే. కుండబద్దలు కొట్టినట్లు చెప్పాలంటే పశ్చిమదేశాలు తమ దేశాల్లో మాత్రమే ప్రజాస్వామ్యం ఉన్నట్లు మాట్లాడుతున్నాయి. గ్లోబల్ సౌత్ దేశాలపై ప్రజాస్వామ్యేతర విధానాలను ఈ పశ్చిమదేశాలు రుద్దుతున్నాయి. పశ్చిమదేశాలు సొంత గడ్డపై ప్రజాస్వామ్యానికి ఎంత విలువ ఇస్తాయో గ్లోబల్ సౌత్ దేశాల ప్రజాస్వామ్యానికీ అంతే విలువ ఇవ్వాలి. ఇంటి విధానాలను బయటా ఆచరించి చూపండి’’అని వ్యాఖ్యానించారు. ఇతర దేశాల్లోని విజయాలను గ్లోబల్ సౌత్ దేశాలూ అందిపుచ్చుకుంటాయని ఆశాభావం వ్యక్తంచేశారు. ప్రజాస్వామ్యం అన్నం పెడుతుంది ప్రజాస్వామ్యం అన్నం పెట్టదని సెనేటర్ ఎలిసా చేసిన వ్యాఖ్యలను జైశంకర్ పరోక్షంగా తప్పుబట్టారు. ‘‘మీరు చెప్పేది తప్పు. వాస్తవానికి ప్రపంచంలో ప్రజాస్వామ్యం ఆహారాన్ని అందించగలదు. భారత ప్రజాస్వామ్య సమాజంలో ప్రజలకు మేం పౌష్టికాహారం అందిస్తున్నాం. 80 కోట్ల మందికి(రేషన్ ద్వారా) ఆహార భరోసా కల్పించాం. వాళ్లిప్పుడు ఎంతో ఆరోగ్యంగా ఉన్నారు, వాళ్ల కడుపులు నిండాయా లేదా అనేది ప్రధానం’’అని అన్నారు. భారత ప్రజాస్వామ్యంపై.. ‘‘ఇటీవలే నా సొంత రాష్ట్రం ఢిల్లీ(అసెంబ్లీ ఎన్నిక)లో ఓటేశా. నా వేలికి ఉన్న ఈ సిరా గుర్తు ఆ ఓటుదే. గత ఏడాది భారత్‌లో సార్వత్రిక ఎన్నికలు జరిగాయి. అర్హులైన ఓటర్లలో మూడింట రెండొంతుల మంది ఓటేశారు. అంటే 90 కోట్ల మందిలో ఏకంగా 70 కోట్ల మంది ఓటేశారు. ఇన్ని కోట్ల ఓట్లను మేం ఒకే రోజులో లెక్కించాం’’అని అన్నారు. ఈ చర్చలో జైశంకర్‌తోపాటు నార్వే ప్రధాని జొనాస్ గహర్ స్టోర్, అమెరికా సెనేట్ సభ్యురాలు ఎలిసా స్లోట్కిన్, వార్సా నగర మేయర్ రాఫల్ ట్రజస్కోవ్క్ పాల్గొన్నారు. -
రష్యాకు సహకరిస్తే ఆంక్షలు తప్పవు
వాషింగ్టన్: ఉక్రెయిన్‌పై యుద్ధం సాగిస్తున్న రష్యాకు చైనా ఆయుధపరమైన సాయం అందించడం, అమెరికా భూభాగంపైకి నిఘా బెలూన్ను పంపించడంపై అమెరికా తీవ్ర నిరసన తెలిపింది. రష్యాకు సాయమందిస్తే ఆంక్షలు తప్పవని హెచ్చరించింది. జర్మనీలోని మ్యూనిక్‌లో జరుగుతున్న సెక్యూరిటీ కాన్ఫరెన్స్‌లో భాగంగా అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్, చైనా ఉన్నతస్థాయి దౌత్యవేత్త వాంగ్ యీతో శనివారం భేటీ అయ్యారు. ‘మా గగనతలంలోకి నిఘా బెలూన్ను పంపించడం అంతర్జాతీయ చట్టాలకు, మా సార్వభౌమత్వానికి భంగం కలిగించడమే. ఇలాంటి బాధ్యతారాహిత్య ఘటన పునరావృతం కారాదు’ అని బ్లింకెన్ స్పష్టం చేశారని అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి నెడ్ ప్రైస్ చెప్పారు. ఉక్రెయిన్‌పై యుద్ధం చేస్తున్న రష్యాకు ఆయుధ, ఇతరత్రా సాయం అందజేస్తే తీవ్ర ఆంక్షలు విధిస్తామని కూడా బ్లింకెన్ చెప్పారు. అయితే ఇలాంటి చర్యలతో అమెరికా తన బలం చూపాలనుకుంటే విరుద్ధ ఫలితాలే వస్తాయని వాంగ్ యీ బదులిచ్చారు. -
చైనాతో అత్యంత క్లిష్టంగా సంబంధాలు
మ్యూనిక్: చైనాతో భారత సంబంధాలు ప్రస్తుతం అత్యంత క్లిష్టమైన దశలో ఉన్నాయని విదేశాంగ మంత్రి ఎస్.జై శంకర్ అన్నారు. సరిహద్దుల్లో సైన్యాన్ని మోహరించవద్దన్న ఒప్పందాలను చైనా ఉల్లంఘించడంతో పరిస్థితి మరింత విషమించిందన్నారు. ద్వైపాక్షిక సంబంధాల్లో పురోగతి సరిహద్దుల్లోని పరిస్థితులపైనే ఆధారపడి ఉంటుందని స్పష్టం చేశారు. జర్మనీలోని మ్యూనిక్‌లో జరుగుతున్న సెక్యూరిటీ కాన్ఫరెన్స్ (ఎంఎస్సీ)లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. చైనాతో వాస్తవాధీన రేఖ వెంబడి పరిస్థితులు 45 ఏళ్ల పాటు శాంతియుతంగానే ఉన్నాయని గుర్తు చేశారు. చైనా వంటి ఒక పెద్ద దేశం ఒప్పందాలను ఉల్లంఘిస్తే అది అంతర్జాతీయ సమాజమంతా ఆందోళన చెందాల్సిన విషయమేనన్నారు. సుదూరాల్లోని చిన్న దేశాలకు భారీగా అప్పులిచ్చి అక్కడి వ్యూహాత్మక ప్రాంతాలను చైనా తన అదుపులోకి తెచ్చుకుంటున్న తీరు ఆందోళనకరమని జై శంకర్ అన్నారు. అనుసంధానం ముసుగులో చేస్తున్న ఇలాంటి పనులు ఇతర దేశాల సార్వభౌమత్వానికి ముప్పని అభిప్రాయపడ్డారు. క్వాడ్‌ను ఆసియా నాటో అనడం సరికాదని స్పష్టం చేశారు. -
అఫ్గాన్ ఉగ్రవాదుల అడ్డా కాకూడదు
న్యూఢిల్లీ: తాలిబన్లు స్వాధీనం చేసుకున్న అఫ్గానిస్తాన్ భూభాగం నుంచి ఉగ్రవాద కార్యకాలాపాలు ఎట్టి పరిస్థితుల్లో జరగకూడదని భారత్ ఆ«ధ్వర్యంలో బుధవారం జరిగిన భద్రతా సదస్సులో పాల్గొన్న ఎనిమిది ఆసియన్ దేశాలు ప్రతిజ్ఞ చేశాయి. అఫ్గాన్ సంక్షోభం విసిరే సవాళ్లపై ఏర్పాటైన ‘ఢిల్లీ రీజనల్ సెక్యూరిటీ డైలాగ్ ఆన్ అఫ్గానిస్తాన్’ సదస్సు అంతర్జాతీయ ఉగ్రవాదానికి అఫ్గాన్ అడ్డాగా మారకుండా నిరోధించడానికి కలసికట్టుగా పోరాటం చేయాలని నిర్ణయించింది. సదస్సులో రష్యా, ఇరాన్, కజకిస్తాన్, కిర్గిజ్స్తాన్, తజికిస్తాన్, తుర్క్మెనిస్తాన్, ఉజ్బెకిస్తాన్ దేశాల భద్రతా సలహాదారులు పాల్గొన్నారు. అఫ్గానిస్తాన్‌లో భద్రతా పరిస్థితులపై ఈ సదస్సులో చర్చ జరిగింది. శాంతియుత, భద్రతాయుత, సుస్థిరమైన అఫ్గానిస్తాన్‌ని చూడటమే తమ లక్ష్యమని సదస్సుకి హాజరైన ప్రతినిధులు పేర్కొన్నారు. కాబూల్, కాందహార్, కుందుజ్‌లో జరిగిన ఉగ్రవాద దాడుల్ని సమావేశం ఖండించింది. పాకిస్తాన్, చైనా ఏవో సాకులు చెప్పి సదస్సుకి దూరంగా ఉన్నాయి. నాలుగు అంశాలపై దృష్టి పెట్టాలి: మోదీ అఫ్గానిస్తాన్‌లో అన్ని వర్గాల భాగస్వామ్యంతో కూడిన సమ్మిళిత ప్రభుత్వం ఏర్పడాల్సిన అవసరం ఉందని ప్రధాని మోదీ ఆకాంక్షించారు. సదస్సు ముగిసిన తర్వాత భద్రతా ప్రతినిధులందరూ కలిసి ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలుసుకున్నారు. సదస్సులో తీసుకున్న నిర్ణయాలను ఆయనకు వివరించారు. ఈ సందర్భంగా మోదీ వారిని ఉద్దేశించి మాట్లాడుతూ అఫ్గానిస్తాన్ అభివృద్ధి కోసం నాలుగు సూత్రాలను ప్రతిపాదించారు. సమ్మిళిత ప్రభుత్వం ఏర్పడాలని అన్నారు. అఫ్గాన్ భూభాగంపై ఉగ్రవాద కార్యకలాపాలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించరాదని చెప్పారు. ఇందుకోసం అక్కడ ఉగ్రవాద సంస్థలకు స్థానం లేకుండా చేయాలన్నారు. అఫ్గాన్ నుంచి మాదక ద్రవ్యాలు, ఆయుధాల అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయడానికి వ్యూహ రచన చేయాలన్నారు. అఫ్గాన్‌లో జనం ఆకలితో అలమటించిపోతున్నారని, ముష్కరులు వారిపై అకృత్యాలకు పాల్పడుతున్నారని, సంక్షోభం నానాటికీ ముదురుతోందని, ఈ సమస్య పరిష్కారానికి ఇరుగు పొరుగు దేశాలు మానవతాదృక్పథంతో నడుం బిగించాలని పిలుపునిచ్చారు. ఈ సదస్సుకి నేతృత్వం వహించి ప్రారంభోపన్యాసం చేసిన జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ అఫ్గానిస్తాన్‌లో ఇటీవల జరిగిన పరిణామాలు ప్రాంతీయంగానూ సవాళ్లు విసురుతున్నాయని అన్నారు. తాలిబన్లతో చర్చల ద్వారానే అఫ్గాన్ సమస్యని పరిష్కరించగలమని రష్యా ప్రతినిధి నికోలాయ్æ అన్నారు. సదస్సు ఒక డిక్లరేషన్ని ఆమోదించింది. మళ్లీ వచ్చే ఏడాది సమావేశం కావాలని అంగీకారానికి వచ్చారు. డిక్లరేషన్‌లో ఏముందంటే ? ► అఫ్గానిస్తాన్ భూభాగం నుంచి ఉగ్రవాద కార్యాకలాపాలు జరగకూడదు. అక్కడ ప్రభుత్వం ఉగ్రవాదులకు శిక్షణ, ఆశ్రయం, ఆర్థిక సహకారం అందించకూడదు. ► అఫ్గాన్ సార్వభౌమత్వాన్ని, ప్రాదేశిక సమగ్రతను గౌరవిస్తాం. ఆ దేశ అంతర్గత వ్యవహారాల్లో ఎవరి జోక్యం ఉండకూడదంటూ పాకిస్తాన్‌కు పరోక్ష హెచ్చరికలు జారీ. ► సామాజికంగా, ఆర్థికంగా కునారిల్లుపోతున్న అఫ్గానిస్తాన్ పరిస్థితిపై సదస్సు ఆందోళన. అఫ్గాన్ ప్రజలకు మానవత్వంతో అత్య వసరంగా సాయం చెయ్యాలని నిర్ణయం. ► అఫ్గాన్‌లో అన్ని వర్గాల ప్రజలకు నిరాటంకంగా సాయం అందేలా చర్యలు చేపట్టాలి. మానవతా దృక్పథంతో చేసే ఈ సాయంలో ఎలాంటి వివక్షలకు తావు ఉండకూడదు ► మహిళలు పిల్లలు, మైనారిటీల హక్కుల్ని ఎవరూ ఉల్లంఘించకూడదు. ► అఫ్గానిస్తాన్‌లో అన్ని వర్గాల ప్రజలకు ప్రాతినిధ్యం లభించేలా ప్రభుత్వం ఏర్పాటుకావాలి. ► కోవిడ్‌పై పోరాటానికి అఫ్గానిస్తాన్‌కు కావల్సిన సాయం అందించడానికి కట్టుబడి ఉన్నాం. భవిష్యత్‌లో కూడా అన్ని దేశాలు పరస్పర సహకారాన్ని అందించుకుంటాయి. ► ఐక్యరాజ్య సమితి ప్రతినిధులు అఫ్గాన్‌లో ఉంటూ ఎప్పటికప్పుడు పరిస్థితుల్ని పర్యవేక్షించాలి. -
పాక్ పర్యటనకు సుష్మా స్వరాజ్
న్యూఢిల్లీ: విదేశీ వ్యవహారాలశాఖ మంత్రి సుష్మా స్వరాజ్ మంగళవారం పాకిస్తాన్లో పర్యటించనున్నారని కేంద్ర మంత్రి రాజీవ్ ప్రతాప్ రూడీ తెలిపారు. న్యూఢిల్లీలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఇస్లామాబాద్ వెళ్లి చర్చలు జరిపి భారత్‌కి ఆమె తిరిగొచ్చాక ఓ ప్రకటన చేస్తారని రాజీవ్ చెప్పారు. పాక్ లో జరగనున్న భద్రతా సదస్సును ముగించుకుని స్వదేశానికి ఆమె విచ్చేసిన తర్వాత పార్లమెంట్ ఉభయసభలలో ఈ విషయంపై చర్చిద్దామన్నారు. థాయ్‌లాండ్ రాజధాని బ్యాంకాక్ లో భారత్, పాకిస్తాన్ దేశాల జాతీయ భద్రతా సలహాదారులు ఆదివారం సమావేశమైన విషయం అందరికీ విదితమే. నిర్మాణాత్మకమైన సంబంధాలను మరింత పటిష్టం చేసుకోవాలని ఇరు దేశాల నేతలు ఈ భేటీలో చర్చించినట్లు సమాచారం. ఇస్లామాబాద్ లో మంగళవారం జరగనున్న భద్రతా సదస్సుకు భారత ప్రతినిధిగా సుష్మా స్వరాజ్ హాజరుకానున్నారు.