ఆదివారం ఈస్టర్ ప్రార్థనల్లో పుతిన్
కీవ్: ఉక్రెయిన్‌పై దాడులను ఆదివారం రష్యా తీవ్రతరం చేసింది. సెంట్రల్ ఉక్రెయిన్‌లో పేలుడు పదార్థాలు, మందుగుండు పౌడర్ తయారీ కంపెనీపై అత్యాధునిక మిసైళ్లు ప్రయోగించినట్టు రష్యా రక్షణ శాఖ అధికార ప్రతినిధి ఇగోర్ కొనషెంకోవ్ తెలిపారు. ఖర్కీవ్ ప్రాంతంలోని బర్వింకోవ్, నోవా ద్మిత్రివ్కా, ఇవనివ్కా, హుతలరివ్కా, వెల్యికాల్లో పలు ఆయుధాగారాలపైనా భారీగా దాడులు చేసినట్టు వివరించారు. 26 ఉక్రెయిన్ సైనిక లక్ష్యాలను ధ్వంసం చేశామన్నారు. మారియుపోల్‌లోని అజోవ్‌స్తల్ స్టీల్ ప్లాంటుపై గగనతల దాడులకు దిగింది.
తూర్పున డోన్బాస్‌లో లుహాన్స్‌క్ ప్రాంతంలోని పొపాస్నా, సివెరోడొనెట్స్‌క్, డొనెట్స్‌క్ ప్రాంతంలోని కురఖీవ్ నగరాలపై బాంబుల వర్షం కురిపించింది. పశ్చిమ డోన్బాస్‌లోని ద్నిప్రోలోనూ బాంబు దాడులు జరిగాయి. చెడుపై అంతిమంగా మంచి గెలిచి తీరుతుందని, ఈ వాస్తవం రష్యాకు త్వరలో తెలిసొస్తుందని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ అన్నారు. మరణాన్ని జీవనం, చీకటిని వెలుతురు అధిగమిస్తాయని దేశ ప్రజలకిచ్చిన ఈస్టర్ సందేశంలో చెప్పారు. అమెరికా రక్షణ, విదేశాంగ మంత్రులు లాయిడ్ ఆస్టిన్, ఆంటోనీ బ్లింకెన్‌లతో భేటీ కోసం ఎదురు చూస్తున్నట్టు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment