రష్యా బాంబు దాడుల్లో ధ్వంసమైన జపొరిజాజియాలోని నివాస భవన సముదాయం
జపొరిజాజియా: రష్యా–క్రిమియా ద్వీపకల్పాన్ని అనుసంధానించే కీలక వంతెనపై ఉక్రెయిన్ అనుకూల వర్గాలు పేలుళ్లకు పాల్పడిన నేపథ్యంలో పుతిన్ సైన్యం ప్రతీకార చర్యలకు దిగింది. ఉక్రెయిన్‌లోని జపొరిజాజియా సిటీపై నిప్పుల వర్షం కురిపించింది. శనివారం అర్ధరాత్రి తర్వాత వరుసగా రాకెట్లు ప్రయోగించింది. ఈ ఘటనలో 12 మంది పౌరులు మృతిచెందారు. 60 మందికి పైగా గాయపడ్డారు.
రష్యా దాడుల్లో 20 ప్రైవేట్ నివాస గృహాలు, 50 అపార్టుమెంట్ భవనాలు దెబ్బతిన్నాయని సిటీ కౌన్సిల్ కార్యదర్శి అనాతోలివ్ కుర్టెవ్ చెప్పారు. జపొరిజాజియాలో రష్యా రాకెట్ దాడులను ఉక్రెయిన్ సైన్యం ధ్రువీకరించింది. పదుల సంఖ్యలో పౌరులు గాయపడ్డారని పేర్కొంది. రష్యా దాడుల పట్ల స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. తమ అనుభవాలను మీడియాతో పంచుకున్నారు. రష్యా అంతర్జాతీయ ఉగ్రవాది అంటూ మండిపడ్డారు. తమను ఎవరూ రక్షంచలేరా? అంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు.
అమాయకులను బలి తీసుకున్నారు: జెలెన్‌స్కీ
వాస్తవానికి దక్షిణ ఉక్రెయిన్‌లోని జపొరిజాజియా ప్రస్తుతం రష్యా ఆధీనంలోనే ఉంది. ఈ ప్రాంతాన్ని తమ దేశంలో విలీనం చేస్తూ రష్యా అధినేత పుతిన్ ఇటీవలే సంతకాలు చేశారు. జపొరిజాజియా ప్రావిన్స్ మొత్తం చట్టబద్ధంగా తమదేనని వాదిస్తున్నారు. గత గురువారం ఇదే సిటీపై రష్యా సైన్యం జరిపిన క్షిపణి దాడుల్లో 19 మంది బలయ్యారు.
తమ నియంత్రణలో ఉన్న ప్రాంతాన్ని లక్ష్యంగా చేసుకొని రష్యా ఇటీవల తరచుగా దాడులు చేస్తుండడం గమనార్హం. తాజా రాకెట్ దాడులపై ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అర్ధరాత్రి వేళ దయ, కరుణ లేకుండా అమాయక ప్రజలను పొట్టనపెట్టుకున్నారని దుమ్మెత్తిపోశారు. అది అక్షరాలా రాక్షసకాండ అని ధ్వజమెత్తారు. ఈ దాడులకు ఆదేశాలిచ్చినవారు, వాటిని పాటించినవారు తప్పనిసరిగా చట్టానికి, ప్రజలకు జవాబు చెప్పాలన్నారు.
వంతెన భద్రత పెంచాలని ఆదేశాలు
ఉక్రెయిన్‌కు చెందిన క్రిమియా ద్వీపకల్పాన్ని 2014లో రష్యా ఆక్రమించింది. రష్యా–క్రిమియాను అనుసంధానించే వంతెనపై శనివారం భారీ ఎత్తున పేలుళ్లు జరిగాయి. వంతెన కొంతవరకు ధ్వంసమైంది. ఈ పేలుళ్లకు ఇంకా ఎవరూ బాధ్యత వహించలేదు. ఇదంతా ఉక్రెయిన్ అనుకూలవర్గాల పనేనని రష్యా నిర్ణయానికొచ్చింది. ప్రతీకార చర్యల్లో భాగంగా జపొరిజాజియాను లక్ష్యంగా చేసుకుంది. వంతెనకు, అక్కడున్న ఇంధన రంగ మౌలిక సదుపాయాలకు భద్రత పెంచాలంటూ పుతిన్ శనివారం రాత్రి ఆదేశాలు జారీ చేశారు.
భద్రత కోసం ఫెడరల్ సెక్యూరిటీ సర్వీస్‌ను రంగంలోకి దించారు. పుతిన్ ‘ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్’ ప్రారంభించారని రష్యా ప్రజాప్రతినిధులు కొందరు తెలిపారు. తూర్పు డొనెట్‌స్క్ రీజియన్‌లోని బఖ్‌ముత్, అవ్‌దివ్‌కా నగరాల్లో రష్యా, ఉక్రెయిన్ బలగాల మధ్య తీవ్రస్థాయిలో ఘర్షణ సాగింది. ఈ విషయాన్ని ఉక్రెయిన్ సైనిక దళాల అధికారి ఆదివారం ఉదయం వెల్లడించారు. ప్రస్తుతం రెండు నగరాల్లో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. రష్యా, ఉక్రెయిన్ జవాన్ల మధ్య ఘర్షణలో వాటిల్లిన ప్రాణనష్టంపై వివరాలు తెలియరాలేదు.
రష్యా సైన్యానికి కొత్త కమాండర్
రష్యా–క్రిమియా వంతెనపై పేలుళ్ల తర్వాత రష్యా ఒక్కసారిగా అప్రమత్తయ్యింది. ఉక్రెయిన్‌లో తమ సైనిక బలగాలకు సారథ్యం వహించడానికి ఎయిర్‌ఫోర్స్ చీఫ్ జనరల్ సెర్గీ సురోవికిన్‌ను నియమిస్తున్నట్లు రష్యా రక్షణ శాఖ ప్రకటించింది. ఇకపై ఉక్రెయిన్‌లో సైనిక ఆపరేషన్లను ఆయనే ముందుండి నడిపిస్తారని స్పష్టం చేసింది. సురోవికిన్‌ను కొన్ని నెలల క్రితం దక్షిణ ఉక్రెయిన్‌లో రష్యా సేనలకు ఇన్‌చార్జిగా నియమించారు. ఇప్పుడు పదోన్నతి కల్పించారు. ఆయన గతంలో సిరియాలో రష్యా సైన్యానికి సారథ్యం వహించారు. సిరియాలోని అలెప్పో నగరంలో పెను విధ్వంసానికి సురోవికిన్ ప్రధాన కారకుడన్న ఆరోపణలున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment