మారియుపోల్‌లో రష్యా క్షిపణిదాడిలో మంటల్లో చిక్కిన అపార్టుమెంట్
లెవివ్/వాషింగ్టన్: ఉక్రెయిన్‌పై రష్యా దాడులు ఉధృతమవుతున్నాయి. ఉక్రెయిన్ సైనికులతోపాటు స్థానికుల నుంచి గట్టి ప్రతిఘటన ఎదురవుతున్నప్పటికీ రష్యా సైన్యం దూసుకుపోతోంది. కీలక నగరాలపై పట్టు సాధించడానికి గగనతలం నుంచి బాంబుల వర్షం కురిపిస్తోంది. రాజధాని కీవ్‌కు ఇతర ప్రాంతాలతో సంబంధాలను ఆక్రమించేందుకు ఈశాన్యంగా చుట్టుముడుతోంది.
కీవ్ శివార్లలో హోరాహోరీ పోరు కొనసాగుతోంది. మరోవైపు పోర్టు సిటీ మారియుపోల్‌లో చిన్నారులతో సహా 80 మందికి పైగా పౌరులు తలదాచుకున్న మసీదుపై రష్యా సైన్యం శనివారం క్షిపణులతో భీకర దాడికి దిగింది. మారియుపోల్‌లో యుద్ధ మరణాలు 1,500 దాటినట్లు మేయర్ కార్యాలయం ప్రకటించింది. కీవ్ పరిధిలోని పెరెమోహా గ్రామంలో పౌరులను తరలిస్తున్న వాహన కాన్వాయ్‌పై రష్యా బాంబు దాడి జరగడంతో ఏడుగురు పౌరులు మరణించారు.
మైకోలైవ్ నగరంలోనూ రష్యా బీభత్సం సృష్టిస్తోంది. దాడిలో క్యాన్సర్ ఆసుపత్రి, నివాస సముదాయాలు దెబ్బతిన్నాయని అధికారులు చెప్పారు. మారియుపోల్ తూర్పు శివారు ప్రాంతాలను రష్యా సైన్యం పూర్తిగా స్వాధీనం చేసుకుందని ఉక్రెయిన్ ప్రకటించింది. మరోవైపు ఉక్రెయిన్ వలసలు 26 లక్షలు దాటినట్టు సమాచారం. యుద్ధం ఆపాలంటూ పోప్ ఫ్రాన్సిస్ ట్వీట్ చేశారు. జర్మనీ చాన్స్‌లర్ స్కోల్జ్, ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ కూడా రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో ఫోన్‌లో మాట్లాడారు. కాల్పులు విరమించాలని కోరారు.
మరో మేజర్ జనరల్ మృతి
యుద్ధంలో రష్యా మరో సైనిక ఉన్నతాధికారిని కోల్పోయింది. మారియుపోల్‌లో తమ దాడిలో రష్యా మేజర్ జనరల్ ఆండ్రీ కొలేస్నికోవ్ చనిపోయినట్టు ఉక్రెయిన్ అంతర్గత వ్యవహారాల శాఖ వెల్లడించింది. రష్యా ఇప్పటికే ఇద్దరు మేజర్ జనరల్స్‌ను పోగొట్టుకోవడం తెలిసిందే. ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయిన వారిని ఆదుకోవడానికి ప్రత్యేక కారిడార్ల ఏర్పాటు కోసం ఉక్రెయిన్, రష్యాలతో చర్చిస్తున్నట్టు ఐరాస చెప్పింది.
12,000 మంది అమెరికా సైనికులు
రష్యాతో సరిహద్దులున్న లాత్వియా, ఎస్తోనియా, లిథువేనియా, రొమేనియా తదితర దేశాలకు 12,000 మంది సైనికులను పంపినట్లు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తెలిపారు. ఉక్రెయిన్‌పై యుద్ధంలో రష్యా అధ్యక్షుడు పుతిన్ గెలవలేరన్నారు. రష్యాకు ఎదురొడ్డి ఉక్రెయిన్ ప్రజలు అసామాన్య ధైర్య సాహసాలు ప్రదర్శిస్తున్నారని ప్రశంసించారు. అయితే ఈ యుద్ధంలో తాము భాగస్వాములం కాబోమన్నారు. నాటో సభ్య దేశాల భూభాగాలను కాపాడుకునేందుకు రష్యా సరిహద్దులకు 12,000 అమెరికా సైనికులను పంపించినట్టు చెప్పారు.
ఉక్రెయిన్ సైన్యంలోకి... స్నైపర్ వలీ
‘రష్యాపై జరుగుతున్న యుద్ధంలో మాకు సహాయం చేయండి’ అంటూ ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ చేసిన విజ్ఞప్తి పట్ల కెనడా మాజీ సైనికులు సానుకూలంగా స్పందించారు. కెనడా రాయల్ 22వ రెజిమెంట్‌కు చెందిన పూర్వ సైనికులు ఉక్రెయిన్ సైన్యంలో చేరారు. వీరిలో ప్రపంచంలోనే అత్యుత్తమ స్నైపర్ వలీ కూడా ఉన్నారు. రష్యా అన్యాయమైన యుద్ధం చేస్తోందని, అందుకే ఉక్రెయిన్‌కు అండగా రంగంలోకి దిగానని వలీ చెప్పారు. గతంలో ఇరాక్‌లో ఐసిస్ ఉగ్రవాదులపై పోరాడిన కుర్దిష్ దళాలకు వలీ సాయం అందించారు. వలీ ఒక్కరోజులో కనీసం 40 మందిని హతమార్చగలడంటారు. 2017 జూన్‌లో ఇరాక్‌లో 3,540 మీటర్ల దూరంలో ఉన్న ఐసిస్ జిహాదిస్ట్‌ను సునాయాసంగా కాల్చి చంపాడు.
మెలిటోపోల్ మేయర్ కిడ్నాప్
మెలిటోపోల్ మేయర్‌ను రష్యా సైనికులు అపహరించారని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ఆరోపించారు. రష్యా సైన్యం ఐసిస్ ఉగ్రవాదుల్లా రాక్షసంగా ప్రవర్తిస్తోందన్నారు. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులను బందీలుగా మారుస్తున్నారని దుయ్యబట్టారు. రష్యాపై పోరాటం కొనసాగించాలని ఉక్రెయిన్ ప్రజలకు పిలుపునిచ్చారు. మేయర్‌ను రష్యా జవాన్లు కిడ్నాప్ చేస్తున్న వీడియోను ఉక్రెయిన్ అధ్యక్ష కార్యాలయం ప్రతినిధి సోషల్ మీడియాలో పోస్టు చేశారు.
మీ పిల్లలను యుద్ధానికి పంపొద్దు..రష్యా తల్లులకు జెలెన్‌స్కీ విజ్ఞప్తి
‘దయచేసి మీ పిల్లలను యుద్ధ రంగానికి పంపకండి, వారి ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టకండి’ అని రష్యా మహిళలకు జెలెన్‌స్కీ విజ్ఞప్తి చేశారు. సాధారణ ప్రజలను ఉక్రెయిన్‌లో యుద్ధంలోకి దించేందుకు రష్యా ప్రయత్నిస్తోందన్న వార్తల నేపథ్యంలో ఉద్యోగాలిస్తాం, కేవలం సైనిక శిక్షణ ఇస్తాం అనే మాటలను ఎట్టిపరిస్థితుల్లోనూ నమ్మొద్దని కోరారు. యుద్ధంలో తమ సైనికులు 1,300 మంది అమరులయ్యారని వెల్లడించారు. కీవ్‌ను స్వాధీనం చేసుకొనేందుకు అమాయకులను రష్యా పొట్టన పెట్టుకుంటోందని ఆరోపించారు. సంక్షోభానికి ముగింపు పలకడానికి ఇజ్రాయెల్‌లోని జెరూసలేంలో చర్చిద్దామని రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు జెలెన్‌స్కీ ప్రతిపాదించినట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment