
ఉక్రెయిన్ రాజధాని కీవ్‌లో జెలెన్‌స్కీతో యూరోపియన్ కమిషన్ చీఫ్ ఉర్సులా మాటామంతి
కీవ్: భారీ సామూహిక మరణాలే లక్ష్యంగా ఉక్రెయిన్‌లో రష్యా సేనలు మరిన్ని ప్రాణాంతక ఆయుధాలను ప్రయోగించవచ్చని ఇంగ్లండ్ రక్షణ శాఖ హెచ్చరించింది. 1960ల నాటి యాంటీ–షిప్ మిస్పైళ్లతో పాటు అణు వార్‌హెడ్లతో కూడిన కేహెచ్–22 మిస్సైళ్లతో ఉక్రెయిన్ యుద్ధ విమానాలను కూల్చవచ్చని పేర్కొంది. తూర్పు ఉక్రెయిన్‌లో శనివారం రష్యా దాడుల్లో పలు ప్రాంతాల్లో తీవ్ర నష్టం వాటిల్లింది. దక్షిణ ఉక్రెయిన్‌లో తమ చేజిక్కిన మెలిటోపోల్ సిటీలో పౌరులకు రష్యా పాస్‌పోర్టులు ఇస్తోంది.
జెలెన్‌స్కీతో ఉర్సులా భేటీ
యూరోపియన్ కమిషన్ చీఫ్ ఉర్సులా వోన్ డెర్ లెయన్ కీవ్‌లో అధ్యక్షుడు జెలెన్‌స్కీతో సమావేశమయ్యారు. రష్యా ఆర్థిక వ్యవస్థను పూర్తిగా స్తంభింపజేసేలా మరిన్ని కఠిన ఆంక్షలు విధించాలని పశ్చిమ దేశాలను జెలెన్‌స్కీ కోరారు.
తూర్పు ఉక్రెయిన్ నుంచి వలసలు
బాంబులు మోత, ఆహార సంక్షోభం దెబ్బకు తూర్పు ఉక్రెయిన్ నుంచి జనం భారీగా వలస వెళ్తున్నారు. వీరిలో చాలామంది మహిళలు, చిన్నారులు, వృద్ధులే ఉన్నారు. రష్యా అనుకూల వేర్పాటువాదులు మరణశిక్ష విధించిన ముగ్గురు విదేశీయులను కాపాడతామని ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి దిమిత్రో కులేబా చెప్పారు. వారిలో ఇద్దరు యూకే పౌరులు, ఒక మొరాకో పౌరుడున్నారు.
మారియూపోల్‌కు కలరా ముప్పు
దక్షిణ ఉక్రెయిన్‌లోని మారియూపోల్ నగరానికి కలరాతోపాటు ఇతర ప్రాణాంతక రోగాల ముప్పు పొంచి ఉందని స్థానిక మేయర్ బొయ్‌చెంకో ఆందోళన వ్యక్తం చేశారు. మారియూపోల్‌లో రష్యా దాడుల్లో చనిపోయిన వారి మృతదేహాలను ఇంకా పూర్తిగా తొలగించలేదని చెప్పారు. వందలాది మృతదేహాలు కుళ్లిపోతున్నాయని, ఫలితంగా జలవనరులు కలుషితం అవుతున్నాయన్నారు. తాగనీరు కలుషితమై రోగాలు దాడి చేసే ప్రమాదం ఉందన్నారు. తక్షణమే నివారణ చర్యలు చేపట్టకపోతే వేలాది మంది బలయ్యే అవకాశం ఉందని వాపోయారు.
హెచ్చరించినా పట్టించుకోలేదు: బైడెన్
లాస్‌ఏంజెలెస్: ఉక్రెయిన్‌పై రష్యా దండయాత్ర గురించి తమ నిఘా సంస్థలు ముందుగానే సమాచారం సేకరించాయని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ చెప్పారు. ఆయన లాస్‌ఏంజెలెస్‌లో డెమొక్రటిక్ పార్టీ ఆధ్వర్యంలో నిధుల సేకరణ కార్యక్రమంలో మాట్లాడారు. యుద్ధానికి రష్యా సిద్ధమవుతోందని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీని అప్రమత్తం చేశానని, అయినప్పటికీ ఆయన పెడచెవిన పెట్టారని అన్నారు. రష్యా ప్రారంభించబోయే యుద్ధం గురించి వినడానికి జెలెన్‌స్కీ ఇష్టపడలేదని తెలిపారు. ఉక్రెయిన్–రష్యా యుద్ధం గురించి స్పందిస్తూ.. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఇలాంటి పరిణామం జరగలేదన్నారు. ఇది అతిశయోక్తి కాదని, ముమ్మాటికీ వాస్తవమేనని స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment