
ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ఆరోపణలు
చర్చలు ఇష్టం లేక ఉక్రెయినే చేయించిందన్న రష్యా
కీవ్: తమ రాజధాని కీవ్ ప్రాంతంలో ఉన్న చెర్నోబిల్ అణువిద్యుత్ ప్లాంట్ రక్షణ కవచంపై రష్యా దాడి చేసిందని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ఆరోపించారు. శక్తివంతమైన పేలుడు పదార్థాలతో గురువారం రాత్రి జరిపిన ఈ దాడితో ప్రొటెక్టివ్ కంటెయిన్‌మెంట్ షెల్ దెబ్బతిందని, మంటలు చెలరేగాయని ఆయన చెప్పారు. అయితే, ఈ ఘటనతో ఆ ప్రాంతంలో రేడియో ధార్మిక స్థాయిలు సాధారణంగానే ఉన్నాయన్నారు. మంటలను అదుపు చేశామన్నారు.
పుతిన్ చర్చలకు సిద్ధంగా లేరన్న విషయం దీనినిబట్టి అర్థమవుతోందని ఆయన వ్యాఖ్యానించారు. ఘటనకు రష్యాను బాధ్యురాలిగా చేయాలన్నారు. ఉక్రెయిన్‌తో యుద్ధం ముగించేందుకు రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో సమావేశమవనున్నట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించిన నేపథ్యంలో ఈ పరిణామం చోటుచేసుకోవడం గమనార్హం. దాడి సమాచారాన్ని అమెరికాతో పంచుకుంటామని జెలెన్‌స్కీ చెప్పారు.
ఈ ఘటనను అంతర్జాతీయ అణు శక్తి ఏజెన్సీ(ఐఏఈఏ) ధ్రువీకరించింది. అయితే, దాడిలో రక్షణ కవచం దెబ్బతిన్నట్లుగా ఎటువంటి ఆనవాళ్లు కనిపించలేదని వివరించింది. అణు రియాక్టర్‌కు బయటివైపు రక్షణగా 2016లో అత్యంత భారీ కాంక్రీట్ నిర్మాణాన్ని ఏర్పాటు చేశారు. ప్రపంచంలోనే అతిపెద్ద 1986 చెర్నోబిల్ దుర్ఘటన జరిగినప్పుడే లోపలి వైపు రక్షణ ఏర్పాట్లను కట్టుదిట్టం చేశారు.

వీటివల్ల ప్రమాదకరమైన రేడియో ధార్మికత బయటకు లీక్ అయ్యేందుకు అవకాశం లేదు. కాగా, జెలెన్‌స్కీ ఆరోపణలపై రష్యా తీవ్రంగా స్పందించింది. అణు వ్యవస్థలు, అణు విద్యుత్ ప్లాంట్లపై దాడులు జరిగాయంటూ ఉక్రెయిన్ చెప్పేదంతా అబద్ధమని కొట్టిపారేసింది. తమ సైన్యం ఇలాంటివి చేయదని రష్యా అధ్యక్ష భవనం ప్రతినిధి దిమిత్రీ పెష్కోవ్ స్పష్టం చేశారు. శాంతి ఒప్పందం కోసం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ జోక్యంతో చర్చలకు అవరోధం కలిగించేందుకు ఉక్రెయినే ఇలాంటివి చేయిస్తోందని ఆరోపించారు.
Comments
Please login to add a commentAdd a comment