IAEA
-
సరికొత్త వంగడాల అన్వేషణ..ఏకంగా అంతరిక్షం నుంచి!
భూతాపాన్ని, కరువును తట్టుకునే సరికొత్త వంగడాల కోసం అన్వేషణ ఇప్పుడు అంతరిక్షంలోకి చేరింది. అంతరిక్షంలో కాస్మిక్ కిరణాల రేడియేషన్‌లో కొన్ని నెలలు ఉంచిన విత్తనాలతో రూపొందించే (స్పేస్ ఇండ్యూస్డ్ మ్యుటేషన్ బ్రీడింగ్) వంగడాలు భూమ్మీద క్లైమెట్ ఎమర్జెన్సీని దీటుగా తట్టుకోగలుగు తాయని ఎఫ్.ఎ.ఓ. భావిస్తోంది. మొట్టమొదటిగా జొన్న విత్తనాలతో స్పేస్ బ్రీడింగ్ ప్రాజెక్టుకు అంతర్జాతీయ అణు ఇంధన సంస్థతో కలసి ఎఫ్.ఎ.ఓ. శ్రీకారం చుట్టింది. కేరళకు చెందిన శాస్త్రవేత్త డా. శోభా శివశంకర్ ఈ పరిశోధనలకు సారధ్యం వహిస్తుండటం విశేషం. ప్రపంచ అంతరిక్ష వారోత్సవాల (అక్టోబర్ 4–10) సందర్భంగా డా. శోభ ‘సాక్షి సాగుబడి’కి ఈ–మెయిల్ ఇంటర్వ్యూ ఇచ్చారు. కరువును తట్టుకొని మంచి దిగుబడులు ఇచ్చే కొత్త వంగడాలు రూపొందించుకోవడానికి ఈ టెక్నాలజీ ఉపయోగపడు తుందని ఆమె ఈ ఇంటర్వ్యూలో చెప్పారు. స్పేస్ బ్రీడింగ్ ద్వారా చైనా ఇప్పటికే 260 వంగడాలను తయారు చేసుకొని వాడుతుండటం విశేషం. అంతరిక్షంలో రేడియేషన్‌కు గురిచేసిన విత్తనాలతో రూపొందించే (స్పేస్ బ్రీడింగ్) వంగడాల వల్ల కలిగే ప్రయోజనాలేమిటి? భూమిపై కరువు, అధిక ఉష్ణోగ్రతలు, నేల లవణీయత వంటి పర్యావరణ సంబంధమైన ఒత్తిళ్లు పంటలను వివిధ వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా పరిణామాత్మక ఉత్పరివర్తనాలు (ఎవల్యూషనరీ మ్యుటేషన్స్) చెందేందుకు ప్రేరేపిస్తాయి. అయితే, అంతరిక్షంలో కాస్మిక్ రేడియేషన్, మైక్రోగ్రావిటీ, విపరీతమైన ఉష్ణోగ్రతలు వంటి కఠినమైన పరిస్థితులు నెలకొని ఉంటుంది. అందువల్ల, అంతరిక్షం విత్తనాలపై పెను ఒత్తిడిని కలిగిస్తుంది. కఠిన పరిస్థితులను మరింత సమర్థవంతంగా తట్టుకునేలా పంట విత్తనాల్లో సాధారణం కన్నా ఎన్నో రెట్లు ఎక్కువగా అత్యంత వేగవంతంగా సరికొత్త ఉత్పరివర్తనాలను ప్రేరేపించడానికి బహుశా అంతరిక్షం మంచి వాతావరణం కావచ్చు. అంతరిక్షంలోకి వెళ్లొచ్చిన విత్తనాలతో సరికొత్త వంగడాలను రూపొందించే ప్రక్రియనే ‘స్పేస్ ఇండ్యూస్ మ్యుటేషన్ బ్రీడింగ్ లేదా స్పేస్ బ్రీడింగ్’ అంటాం. ప్రస్తుతం, స్పేస్ బ్రీడింగ్ ద్వారా విడుదలైన వంగడాల ద్వారా వచ్చిన ఫలితాలు కొన్ని మాత్రమే. అంతేకాదు, ఉత్పరివర్తనాలను ప్రేరేపించడానికి మొక్కల డిఎన్ఏపై అనంత విశ్వం చూపే ప్రభావాలేమిటో తెలియజెప్పే ప్రచురిత సమాచారం చాలా పరిమితమనే చెప్పాలి. స్పేస్ బ్రీడింగ్‌ను ఇప్పటి వరకు ఎన్ని దేశాలు, ఎన్ని పంటల్లో ఉపయోగిస్తున్నాయి? చైనా స్పేస్ బ్రీడింగ్‌లో ముందుంది. వివిధ పంటల విత్తనాలను అంతరిక్షంలోకి పంపి, అక్కడ కొన్నాళ్లు ఉంచి తిరిగి నేల మీదకు తెప్పించిన తర్వాత వాటిని పరీక్షించి, మెరుగైన ఫలితాలు ఉన్నట్లు గుర్తించిన చాలా రకాల పంటల వంగడాలను చైనా తమ దేశంలో రైతులకు అందించింది. ఈ జాబితాలో వరి, గోధుమ, మొక్కజొన్న, సోయాబీన్, పత్తి, నువ్వు, మిరప, టమోటో తదితర పంటలున్నాయి. భారత్ వంటి అభివృద్ధి చెందుతున్న దేశాల్లో రైతులు సాగు చేసే వరి, మిరప, పత్తి తదితర పంటలు అధిక ఉష్ణోగ్రతల్ని తట్టుకోవడంలో జన్యుమార్పిడి విత్తనాల కన్నా ‘అంతరిక్ష విత్తనాలు’ ఎలా మెరుగైనవి? పోల్చడం కష్టం. సాధారణంగా జన్యుమార్పిడి చేయడానికి అందుకు అవసరమైన ప్రత్యేక జన్యువును ముందుగా గుర్తించడం అవసరం. గుర్తించిన జన్యువును జన్యుమార్పిడి/జన్యు సవరణ సాంకేతికతలలో ఉపయోగించి తగిన ఫలితం పొందే అవకాశం ఉంది. అయితే, అంతర్జాతీయ అణు ఇంధన సంస్థ, ఐరాసకు చెందిన ఆహార– వ్యవసాయ సంస్థ వియన్నా (ఆస్ట్రియా) లో సంయుక్తంగా ఏర్పాటు చేసిన ‘సెంటర్ ఆఫ్ న్యూక్లియర్ టెక్నిక్స్ ఇన్ ఫుడ్ అండ్ అగ్రికల్చర్’లో ప్రత్యేక జన్యువులపై ముందస్తు అవగాహన లేకుండానే.. నేలపై ల్యాబ్‌లో మ్యుటేషన్ బ్రీడింగ్ ద్వారా ప్రత్యేక లక్షణాలను ఆశించి సరికొత్త పంట రకాలను అభివృద్ధి చేస్తుంది. ఎక్స్, గామా కిరణాల రేడియేషన్ ద్వారా జరిగే ఈ ప్రక్రియ విత్తనంలో పెద్ద సంఖ్యలో ఉత్పరివర్తనాలను సృష్టిస్తుంది. ఆ విత్తనాలను సాగు చేసి వాటిలో మనం ఆశించిన మార్పు వచ్చిందో లేదో జాగ్రత్తగా పరీక్షించి చూసుకోవాలి. ఈ స్క్రీనింగ్పైనే స్థిరమైన వ్యవసాయక పరిస్థితులకు అనువైన వంగడాల ఎంపిక ఆధారపడి ఉంటుంది. ఇప్పటికి 70కి పైగా దేశాలకు చెందిన 210కి పైగా వృక్ష జాతులతో పాటు అనేక ఆహార పంటలు, అలంకరణ మొక్కలు, చెట్లకు సంబంధించి మ్యూటేషన్ బ్రీడింగ్ జరిగింది. 3,400కి పైగా అధికారికంగా విడుదలైన ఉత్పరివర్తన రకాలు మా డేటాబేస్‌లో వున్నాయి. ‘ఆసియాలో విత్తనోత్పత్తిదారులు వైవిధ్యమైన వాతావరణంలో పనిచేసే చాలా మంది చిన్న రైతుల కోసం విత్తనాలను ఉత్పత్తి చేస్తారు. కేవలం ఒకటి లేదా రెండు లక్షణాలను ఆశించి జన్యుమార్పిడి/సవరణ చేయడం వీరి అవసరాలను తీర్చదు. అధిక వేడిని, కరువును తట్టుకోవడం.. నిస్సారమైన/చౌడుబారిన నేలల్లో పెరిగే సామర్థ్యం వంటి మరింత సంక్లిష్టమైన గుణాలు కలిగిన వంగడాలు వారికి అవసరం. ఏదో ఒక జన్యువును మార్పిడి/సవరణ చేసే సాంకేతికతలతో ఇది సాధించలేం..’ అని మీరు ఓ ఇంటర్వ్యూ లో చెప్పారు. దయచేసి దీని గురించి వివరిస్తారా? ఒక జన్యువు లేదా కొన్ని జన్యువులతో సవరించగలిగే సాధారణ లక్షణాలు జన్యుమార్పిడి మార్పు లేదా జన్యు సవరణకు అనుకూలంగా ఉంటాయి. కరువును తట్టుకోవటం, దిగుబడిని పెంపొందించటం వంటివి అనేక జన్యువులతో సంబంధం ఉండే సంక్లిష్ట లక్షణాలు. ఇవి జన్యుమార్పిడి లేదా జన్యుసవరణతో సాధ్యం కావు. యావత్తు జన్యువ్యవస్థ వ్యాప్త మార్పులు(జీనోమిక్ వైడ్ ఛేంజెస్) అవసరం. ఇవి మ్యుటేషన్ బ్రీడింగ్‌తో లేదా ప్రకృతిలో ఆయా లక్షణాలున్న వంగడాల ఎంపిక (టార్గెటెడ్ సెలక్షన్) ద్వారానే సాధ్యం. – పంతంగి రాంబాబు, సాగుబడి డెస్క్ (చదవండి: ‘అంతరిక్ష విత్తనాలు’ ఆదుకుంటాయా? ) -
అణు నిఘాను ఇరాన్ అడ్డుకుంటోంది
వియెన్నా: అణు కేంద్రాల వద్ద ఉన్న నిఘా కెమెరాలను ఇరాన్ తొలగించడంపై ఐక్యరాజ్యసమితికి చెందిన అంతర్జాతీయ అణు ఇంధన సంస్థ(ఐఏఈఏ) ఆందోళన వ్యక్తం చేసింది. ఐఏఈఏ పర్యవేక్షణ కోసం నతాంజ్ భూగర్భ అణు శుద్ధి కేంద్రం వద్ద బిగించిన రెండు కెమెరాలను ఆఫ్ చేసినట్లు బుధవారం ఇరాన్ ప్రకటించింది. యురేనియం శుద్ధిని మరింత వేగవంతం చేయనున్నట్లు కూడా ఇరాన్ ఐఏఈఏకి సమాచారం అందించింది. అగ్రరాజ్యాలతో జరుగుతున్న అణు చర్చల్లో ప్రతిష్టంభన నేపథ్యంలో ఒత్తిడి పెంచేందుకే ఇరాన్ ఈ ప్రకటన చేసినట్లు భావిస్తున్నారు. దేశంలోని మూడు అప్రటిత ప్రాంతాల్లో కనుగొన్న అణుధార్మిక పదార్ధాలకు సంబంధించి విశ్వసనీయమైన సమాచారం అందించడంలో విఫలమైందంటూ ఇరాన్‌ను బుధవారం ఐఏఈఏ తప్పుబట్టింది. ఇందుకు సంబంధించిన తీర్మానాన్ని ఐఏఈఏలోని 35 దేశాలకు 30 బలపరిచాయి. తీర్మానాన్ని రష్యా, చైనా వీటో చేయగా లిబియా, పాకిస్తాన్, భారత్ ఓటింగ్‌లో పాల్గొనలేదు. ఐఏఈఏ డైరెక్టర్ జనరల్ రఫేల్ మరియానోవియెన్నాలో మీడియాతో మాట్లాడారు. ఇరాన్ అధికారులు నతాంజ్, ఇస్ఫాహాన్‌ల వద్ద ఉన్న రెండు మాత్రమే కాదు, మొత్తం 40కి పైగా కెమెరాలకు గాను 27 కెమెరాలను మూసేసినట్లు సమాచారం ఉందన్నారు. ఈ చర్యతో ఇరాన్ అణు కార్యక్రమం పురోగతి వివరాలు అంతర్జాతీయ సమాజానికి వెల్లడయ్యే అవకాశం లేదన్నారు. అణుకేంద్రాల వద్ద అమర్చిన సీసీటీవీ కెమెరాల ఫుటేజీని ఇరాన్ 2021 నుంచే ఐఏఈఏకి అందించడం మానేసింది. -
ఉక్రెయిన్ యుద్ధంలో ఊహించని పరిణామం
కీవ్: ఉక్రెయిన్-రష్యా యుద్ధం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈ తరుణంలో మంగళవారం.. ఊహించని పరిణామం ఒకటి చోటు చేసుకుంది. అంతర్జాతీయ అణుశక్తి సంస్థ తీరును తప్పుబడుతూ.. తాజాగా ఒక ప్రకటన విడుదల చేసింది ఉక్రెయిన్. అంతర్జాతీయ అణుశక్తి(ఐఏఈఏ) చీఫ్ రఫేల్ గ్రాస్సీ దక్షిణ ఉక్రెయిన్‌లోని జాపోరిజ్జియా అణు విద్యుత్ ప్లాంట్‌కు ప్రతినిధుల బృందాన్ని పంపుతామని ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఈ చర్యలను తప్పుబడుతూ ఉక్రెయిన్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఐఏఈఏకు, ఆ సంస్థ చీఫ్‌కు ఆ ప్లాంట్‌లో అనుమతి లేదంటూ నిషేదాజ్ఞలు జారీ చేసింది ఉక్రెయిన్. #BREAKING Ukraine blocks IAEA chief visit to Russian-occupied nuclear plant: Kyiv pic.twitter.com/Ht8zkkCEyN — AFP News Agency (@AFP) June 7, 2022 ఇదిలా ఉంటే.. ఉక్రెయిన్ న్యూక్లియర్ కంపెనీ ఎనెర్గోఆటం.. ఐరాసకు చెందిన అంతర్జాతీయ విభాగం ఐఏఈఏ నిర్ణయాన్ని తప్పుబడుతోంది. యూరప్‌లోనే అతిపెద్ద అణు విద్యుత్ కేంద్రం అయిన జాపోరిజ్జియా.. దురాక్రమణ నేపథ్యంలో రష్యా బలగాల చేతుల్లోకి వెళ్లిపోయింది. అప్పటి నుంచి రష్యా-ఉక్రెయిన్ బలగాలు ఈ ప్లాంట్‌పై ఆధిపత్యం కోసం హోరాహోరీగా పోరాడుతున్నాయి. అయితే ఇప్పటికీ ఈ ప్లాంట్‌ను ఉక్రెయిన్ సిబ్బందే నిర్వహిస్తుండడం కొసమెరుపు. సోమవారం ఐఏఈఏ చీఫ్ రఫెల్ గ్రాసీ మాట్లాడుతూ.. ఇంటర్నేషనల్ మిషన్‌లో భాగంగా నిపుణులతో కూడిన బృందాన్ని రష్యా ఆధీనంలో ఉన్న జాపోరిజ్జియాకు పంపనున్నట్లు ప్రకటించారు. అయితే.. అది రష్యా అనుకూల వ్యాఖ్య, పైగా యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో ఐఏఈఏ బృందం ప్లాంట్‌లో పర్యటించడాన్ని ఎలాగైనా అడ్డుకోవాలని ప్రయత్నిస్తున్నాయి కీవ్ వర్గాలు. ఈ క్రమంలో.. ఉక్రెయిన్ తీరుపట్ల పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. -
ప్రమాదం ముంగిట ఉక్రెయిన్.. అదే జరిగితే భారీ విస్పోటనం తప్పదు
కీవ్: ఉక్రెయిన్‌లో రష్యా బలగాలు రెచ్చిపోతున్నాయి. దాడుల్లో భాగంగా ఉక్రెయిన్‌లోని అణు విద్యుత్ కేంద్రాలను రష్యా బలగాలు తమ స్వాధీనంలోకి తీసుకున్నాయి. కాగా, చెర్నోబిల్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ విషయంలో అంతర్జాతీయ అణు శక్తి కేంద్రం(IAEA) ఆందోళన వ్యక్తం చేసింది. చెర్నోబిల్‌తో సంబంధాలు తెగిపోయినట్లు బుధవారం ప్రకటించింది. రెండు వారాలుగా అక్కడ పరిస్థితి ఎలా ఉందో తెలియడం లేదు. రష్యా బలగాలు చెర్నోబిల్‌ను స్వాధీనం చేసుకున్నప్పటి నుంచి.. అక్కడ ఏం జరుగుతుందో తెలియడం లేదు. అక్కడి స్టాఫ్ పరిస్థితి మీద కూడా ఎలాంటి అప్డేట్ లేదు అని తెలిపింది. ఇదిలా ఉండగా.. 210 మంది టెక్నీషియన్ల సరిపడా ఆహారం, మందులు ఉన్నప్పటికీ.. పరిస్థితి విషమిస్తోందని అటామిక్ ఏజెన్సీకి ఉక్రెయిన్ ఒక నివేదిక ఇచ్చింది. తాజాగా.. ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి దిమిత్రో కులేబా ఆందోళనకర వ్యాఖ్యలు చేశారు. చెర్నోబిల్ న్యూక్లియర్ ప్లాంట్‌కు చెందిన పవర్ గ్రిడ్ పనిచేయడం ఆపేసిందని బిగ్ బాంబ్ పేల్చారు. నేషనల్ న్యూక్లియర్ రెగ్యులేటర్‌కు అందిన సమాచారం ప్రకారం.. చెర్నోబిల్‌లోని అన్ని కేంద్రాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయిందన్నారు. అత్యవసర పరిస్థితుల కోసం ఏర్పాటు చేసిన జనరేటర్లకు కేవలం 48 గంటలకు సరిపడా డీజిల్ మాత్రమే ఉందని వెల్లడించారు. ప్లాంట్‌కు విద్యుత్ సరఫరా లేకపోతే.. న్యూక్లియర్ మెటీరియల్‌ను చల్లార్చే వ్యవస్థలపై ప్రభావం పడుతుందన్నారు. ఈ క్రమంలో రేడియేషన్‌ను నియంత్రించడం కష్టమవుతుందన్నారు. దీంతో పెను ప్రమాదం జరిగే అవకాశం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు రష్యా దాడుల కారణంగానే చెర్నోబిల్‌కు విద్యుత్ సరఫరా నిలిచిపోయిందని ఆరోపించారు. రష్యా కాల్పుల విరమణ పాటిస్తేనే గ్రిడ్‌కు మరమ్మతులు చేసే అవకాశం ఉంటుందన్నారు. మరోవైపు ఉక్రెయిన్‌పై సైనిక చర్య విషయంపై రష్యా మరోసారి క్లారిటీ ఇచ్చింది. ఉక్రెయిన్ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు తమ బలగాలు పనిచేయడం లేదని, ప్రస్తుత ప్రభుత్వాన్ని కూలగొట్టే అవసరం రష్యా మిలిటరీకి లేదని స్పష్టం చేసింది. తాము చర్చలకు ప్రాధాన్యత ఇస్తామని, చర్చల ద్వారానే లక్ష్యాలను సాధిస్తామని రష్యా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి మరియా జఖరోవా తెలిపారు. కాగా ఉక్రెయిన్-రష్యా మధ్య నేడు(బుధవారం) మూడో దఫా చర్చలు జరగనున్న నేపథ్యంలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. అంతేగాక రష్యా సైనిక చర్య పక్కా ప్రణాళిక పరంగా ముందుకు సాగుతోందన్నారు. Reserve diesel generators have a 48-hour capacity to power the Chornobyl NPP. After that, cooling systems of the storage facility for spent nuclear fuel will stop, making radiation leaks imminent. Putin’s barbaric war puts entire Europe in danger. He must stop it immediately! 2/2 — Dmytro Kuleba (@DmytroKuleba) March 9, 2022 -
ఉ.కొరియాలో మళ్లీ అణు కార్యకలాపాలు
సియోల్: ఉత్తరకొరియా తన ప్రధాన అణు రియాక్టర్‌ను అణ్వస్త్ర ఇంధన ఉత్పత్తి కోసం తిరిగి ప్రారంభించినట్లు కనిపిస్తోందని అంతర్జాతీయ అణు శక్తి సంస్థ(ఐఏఈఏ) తెలిపింది. తమ దేశంపై విధించిన ఆంక్షల తొలగింపు, ద.కొరియాతో సైనిక విన్యాసాలను అమెరికా నిలిపివేయకుంటే అణ్వస్త్ర తయారీని తిరిగి ప్రారంభిస్తామంటూ ఉ.కొరియా బెదిరిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఐఏఈఏ ఈ మేరకు తన వార్షిక నివేదికలో పేర్కొంది. యాంగ్బియోన్లోని ప్రధాన అణు సముదా యంలో ఉన్న 5 మెగావాట్ల రియాక్టర్‌ను ఈ ఏడాది జూలై నుంచి పనిచేస్తున్నట్లు శాటిలైట్ చిత్రాలు, వివిధ వర్గాల నుంచి అందిన సమాచారం విశ్లేషించి ఈ మేరకు అంచనాకు వచ్చినట్లు తెలిపింది. ఇదే సముదాయంలో ఉన్న రేడియో కెమికల్ లేబొరేటరీ ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి జూలై వరకు పని చేసినట్లు సూచనలు కనిపించాయని పేర్కొంది. అణ్వా యుధాల తయారీలో వినియోగించే ప్లుటోనియం ఈ సముదాయంలో ఉత్పత్తవుతుంది. రియాక్టర్ల నుంచి తొలగించిన ఇంధన కడ్డీలను తిరిగి ప్రాసెసింగ్ చేయడం ద్వారా ఇక్కడ ప్లుటోనియంను వేరు చేస్తారు. ‘ఉ.కొరియా అణు కార్యకలాపాలను తిరిగి కొనసాగించడం తీవ్రంగా ఆందోళన కలిగించే అంశం. 5 మెగావాట్ల రియాక్టర్తోపాటు రేడియో కెమికల్ లేబొరేటరీ తిరిగి పనిచేయించడం ఇబ్బందికరమైన విషయం’అని ఐఏఈఏ పేర్కొంది. తమ దేశంలోని అణు సముదాయాలను ఐఏఈఏ బృందాలు తనిఖీ చేయడాన్ని 2009 నుంచి ఉ.కొరియా నిలిపివేసింది. -
ఉత్తర కొరియా ఇప్పుడు ప్రపంచముప్పు!
అణ్వాయుధాలు, కిపణులతో సరికొత్త సవాలుగా మారింది ఆందోళన వ్యక్తం చేసిన ఐఏఈఏ సాక్షి, జెనీవా: ప్రాంతీయ ఉపద్రవం స్థాయి నుంచి అంతర్జాతీయ ముప్పుగా ఉత్తర కొరియా పరిణమించిందని అంతర్జాతీయ అణుశక్తి సంస్థ (ఐఏఈఏ) ఆందోళన వ్యక్తంచేసింది. ఉత్తర కొరియా గత ఆదివారం హైడ్రోజన్ బాంబును పరీక్షించడం.. ప్రపంచానికి సరికొత్త సవాలును విసిరిందని ఐఏఈఏ అధినేత యుకిహ అమానో తెలిపారు. ఉత్తర కొరియా ఆదివారం మరోసారి అణుబాంబును పరీక్షించడంతో కొరియా ద్వీపకల్పంలో ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరిన సంగతి తెలిసిందే. ఉత్తర కొరియా తెంపరితనానికి దీటుగా బదులిచ్చేందుకు దక్షిణ కొరియా క్షిపణీ పరీక్షలను ముమ్మరం చేయడమే కాకుండా అమెరికా నిర్మిత క్షిపణి రక్షణ వ్యవస్థ మోహరింపును తీవ్రతరం చేసింది. ’ఉత్తర కొరియా ఇప్పుడు ప్రపంచముప్పుగా పరిణమించింది. గతంలో ఆ దేశం ప్రాంతీయ సవాలుగానే ఉండేది. కానీ ఇప్పుడా పరిస్థితి లేదు. అణ్వాయుధాలు, క్షిపణులు కలిగిన ప్రపంచ ముప్పుగా అది మారింది’ అని యుకిహ అభిప్రాయపడ్డారు. -
ప్రధాన స్రవంతిలో ఇరాన్
ఈ ఏడాది ఆఖరుకు పదవినుంచి వైదొలగబోతూ అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా కొసమెరుపుగా ఒక మంచిపని చేశారు. సుదీర్ఘ చర్చల అనంతరం ఏడెని మిది నెలలక్రితం వియెన్నాలో కుదిరిన ఒప్పందాన్ననుసరించి ఇరాన్ తన అణు కేంద్రాల తనిఖీకి అంగీకరించడం...ఆ కేంద్రాలను క్షుణ్ణంగా పరిశీలించిన అంత ర్జాతీయ అణు శక్తి సంస్థ(ఐఏఈఏ) అంతా సవ్యంగా ఉన్నదని తేల్చిచెప్పడం పర్యవ సానంగా ఆంక్షలను నిలిపివేస్తున్నట్టు సోమవారం అమెరికా, యూరప్ దేశాలు ప్రకటించాయి. మూడున్నర దశాబ్దాలుగా అమలవుతున్న ఆంక్షలతో ఇరాన్ ప్రజా నీకం పడిన ఇబ్బందులు అన్నీ ఇన్నీ కాదు. 1979లో ‘ఇస్లామిక్ విప్లవం’ తర్వాత అమెరికా ఈ ఆంక్షల్ని మొదలెట్టింది. 1995నాటికి ఇవి మరింత విస్తరించాయి. తన చెప్పుచేతల్లో ఉండే యూరప్ దేశాలనూ, మరికొన్ని ఇతర దేశాలనూ కూడా ఆంక్షల అమలుకు ఒప్పించింది. యురేనియం శుద్ధి కార్యక్రమాన్ని విరమించుకోవడానికి ఆ దేశం నిరాకరించాక 2006లో భద్రతామండలి తీర్మానం ద్వారా ఆంక్షల పరంపర మరింత పెరిగింది. చమురు, గ్యాస్, పెట్రో కెమికల్స్ తదితర రంగాల్లో పెట్టుబ డులు పెట్టడాన్ని ఈ ఆంక్షలు అడ్డుకున్నాయి. ఇరాన్‌తో లావాదేవీలున్నట్టు తేలిన బ్యాంకింగ్, ఆర్థిక సంస్థలన్నిటినీ తమ దేశాల్లో కార్యకలాపాలు నెరపకుండా అమెరికా, యూరప్ దేశాలు నిషేధాలు విధించాయి. ఆంక్షల పర్యవసానంగా సామాన్య పౌరులు చెప్పనలవికాని ఇబ్బందులు పడ్డారు. పేరుకు ఔషధాలు, వైద్య పరికరాలపై ఆంక్షలు లేవని చెప్పినా...చెల్లింపులకు సంబంధించిన మార్గాలన్నీ మూతపడటంతో అవి ఆగిపోయాయి. ఫలితంగా కేన్సర్, గుండె, ఊపిరితిత్తులకు సంబంధించిన రోగులు వేలాదిమంది నిస్సహాయంగా మరణించారు. 85,000 మంది కేన్సర్ రోగులు కీమోథెరపీ, రేడియోథెరపీ చికిత్సలు అందుబాటులో లేక చనిపోయారని 2013లో ఒక అధ్యయనం వెల్లడించింది. వేలాదిమంది పసిపిల్లలు మృత్యువాత పడ్డారు. అయితే ఇరాన్ సకల ఆంక్షలనుంచీ విముక్తమైనట్టేనా? దానికున్న సమస్యలన్నీ తీరినట్టేనా? కానేకాదు. అణు కార్యక్రమం పర్యవసానంగా విధించిన ఆంక్షలు మాత్రమే ఇప్పుడు నిలిచిపోయాయి. అంటే ఆంక్షలు సస్పెండ్ అయ్యాయే తప్ప పూర్తిగా రద్దు కాలేదు. దీనికితోడు అమెరికా పౌరులైనా, కంపెనీలైనా ఇరాన్ సంస్థ లతో వాణిజ్య లావాదేవీలు జరపకూడదన్న ఆంక్షలు అలాగే ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఏ అమెరికా పౌరుడైనా, సంస్థయినా ఆ దేశంలో పెట్టుబడులు పెట్టడా నికి చొరవ తీసుకునే పరిస్థితులుంటాయా? అణు చర్చలు జరుగుతుండగానే నిరుడు అక్టోబర్‌లో ఇరాన్ బాలిస్టిక్ క్షిపణిని పరీక్షించాక అమెరికా విధించిన కొత్త ఆంక్షలు యథాతథంగా కొనసాగుతాయి. బాలిస్టిక్ క్షిపణికి అణ్వస్త్రాన్ని మోసుకుపో గల సామర్థ్యం ఉన్నదని అమెరికా, ఇతర పాశ్చాత్య దేశాలు అనుమానిస్తున్నాయి. అలాంటపుడు ఇప్పుడు నిలిపివేసిన ఆంక్షలు ఏమేరకు ప్రభావం కలిగిస్తాయన్నది వేచిచూడాల్సిందే. ఇరాన్ తన చమురు నిల్వల్ని అంతర్జాతీయ మార్కెట్‌కు తర లించడానికి ముందు చమురు వెలికితీతకు ఆ దేశం వినియోగిస్తున్న సాంకేతికతను ఆధునీకరించుకోవాల్సి ఉంటుంది. మూడున్నర దశాబ్దాలనాటి సాంకేతికత స్థానంలో కొత్తది తెచ్చుకోవాలి. అందుకయ్యే కోట్లాది డాలర్ల మొత్తాన్ని సమీక రించుకోవాల్సి ఉంటుంది. వెనువెంటనే చేకూరే లాభమేమంటే అమెరికాతోపాటు ఇతర దేశాల్లో ఇన్నాళ్లనుంచీ స్తంభించిన స్థితిలో ఉన్న పదివేల కోట్ల డాలర్ల ఆస్తుల్ని ఆ దేశం వెనువెంటనే పొందగలుగుతుంది. ఇరాన్, అమెరికాలు రెండూ దగ్గరకావడానికి ఎవరి కారణాలు వారికున్నాయి. ఇరాన్ ఆర్థిక వ్యవస్థ సహజంగానే ఆంక్షల కారణంగా తీవ్రంగా దెబ్బతిని ఉంది. ఆ దేశంలో ఇప్పుడు అధికారంలో ఉన్న సంస్కరణవాదులు వచ్చే నెలలో జరగబోయే పార్లమెంటు ఎన్నికల్లో ఎలాగైనా అధికారంలోకి రావాలన్న పట్టుదలతో ఉన్నారు. ఆంక్షలు నిలిపేయడంవల్ల ప్రారంభమయ్యే వాణిజ్య కార్యకలాపాలు... ప్రభుత్వా నికి లభించే వేల కోట్ల డాలర్లు ఒక ఉత్సాహపూరిత వాతావరణానికి దోహదం చేస్తాయి. సహజంగానే ప్రస్తుత ప్రభుత్వంపై దేశ పౌరుల్లో అనుకూల ప్రభావాన్ని కలిగిస్తాయి. 2013లో జరిగిన ఎన్నికల్లో ప్రస్తుత అధ్యక్షుడు హసన్ రౌహానీ దేశ ఆర్థిక వ్యవస్థకు జవజీవాలు తీసుకొస్తానని...ఇరాన్‌ను అంటరాని దేశంగా పరిగ ణించే ప్రస్తుత స్థితిని మారుస్తానని వాగ్దానం చేశారు. వాటిని సాధించిన ఘనత ఆయనకు దక్కుతుంది. అటు అమెరికాలో సైతం ఈ ఏడాది ఆఖరుకు అధ్యక్ష ఎన్నికలు జరగబో తున్నాయి. ఈ ఎనిమిదేళ్ల ఏలుబడిలో ఇరాన్‌ను దారికి తీసుకురాగలిగామన్న ప్రచారం డెమొక్రటిక్ పార్టీకి లబ్ధి చేకూరుస్తుంది. గతంలో డెమొక్రటిక్ పార్టీకి చెందిన బిల్ క్లింటన్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఉత్తర కొరియాను సైతం ఇదే విధానంలో దారికి తెచ్చుకోవడానికి ప్రయత్నించగా...ఆ తర్వాత ఏర్పడ్డ రిపబ్లికన్ పార్టీ ప్రభుత్వం ఆ వాతావరణాన్ని చెడగొట్టింది. ఉత్తర కొరియాపై తొడగొట్టింది. పర్యవసానంగా ఆ దేశం ఇప్పుడు హైడ్రోజన్ బాంబు తయారు చేసుకున్నానని ప్రపంచాన్నే బెదరగొట్టే స్థితికి చేరుకుంది. ఆ దేశాన్ని నియంత్రించడమెలాగో తెలియక అందరూ తలలు పట్టుకుంటున్నారు. ఈ వ్యత్యాసాన్ని చూపి, తమ సమర్థతను నిరూపించుకోవడానికి డెమొక్రటిక్ పార్టీకి అవకాశం ఏర్పడింది. పైగా సిరియాలో తలదూర్చి తలబొప్పి కట్టించుకున్న ఒబామాకు ఉగ్రవాద సంస్థ ఐఎస్‌ను కట్టడి చేయడం ఎలాగో తెలియడంలేదు. ఇరాన్‌ను మిత్రదేశంగా మార్చుకుంటే ఆ సమస్య పరిష్కారంలో దాని సాయం తీసుకోవడం సాధ్యమవు తుంది. ఆంక్షల నిలిపివేత వల్ల ఇన్ని లాభాలున్నా తన చిరకాల మిత్ర దేశం సౌదీ అరేబియాను బుజ్జగించడమెలాగన్న సమస్య అమెరికాకు ఉండనే ఉంది. పశ్చి మాసియాలో చిరకాల ప్రత్యర్థి ఇరాన్ బలపడితే తన పరిస్థితి ఏమిటో సౌదీకి తెలి యడంలేదు. అయితే ఇరాన్ ప్రధాన స్రవంతిలోకి అడుగిడటంవల్ల మనతోపాటు అనేక దేశాలకు కొత్తగా బహుముఖ అవకాశాలు లభిస్తాయి. ఇరాన్లో మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల్లో పెట్టుబడులకు మార్గం సుగమం అవుతుంది. ఆ దేశం చమురు మార్కెట్లోకి రావడంవల్ల పోటీ పెరిగి అది మరింత చవగ్గా లభిస్తుంది. ఆంక్షల నిరర్ధకతను అమెరికా గుర్తించి మిగిలినవాటిని కూడా తొలగిస్తే మొత్తంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ బలపడుతుంది.