ఉత్తర కొరియా ఇప్పుడు ప్రపంచముప్పు!
- అణ్వాయుధాలు, కిపణులతో సరికొత్త సవాలుగా మారింది
- ఆందోళన వ్యక్తం చేసిన ఐఏఈఏ
సాక్షి, జెనీవా: ప్రాంతీయ ఉపద్రవం స్థాయి నుంచి అంతర్జాతీయ ముప్పుగా ఉత్తర కొరియా పరిణమించిందని అంతర్జాతీయ అణుశక్తి సంస్థ (ఐఏఈఏ) ఆందోళన వ్యక్తంచేసింది. ఉత్తర కొరియా గత ఆదివారం హైడ్రోజన్ బాంబును పరీక్షించడం.. ప్రపంచానికి సరికొత్త సవాలును విసిరిందని ఐఏఈఏ అధినేత యుకిహ అమానో తెలిపారు.
ఉత్తర కొరియా ఆదివారం మరోసారి అణుబాంబును పరీక్షించడంతో కొరియా ద్వీపకల్పంలో ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరిన సంగతి తెలిసిందే. ఉత్తర కొరియా తెంపరితనానికి దీటుగా బదులిచ్చేందుకు దక్షిణ కొరియా క్షిపణీ పరీక్షలను ముమ్మరం చేయడమే కాకుండా అమెరికా నిర్మిత క్షిపణి రక్షణ వ్యవస్థ మోహరింపును తీవ్రతరం చేసింది.
’ఉత్తర కొరియా ఇప్పుడు ప్రపంచముప్పుగా పరిణమించింది. గతంలో ఆ దేశం ప్రాంతీయ సవాలుగానే ఉండేది. కానీ ఇప్పుడా పరిస్థితి లేదు. అణ్వాయుధాలు, క్షిపణులు కలిగిన ప్రపంచ ముప్పుగా అది మారింది’ అని యుకిహ అభిప్రాయపడ్డారు.