ప్రధాన స్రవంతిలో ఇరాన్ | Free from sanctions, Iran becomes mainstreem country now | Sakshi
Sakshi News home page

ప్రధాన స్రవంతిలో ఇరాన్

Published Wed, Jan 20 2016 4:16 AM | Last Updated on Thu, Apr 4 2019 3:25 PM

ప్రధాన స్రవంతిలో ఇరాన్ - Sakshi

ప్రధాన స్రవంతిలో ఇరాన్

ఈ ఏడాది ఆఖరుకు పదవినుంచి వైదొలగబోతూ అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా కొసమెరుపుగా ఒక మంచిపని చేశారు. సుదీర్ఘ చర్చల అనంతరం ఏడెని మిది నెలలక్రితం వియెన్నాలో కుదిరిన ఒప్పందాన్ననుసరించి ఇరాన్ తన అణు కేంద్రాల తనిఖీకి అంగీకరించడం...ఆ కేంద్రాలను  క్షుణ్ణంగా పరిశీలించిన అంత ర్జాతీయ అణు శక్తి సంస్థ(ఐఏఈఏ) అంతా సవ్యంగా ఉన్నదని తేల్చిచెప్పడం పర్యవ సానంగా ఆంక్షలను నిలిపివేస్తున్నట్టు సోమవారం అమెరికా, యూరప్ దేశాలు ప్రకటించాయి. మూడున్నర దశాబ్దాలుగా అమలవుతున్న ఆంక్షలతో ఇరాన్ ప్రజా నీకం పడిన ఇబ్బందులు అన్నీ ఇన్నీ కాదు.

 

1979లో ‘ఇస్లామిక్ విప్లవం’ తర్వాత అమెరికా ఈ ఆంక్షల్ని మొదలెట్టింది.  1995నాటికి ఇవి మరింత విస్తరించాయి. తన చెప్పుచేతల్లో ఉండే యూరప్ దేశాలనూ, మరికొన్ని ఇతర దేశాలనూ కూడా ఆంక్షల అమలుకు ఒప్పించింది. యురేనియం శుద్ధి కార్యక్రమాన్ని విరమించుకోవడానికి ఆ దేశం నిరాకరించాక 2006లో భద్రతామండలి తీర్మానం ద్వారా ఆంక్షల పరంపర మరింత పెరిగింది. చమురు, గ్యాస్, పెట్రో కెమికల్స్ తదితర రంగాల్లో పెట్టుబ డులు పెట్టడాన్ని ఈ ఆంక్షలు అడ్డుకున్నాయి. ఇరాన్‌తో లావాదేవీలున్నట్టు తేలిన బ్యాంకింగ్, ఆర్థిక సంస్థలన్నిటినీ తమ దేశాల్లో కార్యకలాపాలు నెరపకుండా అమెరికా, యూరప్ దేశాలు నిషేధాలు విధించాయి. ఆంక్షల పర్యవసానంగా సామాన్య పౌరులు చెప్పనలవికాని ఇబ్బందులు పడ్డారు.

 

పేరుకు ఔషధాలు, వైద్య పరికరాలపై ఆంక్షలు లేవని చెప్పినా...చెల్లింపులకు సంబంధించిన మార్గాలన్నీ మూతపడటంతో అవి ఆగిపోయాయి. ఫలితంగా కేన్సర్, గుండె, ఊపిరితిత్తులకు సంబంధించిన రోగులు వేలాదిమంది నిస్సహాయంగా మరణించారు. 85,000 మంది కేన్సర్ రోగులు కీమోథెరపీ, రేడియోథెరపీ చికిత్సలు అందుబాటులో లేక చనిపోయారని 2013లో ఒక అధ్యయనం వెల్లడించింది. వేలాదిమంది పసిపిల్లలు మృత్యువాత పడ్డారు.

 

అయితే ఇరాన్ సకల ఆంక్షలనుంచీ విముక్తమైనట్టేనా? దానికున్న సమస్యలన్నీ తీరినట్టేనా? కానేకాదు. అణు కార్యక్రమం పర్యవసానంగా విధించిన ఆంక్షలు మాత్రమే ఇప్పుడు నిలిచిపోయాయి. అంటే ఆంక్షలు సస్పెండ్ అయ్యాయే తప్ప పూర్తిగా రద్దు కాలేదు. దీనికితోడు అమెరికా పౌరులైనా, కంపెనీలైనా ఇరాన్ సంస్థ లతో వాణిజ్య లావాదేవీలు జరపకూడదన్న ఆంక్షలు అలాగే ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఏ అమెరికా పౌరుడైనా, సంస్థయినా ఆ దేశంలో పెట్టుబడులు పెట్టడా నికి చొరవ తీసుకునే పరిస్థితులుంటాయా? అణు చర్చలు జరుగుతుండగానే నిరుడు అక్టోబర్‌లో ఇరాన్ బాలిస్టిక్ క్షిపణిని పరీక్షించాక అమెరికా విధించిన కొత్త ఆంక్షలు యథాతథంగా కొనసాగుతాయి. బాలిస్టిక్ క్షిపణికి అణ్వస్త్రాన్ని మోసుకుపో గల సామర్థ్యం ఉన్నదని అమెరికా, ఇతర పాశ్చాత్య దేశాలు అనుమానిస్తున్నాయి. అలాంటపుడు ఇప్పుడు నిలిపివేసిన ఆంక్షలు ఏమేరకు ప్రభావం కలిగిస్తాయన్నది వేచిచూడాల్సిందే.

 

ఇరాన్ తన చమురు నిల్వల్ని అంతర్జాతీయ మార్కెట్‌కు తర లించడానికి ముందు చమురు వెలికితీతకు ఆ దేశం వినియోగిస్తున్న సాంకేతికతను ఆధునీకరించుకోవాల్సి ఉంటుంది. మూడున్నర దశాబ్దాలనాటి సాంకేతికత స్థానంలో కొత్తది తెచ్చుకోవాలి. అందుకయ్యే కోట్లాది డాలర్ల మొత్తాన్ని సమీక రించుకోవాల్సి ఉంటుంది. వెనువెంటనే చేకూరే లాభమేమంటే అమెరికాతోపాటు ఇతర దేశాల్లో ఇన్నాళ్లనుంచీ స్తంభించిన స్థితిలో ఉన్న పదివేల కోట్ల డాలర్ల ఆస్తుల్ని ఆ దేశం వెనువెంటనే పొందగలుగుతుంది.

 

ఇరాన్, అమెరికాలు రెండూ దగ్గరకావడానికి ఎవరి కారణాలు వారికున్నాయి. ఇరాన్ ఆర్థిక వ్యవస్థ సహజంగానే ఆంక్షల కారణంగా తీవ్రంగా దెబ్బతిని ఉంది. ఆ దేశంలో ఇప్పుడు అధికారంలో ఉన్న సంస్కరణవాదులు వచ్చే నెలలో జరగబోయే పార్లమెంటు ఎన్నికల్లో ఎలాగైనా అధికారంలోకి రావాలన్న పట్టుదలతో ఉన్నారు. ఆంక్షలు నిలిపేయడంవల్ల ప్రారంభమయ్యే వాణిజ్య కార్యకలాపాలు... ప్రభుత్వా నికి లభించే వేల కోట్ల డాలర్లు ఒక ఉత్సాహపూరిత వాతావరణానికి దోహదం చేస్తాయి. సహజంగానే ప్రస్తుత ప్రభుత్వంపై దేశ పౌరుల్లో అనుకూల ప్రభావాన్ని కలిగిస్తాయి. 2013లో జరిగిన ఎన్నికల్లో ప్రస్తుత అధ్యక్షుడు హసన్ రౌహానీ దేశ ఆర్థిక వ్యవస్థకు జవజీవాలు తీసుకొస్తానని...ఇరాన్‌ను అంటరాని దేశంగా పరిగ ణించే ప్రస్తుత స్థితిని మారుస్తానని వాగ్దానం చేశారు. వాటిని సాధించిన ఘనత ఆయనకు దక్కుతుంది.

 

అటు అమెరికాలో సైతం ఈ ఏడాది ఆఖరుకు అధ్యక్ష ఎన్నికలు జరగబో తున్నాయి. ఈ ఎనిమిదేళ్ల ఏలుబడిలో ఇరాన్‌ను దారికి తీసుకురాగలిగామన్న ప్రచారం డెమొక్రటిక్ పార్టీకి లబ్ధి చేకూరుస్తుంది. గతంలో డెమొక్రటిక్ పార్టీకి చెందిన బిల్ క్లింటన్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఉత్తర కొరియాను సైతం ఇదే విధానంలో దారికి తెచ్చుకోవడానికి ప్రయత్నించగా...ఆ తర్వాత ఏర్పడ్డ రిపబ్లికన్ పార్టీ ప్రభుత్వం ఆ వాతావరణాన్ని చెడగొట్టింది. ఉత్తర కొరియాపై తొడగొట్టింది. పర్యవసానంగా ఆ దేశం ఇప్పుడు హైడ్రోజన్ బాంబు తయారు చేసుకున్నానని ప్రపంచాన్నే బెదరగొట్టే స్థితికి చేరుకుంది.

 

ఆ దేశాన్ని నియంత్రించడమెలాగో తెలియక అందరూ తలలు పట్టుకుంటున్నారు. ఈ వ్యత్యాసాన్ని చూపి, తమ సమర్థతను నిరూపించుకోవడానికి డెమొక్రటిక్ పార్టీకి అవకాశం ఏర్పడింది. పైగా సిరియాలో తలదూర్చి తలబొప్పి కట్టించుకున్న ఒబామాకు ఉగ్రవాద సంస్థ ఐఎస్‌ను కట్టడి చేయడం ఎలాగో తెలియడంలేదు. ఇరాన్‌ను మిత్రదేశంగా మార్చుకుంటే ఆ సమస్య పరిష్కారంలో దాని సాయం తీసుకోవడం సాధ్యమవు తుంది.

 

ఆంక్షల నిలిపివేత వల్ల ఇన్ని లాభాలున్నా తన చిరకాల మిత్ర దేశం సౌదీ అరేబియాను బుజ్జగించడమెలాగన్న సమస్య అమెరికాకు ఉండనే ఉంది. పశ్చి మాసియాలో చిరకాల ప్రత్యర్థి ఇరాన్ బలపడితే తన పరిస్థితి ఏమిటో సౌదీకి తెలి యడంలేదు. అయితే ఇరాన్ ప్రధాన స్రవంతిలోకి అడుగిడటంవల్ల మనతోపాటు అనేక దేశాలకు కొత్తగా బహుముఖ అవకాశాలు లభిస్తాయి. ఇరాన్‌లో మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల్లో పెట్టుబడులకు మార్గం సుగమం అవుతుంది. ఆ దేశం చమురు మార్కెట్‌లోకి రావడంవల్ల పోటీ పెరిగి అది మరింత చవగ్గా లభిస్తుంది. ఆంక్షల నిరర్ధకతను అమెరికా గుర్తించి మిగిలినవాటిని కూడా తొలగిస్తే మొత్తంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ బలపడుతుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement