రష్యావ్యాప్తంగా మెక్‌డొనాల్డ్స్ తన వ్యాపారాన్ని త్వరలో మూసేస్తున్న నేపథ్యంలో ఆ ఫాస్ట్‌ఫుడ్ రుచిని మళ్లీ ఆస్వాదించలేమని భావించి ఔట్‌లెట్‌ల ముందు బారులుతీరిన రష్యన్లు
కీవ్: ఉక్రెయిన్‌లో వరుస ఎదురుదెబ్బలతో డీలా పడ్డ రష్యాకు ఎట్టకేలకు చిన్న ఊరట. కీలక రేవు పట్టణం మారియుపోల్‌పై రష్యా సైన్యాలు పూర్తిగా పట్టు సాధించాయి. దాదాపు మూడు నెలల పోరాటంలో రష్యాకు చిక్కిన అతి పెద్ద నగరం ఇదే! వాస్తవానికి అజోవ్‌స్తల్ స్టీల్ ఫ్యాక్టరీ మినహా నగరమంతా ఎప్పుడో రష్యా గుప్పెట్లోకి వెళ్లింది. ఫ్యాక్టరీలో దాగున్న ఉక్రెయిన్ సైనికులు మాత్రం రెండు నెలలుగా పోరాడుతున్న విషయం తెలిసిందే.
ఆహారం తదితర వనరులన్నీ నిండుకోవడంతో ఇక పోరాడలేక వారంతా సోమవారం నుంచి లొంగుబాట పట్టారు. అది బుధవారంతో ముగిసిందని రష్యా ప్రకటించింది. 959 మంది లొంగిపోయినట్టు వెల్లడించింది. వారిని బస్సుల్లో డోన్బాస్‌లో వేర్పాటువాదుల అధీనంలోని ఒలెనివ్కా నగరానికి తరలించారు. ప్రాణాలు కాపాడుకోవాల్సిందిగా వారికి ఉక్రెయిన్ కూడా మంగళవారమే పిలుపునిచ్చింది.
ఖైదీల మార్పిడి కింద వారిని తమకు అప్పగిస్తారని ఉక్రెయిన్ భావిస్తుండగా, రష్యా మాత్రం కొందరినైనా యుద్ధ నేరాల కింద విచారిస్తామని చెబుతోంది. దాంతో లొంగిపోయిన వారి భవితవ్యంపై అయోమయం నెలకొంది. మరోవైపు ఉక్రెయిన్‌కు అమెరికా అందజేసిన అత్యాధునిక ఆయుధాలతో కూడిన పలు నిల్వలను ధ్వంసం చేసినట్టు రక్షణ శాఖ అధికార ప్రతినిధి ఇగోర్ కొనషెంకోవ్ చెప్పారు. వాటిలో ఎం777 హొవిట్జర్లు తదితరాలున్నాయన్నారు. ఇందుకు సంబంధించిన వీడియోను రష్యా విడుదల చేసింది.
చరిత్రాత్మక క్షణం: నాటో చీఫ్
మారియుపోల్ చిక్కిన ఆనందంలో ఉన్న రష్యాకు మింగుడు పడని పరిణామం చోటుచేసుకుంది. నాటో సభ్యత్వం కోసం స్వీడన్, ఫిన్లాండ్ బుధవారం లాంఛనంగా దరఖాస్తు చేసుకున్నాయి. దీన్ని చరిత్రాత్మక క్షణంగా నాటో సెక్రెటరీ జనరల్ జెన్స్ స్టోటెన్‌బర్గ్ అభివర్ణించారు. ‘‘ఈ క్షణాన్ని వదులుకోబోం. ఆ రెడు దేశాలకు తక్షణం సభ్యత్వం ఇచ్చేందుకు చర్యలు చేపడతాం’’ అని ప్రకటించారు.
మామూలుగా ఏడాది పట్టే దరఖాస్తు పరిశీలన ప్రక్రియను రెండు వారాల్లో ముగించాలని నాటో నిర్ణయించింది. ఈ నిర్ణయానికి ఫిన్లండ్, స్వీడన్ భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని రష్యా మరోసారి హెచ్చరించింది. అయితే అమెరికా, ఇంగ్లండ్‌తో పాటు పలు నాటో దేశాలు ఇందుకు దీటుగా స్పందించాయి. దరఖాస్తులు ఆమోదం పొందేలోపు ఆ దేశాలపై రష్యా దుందుడుకు చర్యలకు దిగితే వాటికి అన్నివిధాలా రక్షణ కల్పిస్తామని ప్రకటించాయి. వాటి చేరికకు మొత్తం నాటో సభ్య దేశాలన్నీ అంగీకరించాల్సి ఉంటుంది.
టర్కీ వ్యతిరేకత నేపథ్యంలో ఏం జరుగుతుందా అన్న ఉత్కంఠ నెలకొంది. నాటోలో చేరే ఉద్దేశం లేదని ఆస్ట్రియా వెల్లడించింది. ప్రతీకార చర్యల్లో భాగంగా ఫ్రాన్స్, ఇటలీ, స్పెయిన్ దౌత్యవేత్తలను రష్యా బహిష్కరించింది. ఉక్రెయిన్ పునరుద్ధరణకు 950 కోట్ల డాలర్ల రుణం మంజూరు చేయాలని యూరోపియన్ కమిషన్ ప్రతిపాదించింది. ఉక్రెయిన్‌కు ఇప్పటికే 410 కోట్ల యూరోల సాయాన్ని సేకరించినట్టు కమిషన్ ప్రెసిడెంట్ ఉర్సులా వాండెర్ లెయన్ చెప్పారు.
సైనికుడి నేరాంగీకారం
యుద్ధ నేరాల విచారణ ఎదుర్కొంటున్న ఓ రష్యా సైనికుడు తనపై మోపిన అభియోగాలను అంగీకరించాడు. ఫిబ్రవరి 28న సమీ ప్రాంతంలో కార్లో కూర్చుని ఉన్న ఓ నిరాయుధ ఉక్రెయిన్ పౌరున్ని తలలో కాల్చి చంపినట్టు సార్జెంట్ వడీం షిషిమారిన్ (21) వెల్లడించాడు.
Comments
Please login to add a commentAdd a comment