సాక్షి, నెట్‌వర్క్ : ఉక్రెయిన్‌లో మూడో రోజూ రష్యా దాడులు కొనసాగుతుండడం.. యుద్ధం తగ్గుముఖం పట్టే సూచనలు కనిపించకపోవడంతో అక్కడ చదువుకుంటున్న తెలుగు విద్యార్థులు బాంబుల హోరుతో బెంబేలెత్తుతున్నారు. రాజధాని కీవ్‌లో చిత్తూరు జిల్లా బి.కొత్తకోటకు చెందిన వైద్య విద్యార్థిని సాయినిఖిత ఉంటున్న అపార్ట్‌మెంటుకు కిలోమీటర్ దూరంలో శుక్రవారం రాత్రి బాంబులు పడటంతో అక్కడ వారంతా భయంకంపితులయ్యారు. బాంబులు పడిన ప్రాంతమంతా భీకర శబ్దాలతో దద్దరిల్లిందని శనివారం ఆమె ‘సాక్షి’తో మాట్లాడుతూ చెప్పింది. రాత్రంతా బాంబుల శబ్దాలతో నిద్రపోలేదని చెప్పింది. కానీ, శనివారం ఉదయం నుంచీ కర్ఫ్యూ వాతావరణం నెలకొందని వివరించింది.
ఎక్కడి వారు అక్కడే ఉండాలంటూ వాట్సప్ గ్రూపులో మెసేజ్‌లు వస్తున్నాయని అక్కడి పరిస్థితిని నిఖిత వివరించింది. వాహనాలు లేనందున ఎక్కడికీ కదల్లేని పరిస్థితని చెప్పింది. ప్రస్తుత పరిస్థితుల్లో ఉక్రెయిన్ సరిహద్దులకు వెళ్లడం కూడా అంత శ్రేయస్కరం కాదని హెచ్చరించడంతో తామంతా కీవ్‌లోని అపార్ట్‌మెంట్‌లోనే ఉండిపోయామని తెలిపింది. రాజంపేట ఎంపీ మిథున్‌రెడ్డి ఫోన్‌లో మాట్లాడి దైర్యం చెప్పారని, ఆయన సిబ్బంది తరచూ మాట్లాడుతున్నారని చెప్పింది. అలాగే, బి.కొత్తకోట శెట్టిపల్లె రోడ్డులో ఉంటున్న ప్రభుత్వ ఉపాధ్యాయుడు రామకృష్ణ కూడా తన కుమారుడు ఎస్. చైతన్య కోసం ఆందోళన చెందుతున్నారు. అయితే శనివారం సాయంత్రం చైతన్య సహా పలువురు విద్యార్థులు బస్సులో రుమేనియా దేశానికి బయలుదేరారు. అక్కడినుంచి ప్రత్యేక విమానంలో ముంబై కాని, ఢిల్లీకాని చేరుకుంటారు.
బస్సుల కొరతతో విడతల వారీగా..
ఇక భారత్ ఎంబసీ ఏర్పాటుచేసిన ప్రత్యేక బస్సులో రుమేనియాకు బయల్దేరామని ప్రకాశం జిల్లా కురిచేడు మండలం పడమర వీరాయపాలెంకు చెందిన మోతుకూరు నాగప్రణవ్ తెలిపాడు. శనివారం మధ్యాహ్నం ప్రణవ్ తల్లిదండ్రులకు ఫోన్ చేశాడు. బస్సులో రుమేనియాకు చేరుకునేందుకు ఒకటిన్నర రోజు పడుతుందని, అక్కడ నుంచి స్వదేశానికి వస్తామని తెలిపాడు. ఇక్కడ ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన 70 మంది విద్యార్థులు ఉన్నారని, ప్రస్తుతం 30 మంది బస్సులో రుమేనియా బయలుదేరామని తెలిపాడు.
మరో 20 మంది రాత్రికి, మిగతా 20 మంది రేపు బయల్దేరుతారన్నాడు. బస్సుల కొరత కారణంగా విడతల వారీగా రుమేనియాకు వెళ్లాల్సి వస్తోందని ప్రణవ్ ‘సాక్షి’కి వివరించాడు. మరోవైపు.. విమానాలు లేక దాచేపల్లికి చెందిన కటకం మురళీకృష్ణ, లక్ష్మీ దంపతుల కుమార్తె రమ్యశ్రీ అక్కడే ఉండిపోవాల్సిన పరిస్థితి. విమానం టికెట్లు బుక్ చేసుకున్నప్పటికీ ఉపయోగం లేకుండాపోయిందని వారు ఆవేదన వ్యక్తంచేశారు. ఎయిర్‌పోర్టుకు సమీపంలో ఉన్న మరో యూనివర్సిటీకి రమ్యశ్రీతో పాటు మరికొంతమంది విద్యార్థులను అక్కడి అధికారులు తరలించారు.
భయపడొద్దు..మేమందరం ఉన్నాం : కోన రఘుపతి
‘ఉక్రెయిన్ నుంచి ప్రతి ఒక్కరినీ క్షేమంగా తీసుకువచ్చేందుకు సీఎం జగన్ సిద్ధంగా ఉన్నారు.. భయపడొద్దు..మేమందరం ఉన్నాం’.. అంటూ డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి ఉక్రెయిన్‌లో ఉన్న నోషితకు, ఇక్కడ ఆమె తల్లిదండ్రులు శ్రీదేవి, శ్రీనివాసరావుకు ధైర్యం చెప్పారు. వీడియోకాల్‌లో నోషితతో మాట్లాడిన అనంతరం ఆయన టాస్క్‌ఫోర్స్ కమిటీతో ఉక్రెయిన్‌లోని పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అలాగే, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల చొరవతో ప్రత్యేక విమానాల్లో విద్యార్థులను స్వదేశానికి తీసుకువచ్చే ఏర్పాట్లు జరుగుతున్నాయని, అధైర్య పడొద్దని అమలాపురం ఎంపీ అనురాధ తూర్పుగోదావరి జిల్లా ఉప్పలగుప్తం మండలం విలసవల్లికి చెందిన సలాది గంగా భవాని (భవ్య)కు శనివారం వీడియో కాల్‌చేసి మాట్లాడారు. భవ్యతో పాటు 20 మంది విద్యార్థులు బంకర్‌లో ఉన్నారు.
బాంబుల హోరుతో భయం భయంగా..విద్యార్థులు
Published Sun, Feb 27 2022 4:19 AM | Last Updated on Sun, Feb 27 2022 3:53 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment