ఖర్గీవ్‌లో క్షతగాత్రుడికి సాయపడుతున్న దృశ్యం
సాక్షి, నేషనల్ డెస్క్: అందరిలోనూ ఒకటే ఆరాటం.. ఒకటే ఆకాంక్ష. ఈ క్షణం ప్రాణాలు దక్కించుకుంటే చాలు. ఈ యుద్ధభూమి దూరంగా వెళ్లిపోయి క్షేమంగా మిగిలితే అదే పదివేలు. అందుకే వాహనాలన్నీ రోడ్లపై బారులు తీరాయి. పెట్రోల్ బంకులు, ఏటీఎం కేంద్రాలు జనం రద్దీతో కిటకిటలాడాయి. అండర్‌గ్రౌండ్ స్టేషన్లు కిక్కిరిసిపోయాయి. ఉక్రెయిన్ రాజధాని కీవ్ నగరంలో గురువారం ఉదయమే కనిపించిన దృశ్యాలివీ.. రష్యా సైన్యం అకస్మాత్తుగా దాడులు ప్రారంభించడంతో ఉక్రెయిన్ ప్రజలు కకావికలమయ్యారు. బాంబుల మోతలు, ఎయిర్ సైరన్లు భీకర స్థాయిలో వినిపిస్తుండడంతో తొలుత ఏం జరుగుతోందో అర్థంకాక తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. విస్ఫోటన శబ్దాలు విని ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. రష్యా సైన్యం విరుచుకుపడుతోందని తెలిశాక సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లేందుకు ఏర్పాటు చేసుకున్నారు.
పిల్లా పాపలు, కుటుంబ సభ్యులతో కలిసి సొంత వాహనాల్లో పయనమయ్యారు. పెట్రోల్ బంకుల వద్ద వాహనాలు పెద్ద సంఖ్యలో క్యూ కట్టాయి. పెట్రోల్ కోసం చాలా సమయం వేచి చూడాల్సి వచ్చింది. రోడ్లపై తరచుగా ట్రాఫిక్ నిలిచిపోయింది. నగరం వెలుపలకు దారితీసే రోడ్లన్నీ వ్యక్తిగత వాహనాలతో నిండిపోయాయి. కొందరైతే అండర్‌గ్రౌండ్ స్టేషన్లకు పరుగులు తీశారు. రోజంతా అక్కడే తలదాచుకున్నారు. అన్నపానీయాలు సైతం ఇచ్చేవారు లేక ఆకలితో అలమటించారు. పిల్లల రోదనలు, పెద్దల కన్నీళ్లతో అండర్‌గ్రౌండ్ స్టేషన్లలో దృశ్యాలు హృదయాలను బరువెక్కించాయి. డబ్బుల కోసం ఏటీఎం కేంద్రాలకు ప్రజలు పోటెత్తారు. కొద్దిసేపట్లోనే ఏటీఎం యంత్రాలు ఖాళీ కావడంతో ఉసూరుమంటూ వెనుదిరగాల్సి వచ్చిందని, రేపటి రోజు ఎలా గడుస్తుందో తెలియడం లేదని జనం ఆవేదన వ్యక్తం చేశారు. నిత్యావసర సరుకుల కోసం దుకాణాల్లో జనం ఎగబడ్డారు.
కీవ్‌లోని ఓ ఏటీఎం వద్ద నగదు కోసం బారులు తీరిన ప్రజలు
విద్యాసంస్థలు మూసివేత
ప్రజలంతా ఇళ్లల్లోనే ఉండాలని, బయటకు రావొద్దని అధికారులు పదేపదే అభ్యర్థించారు. అయినప్పటికీ జనం ప్రాణభయంతో నగరం విడిచి వెళ్లేందుకే మొగ్గుచూపారు. చాలామంది మెట్రో స్టేషన్లకు చేరుకున్నారు. బంధు మిత్రులకు ఫోన్లు చేస్తూ క్షేమ సమాచారాలు ఇచ్చిపుచ్చుకున్నారు. నగరంలో ప్రజా రవాణా వ్యవస్థకు ఎలాంటి అంతరాయం కలగలేదని అధికారులు వెల్లడించారు. మెట్రో రైళ్లు, బస్సులు యథావిధిగా నడిచాయని చెప్పారు. ఇక పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాలను ముందు జాగ్రత్తగా మూసివేశారు. ప్రభుత్వం మార్షల్ లా విధించడంతో ఆసుపత్రుల్లో హైఅలర్ట్ ప్రకటించారు. రష్యా దాడులతో తూర్పు సరిహద్దుకు చాలా దూరంగా ఉన్న నగరాల నుండి కూడా పొగలు వచ్చాయి.
కీవ్‌లోని ప్రధాన వీధి క్రేష్‌చాటిక్‌లో ఆందోళనతో నిండిన ప్రజలు కనిపించారు. చాలా మంది పాత్రికేయులు బస చేసిన హోటల్‌ను 30 నిమిషాల్లో ఖాళీ చేయమని అధికారులు ఆదేశించారు. ఖార్కివ్‌లో పిల్లల ఆట స్థలంలో మిలటరీ శకలాలు పడ్డాయి. నగరంలో ప్రతి ఒక్కరూ వారికి అవసరమైన ఔషధాలు, గుర్తింపు పత్రాలతో సిద్ధంగా ఉండాలని కీవ్ మేయర్ సూచించారు. ‘ఈ పరిస్థితి వస్తుందని ఊహించలేదు. తక్షణ సాయం కోసం ఎవరిని సంప్రదించాలో తెలియట్లేదు’’ అని కీవ్ నివాసి ఎలిజవేటా మెల్నిక్ వాపోయారు. ఇది నా జీవితంలో అత్యంత దారుణమైన సూర్యోదయం అని ఖార్వివ్ నగరానికి చెందిన సాశా అనే మహిళ వాపోయారు. బాంబుల శబ్దాలతోనే నిద్ర నుంచి మేల్కొన్నానని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment