కీవ్‌లో వైమానిక దాడిలో నేలమట్టమైన షాపింగ్ సెంటర్
కీవ్: ఉక్రెయిన్‌పై రష్యా ముట్టడి తీవ్రస్థాయిలో కొనసాగుతూనే ఉంది. రేవుపట్టణం మారియుపోల్‌ను ఆక్రమించే ప్రయత్నాలను రష్యా సైన్యం తీవ్రతరం చేసింది. నగరం వీడాల్సిందిగా ఉక్రెయిన్ దళాలకు సోమవారం సూచించింది. ‘‘తెల్ల జెండాలు ఎగరేసి, ఆయుధాలు వదిలి వెళ్లిపోయేందుకు సిద్ధపడ్డవాళ్లంతా హ్యుమానిటేరియన్ కారిడార్ల గుండా సురక్షితంగా వెళ్లిపోయేలా చూస్తాం. మరుక్షణమే నగరంలోకి అత్యవసరాల సరఫరాను అనుమతిస్తాం’’ అని కల్నల్ జనరల్ మిఖాయిల్ మిజింట్సెవ్ చెప్పారు. ఉక్రెయిన్ అందుకు నిరాకరించింది. దాంతో రష్యా దళాలు రెచ్చిపోయాయి. ఎడాపెడా క్షిపణి, బాంబు దాడులతో కనీవినీ ఎరగని రీతిలో నగరంపై విరుచుకుపడుతున్నాయి.
ఒక్క మారియుపోల్‌లోనే కనీసం 20 వేల మంది దాకా మరణించి ఉంటారన్న వార్తలు అందరినీ కలచివేస్తున్నాయి! దీనిపై యూరోపియన్ యూనియన్ తీవ్రంగా స్పందించింది. రష్యా తీవ్ర యుద్ధ నేరాలకు పాల్పడుతోందంటూ దుమ్మెత్తిపోసింది. మారియుపోల్‌లో వేలాదిగా పౌరులను అతి కిరాతకంగా, విచక్షణారహితంగా పొట్టన పెట్టుకుంటున్న తీరు దుర్మార్గమని ఈయూ విదేశీ విధాన చీఫ్ జోసెఫ్ బోరెల్ విమర్శించారు. ‘‘రష్యా నైతికంగా అధఃపాతాళానికి దిగజారింది. యుద్ధంలోనూ నీతీ నియమాలుంటాయని మర్చిపోయింది’’ అంటూ దుయ్యబట్టారు. రష్యా యుద్ధ నేరాలపై అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు సాక్ష్యాలను సేకరిస్తోంది.
కీవ్... కదనరంగం: రాజధాని కీవ్‌ను ఆక్రమించే ప్రయత్నాలను రష్యా మరింత ముమ్మరం చేసింది. ఆదివారం అర్ధరాత్రి రష్యా సైన్యం జరిపిన బాంబు దాడుల్లో జనసమ్మర్ధ ప్రాంతంలోని ఓ షాపింగ్ సెంటర్ నేలమట్టమైంది. కనీసం ఎనిమిది మంది చనిపోయినట్టు సమాచారం. రాజధానిని చుట్టుముట్టి స్వాధీనం చేసుకోవడమే లక్ష్యంగా రష్యా తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. వీటిని ఉక్రెయిన్ సైనికులు తీవ్రంగా ప్రతిఘటిస్తున్నారు. సమీలో ఒక కెమికల్ ఫ్యాక్టరీలో 50 టన్నుల భారీ ట్యాంక్ నుంచి అమోనియా లీకయింది. దాంతో చుట్టుపక్కల రెండున్నర కిలోమీటర్ల మేర వాతావరణం బాగా కలుషితమైనట్టు సమాచారం.
తీవ్ర ప్రయత్నాల తర్వాత లీకేజీని అరికట్టారు. ఇతర నగరాలనూ సుదూరాల నుంచి క్షిపణి దాడులతో రష్యా బెంబేలెత్తిస్తోంది. ఉక్రెయిన్ దళాలు రష్యా సైన్యంపై చాటునుంచి దాడులు చేసి పారిపోతూ గెరిల్లా వ్యూహం అనుసరిస్తున్నాయి. ఆహారం తదితర అత్యవసర సరఫరాలను అడ్డుకుంటున్నాయి. రివెన్ సమీపంలో సైనిక శిక్షణ కేంద్రంపై క్షిపణులతో దాడి చేసి 80 మందికి పైగా ఉక్రెయిన్, కిరాయి సైనికులను చంపేసినట్టు రష్యా చెప్పింది. రేవు పట్టణం ఒడెసాపై దాడులను తీవ్రతరం చేయాల్సిందిగా పుతిన్ ఆదేశించారు. దాంతో రష్యా సేనలు యుద్ధ నౌకల నుంచి పౌరులపైకి కూడా క్షిపణులు ప్రయోగిస్తున్నాయి.
బెనెట్‌కు థాంక్స్: జెలెన్‌స్కీ
చర్చల కోసం ఇజ్రాయెల్ ప్రధాని బెనెట్ చేస్తున్న ప్రయత్నాలకు ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్‌స్కీ కృతజ్ఞతలు తెలిపారు. ఆర్ట్ స్కూలుపై బాంబు వేసిన పైలట్‌ను హతమార్చి తీరతామన్నారు. చర్చల్లో సానుకూల సంకేతాలు కన్పిస్తున్నాయని బెనెట్ చెప్పారు. ఫేస్‌బుక్, ఇన్‌స్ట్రాగామ్‌లను రష్యా స్థానిక కోర్టు నిషేధించింది!
మొరాయించిన చెర్నోబిల్ మానిటర్లు
ఉక్రెయిన్‌లోని చెర్నోబిల్ అణు విద్యుత్కేంద్రంలోని రేడియేషన్ మానిటర్లు పని చేయడం లేదు! ఉక్రెయిన్ అణు నియంత్రణ సంస్థ సోమవారం ఒక ప్రకటనలో ఈ మేరకు వెల్లడించింది. ‘‘వాతావరణం క్రమంగా వేడెక్కుతున్న నేపథ్యంలో ప్లాంటు సమీపంలోని అడవులను కాపాడేందుకు అవసరమైన సంఖ్యలో అగ్నిప్రమాపక సిబ్బంది కూడా అందుబాటులో లేరు. ఫలితంగా రేడియేషన్ లీకేజీని అడ్డుకోవడం కష్టం కావచ్చు’’ అని హెచ్చరించింది.
శనివారం పోలండ్‌కు బైడెన్
అత్యవసర చర్చల కోసం ఈ వారాంతంలో యూరప్ రానున్న అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తన ట్రిప్‌లో భాగంగా శనివారం పోలండ్‌లో కూడా పర్యటించాలని నిర్ణయించుకున్నారు. గురువారం నాటో నేతలతో శిఖరాగ్ర భేటీలో బైడెన్ పాల్గొంటారు. తర్వాత బ్రసెల్స్ నుంచి పోలండ్ వెళ్తారని వైట్‌హౌస్ ప్రెస్ సెక్రెటరీ జాన్ సాకీ తెలిపారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్, జర్మనీ చాన్సలర్ షోల్జ్, ఇటలీ, ఇంగ్లండ్ ప్రధానులు మారియో డ్రాగీ, బోరిస్ జాన్సన్‌లతో కూడా సోమవారం బైడెన్ చర్చలు జరిపారు.
Comments
Please login to add a commentAdd a comment