వాషింగ్టన్: ఉక్రెయిన్‌పై యుద్ధానికి తెగబడ్డ రష్యా మీద అమెరికా, యూరోపియన్ యూనియన్ శుక్రవారం మరిన్ని ఆంక్షలకు తెర తీశాయి. ఈసారి కూడా ప్రధానంగా ఆ దేశ ఆర్థిక, రక్షణ, పారిశ్రామిక నెట్‌వర్కులను లక్ష్యం చేసుకున్నాయి. రష్యా, దాని సన్నిహితులపై ఏకంగా 500పై చిలుకు ఆంక్షలు విధిస్తున్నట్టు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రకటించారు!
మతిలేని హత్యాకాండకు, వినాశనానికి పుతిన్ మూల్యం చెల్లించి తీరాల్సిందేనని స్పష్టం చేశారు. మరోవైపు భారీ ఆయుధాల తయారీ తదితరాలకు ఉపయోగపడే నిషేధిత వస్తువులను రష్యాకు ఎగుమతి చేసిన ఆరోపణలపై పలు విదేశీ కంపెనీలపై కఠిన ఆంక్షలు విధిస్తున్నట్టు ఈయూ సమాఖ్య ప్రకటించింది.
నవాల్నీ కుటుంబంతో బైడెన్ భేటీ: అంతకుముందు రష్యా విపక్ష నేత దివంగత అలెక్సీ నవాల్నీ భార్య యూలియా నవాల్నయా, కూతురు దషాతో బైడెన్ భేటీ అయ్యారు. నవాల్నీ మృతి పట్ల దిగ్భ్రాంతి వెలిబుచ్చారు. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ‘‘నవాల్నీ సాటిలేని ధైర్యశాలి.
ఆయన పోరాటాన్ని యూలియా, దషా ముందుకు తీసుకెళ్తారని పూర్తి విశ్వాసముంది’’ అన్నారు. నవాల్నీ మృతదేహానికి గోప్యంగా తక్షణ అంత్యక్రియలు జరిపేందుకు అంగీకరించేలా జైలు అధికారులు తనపై తీవ్ర ఒత్తిడి తెస్తున్నారని తల్లి లుడ్మిలా ఆరోపించారు. ఆలస్యమైతే శవం కుళ్లిపోతుందంటూ బ్లాక్‌మెయిల్ చేస్తున్నారని ఆవేదన వెలిబుచ్చారు. గురువారం కుమారుని మృతదేహాన్ని చూసిన అనంతరం ఆమె ఈ మేరకు వీడియో విడుదల చేశారు.
Comments
Please login to add a commentAdd a comment