Alexei Navalny
-
Russia: ఆంక్షల మధ్య నవాల్నీ అంత్యక్రియలు
మాస్కో: రష్యా విపక్ష నేత అలెక్సీ నవాల్నీ అంత్యక్రియలు శుక్రవారం ఆంక్షల నడుమ ముగిశాయి. జైల్లో అనుమానాస్పద రీతిలో మరణించిన ఆయన మృతదేహాన్ని కుటుంబీకులకు అప్పగించేందుకు పుతిన్ సర్కారు ఒక పట్టాన అంగీకరించని విషయం తెలిసిందే. అనంతరం సర్కారు భయంతో అంత్యక్రియ నిర్వహణకు చర్చిలు కూడా వెనకడుగు వేశాయి. ఎట్టకేలకు మాస్కోలోని ఓ చర్చి ఒప్పుకున్నా శ్మశానవాటికకు పార్థివదేహాన్ని తరలించేందుకు వాహనం దొరకడమూ గగనమే అయింది. మృతదేహాన్ని తరలించేందుకు ముందుకొచ్చిన వారికి బెదిరింపులు వచ్చినట్టు నావల్నీ అధికార ప్రతినిధి కీరా యార్మిష్ చెప్పారు. చివరకు మాస్కో పరిధిలోని మేరినో జిల్లా బోరిసోవస్కోయీ శ్మశానవాటికలో నవాల్నీ పార్థివ దేహాన్ని ఖననం చేశారు. జనం గుమికూడొద్దన్న ప్రభుత్వ హెచ్చరికలను బేఖాతరుచేస్తూ వేలాదిగా వేలాదిగా మద్దతుదారులు, ఉద్యమకారులు, అభిమానులు హాజరయ్యారు. మృతదేహాన్ని ఉంచిన మదర్ ఆఫ్ గాడ్ సూథీ మై సారోస్ చర్చిలో వేలాదిగా నివాళులర్పించారు. నవాల్నీ నవాల్నీ అంటూ నినాదాలతో హోరెత్తించారు. అమెరికా, ఫ్రాన్స్ రాయబారులు తదితరులు పుష్పగుచ్ఛాలుంచి అంజలి ఘటించారు. అంత్యక్రియల్లో ఆంక్షలు అతిక్రమించిన వారికి శిక్షలు తప్పవని ప్రభుత్వ అధికార ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్ చెప్పారు. -
నావల్నీ అంత్యక్రియలకు చర్చిలు నిరాకరించిన వేళ..
మాస్కో: ఇటీవల అనుమానాస్పదంగా జైలులో మరణించిన రష్యా విపక్ష నేత అలెక్సీ నావల్నీ అంత్యక్రియల నిర్వహణకు చర్చిలేవీ స్వచ్ఛందంగా ముందుకు రావడ లేదు. అధ్యక్షుడు పుతిన్ ఆగ్రహిస్తారన్న భయమే ఇందుకు కారణమని నావల్నీ సంస్థ అధికార ప్రతినిధి ఆరోపించారు. ‘‘నావల్నీ పేరు చెప్పగానే ఇప్పటికే బుకింగ్ అయిపోయాయంటూ చాలా చర్చిల నిర్వాహకులు తప్పించుకున్నారు. ఎట్టకేలకు మాస్కో శివార్లలోని మేరీనో పట్టణంలో ఉన్న మదర్ ఆఫ్ గాడ్ క్వెంచ్ మై సారోస్ చర్చి నావల్నీ అంత్యక్రియల నిర్వహణకు ముందుకొచ్చింది’’ అని ఆమె ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు. ‘వాస్తవానికి గురువారమే అంత్యక్రియలు పూర్తిచేద్దామనుకున్నాం. కానీ పార్లమెంట్‌ను ఉద్దేశిస్తూ పుతిన్ ప్రసంగం ఉండటంతో ఆ రోజు అంత్యక్రియలకు చర్చిలేవీ ముందుకు రాలేదు. అందుకే శుక్రవారం మధ్యాహ్నం ఖననం చేయనున్నాం’ అని చెప్పారు. -
‘నవాల్నీ’ మృతదేహం అతని తల్లికి అప్పగింత
మాస్కో: ఇటీవల రష్యాలోని ఆర్కిటిక్ పీనల్ కాలనీ జైలులో వివాదస్పద స్థితిలో మృతి చెందన రష్యా ప్రతిపక్షనేత, అధ్యక్షుడు పుతిన్ రాజకీయ ప్రత్యర్థి అలెక్సీ నావల్ని మృత దేహాన్ని ఎట్టకేలకు అతని తల్లికి అప్పగించారు. అలెక్సీ నావల్ని మరణించిన వారం రోజులకు ఆయన మృతదేహాన్ని తన తల్లికి అప్పగించారు. ‘అలెక్సీ మృతదేహాన్ని అతని తల్లికి అప్పగించారు. ఆయన మృతదేహాన్ని తన తల్లికి అప్పగించాలని కోరిన మీ అందరికీ చాలా ధన్యవాదాలు’ అని నవల్నీ ప్రతినిధి కిరా యార్మిష్ తెలిపారు. Alexey's body was handed over to his mother. Many thanks to all those who demanded this with us. Lyudmila Ivanovna is still in Salekhard. The funeral is still pending. We do not know if the authorities will interfere to carry it out as the family wants and as Alexey deserves. We… — Кира Ярмыш (@Kira_Yarmysh) February 24, 2024 ఇటీవల.. నావల్ని మృతదేహాన్ని రహస్యంగా ఖననం చేయాలని, ఎలాంటి అంతిమయాత్ర నిర్వహించడానికి వీలు లేదని తమపై రష్యా ప్రభుత్వం ఒత్తిడి తీసుకువచ్చిందని నావల్ని తల్లి లియుడ్మిలా ఆవేదన వ్యక్తం చేశారు. పుతిన్‌ను తీవ్రంగా విమర్శించే ప్రతిపక్ష నేతగా పేరున్న జైలులో ఉన్న రష్యా ప్రతిపక్ష పార్టీ నేత అలెక్సీ నావల్నీ(47) జైలులోనే మృతి చెందారు. ఈ విషయాన్ని యమాలో నెనెట్స్ ప్రాంత జైలు సర్వీసు డిపార్ట్మెంట్ వెల్లడించింది. నావల్నీ పలు రాజకీయ ప్రేరేపిత కేసుల్లో దోషిగా తేలడంతో 2021 నుంచి జైలు శిక్ష అనుభవిస్తున్నారు. అయితే ఆయన మృతిపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్న విషయం తెలిసిందే. చదవండి: నవాల్నీ మృతదేహం అప్పగింత కోసం తల్లి ఆవేదన -
USA: రష్యాపై భారీ ఆంక్షలు
వాషింగ్టన్: ఉక్రెయిన్‌పై యుద్ధానికి తెగబడ్డ రష్యా మీద అమెరికా, యూరోపియన్ యూనియన్ శుక్రవారం మరిన్ని ఆంక్షలకు తెర తీశాయి. ఈసారి కూడా ప్రధానంగా ఆ దేశ ఆర్థిక, రక్షణ, పారిశ్రామిక నెట్వర్కులను లక్ష్యం చేసుకున్నాయి. రష్యా, దాని సన్నిహితులపై ఏకంగా 500పై చిలుకు ఆంక్షలు విధిస్తున్నట్టు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రకటించారు! మతిలేని హత్యాకాండకు, వినాశనానికి పుతిన్ మూల్యం చెల్లించి తీరాల్సిందేనని స్పష్టం చేశారు. మరోవైపు భారీ ఆయుధాల తయారీ తదితరాలకు ఉపయోగపడే నిషేధిత వస్తువులను రష్యాకు ఎగుమతి చేసిన ఆరోపణలపై పలు విదేశీ కంపెనీలపై కఠిన ఆంక్షలు విధిస్తున్నట్టు ఈయూ సమాఖ్య ప్రకటించింది. నవాల్నీ కుటుంబంతో బైడెన్ భేటీ: అంతకుముందు రష్యా విపక్ష నేత దివంగత అలెక్సీ నవాల్నీ భార్య యూలియా నవాల్నయా, కూతురు దషాతో బైడెన్ భేటీ అయ్యారు. నవాల్నీ మృతి పట్ల దిగ్భ్రాంతి వెలిబుచ్చారు. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ‘‘నవాల్నీ సాటిలేని ధైర్యశాలి. ఆయన పోరాటాన్ని యూలియా, దషా ముందుకు తీసుకెళ్తారని పూర్తి విశ్వాసముంది’’ అన్నారు. నవాల్నీ మృతదేహానికి గోప్యంగా తక్షణ అంత్యక్రియలు జరిపేందుకు అంగీకరించేలా జైలు అధికారులు తనపై తీవ్ర ఒత్తిడి తెస్తున్నారని తల్లి లుడ్మిలా ఆరోపించారు. ఆలస్యమైతే శవం కుళ్లిపోతుందంటూ బ్లాక్మెయిల్ చేస్తున్నారని ఆవేదన వెలిబుచ్చారు. గురువారం కుమారుని మృతదేహాన్ని చూసిన అనంతరం ఆమె ఈ మేరకు వీడియో విడుదల చేశారు. -
పుతిన్‌పై పోరాటమే..
మాస్కో: రష్యా ప్రభుత్వం, అధ్యక్షుడు పుతిన్‌పై పోరాటం కొనసాగిస్తానని ఇటీవల మృతి చెందిన ప్రతిపక్ష నేత అలెక్సీ నవాల్నీ భార్య యూలియా నవాల్నయా ప్రతిజ్ఞ చేశారు. సోమవారం బెల్జియం రాజధాని బ్రస్సెల్స్‌లో పలువురు ఈయూ నేతలను కలిశారు. ఈ సందర్భంగా ఆమె మీడియా ఎదుట కన్నీటిపర్యంతమయ్యారు. భర్త నవాల్నీ అడుగుజాడల్లోనే నడుస్తానన్నారు. ఆయన్ను సుదూర ప్రాంతంలో ఉండే జైలుకు పంపి పొట్టన పెట్టుకున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పుతిన్‌ను, ఈ పాపంలో పాలు పంచుకున్న వారందరినీ శిక్షించేదాకా పోరాటం కొనసాగిస్తానన్నారు. నవాల్నీ మృతదేహాన్ని ఆయన తల్లికి అప్పగించేందుకు కూడా అధికారులు నిరాకరిస్తున్నారని, సాక్ష్యాలు దొరక్కుండా చేయడమే వారి ఉద్దేశమని ఆరోపించారు. -
Alexei Navalny: నావల్నీ తల, ఒంటిపై కమిలిన గాయాలు
రష్యా ప్రతిపక్ష నేత అలెక్సీ నావల్నీ మృతిపై అంతర్జాతీయ స్థాయిలో ఖండనలు వ్యక్తం అవుతున్నాయి. పుతిన్ ప్రభుత్వ అవినీతిని ప్రశ్నించారు గనుకే ఆయన్ని.. తీవ్రవాదం కేసులో జైలుకు పంపారని.. అక్కడే ఆయన్ని చంపేసి ఉంటారని అనుమానాలు సైతం వ్యక్తం చేస్తున్నారు. అయితే.. ఆయన్ను హింసించారంటూ వస్తోన్న వార్తలను రష్యా ప్రభుత్వం ఖండించింది. సహజ కారణాల వల్లే చనిపోయారని చెబుతోంది. ఈ క్రమంలో.. ఓ కథనం వెలుగులోకి వచ్చింది. నావల్నీ తల, ఛాతీపై కమిలిన గాయాలున్నాయని స్థానిక మీడియా సంస్థ వెల్లడించింది. మృతదేహం మార్చురీకి తరలించినప్పుడు ఈ గాయాలు కనిపించాయని వైద్య నిపుణుడిని ఉటంకిస్తూ తెలిపింది. ‘‘సాధారణంగా జైల్లో చనిపోయిన వ్యక్తుల మృతదేహాలను గ్లాజ్కోవా వీధిలోని బ్యూరో ఆఫ్ ఫోరెన్సిక్ మెడిసిన్‌కు తరలిస్తారు. ఈ కేసులో కొన్ని కారణాలతో బాడీని క్లినికల్ హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. తర్వాత మార్చురీ లోపలికి తీసుకువచ్చారు. అక్కడ ఇద్దరు పోలీసుల్ని కాపలా ఉంచారు. ప్రతిఒక్కరూ ఆయన మృతికి గల కారణం తెలుసు కోవాలనుకుంటున్నారు. ఈ గోప్యత దేనికి, వారు ఏదైనా దాచాలనుకుంటున్నారా..?’ అని ఆ వైద్యుడు ప్రశ్నించినట్లు ఆ కథనం పేర్కొంది. ఇదిలా ఉంటే.. సడెన్ డెత్ సిండ్రోమ్ వల్లే అలెక్సీ నావల్నీ చనిపోయినట్లు అధికారులు తనకు సమాచారం అందించారని ఆయన తల్లి లియుడ్మిలాకు మీడియాకు చెప్పారు. అదే సమయంలో.. మృతదేహాన్ని ఇప్పటికీ కుటుంబానికి అప్పగించకపోవడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నావల్నీకి నివాళులర్పించేవారిని, ర్యాలీలు నిర్వహించేవారిని పోలీసులు ఎక్కడికక్కడ అరెస్టు చేస్తున్నారు. -
కనీసం చివరిచూపు చూసుకోనివ్వండి
మాస్కో: రష్యా మారుమూల జైలులో అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన విపక్ష నేత, హక్కుల ఉద్యమకారుడు అలెక్సీ నవాల్నీ పార్థివదేహాన్ని వెంటనే అప్పగించాలని ఆయన తల్లి ఆవేదనతో ప్రభుత్వాన్ని అభ్యర్థించారు. చనిపోయాక మృతదేహాన్ని వేరే చోటుకు తరలించామంటూ తల్లి, నవాల్నీ న్యాయవాదులను అటూ ఇటూ తిప్పుతూ అధికారులు తిప్పలు పెడుతున్నారు. మృతదేహాన్ని స్వా«దీనం చేసుకుని ల్యాబ్ పరీక్షలు చేయిస్తేగానీ విషప్రయోగం జరిగిందా లేదా అనేది తెలియని పరిస్థితి. అందుకే కుటుంబసభ్యులకు మృతదేహాన్ని అప్పగించట్లేరనే వాదన వినిపిస్తోంది. మాస్కోకు 1,900 కిలోమీటర్ల దూరంలోని ఆర్కిటిక్ ధృవ సమీపంలో మంచుమయ మారుమూల కారాగారంలో శుక్రవారం నవాల్నీ మరణించిన విషయం తెల్సిందే. విషయం తెల్సి నవాల్నీ తల్లితో కలిసి న్యాయవాది కిరా యామిష్క్ ఆ జైలుకెళ్లారు. అక్కడ మృతదేహం లేదు. దర్యాప్తులో భాగంగా సలేఖర్డ్ సిటీకి తరలించామని అధికారులు చెప్పారు. తీరా అక్కడి సిటీ మార్చురీకి వెళ్తే మూసేసి ఉంది. ఇక్కడికి తీసుకురాలేదని అక్కడి అధికారులు చెప్పారు. ‘మరణానికి కారణాన్ని రష్యా ప్రభుత్వం ఇంతవరకు వెల్లడించలేదు. మృతదేహాన్ని అయినా అప్పగించాలి’ అని లాయర్ డిమాండ్‌చేశారు. -
ఆయన మరణం పుతిన్ నాశనానికే: బైడెన్ ఫైర్
ఆయన చనిపోవడం నాకేం ఆశ్చర్యంగా అనిపించలేదు. నావల్నీ(అలెక్సీ నావల్నీ) చావుకి పుతిన్‌దే బాధ్యత, పుతిన్‌దే పూర్తి బాధ్యత.. అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు అమెరికా అధ్యక్షుడు బైడెన్.. రష్యా ప్రతిపక్ష నేత, పుతిన్ విమర్శకుడు అలెక్సీ నావల్నీ(47) హఠాన్మరణంపై యావత్ ప్రపంచం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తోంది. అర్కిటిక్ సర్కిల్లోని రష్యా పీనల్ కాలనీలో కారాగార శిక్ష అనుభవిస్తున్న ఆయన.. ఉన్నట్లుండి కుప్పకూలి మరణించారని.. వైద్యులు ప్రయత్నించినా లాభం లేకపోయిందని అధికారిక వర్గాలు ప్రకటించాయి. అయితే.. అంతకు ముందు రోజు కూడా కోర్టు విచారణకు నవ్వుతూ హాజరైన నావల్నీ.. ఉన్నట్లుండి మరణించడంతో క్రెమ్లిన్ పాత్రపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అలెక్సీ నావల్నీ మృతిపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. శుక్రవారం వైట్‌హౌజ్‌లో ఆయన మాట్లాడుతూ.. నావల్నీ మరణం నాకేం ఆశ్చర్యంగా అనిపించలేదు. ఆయనొక పోరాటయోధుడు. అవినీతి విషయంలో పుతిన్‌ను ఎదురించాడు. పుతిన్ ప్రభుత్వ పాల్పడుతున్న హింసకు ధైర్యంగా అడ్డుచెప్పాడు. నావల్నీ(అలెక్సీ నావల్నీ) చావుకి పుతిన్‌దే బాధ్యత.. ఇది పుతిన్ వినాశనానికి దారి తీయక తప్పదు’’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారాయన. మరోవైపు నావల్నీ మృతిపై పూర్తిస్థాయి నివేదికను రూపొందించే పనిలో ఉన్నట్లు వైట్‌హౌజ్ వర్గాలు వెల్లడించాయి. #WATCH | On the death of jailed Russian opposition figure and Kremlin critic Alexey Navalny, US President Joe Biden says, "...Putin is responsible for Navalny's death. Putin is responsible..." (Video source: Reuters) pic.twitter.com/6xpoKvAnA4 — ANI (@ANI) February 17, 2024 ఇంకోవైపు మ్యూనిచ్ భద్రతా సదస్సులో పాల్గొన్న ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్.. అలెక్సీ నావల్నీ భార్య యూలియాని కలిసి ఓదార్చారు. ఆ సందర్భంలో మీడియాతో మాట్లాడుతూ యూలియా కన్నీటి పర్యంతమయ్యారు. ‘‘నా భర్త మృతి నిజమే అయితే అందుకు పుతిన్, ఆయన అనుచర గణమే బాధ్యులు. ఎప్పటికైనా వారు శిక్ష నుంచి తప్పించుకోలేరు’’ అని యూలియా అన్నారు. అతి(తీవ్ర)వాదం అభియోగాలపై కిందటి ఏడాది ఆగస్టులో అలెక్సీ నావల్నీకి 19 ఏళ్ల జైలుశిక్ష పడింది. ‘‘నా ప్రాణం ఉన్నంతవరకు లేదా ఈ (పుతిన్) ప్రభుత్వం ఉన్నంత కాలం నేను జైల్లోనే ఉంటానన్న సంగతి నాకు తెలుసు’’ అని నాటి తీర్పు సమయంలో నావల్నీ వ్యాఖ్యానించారు. రెండు నెలల కిందటే ఆయన్ని.. అర్కిటిక్ సర్కిల్లోని రష్యా పీనల్ కాలనీకి తరలించారు. ఇదీ చదవండి: నిరసన గళం మూగబోయింది పుతిన్ హేట్స్ నావల్నీ రష్యా అధ్యక్ష కార్యాలయం క్రెమ్లిన్ విధానాలను వ్యతిరేకిస్తూ నావల్నీ అనేక నిరసనలు చేపట్టారు. అందుకుగాను పలుమార్లు అరెస్టయ్యారు. గత అధ్యక్ష ఎన్నికల్లో నావల్నీ పోటీ చేశారు. వ్లాదిమిర్ పుతిన్‌కు ఆయనంటే తీవ్ర కోపం. నావల్నీ పేరును పలికేందుకు కూడా ఇష్టపడేవారు కాదు. నావల్నీకి మరింత ఎక్కువ పేరు రావొద్దనే ఆయన పేరును పుతిన్ పలికేవారు కాదన్నది విశ్లేషకుల అభిప్రాయం. ఎప్పుడైనా ఆయన గురించి మాట్లాడాల్సి వస్తే.. ఆ వ్యక్తి అని మాత్రమే సంబోధించేవారు. ఆది నుంచీ ధిక్కార స్వరమే! ప్రభుత్వ అధికారుల అవినీతిపై ఆయన అలుపెరుగని పోరాటం చేశారు. పుతిన్ సర్కారు పాలనా విధానాల్లో లోపాలను తీవ్రంగా ఎండగట్టారు. ఈ క్రమంలో తన ప్రాణాలకు ముప్పు ఎదురైనా లెక్కచేయలేదు. నాయకులు/అధికారుల అవినీతిపై స్వతంత్ర దర్యాప్తు జరిపి అనేక కీలక వాస్తవాలను వెలుగులోకి తీసుకొచ్చారు. ప్రభుత్వరంగ టీవీ ఛానళ్లలో నావల్నీకి ఏమాత్రం ప్రచారం లభించేది కాదు. అయితే యూట్యూబ్ వీడియోలు, సామాజిక మాధ్యమ ఖాతాలతో ఆయన జనానికి బాగా దగ్గరయ్యారు. -
Alexey Navalny: నిరసన గళం మూగబోయింది
మాస్కో: రష్యాలో మరో అసమ్మతి గళం శాశ్వతంగా మూగబోయింది. మూడేళ్లుగా నిర్బంధంలో ఉన్న విపక్ష నేత, హక్కుల ఉద్యమకారుడు 47 ఏళ్ల అలెక్సీ నవాల్నీ అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందారు. ‘‘ఆయన శుక్రవారం ఉదయం వాకింగ్ అనంతరం అస్వస్థతకు గురయ్యారు. ఆ వెంటనే అపస్మారక స్థితిలోకి జారుకున్నారు. కాపాడేందుకు వైద్యులు ఎంత ప్రయతి్నంచినా, తక్షణం అంబులెన్సు రప్పించినా లాభం లేకపోయింది’’ అని జైలు వర్గాలు తెలిపాయి. అయితే మరణానికి కారణమేమిటో బయట పెట్టలేదు. దశాబ్దానికి పైగా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కంట్లో నలుసుగా మారి ఆయనకు ప్రబల ప్రత్యర్థిగా ఎదిగిన నవాల్నీ మృతిపై తీవ్ర అనుమానాలు తలెత్తుతున్నాయి. ఇది కచి్చతంగా ప్రభుత్వ హత్యేనని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 2018లో రష్యా అధ్యక్ష పదవి కోసం పుతిన్‌తో పోటీ పడేందుకు విఫలయత్నం చేసిన నవాల్నీ, నాటినుంచీ ప్రభుత్వ అవినీతిపై పోరును తీవ్రతరం చేశారు. పలు స్థాయిల్లో పెచ్చరిల్లిన అవినీతిని బయటపెడుతూ సంచలనం సృష్టిస్తూ వచ్చారు. దాంతో ప్రభుత్వం ఆయన్ను నిర్బంధించడమే గాక దేశద్రోహం తదితర అభియోగాలు మోపింది. 19 ఏళ్ల జైలు శిక్ష అనుభవిస్తున్న నవాల్నీని మాస్కో సమీపంలోని జైలు నుంచి గత డిసెంబర్లో దాదాపు 2,000 కిలోమీటర్ల దూరంలోని స్పెషల్ రెజీమ్ పీనల్ కాలనీకి తరలించారు. అతి శీతల ఆర్కిటిక్ ప్రాంతంలోని ఈ కాలనీ రష్యాలోకెల్లా అత్యంత కఠినమైన పరిస్థితులుండే కారాగారం. వచ్చే నెలలో రష్యాలో అధ్యక్ష ఎన్నికలున్న నేపథ్యంలో ఇది కచి్చతంగా ఆయన గొంతు నొక్కే ప్రయత్నమేనని అభిమానులు అప్పుడే ఆందోళనలకు దిగారు. ఈ ఎన్నికల్లో పుతిన్‌ను సవాలు చేసే గట్టి ప్రత్యర్థి లేకపోయినా ‘నవాల్నీ ఫ్యాక్టర్’ ఆయన్ను బాగా చీకాకు పరుస్తోంది. నవాల్నీ అనుయాయులతో పాటు నానాటికీ పెరిగిపోతున్న అభిమాన గణం సోషల్ మీడియా ద్వారా పుతిన్ వ్యతిరేక ప్రచారంతో దేశమంతటా హోరెత్తిస్తోంది. దేశ విదేశాల్లోని పుతిన్ అపార ఆస్తుల చిట్టాను కొద్ది రోజులుగా ఒక్కొక్కటిగా విప్పుతూ ఫొటోలు, వీడియోలతో సహా బయట పెడుతూ వస్తోంది. వాటికి మిలియన్ల కొద్దీ వ్యూస్, లక్షలాది లైక్‌లు వచ్చి పడుతున్నాయి! ఈ నేపథ్యంలో నవాల్నీ ‘మృతి’ పుతిన్ పనేనని భావిస్తున్నారు. దీనిపై పాశ్చాత్య దేశాలన్నీ స్పందించాయి. పుతిన్ అణచివేతను నవాల్నీ ఆజన్మాంతం అత్యంత ధైర్యసాహసాలతో ఎదిరించారంటూ పలు దేశాధినేతలు కొనియాడారు. విషప్రయోగం జరిగినా... మూడున్నరేళ్ల క్రితం ప్రాణాంతక విషప్రయోగం జరిగినా వెరవని గుండె ధైర్యం నవాల్నీది! ఆయన 2020 ఆగస్టులో సైబీరియా పర్యటన ముగించుకుని తిరిగొస్తుండగా ‘నొవిచోక్’ దాడికి గురయ్యారు. రష్యాకే ప్రత్యేకమైన ఆ ప్రాణాంతక రసాయనాన్ని నవాల్నీ లో దుస్తులపై చల్లినట్టు తర్వాత తేలింది. నాడీ మండలాన్ని నేరుగా దెబ్బ తీసే నొవిచోక్ ప్రభావానికి విమానంలోనే ఆయన అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు. అనుయాయులు హుటాహుటిన జర్మనీకి తరలించడంతో ప్రాణాపాయం తప్పింది. నెలల తరబడి చికిత్స తర్వాత కోలుకున్నాక పుతిన్‌పై ‘అండర్‌ప్యాంట్స్ (లో దుస్తుల) పాయిజనర్’ అంటూ చెణుకులు విసిరారు. దాంతో అండర్‌ప్యాంట్స్ పదబంధం ఒక్కసారిగా రష్యా సోషల్ మీడియాలో పాపులరైంది. దానిపై లెక్కలేనన్ని మీమ్స్ కూడా పుట్టుకొచ్చాయి. నిర్బంధం ఖాయమని తెలిసి కూడా ఆరోగ్యం చక్కబడుతూనే 2021 జనవరిలో నవాల్నీ రష్యా తిరిగొచ్చారు. మాస్కోలో విమానం దిగీ దిగగానే ఆయన్ను నిర్బంధంలోకి తీసుకుని జైలుకు తరలించారు. చివరికి జైల్లోనే ప్రాణాలు కోల్పోయారు. నవ్వుతూనే కన్పించారు... నవాల్నీ చివరిసారిగా గురువారం బయటి ప్రపంచానికి కన్పించారు. ఓ కేసు విచారణలో వీడియో లింక్ ద్వారా పాల్గొన్నారు. ఆరోగ్యంగా ఉండటమే గాక సరదాగా నవ్వుతూ, విచారణ సందర్భంగా జడ్జితోనూ జోకులు వేస్తూ గడిపారు. సాహసమే శ్వాస... మాస్కో శివారు ప్రాంతమైన బుటిన్లో జని్మంచిన నవాల్నీ మాస్కోలో లా డిగ్రీ అనంతరం విదేశాల్లో పై చదువులు పూర్తి చేశారు. ప్రభుత్వ అవినీతిని ప్రశ్నించడం ద్వారా పుతిన్ వ్యతిరేకునిగా తెరపైకి వచ్చారు. రష్యా చమురు, గ్యాస్ కంపెనీల్లో వాటాలు కొనుగోలు చేసి వాటిలోని విచ్చలవిడి అవినీతిని బయట పెట్టారు. 2008 నుంచీ ఆయన పేరు క్రమంగా రష్యా అంతటా పాకింది. దాంతో 2012లో నవాల్నీ అరెస్టుల పర్వం మొదలైంది. 2014లో ఆశ్చర్యకరంగా జైలు నుంచి విడుదల చేయడంతో మాస్కో మేయర్ ఎన్నికల బరిలో దిగారు. ప్రచార మార్గాలన్నింటినీ మూసేసినా పుతిన్ బలపరిచిన అభ్యరి్థకి గట్టి పోటీ ఇవ్వడంతో నవాల్నీ పేరు మారుమోగిపోయింది. దాంతో ప్రభుత్వం మళ్లీ అరెస్టుల పర్వానికి తెర తీసింది. చివరికి 2018 అధ్యక్ష ఎన్నికల్లో పోటీకి అనర్హునిగా ప్రకటించడంతో ప్రజల దృష్టిలో నవాల్నీ మళ్లీ హీరోగా మారారు. రష్యాలో రెండు దశాబ్దాలుగా విపక్ష నేతలు, పుతిన్ విమర్శకులు, వ్యతిరేకులు నిర్బంధం పాలవడం, అనుమానాస్పద పరిస్థితుల్లో మరణించడం పరిపాటిగా మారింది. విపక్ష నేత బోరిస్ నెమ్త్సోవ్ను 2015లో పుతిన్ అధికార నివాసం క్రెమ్లిన్ ప్రాసాదానికి కూతవేటు దూరంలోనే కాల్చి చంపారు. పుతిన్‌ను విమర్శించిన వాగ్నర్ గ్రూప్ బాస్ ప్రిగోజిన్ 2023 ఆగస్టులో ‘విమాన ప్రమాదం’లో మరణించాడు. ప్రభుత్వంపై విమర్శలు చేసి అకాల మరణం పాలైన రష్యా కుబేరుల జాబితా చాలా పెద్దది. నవాల్నీ మాత్రం పుతిన్‌ను గట్టిగా సవాలు చేస్తూ ప్రబల ప్రత్యర్థిగా ఎదుగుతూ వచ్చారు. సోషల్ మీడియాను, స్వతంత్ర మీడియాను సమర్థంగా వాడుకుంటూ చెమటలు పట్టించారు. భౌతిక దాడులు, హత్యాయత్నాలను ఏమాత్రం లెక్కచేయని తీరు ఆయనకు అసంఖ్యాకంగా అభిమానులను సంపాదించి పెట్టింది. నిరసనలు... ఆగ్రహావేశాలు నవాల్నీ మృతి పట్ల ప్రపంచవ్యాప్తంగా నిరసనలు, ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ఇది పుతిన్ పనేనంటూ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మండిపడ్డారు. నవాల్నీ కుటుంబానికి ప్రగాఢ సంతాపం తెలిపారు. అధికారాన్ని కాపాడుకునేందుకు ఎవరినైనా అంతమొందించడం పుతిన్ నైజమంటూ ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోదిమిర్ జెలెన్స్కీ దుయ్యబట్టారు. ఆయన సర్వం కోల్పోవడంతో పాటు తన తప్పిదాలకు బాధ్యునిగా శిక్ష అనుభవించి తీరాల్సిందేనన్నారు. నవాల్నీ తన అసమాన ధైర్యసాహసాలకు జీవితాన్నే మూల్యంగా చెల్లించాల్సి రావడం బాధాకరమని జర్మనీ చాన్సలర్ ఒలాఫ్ స్కొల్జ్ ఆవేదన వెలిబుచ్చారు. అడుగడుగునా ప్రాణాపాయం పొంచి ఉన్నా మొక్కవోని ధైర్యసాహసాలు ప్రదర్శించడం నవాల్నీకే చెల్లిందంటూ బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ కొనియాడారు. ఆయన్ను రష్యా ప్రభుత్వమే క్రూరంగా పొట్టన పెట్టుకుందని లాతి్వయా అధ్యక్షుడు రింకేవిక్స్ ఆరోపించారు. తాను అత్యంత బలహీనుడినని ఈ చర్యతో పుతిన్ రుజువు చేసుకున్నారని అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ అభిప్రాయపడ్డారు. రష్యాలో స్వేచ్చా గళాలపై ఉక్కుపాదం మోపుతున్నారంటూ ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ మండిపడ్డారు. సొంత ప్రజల అసమ్మతి పుతిన్‌ను విపరీతంగా వణికిస్తోందని మరోసారి రుజువైందని ఈయూ కమిషన్ ప్రెసిడెంట్ ఉర్సులా వాండర్ లియన్ అన్నారు. పుతిన్ ఆదేశాల మేరకే నవాల్నీ హత్య జరిగిందని ప్రపంచ మాజీ చెస్ చాంపియన్, రష్యా విపక్ష నేత గారీ కాస్పరోవ్ తదితరులు దుమ్మెత్తిపోశారు. పుతినే బాధ్యుడు: భార్య నవాల్నీ మరణ వార్తలపై ఆయన భార్య యూలియా నవాల్నయా అనుమానాలు వెలిబుచ్చారు. శుక్రవారం మ్యూనిచ్ భద్రతా సదస్సులో మాట్లాడుతూ ఆమె కన్నీటి పర్యంతమయ్యారు. ‘‘నా భర్త మృతి నిజమే అయితే అందుకు పుతిన్, ఆయన అనుచర గణమే బాధ్యులు. ఎప్పటికైనా వారు శిక్ష నుంచి తప్పించుకోలేరు’’ అన్నారు. సదస్సులో పాల్గొన్న అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ తదితర నేతలు ఆమెను ఓదార్చారు.