మాస్కో: రష్యా విపక్ష నేత అలెక్సీ నవాల్నీ అంత్యక్రియలు శుక్రవారం ఆంక్షల నడుమ ముగిశాయి. జైల్లో అనుమానాస్పద రీతిలో మరణించిన ఆయన మృతదేహాన్ని కుటుంబీకులకు అప్పగించేందుకు పుతిన్ సర్కారు ఒక పట్టాన అంగీకరించని విషయం తెలిసిందే. అనంతరం సర్కారు భయంతో అంత్యక్రియ నిర్వహణకు చర్చిలు కూడా వెనకడుగు వేశాయి. ఎట్టకేలకు మాస్కోలోని ఓ చర్చి ఒప్పుకున్నా శ్మశానవాటికకు పార్థివదేహాన్ని తరలించేందుకు వాహనం దొరకడమూ గగనమే అయింది.
మృతదేహాన్ని తరలించేందుకు ముందుకొచ్చిన వారికి బెదిరింపులు వచ్చినట్టు నావల్నీ అధికార ప్రతినిధి కీరా యార్మిష్ చెప్పారు. చివరకు మాస్కో పరిధిలోని మేరినో జిల్లా బోరిసోవస్కోయీ శ్మశానవాటికలో నవాల్నీ పార్థివ దేహాన్ని ఖననం చేశారు. జనం గుమికూడొద్దన్న ప్రభుత్వ హెచ్చరికలను బేఖాతరుచేస్తూ వేలాదిగా వేలాదిగా మద్దతుదారులు, ఉద్యమకారులు, అభిమానులు హాజరయ్యారు.
మృతదేహాన్ని ఉంచిన మదర్ ఆఫ్ గాడ్ సూథీ మై సారోస్ చర్చిలో వేలాదిగా నివాళులర్పించారు. నవాల్నీ నవాల్నీ అంటూ నినాదాలతో హోరెత్తించారు. అమెరికా, ఫ్రాన్స్ రాయబారులు తదితరులు పుష్పగుచ్ఛాలుంచి అంజలి ఘటించారు. అంత్యక్రియల్లో ఆంక్షలు అతిక్రమించిన వారికి శిక్షలు తప్పవని ప్రభుత్వ అధికార ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్ చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment