
మాస్కో: రష్యా మారుమూల జైలులో అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన విపక్ష నేత, హక్కుల ఉద్యమకారుడు అలెక్సీ నవాల్నీ పార్థివదేహాన్ని వెంటనే అప్పగించాలని ఆయన తల్లి ఆవేదనతో ప్రభుత్వాన్ని అభ్యర్థించారు. చనిపోయాక మృతదేహాన్ని వేరే చోటుకు తరలించామంటూ తల్లి, నవాల్నీ న్యాయవాదులను అటూ ఇటూ తిప్పుతూ అధికారులు తిప్పలు పెడుతున్నారు. మృతదేహాన్ని స్వా«దీనం చేసుకుని ల్యాబ్ పరీక్షలు చేయిస్తేగానీ విషప్రయోగం జరిగిందా లేదా అనేది తెలియని పరిస్థితి. అందుకే కుటుంబసభ్యులకు మృతదేహాన్ని అప్పగించట్లేరనే వాదన వినిపిస్తోంది.
మాస్కోకు 1,900 కిలోమీటర్ల దూరంలోని ఆర్కిటిక్ ధృవ సమీపంలో మంచుమయ మారుమూల కారాగారంలో శుక్రవారం నవాల్నీ మరణించిన విషయం తెల్సిందే. విషయం తెల్సి నవాల్నీ తల్లితో కలిసి న్యాయవాది కిరా యామిష్క్ ఆ జైలుకెళ్లారు. అక్కడ మృతదేహం లేదు. దర్యాప్తులో భాగంగా సలేఖర్డ్ సిటీకి తరలించామని అధికారులు చెప్పారు. తీరా అక్కడి సిటీ మార్చురీకి వెళ్తే మూసేసి ఉంది. ఇక్కడికి తీసుకురాలేదని అక్కడి అధికారులు చెప్పారు. ‘మరణానికి కారణాన్ని రష్యా ప్రభుత్వం ఇంతవరకు వెల్లడించలేదు. మృతదేహాన్ని అయినా అప్పగించాలి’ అని లాయర్ డిమాండ్‌చేశారు.
Comments
Please login to add a commentAdd a comment