రష్యా ప్రతిపక్ష నేత అలెక్సీ నావల్నీ మృతిపై అంతర్జాతీయ స్థాయిలో ఖండనలు వ్యక్తం అవుతున్నాయి. పుతిన్ ప్రభుత్వ అవినీతిని ప్రశ్నించారు గనుకే ఆయన్ని.. తీవ్రవాదం కేసులో జైలుకు పంపారని.. అక్కడే ఆయన్ని చంపేసి ఉంటారని అనుమానాలు సైతం వ్యక్తం చేస్తున్నారు. అయితే.. ఆయన్ను హింసించారంటూ వస్తోన్న వార్తలను రష్యా ప్రభుత్వం ఖండించింది. సహజ కారణాల వల్లే చనిపోయారని చెబుతోంది. ఈ క్రమంలో..
ఓ కథనం వెలుగులోకి వచ్చింది. నావల్నీ తల, ఛాతీపై కమిలిన గాయాలున్నాయని స్థానిక మీడియా సంస్థ వెల్లడించింది. మృతదేహం మార్చురీకి తరలించినప్పుడు ఈ గాయాలు కనిపించాయని వైద్య నిపుణుడిని ఉటంకిస్తూ తెలిపింది. ‘‘సాధారణంగా జైల్లో చనిపోయిన వ్యక్తుల మృతదేహాలను గ్లాజ్కోవా వీధిలోని బ్యూరో ఆఫ్ ఫోరెన్సిక్ మెడిసిన్‌కు తరలిస్తారు. ఈ కేసులో కొన్ని కారణాలతో బాడీని క్లినికల్ హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. తర్వాత మార్చురీ లోపలికి తీసుకువచ్చారు. అక్కడ ఇద్దరు పోలీసుల్ని కాపలా ఉంచారు. ప్రతిఒక్కరూ ఆయన మృతికి గల కారణం తెలుసు కోవాలనుకుంటున్నారు. ఈ గోప్యత దేనికి, వారు ఏదైనా దాచాలనుకుంటున్నారా..?’ అని ఆ వైద్యుడు ప్రశ్నించినట్లు ఆ కథనం పేర్కొంది.
ఇదిలా ఉంటే.. సడెన్ డెత్ సిండ్రోమ్ వల్లే అలెక్సీ నావల్నీ చనిపోయినట్లు అధికారులు తనకు సమాచారం అందించారని ఆయన తల్లి లియుడ్మిలాకు మీడియాకు చెప్పారు. అదే సమయంలో.. మృతదేహాన్ని ఇప్పటికీ కుటుంబానికి అప్పగించకపోవడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నావల్నీకి నివాళులర్పించేవారిని, ర్యాలీలు నిర్వహించేవారిని పోలీసులు ఎక్కడికక్కడ అరెస్టు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment