బ్యారెల్‌ @ 60 డాలర్లు.. రష్యా తిరస్కరణ.. ఎగుమతులు నిలిపేస్తామని హెచ్చరిక | G-7 joins EU on 60 Dollers per barrel price cap on Russian oil | Sakshi
Sakshi News home page

బ్యారెల్‌ @ 60 డాలర్లు.. రష్యా తిరస్కరణ.. ఎగుమతులు నిలిపేస్తామని హెచ్చరిక

Published Sun, Dec 4 2022 5:34 AM | Last Updated on Sun, Dec 4 2022 2:19 PM

G-7 joins EU on 60 Dollers per barrel price cap on Russian oil - Sakshi

బ్రసెల్స్‌: ఉక్రెయిన్‌పై 9 నెలలుగా రష్యా చేస్తున్న యుద్ధానికి నిధుల లభ్యతను వీలైనంత తగ్గించడం. నానాటికీ పెరుగుతున్న ఇంధన ధరలకు అడ్డుకట్ట వేయడం. ఈ రెండు లక్ష్యాల సాధనకు యూరోపియన్‌ యూనియన్‌ ఎట్టకేలకు కీలక నిర్ణయం తీసుకుంది. రష్యా నుంచి కొనుగోలు చేసే చమురు ధరకు బ్యారెల్‌కు 60 డాలర్ల పరిమితి విధించింది. సుదీర్ఘ వాదోపవాదాల అనంతరం ఈయూ సభ్య దేశాల మధ్య చివరి నిమిషంలో ఎట్టకేలకు శుక్రవారం రాత్రి ఇందుకు అంగీకారం కుదిరింది.

అమెరికా, జపాన్, కెనడా తదితర జీ 7 దేశాలు కూడా ఈ నిర్ణయానికి అంగీకారం తెలిపాయి. ఇది సోమవారం నుంచి అమల్లోకి రానుంది. దీని ప్రకారం ఈయూ, జీ 7 దేశాలకు చమురును బ్యారెల్‌ 60 డాలర్లు, అంతకంటే తక్కువకు మాత్రమే రష్యా విక్రయించాల్సి ఉంటుంది. అయితే ఈ పరిమితిని రష్యా తిరస్కరించింది. ఈయూ తదితర దేశాలకు చమురు ఎగుమతులను నిలిపేస్తామని హెచ్చరించింది.

‘‘ఈ ఏడాది నుంచి యూరప్‌ రష్యా చమురు లేకుండా మనుగడ సాగించాల్సి వస్తుంది’’ అని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ద్మిత్రీ పెస్కోవ్, అంతర్జాతీయ సంస్థల్లో రష్యా శాశ్వత ప్రతినిధి మిఖాయిల్‌ ఉల్యనోవ్‌ హెచ్చరించారు. ఈయూ పరిమితితో పెద్దగా ఒరిగేదేమీ ఉండబోదంటూ నిపుణులు కూడా పెదవి విరుస్తున్నారు. ‘‘రష్యా ఇప్పటికే భారత్, చైనా తదితర ఆసియా దేశాలకు అంతకంటే తక్కువకే చమురు విక్రయిస్తోంది. రష్యాను నిజంగా బలహీన పరచాలనుకుంటే బ్యారెల్‌కు 50 డాలర్లు, వీలైతే 40 డాలర్ల పరిమితి విధించాల్సింది’’ అని అభిప్రాయపడుతున్నారు. ఈయూ నిర్ణయం ప్రభావం రానున్న రోజుల్లో యూరప్‌ దేశాలపై, రష్యాపై, మిగతా ప్రపంచంపై ఎలా ఉంటుందన్న చర్చ మొదలైంది.

రూటు మార్చిన రష్యా
రష్యా ప్రపంచంలో రెండో అతి పెద్ద చమురు ఉత్పత్తిదారు. సగటున రోజుకు 50 లక్షల బ్యారెళ్ల చమురు ఉత్పత్తి చేస్తోంది. ఉక్రెయిన్‌తో యుద్ధం మొదలయ్యేదాకా యూరప్‌ దేశాలే దానికి అతి పెద్ద చమురు మార్కెట్‌. వాటి కఠిన ఆంక్షల నేపథ్యంలో కథ మారింది. యూరప్‌ ఎగుమతుల్లో చాలావరకు భారత్, చైనాలకు మళ్లించింది. అయితే కరోనా కల్లోలం నేపథ్యంలో చైనా చమురు దిగుమతులను బాగా తగ్గించుకుంటోంది.

ఇదిలాగే కొనసాగితే రష్యా తన చమురు ఉత్పత్తిని తగ్గించుకోవాల్సి రావచ్చు. లభ్యత తగ్గి ధరలకు మళ్లీ రెక్కలు రావచ్చు. చలికాలం కావడంతో చమురు, సహజవాయువు వినియోగం భారీగా పెరిగే ఈయూ దేశాలను ఈ పరిణామం మరింతగా కలవరపెడుతోంది. ‘‘చమురు ధరలు ఏ 120 డాలర్లో ఉంటే 60 డాలర్ల పరిమితి రష్యాకు దెబ్బగా మారేది. కానీ ఇప్పుడున్నది 87 డాలర్లే. రష్యాకు ఉత్పాదక వ్యయం బ్యారెల్‌కు కేవలం 30 డాలర్లే! ’’ అని పరిశీలకులు గుర్తు చేస్తున్నారు.

నల్ల మార్కెట్‌కూ తరలించొచ్చు...
ఆర్థిక మందగమనం దెబ్బకు ఒకవేళ సమీప భవిష్యత్తులో అంతర్జాతీయంగా చమురు వాడకం తగ్గినా ఆ మేరకు ఉత్పత్తిని తగ్గించడం రష్యాకు సమస్యే అవుతుంది. ఎందుకంటే ఒకసారి చము రు ఉత్పత్తి ఆపితే పునఃప్రారంభించడం అత్యంత వ్యయ ప్రయాసలతో కూడిన వ్యవహారం. కాబట్టి మధ్యేమార్గంగా ఇరాన్, వెనెజువెలా దారిలోనే రష్యా కూడా బ్లాక్‌ మార్కెట్లో చమురును అమ్ముకునే అవకాశాలూ లేకపోలేదని భావిస్తున్నారు. పైగా దీనిద్వారా హెచ్చు ఆదాయం కూడా సమకూరుతుంది. ఈ కోణంలో చూసినా ఈయూ పరిమితి వాటికే బెడిసికొట్టేలా కన్పిస్తోందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. 2023 తొలి త్రైమాసికాంతం నాటికి చమురు ధరలు ఒకవేళ బాగా పెరిగితే పరిమితి రష్యాపై ఎంతోకొంత ప్రభావం చూపొచ్చని అంచనా వేస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement