కీవ్‌లోని పిల్లల ఆస్పత్రిపైనా దాడి
31 మంది మృతి.. 154 మందికి గాయాలు
కీవ్: దాదాపు నాలుగు నెలల విరామం తర్వాత ఉక్రెయిన్ రాజధాని కీవ్‌పై రష్యా క్షిపణులతో విరుచుకుపడింది. సోమవారం ఉదయం నుంచి పలు నగరాల్లోని మౌలిక వనరులు, విద్యుత్ వ్యవస్థలే లక్ష్యంగా వివిధ రకాలైన 40 వరకు క్షిపణులను ప్రయోగించింది. ఈ దాడుల్లో కనీసం 31 మంది చనిపోగా మరో 154 మంది గాయపడ్డారని అధికారులు తెలిపారు. కీవ్‌లోని చిన్నారుల ఆస్పత్రి సహా పలు నివాస ప్రాంతాలపై క్షిపణులు పడటంతో భారీగా పేలుళ్లు సంభవించాయి.
పలు చోట్ల మంటలు వ్యాపించాయి. రాజధాని కీవ్‌లోని 10 జిల్లాలకు గాను ఏడు జిల్లాల్లో జరిగిన దాడుల్లో 14 మంది చనిపోగా పదుల సంఖ్యలో క్షతగాత్రులయ్యారు. మూడంతస్తుల నివాస భవనం పూర్తిగా ధ్వంసమైంది. మరో నగరం క్రివ్యి రిహ్‌లో 10 మంది ప్రాణాలు కోల్పోగా మరో 47 మంది గాయపడ్డారు. కీవ్‌లోని రెండంతస్తుల చిన్నారుల ఆస్పత్రిలోని ఇంటెన్సివ్ కేర్ యూనిట్, ఆపరేషన్ థియేటర్, ఆంకాలజీ విభాగం దెబ్బతిన్నాయి.
ఆస్పత్రిలోని పదంతస్తుల ప్రధాన భవనం కిటికీలు, తలుపులు ధ్వంసమయ్యాయి. ఘటన నేపథ్యంలో ఆస్పత్రిలో వారందరినీ ఖాళీ చేయిస్తున్నారు. ఆస్పత్రిపై దాడిలో ఏడుగురు చిన్నారులు సహా 16 మంది గాయపడినట్లు మేయర్ విటాలి క్రిట్‌్చకో చెప్పారు. ప్రాణ నష్టం వివరాలు తెలియాల్సి ఉందని అధ్యక్షుడు జెలెన్‌స్కీ తెలిపారు.
రష్యా ప్రయోగించిన క్షిపణుల్లో ధ్వని కంటే 10 రెట్లు వేగంగా ప్రయాణించగల హైపర్‌సోనిక్ కింఝాల్ మిస్సైళ్లు కూడా ఉన్నాయని ఉక్రెయిన్ ఆర్మీ తెలిపింది. మొత్తం 40 క్షిపణుల్లో 30 వరకు కూల్చి వేశామని, వీటిలో కింఝాల్ రకానివి 11 ఉన్నాయని పేర్కొంది. ఉక్రెయిన్‌కు మరింత సాయం అందించేందుకు గల అవకాశాల్ని పరిశీలించేందుకు వాషింగ్టన్‌లో నాటో దేశాలు మంగళవారం భేటీ అవుతున్న వేళ రష్యా భారీ దాడులకు పూనుకుందని పరిశీలకులు చెబుతున్నారు. కాగా, ఆస్పత్రిపై దాడిని జర్మనీ, చెక్ రిపబ్లిక్ తీవ్రంగా ఖండించాయి. అయితే, తాము ఉక్రెయిన్ రక్షణ, సైనిక స్థావరాలే లక్ష్యంగా దాడులు జరిపామని రష్యా ఆర్మీ పేర్కొంది. ఉక్రెయిన్ క్షిపణి రక్షణ వ్యవస్థల వల్లే ఆస్పత్రికి నష్టం వాటిల్లినట్లు తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment