వరల్డ్ ఎంబ్రాయిడరీ డే నేపథ్యంలో రష్యా సేనలపైకి ప్రయోగించే క్షిపణులపై పెయింటింగ్ చేస్తున్న ఉక్రెయిన్ సైనికులు
కీవ్/మాస్కో/ఇస్తాంబుల్: ఉక్రెయిన్‌లో కీలక నగరం మారియుపోల్‌ను పూర్తిగా స్వాధీనం చేసుకున్న రష్యా దళాలు ముందుకు సాగుతున్నాయి. జంట నగరాలైన సెవెరోడోన్‌టెస్క్, లిసీచాన్‌స్క్‌ను చుట్టుముట్టాయి. ఈ రెండు నగరాలను ఒక నది మాత్రమే వేరు చేస్తుంది. రష్యా సేనలు బాంబుల వర్షం కురిపించడంతో సెవెరోడోన్‌టెస్క్, లిసీచాన్‌స్క్ ప్రజలు బెంబేలెత్తిపోయారు.
రష్యా దాడిలో నలుగురు మృతి
రష్యా క్షిపణి దాడుల్లో నలుగురు పౌరులు మృతిచెందారని ఉక్రెయిన్‌లోని లుహాన్‌స్క్ ప్రాంతీయ గవర్నర్ సెర్హివ్ హైడై చెప్పారు. సీవీరోడోన్‌టెస్క్ పట్టణంపై జరిగిన దాడుల్లో మరో ముగ్గురు గాయపడ్డారని పేర్కొన్నారు. డోన్‌టెస్క్‌లో గత 24 గంటల్లో ఉక్రెయిన్ సైన్యం దాడుల్లో ఇద్దరు పౌరులు మరణించారని, మరో ఐదుగురు గాయపడ్డారని రష్యా అనుకూల వేర్పాటువాదులు ప్రకటించారు. మారియుపోల్‌లోని అజోవ్‌స్టల్ స్టీల్‌ప్లాంట్‌లో యూలియా పైయీవ్‌స్కా అనే విద్యార్థిని బాడీ కెమెరాతో చిత్రీకరించిన దృశ్యాలు సంచలనాత్మకంగా మారాయి. ఆమె 256 గిగాబైట్ల సామర్థ్యం గల వీడియోలో చిత్రీకరించారు. మార్చి 16న ఆమె, ఆమె డ్రైవర్‌ను రష్యా జవాన్లు అదుపులోకి తీసుకున్నారు. సదరు వీడియోలు అసోసియేట్ ప్రెస్ ద్వారా వెలుగులోకి వచ్చాయి.
ఉక్రెయిన్ దాడిలో రష్యా పౌరుడు బలి
సరిహద్దు వద్ద ఉక్రెయిన్ భూభాగం నుంచి జరిగిన దాడిలో తమ పౌరుడి చనిపోయాడని, మరికొందరు గాయపడ్డారని పశ్చిమ రష్యాలోని కుర్‌స్క్ గవర్నర్ రోమన్ స్టారోవోయిట్ చెప్పారు. మారియుపోల్‌లో ఉన్న అజోవ్‌స్టల్ స్టీల్‌ప్లాంట్ నుంచి రష్యా దళాల నుంచి విముక్తి పొందిన ఉక్రెయిన్ యుద్ధ ఖైదీల రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభించినట్లు ఇంటర్నేషన్ రెడ్‌క్రాస్ గురువారం వెల్లడించింది. రష్యా, ఉక్రెయిన్ మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం యుద్ధ ఖైదీల రిజిస్ట్రేషన్ ప్రారంభించినట్లు తెలియజేసింది.
అప్పటిదాకా కాల్పుల విరమణ ప్రసక్తే లేదు
రష్యా దళాలు తమ దేశం నుంచి వెంటనే వెనక్కి వెళ్లిపోవాలని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ సలహాదారు మిఖాయిలో పోడోలైక్ డిమాండ్ చేశారు. అప్పటిదాకా కాల్పుల విరమణ వినతిని అంగీకరించే ప్రసక్తే లేదన్నారు. ఉక్రెయిన్‌లో తమ ఆధీనంలో ఉన్న ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలు వారి భవిష్యత్తును వారే నిర్ణయించుకోవాలని రష్యా అధికార ప్రతినిధి దిమిత్రీ పెస్కోవ్ సూచించారు.
క్షమాపణ కోరిన వాదిమ్ శిషిమారిన్
ఉక్రెయిన్‌లో యుద్ధ నేరాలపై విచారణను ఎదుర్కొంటున్న తొలి రష్యా సైనికుడు వాదిమ్ శిషిమారిన్ గురువారం కోర్టుకు హాజరయ్యాడు. తనను క్షమించాలంటూ ఒలెగ్జాండర్ షెలిపోవ్ భార్య కేటరినా షెలిపోవాను కోరాడు. ఉన్నతాధికారుల ఆదేశాల వల్లే ఫిబ్రవరి 28న ఒలెగ్జాండర్ షెలిపోవ్‌ను తాను కాల్చి చంపాల్సిన వచ్చిందని తెలిపాడు. యుద్ధ నేరాల కేసులో నేరం రుజువైతే శిషిమారిన్‌కు యావజ్జీవ కారాగార శిక్ష పడనుంది.
పోర్చుగల్ దౌత్యవేత్తల బహిష్కరణ..: రష్యా ప్రభుత్వం పోర్చుగల్ ఎంబసీకి చెందిన ఐదుగురు దౌత్యవేత్తలను బహిష్కరించింది. రెండు రోజుల క్రితమే స్పెయిన్, ఫ్రాన్స్, ఇటలీ ఎంబసీల నుంచి దౌత్యవేత్తలను బహిష్కరించింది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా చాలాదేశాలు రష్యా దౌత్యవేత్తలను బహిష్కరించిన సంగతి తెలిసిందే.
ఉక్రెయిన్ సరుకులపై దిగుమతి సుంకాలు రద్దు
ఉక్రెయిన్‌కు మరింత చేయూతనందించాలని యూరోపియన్ యూనియన్(ఈయూ) నిర్ణయించింది. ఇందులో భాగంగా ఉక్రెయిన్ నుంచి దిగుమతి చేసుకొనే అన్ని రకాల సరుకులపై దిగుమతి సుంకాలు రద్దుచేసింది. యుద్ధం వల్ల నష్టపోతున్న ఉక్రెయిన్‌కు మరో 300 మిలియన్ డాలర్ల సాయం అందజేస్తామని జపాన్ ప్రకటించింది. ఉక్రెయిన్‌కు జపాన్ ఇప్పటికే 300 మిలియన్ డాలర్లు అందజేసింది.
స్వీడన్, ఫిన్‌లాండ్ నాటోలో చేరొద్దు: టర్కీ
నాటో కూటమిలో చేరాలన్న స్వీడన్, ఫిన్‌లాండ్ ఆకాంక్షను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు టర్కీ అధ్యక్షుడు తయీప్ ఎర్డోగాన్ చెప్పారు. ఆ రెండు దేశాలు ఉగ్రవాదానికి అడ్డాగా మారాయని ఆరోపించారు. స్వీడన్, ఫిన్‌లాండ్ దేశాలు నాటోలో చేరాలంటే టర్కీ మద్దతు కీలకం.
జార్జి డబ్ల్యూ బుష్ వివరణ
‘ఇరాక్‌పై క్రూరమైన దండయాత్ర సాగించడం అన్యాయం’ అని వ్యాఖ్యానించిన అమెరికా మాజీ అధ్యక్షుడు జార్జి డబ్ల్యూ బుష్ తాజాగా వివరణ ఇచ్చారు. ఉక్రెయిన్‌పై అనబోయి పొరపాటున ఇరాక్ అన్నానని చెప్పారు. 2003లో బుష్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలోనే ఇరాక్‌పై అమెరికా యుద్ధం ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఉక్రెయిన్‌పై యుద్ధాన్ని ఆయన తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment