బుచాలో జనాన్ని ఖననం చేసిన దృశ్యం. (ఇన్‌సెట్లో) బుచాలో జెలెన్‌స్కీ భావోద్వేగం
కీవ్/బుచా: ఉక్రెయిన్ రాజధాని కీవ్ నుంచి రష్యా సైన్యం క్రమంగా వెనక్కి మళ్లుతోంది. ప్రధానంగా ఉక్రెయిన్ తూర్పు ప్రాంతం వైపు కదులుతోంది. డాన్‌బాస్‌పై ప్రత్యేకంగా దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. ఇన్నాళ్లూ రష్యా నియంత్రణలో ఉన్న కీవ్ పరిసర పట్టణాలను ఉక్రెయిన్ సైనికులు తిరిగి స్వాధీనం చేసుకుంటున్నారు. బుచాతోసహా పలు పట్టణాల్లో రష్యా జవాన్లు దారుణ అకృత్యాలకు పాల్పడినట్లు ఉక్రెయిన్ ఆరోపిస్తోంది.
సామాన్య పౌరులపై రాక్షసకాండ జరిపారని, వందలాది మందిని బలితీసుకున్నారని ఉక్రెయిన్ ప్రాసిక్యూటర్ జనరల్ ఇరైనా వెనెడిక్‌టోవా చెప్పారు. కీవ్ ఇరుగుపొరుగు పట్టణాల్లో గత మూడు రోజుల్లో 410 మృతదేహాలు గుర్తించామని తెలిపారు. ఇందులో 140 మృతదేహాలకు పరీక్షలు నిర్వహిస్తున్నామని అన్నారు. కీవ్ రీజియన్‌లోని మోటిజైన్ మేయర్ ఓల్గా సుఖెంకోను, ఆమె భర్త, కుమారుడిని రష్యా సైనికులు హత్య చేశారని, శవాలను ఓ కుంటలోకి విసిరేశారని ఉక్రెయిన్ ఉప ప్రధానమంత్రి వెరెస్‌చుక్ చెప్పారు. మేయర్, ఆమె కుటుంబ సభ్యులను మార్చి 23న రష్యా జవాన్లు కిడ్నాప్ చేశారని వెల్లడించారు.
11 మంది మేయర్లు, కమ్యూనిటీ పెద్దలను కూడా అపహరించారని తెలిపారు. చెర్నిహివ్ రీజియన్‌లోని కొన్ని ప్రాంతాలను తాము మళ్లీ స్వాధీనం చేసుకున్నామని ఉక్రెయిన్ సైన్యం ప్రకటించింది. చెర్నిహివ్–కీవ్ రహదారిపై సోమవారం నుంచి రాకపోకలు పునరుద్ధరించామని పేర్కొంది. రష్యా దాడుల్లో చెర్నిహివ్ నగరం 80 శాతం ధ్వంసమయ్యిందని స్థానిక మేయర్ వెల్లడించారు. కీవ్‌కు 75 కిలోమీటర్ల దూరంలోని బలాక్లియాలోని ఓ ఆస్పత్రి రష్యా దాడిలో ధ్వంసమయ్యింది. అందులోని రోగులను బస్సుల్లో సురక్షిత ప్రాంతాలకు తరలిస్తుండగా రష్యా మళ్లీ దాడి చేయగా ఓ బస్సు డ్రైవర్ మృతి చెందాడని ఖర్కీవ్ గవర్నర్ చెప్పారు. ఆదివారం రాత్రి ఖర్కివ్‌లో రష్యా జరిపిన దాడుల్లో ఏడుగురు మృతిచెందారు. వీరిలో ముగ్గురు చిన్నారులు ఉన్నారు.
అంతర్జాతీయ సమాజం ఆగ్రహం
ఉక్రెయిన్‌లో సాధారణ పౌరులను పొట్టనపెట్టుకున్న రష్యాపై అంతర్జాతీయ సమాజం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. రష్యా మారణకాండను ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రి యాయిర్ లాపిడ్ ట్విట్టర్‌లో ఖండించారు. సాధారణ పౌరులను చంపడం కచ్చితంగా యుద్ధ నేరమేనన్నారు. రష్యా రాక్షసకాండను అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్, నాటో సెక్రెటరీ జనరల్ జెన్స్ స్టోల్టెన్‌బర్గ్, ఈయూ విదేశాంగ విధానం చీఫ్ జోసెఫ్ బోరెల్, ఎస్తోనియా ప్రధానమంత్రి కజా కల్లాస్, ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ ఖండించారు. బుచాలో మారణకాండకు నిరసనగా జర్మనీ 40 మంది రష్యా దౌత్యాధికారులను దేశం నుంచి బహిష్కరించింది.
విచారణను రష్యా ఎదుర్కోవాల్సిందే: బైడెన్
ఉక్రెయిన్‌లో యుద్ధ నేరాలకు పాల్పడుతున్న రష్యా విచారణను ఎదుర్కోక తప్పదని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అన్నారు. రష్యాపై మరిన్ని ఆంక్షలు విధిస్తామని సోమవారం ప్రకటించారు.
నిజానిజాలు నిగ్గుతేల్చాలి: లావ్రోవ్
ఉక్రెయిన్‌లో తమ దళాలు ఎలాంటి అరాచకాలకు పాల్పడలేదని రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ స్పష్టం చేశారు. నిజానిజాలను నిగ్గు తేల్చడానికి భద్రతా మండలిని సమావేశపర్చాలన్నారు.
ఇంతటి దారుణాలు చూశాక చర్చలు కష్టమే
రష్యా సైన్యం అకృత్యాలకు సజీవ సాక్ష్యంగా నిలిచిన బుచా సిటీలో అధ్యక్షుడు జెలెన్‌స్కీ పర్యటించారు. ‘ కుప్పలు తెప్పలుగా పడిన అమాయకుల మృతదేహాలను చూశాక రష్యాతో చర్చలు జరపాలనే ఆలోచనే చాలా కష్టంగా ఉంది. అందరినీ దా రుణంగా హింసించి చంపారు. చిన్నారులు, మైనర్లుసహా మహిళలను రేప్ చేశారు. జంతువులకంటే హీనంగా ఉక్రెయిన్లను రష్యా సైనికులు పరిగణించారు’ అని జెలెన్‌స్కీ భావోద్వేగంతో మాట్లాడారు.
Comments
Please login to add a commentAdd a comment