civilians killed
-
ఉక్రెయిన్‌పై మళ్లీ నిప్పుల వర్షం
కీవ్: ఉక్రెయిన్‌పై రష్యా సైన్యం మరోసారి భీకర స్థాయిలో విరుచుకుపడింది. చాలారోజుల తర్వాత అతిపెద్ద దాడికి పాల్పడింది. గురువారం రాత్రి నుంచి ఉక్రెయిన్‌లోని కీలకమైన లక్ష్యాలపై ఏకంగా 122 క్షిపణులు, 36 డ్రోన్లు ప్రయోగించింది. 18 గంటలపాటు జరిగిన ఈ దాడుల్లో 24 మంది సాధారణ పౌరులు మృతి చెందారని, దాదాపు 130 మంది గాయపడ్డారని ఉక్రెయిన్ అధికార వర్గాలు శుక్రవారం వెల్లడించాయి. ఉక్రెయిన్–రష్యా యుద్ధం మొదలైన తర్వాత ఉక్రెయిన్‌పై ఇదే అతిపెద్ద వైమానిక దాడి అని పేర్కొన్నాయి. రష్యా సైన్యం ప్రయోగించిన బాలిస్టిక్, క్రూయిజ్ క్షిపణులు, షాహెద్ డ్రోన్లను చాలావరకు కూలి్చవేశామని ఉక్రెయిన్ సైనికాధికారి ఒకరు పేర్కొన్నారు. 2022 ఫిబ్రవరిలో ఉక్రెయిన్–రష్యా నడుమ యుద్ధం ప్రారంభమైన సంగతి తెలిసిందే. -
ముగ్గురు పౌరుల అనుమానాస్పద మృతి
జమ్మూ: జమ్మూకశ్మీర్‌లోని సరిహద్దు జిల్లాలు పూంఛ్, రాజౌరీల్లో మళ్లీ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. విచారణ కోసమని తీసుకెళ్లి ముగ్గురు పౌరులను ఆర్మీ అధికారులు చంపేశారంటూ పార్టీల నేతలు, స్థానికులు నిరసనకు దిగారు. దీనిపై ప్రభుత్వం స్పందించింది. మృతుల కుటుంబాలకు పరిహారం అందజేస్తామని, ఉద్యోగాలు కల్పిస్తామని తెలిపింది. సమగ్ర దర్యాప్తు జరిపి, బాధ్యులపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చింది. విచారణకు పూర్తిగా సహకరిస్తామని ఆర్మీ ప్రకటించింది. వదంతులు వ్యాపించకుండా పూంఛ్, రాజౌరీ జిల్లాల్లో మొబైల్ ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు. ఈ నెల 21న పూంఛ్ జిల్లాలో ఆర్మీ వాహనాలపై ఉగ్రవాదుల దాడిలో ఐదుగురు సైనికులు అసువులు బాయడం తెలిసిందే. అనంతరం ఆర్మీ అధికారులు 8 మందిని అదుపులోకి తీసుకున్నారు. వీరిలో ముగ్గురు శుక్రవారం రాత్రి శవాలై కనిపించారు. వారిని చిత్రహింసలు పెట్టిన వీడియోలు బహిర్గతమయ్యాయి. ఇది ఆర్మీ అధికారుల పనేనని స్థానికులు ఆరోపించారు. తీవ్ర గాయాలపాలైన నలుగురిని అధికారులు ఆస్పత్రికి తరలించారు. కశ్మీర్లో మళ్లీ ఉద్రిక్తతలు -
Israel-Hamas war: గాజా రక్తసిక్తం
ఖాన్ యూనిస్/రఫా/జెరూసలేం: గాజాపై ఇజ్రాయెల్ సైన్యం భీకర స్థాయిలో దాడులు కొనసాగిస్తోంది. భూతల దాడులతోపాటు వైమానిక దళం బాంబులు ప్రయోగిస్తోంది. గాజా రక్తసిక్తంగా మారుతోంది. హమాస్ మిలిటెంట్లతోపాటు వందలాది మంది సాధారణ ప్రజలు మృత్యువాత పడుతున్నారు. మృతుల సంఖ్య నానాటికీ పెరిగిపోతోంది. గాజా సిటీ సమీపంలో జబాలియా శరణార్థి శిబిరంలోని అపార్టుమెంట్లపై ఇజ్రాయెల్ సైన్యం రెండో రోజు బుధవారం కూడా దాడులు సాగించింది. పలు భవనాలు నేలమట్టమయ్యాయి. క్షతగాత్రులుగా మారి రక్తమోడుతున్న మహిళలను, చిన్నపిల్లలను శిథిలాల నుంచి బయటకు తీసుకొస్తున్న దృశ్యాలు కనిపించాయి. జబాలియాలో సాధారణ నివాస గృహాల మధ్య ఏర్పాటు చేసిన హమాస్ కమాండ్ సెంటర్‌ను, మిలిటెంట్ల సొరంగాలను ధ్వంసం చేశామని ఇజ్రాయెల్ సైన్యం వెల్లడించింది. ఇక్కడ హమాస్ కీలక కమాండర్‌తోపాటు చాలామంది మిలిటెంట్లు హతమయ్యారని ప్రకటించింది. సాధారణ ప్రజలు 50 మందికిపైగానే మరణించినట్లు, వందలాది మంది గాయాలపాలైనట్లు తెలుస్తోంది. శరణార్థి శిబిరంలో ఇజ్రాయెల్ వైమానిక దాడులను ఖతార్, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ)తోపాటు పాకిస్తాన్ ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. హమాస్ చెరలో 240 మంది బందీలు ఇజ్రాయెల్ సైన్యం–హమాస్ మిలిటెంట్ల మధ్య ఘర్షణ మొదలై మూడు వారాలు దాటింది. ఇజ్రాయెల్ దాడుల్లో గాజాలో ఇప్పటిదాకా 8,700 మందికిపైగా పాలస్తీనియన్లు మరణించారని, 22,000 మంది గాయపడ్డారని గాజా ఆరోగ్య శాఖ బుధవారం ప్రకటించింది. ఇజ్రాయెల్ ఆక్రమిత వెస్ట్‌బ్యాంక్‌లో 122 మంది పాలస్తీనియన్లు చనిపోయారని వెల్లడించింది. హమాస్ చెరలో దాదాపు 240 మంది బందీలుగా ఉన్నారు. ఇప్పటివరకు నలుగురు బందీలను హమాస్ విడుదల చేసింది. బందీగా ఉన్న ఒక ఇజ్రాయెల్ మహిళా జవాన్‌ను ఇజ్రాయెల్ ప్రత్యేక దళాలు విడిపించాయి. 34 మంది జర్నలిస్టులు బలి ఇజ్రాయెల్–హమాస్ యుద్ధంలో 34 మంది జర్నలిస్టులు మరణించారని ‘రిపోర్టర్స్ వితౌట్ బార్డర్స్’ సంస్థ వెల్లడించింది. ఇరు పక్షాలూ యుద్ధ నేరాలకు పాల్పడుతున్నాయని ఆరోపించింది. ఈ మేరకు బుధవారం ఒక ప్రకటన విడుదల చేసింది. గాజాలో పాలస్తీనియన్ జర్నలిస్టులు దారుణ హత్యలకు గురవుతున్నారని, వీటిపై అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు విచారణ జరపాలని పేర్కొంది. సాధారణ ప్రజలు నివాసం ఉండే ప్రాంతాల్లో హమాస్ మిలిటెంట్లు మకాం వేస్తున్నారని, తద్వారా ప్రజల ప్రాణాలకు ముప్పు కలిగిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేసింది. గాజాలో భారత సంతతి ఇజ్రాయెల్ సైనికుడు మృతి గాజాలో హమాస్ మిలిటెంట్లతో జరుగుతున్న ఘర్షణలో భారత సంతతి ఇజ్రాయెల్ సైనికుడు హలెల్ సోలోమాన్ (20) బుధవారం మృతిచెందాడు. దక్షిణ ఇజ్రాయెల్‌లోని డొమోనా పట్టణానికి చెందిన సోలోమాన్ హమాస్ మిలిటెంట్లపై వీరోచితంగా పోరాడుతూ ప్రాణాలు కోల్పోయాడు. అతడి మృతిపట్ల డిమోనా మేయర్ సంతాపం ప్రకటించారు. డిమోనా పట్టణాన్ని ‘లిటిల్ ఇండియా’గా పిలుస్తుంటారు. భారత్ నుంచి వలస వచి్చన యూదులు ఇక్కడ స్థిరపడ్డారు. గాజాలో మిలిటెంట్ల దాడుల్లో ఇప్పటివరకు 11 మంది ఇజ్రాయెల్ సైనికులు మృతిచెందారు. బుధవారం ఒక్కరోజే 9 మంది మరణించారు. ఇంటర్నెట్, ఫోన్ సేవలకు అంతరాయం గాజాలో ఇంటర్నెట్, మొబైల్ ఫోన్ సేవలు బుధవారం కొన్ని గంటలపాటు నిలిచిపోయాయి. సాయంత్రానికల్లా పునరుద్ధరించారు. ఇంటర్నెట్, ఫోన్ల సేవలకు తరచూ అంతరాయం కలుగుతుండడం వల్ల సహాయక చర్యలకు ఆటంకాలు ఎదురవుతున్నాయని స్వచ్ఛంద సంస్థలు చెబుతున్నాయి. ఇజ్రాయెల్‌కు ఆహారం, ఇంధనం ఎగుమతులు ఆపేయండి గాజాలో సాధారణ పాలస్తీనియన్ల ప్రాణాలను బలిగొంటున్న ఇజ్రాయెల్‌కు తగిన బుద్ధి చెప్పాలని ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ అన్నారు. ఇజ్రాయెల్‌కు ఆహారం, ఇంధనం ఎగుమతులను తక్షణమే నిలిపివేయాలని బుధవారం ఆస్లామిక్ దేశాలకు పిలుపునిచ్చారు. గాజాలో ఇజ్రాయెల్ సాగిస్తున్న నేరాలకు తక్షణమే అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఉందన్నారు. ఇజ్రాయెల్‌ను ఏకాకిని చేయాలని, ఆర్థిక సంబంధాలు తెంచుకోవాలని ఇస్లామిక్ దేశాలకు సూచించారు. -
యుద్ధ మృతులు 10 వేలు.. ఓ రక్తపిపాసీ... నీకిదే జలాభిషేకం...!
కీవ్: రష్యా దురాక్రమణ తమ దేశంపై మొదలయ్యాక 499 మంది చిన్నారులు సహా 10,749 మంది పౌరులు చనిపోయినట్లు ఉక్రెయిన్ తెలిపింది. ఉక్రెయిన్ ప్రాసిక్యూటర్ జనరల్ ఉన్నతాధికారి యూరి బియెలౌసోవ్ ఓ ఇంటర్వ్యూలో ఈ విషయాలు వెల్లడించారు. ఆక్రమిత ప్రాంతాలను విముక్తి చేసిన తర్వాతే వాస్తవ సంఖ్య తేలుతుందని చెప్పారు. రష్యా–ఉక్రెయిన్ యుద్ధంలో 500 మంది చిన్నారులు సహా 9 వేల మందికి పైగా పౌరులు మృతి చెందినట్లు జూలై 7న ఐక్యరాజ్యసమితి వెల్లడించిన నివేదిక తెలిపింది. కాగా, రష్యా కాల్పుల్లో ఖెర్సన్ నగరంలోని 18వ శతాబ్దానికి చెందిన చారిత్రక సెంట్ కేథరిన్ కేథడ్రల్ చర్చి దెబ్బతింది. మంటలను ఆర్పుతుండగా మరోసారి దాడి జరిగింది. ► యుద్ధ ట్యాంకర్‌పై కూర్చున్న రష్యా అధ్యక్షుడు పుతిన్ నిలువెత్తు రక్త ప్రతిమపై వాటర్ గన్‌తో నీళ్లు పిచికారీ చేస్తున్న ఓ బాలిక. ఇటలీ రాజధాని రోమ్‌లో జేమ్స్ కొలోమినా అనే కళాకారుడు ఈ ప్రతిమను ప్రతిష్టించారు. -
ఇళ్లల్లోకి చొరబడి ఉగ్రవాదుల కాల్పులు.. ముగ్గురు పౌరులు మృతి
శ్రీనగర్: జమ్ముకశ్మీర్‌లో మరోసారి ఉగ్రవాదులు రెచ్చిపోయారు. రాజౌరీ జిల్లాలోని డాంగ్రి గ్రామంలో మైనారిటీ వర్గం లక్ష్యంగా కాల్పులకు పాల్పడ్డారు. ఈ దుర్ఘటనలో ముగ్గురు పౌరులు ప్రాణాలు కోల్పోయారు. ఆయుధాలతో గ్రామంలోకి చొరబడిన దుండగులు కాల్పులకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. ఈ కాల్పుల్లో మరో 10 మంది స్థానికులు గాయపడ్డారు. తూటాలు తగిలిన క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. అందులో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. ఉగ్రమూకల కోసం భద్రతా దాళం గాలింపు చర్యలు చేపట్టాయి. ఇద్దరు దుండగులు గ్రామంలోకి వచ్చినట్లు అనుమానిస్తున్నారు. ‘మూడు ఇళ్లల్లో కాల్పులు జరిగాయి. ఇద్దరు పౌరులు ప్రాణాలు కోల్పోయారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. దుండగుల కోసం గాల్పింపు చర్యలు కొనసాగుతున్నాయి. ’అని తెలిపారు అదనపు డీజీపీ ముకేశ్ సింగ్. మరోవైపు.. కాల్పుల్లో ముగ్గురు చనిపోయారని, మరో ఎనిమిది మంది గాయపడినట్లు స్థానికులు పేర్కొన్నారు. ఈ ఘటనతో రాజౌరీ వైద్య కళాశాల వద్ద గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. గడిచిన రెండు వారాళ్లో పౌరులే లక్ష్యంగా కాల్పులు జరగటం ఇదే రెండో సంఘటన. డిసెంబర్ 16న ఆర్మీ క్యాంప్ సమీపంలో ఇద్దరు పౌరులను ఉగ్రవాదులు కాల్చి చంపారు. ఇదీ చదవండి: చంద్రబాబు సభలో తొక్కిసలాట.. ముగ్గురు మృతి -
Ukraine-Russia war: రష్యాకు లక్ష, మాకు 13 వేలు సైనిక నష్టంపై ఉక్రెయిన్
కీవ్: రష్యా–ఉక్రెయిన్ యుద్ధంలో భారీగా ప్రాణనష్టం చోటు చేసుకుంటోంది. యుద్ధం మొదలైన ఈ తొమ్మిది నెలల కాలంలో దాదాపుగా 13 వేల మంది ఉక్రెయిన్ సైనికులు మరణించినట్టు అధ్యక్షుడు జెలెన్స్కీ సలహాదార మైఖైలో పోడోల్యాక్ వెల్లడించారు. వీరిలో సాధారణ పౌరులే అధికమన్నారు. రష్యా సైనికులు లక్ష మంది దాకా మరణించినట్టు అంచనా వేశామన్నారు. లక్షన్నర మంది గాయపడి ఉంటారని తెలిపారు. ఉక్రెయిన్ వైపు చనిపోయిన, గాయపడ్డ వారి సంఖ్య లక్ష దాకా ఉంటుందని యూరోపియన్ యూనియన్ ఎగ్జిక్యూటివ్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాండెర్ లెయెన్ చెప్పారు. రష్యా, ఉక్రెయిన్ రెండు పక్షాల్లో కలిపి మృతుల సంఖ్య లక్ష వరకు ఉంటుందని అమెరికా జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ జనరల్ మార్క్ మిల్లీ అన్నారు. ఉక్రెయిన్ పౌరులు 40 వేల మంది వరకు కూడా ప్రాణాలు కోల్పోయారని తెలిపారు. ఇక ఇరువైపులా కలిపి 6,655 మంది పౌరులు మరణించారని, 10, 368 మంది గాయపడ్డారని ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల కమిషన్ వెల్లడించింది. సైనికులు ఎంతమంది ప్రాణాలు కోల్పోయారో ఐరాస వెల్లడించలేదు. -
Russia-Ukraine War: సామాన్యులే సమిధలు
కీవ్/బుచా: ఉక్రెయిన్ రాజధాని కీవ్ నుంచి రష్యా సైన్యం క్రమంగా వెనక్కి మళ్లుతోంది. ప్రధానంగా ఉక్రెయిన్ తూర్పు ప్రాంతం వైపు కదులుతోంది. డాన్‌బాస్‌పై ప్రత్యేకంగా దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. ఇన్నాళ్లూ రష్యా నియంత్రణలో ఉన్న కీవ్ పరిసర పట్టణాలను ఉక్రెయిన్ సైనికులు తిరిగి స్వాధీనం చేసుకుంటున్నారు. బుచాతోసహా పలు పట్టణాల్లో రష్యా జవాన్లు దారుణ అకృత్యాలకు పాల్పడినట్లు ఉక్రెయిన్ ఆరోపిస్తోంది. సామాన్య పౌరులపై రాక్షసకాండ జరిపారని, వందలాది మందిని బలితీసుకున్నారని ఉక్రెయిన్ ప్రాసిక్యూటర్ జనరల్ ఇరైనా వెనెడిక్టోవా చెప్పారు. కీవ్ ఇరుగుపొరుగు పట్టణాల్లో గత మూడు రోజుల్లో 410 మృతదేహాలు గుర్తించామని తెలిపారు. ఇందులో 140 మృతదేహాలకు పరీక్షలు నిర్వహిస్తున్నామని అన్నారు. కీవ్ రీజియన్‌లోని మోటిజైన్ మేయర్ ఓల్గా సుఖెంకోను, ఆమె భర్త, కుమారుడిని రష్యా సైనికులు హత్య చేశారని, శవాలను ఓ కుంటలోకి విసిరేశారని ఉక్రెయిన్ ఉప ప్రధానమంత్రి వెరెస్చుక్ చెప్పారు. మేయర్, ఆమె కుటుంబ సభ్యులను మార్చి 23న రష్యా జవాన్లు కిడ్నాప్ చేశారని వెల్లడించారు. 11 మంది మేయర్లు, కమ్యూనిటీ పెద్దలను కూడా అపహరించారని తెలిపారు. చెర్నిహివ్ రీజియన్‌లోని కొన్ని ప్రాంతాలను తాము మళ్లీ స్వాధీనం చేసుకున్నామని ఉక్రెయిన్ సైన్యం ప్రకటించింది. చెర్నిహివ్–కీవ్ రహదారిపై సోమవారం నుంచి రాకపోకలు పునరుద్ధరించామని పేర్కొంది. రష్యా దాడుల్లో చెర్నిహివ్ నగరం 80 శాతం ధ్వంసమయ్యిందని స్థానిక మేయర్ వెల్లడించారు. కీవ్‌కు 75 కిలోమీటర్ల దూరంలోని బలాక్లియాలోని ఓ ఆస్పత్రి రష్యా దాడిలో ధ్వంసమయ్యింది. అందులోని రోగులను బస్సుల్లో సురక్షిత ప్రాంతాలకు తరలిస్తుండగా రష్యా మళ్లీ దాడి చేయగా ఓ బస్సు డ్రైవర్ మృతి చెందాడని ఖర్కీవ్ గవర్నర్ చెప్పారు. ఆదివారం రాత్రి ఖర్కివ్‌లో రష్యా జరిపిన దాడుల్లో ఏడుగురు మృతిచెందారు. వీరిలో ముగ్గురు చిన్నారులు ఉన్నారు. అంతర్జాతీయ సమాజం ఆగ్రహం ఉక్రెయిన్‌లో సాధారణ పౌరులను పొట్టనపెట్టుకున్న రష్యాపై అంతర్జాతీయ సమాజం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. రష్యా మారణకాండను ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రి యాయిర్ లాపిడ్ ట్విట్టర్లో ఖండించారు. సాధారణ పౌరులను చంపడం కచ్చితంగా యుద్ధ నేరమేనన్నారు. రష్యా రాక్షసకాండను అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్, నాటో సెక్రెటరీ జనరల్ జెన్స్ స్టోల్టెన్‌బర్గ్, ఈయూ విదేశాంగ విధానం చీఫ్ జోసెఫ్ బోరెల్, ఎస్తోనియా ప్రధానమంత్రి కజా కల్లాస్, ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ ఖండించారు. బుచాలో మారణకాండకు నిరసనగా జర్మనీ 40 మంది రష్యా దౌత్యాధికారులను దేశం నుంచి బహిష్కరించింది. విచారణను రష్యా ఎదుర్కోవాల్సిందే: బైడెన్ ఉక్రెయిన్‌లో యుద్ధ నేరాలకు పాల్పడుతున్న రష్యా విచారణను ఎదుర్కోక తప్పదని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అన్నారు. రష్యాపై మరిన్ని ఆంక్షలు విధిస్తామని సోమవారం ప్రకటించారు. నిజానిజాలు నిగ్గుతేల్చాలి: లావ్రోవ్ ఉక్రెయిన్‌లో తమ దళాలు ఎలాంటి అరాచకాలకు పాల్పడలేదని రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ స్పష్టం చేశారు. నిజానిజాలను నిగ్గు తేల్చడానికి భద్రతా మండలిని సమావేశపర్చాలన్నారు. ఇంతటి దారుణాలు చూశాక చర్చలు కష్టమే రష్యా సైన్యం అకృత్యాలకు సజీవ సాక్ష్యంగా నిలిచిన బుచా సిటీలో అధ్యక్షుడు జెలెన్స్కీ పర్యటించారు. ‘ కుప్పలు తెప్పలుగా పడిన అమాయకుల మృతదేహాలను చూశాక రష్యాతో చర్చలు జరపాలనే ఆలోచనే చాలా కష్టంగా ఉంది. అందరినీ దా రుణంగా హింసించి చంపారు. చిన్నారులు, మైనర్లుసహా మహిళలను రేప్ చేశారు. జంతువులకంటే హీనంగా ఉక్రెయిన్లను రష్యా సైనికులు పరిగణించారు’ అని జెలెన్స్కీ భావోద్వేగంతో మాట్లాడారు. -
రష్యా vs ఉక్రెయిన్: మారియుపోల్ మారణహోమం..!!
-
Nagaland Tragedy: నాగాలాండ్ నరమేథం
ఈశాన్య భారతంలో తిరుగుబాట్లను అణిచే పేరిట దశాబ్దాలుగా అమలవుతున్న సాయుధ బలగాల (ప్రత్యేకాధికారాల) చట్టం పౌరుల జీవితాల్లో ఎంతటి కల్లోలం సృష్టిస్తున్నదో తెలియడానికి శనివారం చోటుచేసుకున్న నాగాలాండ్ నరమేథమే తార్కాణం. ఆ రాష్ట్రంలోని మోన్ జిల్లాలో 13మంది పౌరులు, ఒక జవాను మరణించడానికి దారి తీసిన ఈ ఉదంతం అత్యంత విషాదకరమైనది. వాహ నంలోని వారిని తిరుగుబాటుదారులుగా పొరబడి కాల్పులు జరిపామని సైన్యం ఇస్తున్న సంజాయిషీ నేర తీవ్రతను తగ్గించలేదు. వారి ప్రకటన ప్రకారం నిషేధిత నేషనల్ సోషలిస్టు కౌన్సిల్ ఆఫ్ నాగా లాండ్ –ఖప్లాంగ్(ఎన్ఎస్సీఎన్–కే)లోని చీలిక వర్గం తిరుగుబాటుదారులు ఫలానా వాహనంలో వస్తున్నారని నిఘా సంస్థలు సమాచారం ఇచ్చాయి. దాని ఆధారంగా కాల్పులు జరిపామని సైన్యం అంటున్నది. తిరుగుబాటుదారుల గురించి అంత ఖచ్చితమైన సమాచారం అందించిన నిఘా సంస్థకూ, దాన్ని విశ్వసించిన సైన్యానికీ సమీపంలోని బొగ్గు గనిలో పనిచేస్తూ రోజూ అదే సమయా నికి వాహనంలో కూలీలు వెళ్తారన్న ఇంగితం లేకపోవడం, జాగరూకతతో వ్యవహరించాలన్న స్పృహ కొరవడటం క్షమార్హంకాదు. పద్ధతిగా అయితే ఇలాంటి దాడుల సమయంలో స్థానిక పోలీసుల సాయం తీసుకోవాలి. కానీ, అక్కడ కార్యకలాపాలు చూసే అస్సాం రైఫిల్స్‌కు కూడా చెప్పకుండా సైన్యంలోని ఒక ఎలైట్ యూనిట్ తనకు తానే నిర్ణయం తీసుకుని ఈ దాడికి పాల్పడిందని వస్తున్న కథనాలు ఆందోళనకరమైనవి. బలగాలమధ్య సమన్వయం లేదని దీన్నిబట్టి అవగతమవుతోంది. అసలు సైన్యం నిర్వహిస్తున్న ఆపరేషన్ల తీరుతెన్నులనే ఈ ఉదంతం ప్రశ్నార్థకం చేస్తున్నది. ఆ వాహనంలో నిజంగా తిరుగుబాటుదారులే వెళ్తున్నా అచ్చం వారి మాదిరే పొంచివుండి దాడి చేయాలనుకోవడం సరికాదు. గత నెలలో మణిపూర్‌లో అస్సాం రైఫిల్స్‌కు చెందిన ఒక కమాండింగ్ ఆఫీసర్‌నూ, మరో ఆరుగురినీ తిరుగుబాటుదారులు బలితీసుకున్ననాటినుంచీ సూత్రధారుల కోసం గాలింపు మొదలైంది. తిరుగుబాటుదారులను సజీవంగా పట్టుకుంటేనే ఆ అధికారి మరణానికి కారకులెవరో, వారి కార్యకలాపాలేమిటో తెలిసేది. అందుకు భిన్నంగా పొంచివుండి హఠాత్తుగా గుళ్ల వర్షం కురిపించడం వల్ల దేశ భద్రతకు కలిగే ప్రయోజనమేమిటి? కాస్తయినా ఆలోచించారా? వాహ నాన్ని ఆపడానికి బలగాలు ప్రయత్నించాయని, కానీ వారు ‘పారిపోయే ప్రయత్నం’ చేయడంతో అందులో తీవ్రవాదులు వెళ్తున్నారని భావించారని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పార్లమెంటులో చేసిన ప్రకటన హేతుబద్ధంగా లేదు. తీవ్రవాదులు వాహనంలో ఉండుంటే మారణాయుధాలతో దాడికి దిగరా? వాహనం ఆపనంత మాత్రాన అందులో తీవ్రవాదులే ప్రయాణిస్తున్నారన్న నిర్ధార ణకు రావడం సబబేనా? నాగాలాండ్ పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలిన అంశాలు మరింత గుబులు పుట్టిస్తున్నాయి. ఘటన జరిగాక మృతదేహాలపై ఉన్న దుస్తులను తొలగించి, ఖాకీ దుస్తులు వేసేందుకు బలగాలు ప్రయత్నించాయని ఆ దర్యాప్తు చెబుతోంది. మరణించినవారు తీవ్రవాదులని కట్టుకథలల్లడానికి ఈ పని చేశారా అన్నది తేలాలి. ఆ రాష్ట్రంలో ఉన్నది ఎన్డీపీపీ–బీజేపీ కూటమి ప్రభుత్వం. కానీ బీజేపీ నేతలకే అక్కడ రక్షణ కరువు! ఘటనాస్థలికి బీజేపీ జెండాతో వెళ్తున్న తమ వాహనంపై కూడా బలగాలు కాల్పులు జరిపి, ఒకరి ప్రాణం తీశాయని, మరో ముగ్గురు గాయపడ్డా రని మోన్ జిల్లా బీజేపీ నేత అంటున్నారు. ఇదంతా వింటుంటే మనం ప్రజాస్వామ్య వ్యవస్థలోనే జీవిస్తున్నామా అనే సందేహం రాకమానదు తీవ్రవాదాన్ని అదుపు చేయడం, శాంతిభద్రతల్ని పరిరక్షించడం ప్రభుత్వాల కర్తవ్యం. మయ న్మార్కూ, చైనాకూ కూతవేటు దూరంలో ఉండే నాగాలాండ్ వంటిచోట అది మరింత అవసరం. కానీ కొండనాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఊడిన చందంగా చట్టాలు ఉండకూడదు. రాజ్యాంగంలోని అధికరణలను సైతం అపహాస్యం చేసేలా సైన్యానికి అపరిమిత అధికారాలిస్తున్న సాయుధ బలగాల (ప్రత్యేకాధికారాల) చట్టం ఈ పోకడే పోతోంది. పర్యవసానంగా ఇది అమలవుతున్న ఈశాన్య రాష్ట్రాల్లో ఎక్కడో ఒకచోట నిత్యం మానవ హక్కుల ఉల్లంఘన సాగుతూనే ఉంది. అక్రమ నిర్బం ధాలు, అత్యాచారాలు, బూటకపు ఎన్కౌంటర్లు, మనుషుల్ని మాయం చేయడం వంటి ఆరోపణలు వస్తూనే ఉన్నాయి. మణిపూర్ ఎన్కౌంటర్ ఘటనలపై 2013లో దర్యాప్తు చేసిన జస్టిస్ సంతోష్ హెగ్డే కమిషన్ సాయుధ బలగాల చట్టం అశాంతికి కారణమవుతున్నదని తేల్చి చెప్పింది. చట్టవిరుద్ధ చర్య లకు పాల్పడిన భద్రతా బలగాలకు ఏ రక్షణా ఉండబోదని సుప్రీంకోర్టు ఒక కేసులో స్పష్టం చేసింది. జస్టిస్ బీపీ జీవన్ రెడ్డి కమిటీ ఆ చట్టాన్ని రద్దు చేయాలని 2005లో సూచించింది. నిర్భయ ఉదం తంలో నియమించిన జస్టిస్ జేఎస్ వర్మ కమిటీ నివేదిక సైతం ఈ చట్టాన్ని రద్దు చేయాలని చెప్పింది. అయినా ఆనాటి యూపీఏ సర్కారుకు పట్టలేదు. అది జరిగితే భద్రతా బలగాల నైతిక స్థైర్యం దెబ్బ తింటుందన్నదే ప్రభుత్వాల వాదన. మరి పౌరుల నైతిక స్థైర్యం సంగతేమిటి? నాగాలాండ్ ఉదం తంలో కారకుల్ని శిక్షిస్తామని సైన్యం అంటున్నది. కేంద్రం కూడా హామీ ఇస్తోంది. మంచిదే. కానీ ఇన్ని దశాబ్దాలుగా ఎంతమందిని శిక్షించారు... లెక్కలు తీస్తారా? సాయుధ బలగాల (ప్రత్యేకాధి కారాల) చట్టం అమల్లో ఉన్నంతకాలం ఇలాంటి ఉదంతాలు చోటుచేసుకుంటూనే ఉంటాయి. చట్టం రద్దు చేయాలన్న నాగాలాండ్, మేఘాలయ సీఎంల తాజా డిమాండ్ ముమ్మాటికీ సబబే. ఇప్పటికైనా కేంద్రం ఆలోచించాలి. ప్రజా శ్రేయస్సుకు అనుగుణంగా నిర్ణయం తీసుకోవాలి. -
17 మంది అమాయకులు బలి.. ఇంకెన్నాళ్లీ చట్టం?
సాక్షి, నేషనల్ డెస్క్: వచ్చిందెవరో ధ్రువీకరించుకోకుండానే... వారి వద్ద ఆయుధాలున్నాయా? దాడికి ప్రయత్నిస్తున్నారా? అనేవి ఏవీ చూడకుండా పనులకెళ్లి తిరిగి వస్తున్న కూలీలపై ఆర్మీ జవాన్లు కాల్పులకు తెగబడటం విభ్రాంతికలిగించింది. బొగ్గు గనిలో పని పూర్తిచేసుకొని పాటలు పాడుకుంటూ వాహనంలో ఇళ్లకు తిరిగి వస్తున్న కార్మికులపై సైనికులు తుపాకులు ఎక్కుపెట్టారు. ఈ ఘటనలో మృతుల సంఖ్య 17కే చేరింది. అయితే ఈశాన్య రాష్ట్రాల్లో ఇలాంటి దారుణాలు కొత్తేమీ కాదు. సాయుధ బలగాల ప్రత్యేక అధికారాల చట్టం (ఏఎఫ్ఎస్పీఏ) కట్టబెట్టిన అపరిమిత అధికారాలతోనే సైన్యం ఇలాంటి అతిక్రమణలకు, హక్కుల ఉల్లంఘనలకు పాల్పడుతోంది. తిరుగుబాట్లను, వేర్పాటువాదాన్ని, నిషేధిత ఉగ్రసంస్థలను అణచివేసే చర్యల పేరిట అమాయాకుల ఊచకోత, మహిళలపై సైన్యం అకృత్యాలు చేసిన దృష్టాంతాలెన్నో ఉన్నాయి. ఈ నిరంకుశ చట్టాన్ని ఉపసంహరించాలని ఇక్కడి పౌర సమాజం, హక్కుల కార్యకర్తలు, రాజకీయ నాయకులు ఎన్నో ఏళ్లుగా గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. ఈశాన్య రాష్ట్రాల్లో అశాంతిని, అలజడులను నియంత్రించడం రాష్ట్ర ప్రభుత్వాల యం త్రాంగాలకు సాధ్యం కాకపోవడంతో ఆరు దశాబ్దాల కిందట 1958లో కేంద్ర ప్రభుత్వం ‘ఏఎఫ్ఎస్పీఏ’ చట్టాన్ని తెచ్చింది. దీని ప్రకారం... ►కల్లోలిత ప్రాంతంగా ప్రకటించిన ప్రదేశాల్లో శాంతిభద్రతలను కాపాడే అధికారం సైనిక బలగాలకు దఖలు పడుతుంది. ►ఐదుగురికి మించి ఒకేచోట గుమిగూడకుండా ఆర్మీ నిషేధం విధించగలదు. ►ఎవరైనా ఈ ఆజ్ఞలను ఉల్లంఘించారని భావిస్తే బలప్రయోగం ద్వారా నియంత్రించొచ్చు. ముందస్తు హెచ్చరిక జారీచేసి కాల్పులూ జరపొచ్చు. ►సమంజసమైన అనుమానం ఉంటే వారెంటు లేకుండానే ఎవరినైనా అరెస్టు చేయవచ్చు. అరెస్టుకు కారణాలను వివరిస్తూ తర్వాత సమీపంలోని పోలీసుస్టేషన్లో సదరు వ్యక్తిని లేదా వ్యక్తులను అప్పగించవచ్చు. ►వారెంటు లేకుండానే ఎవరి ఇంట్లోకైనా ప్రవేశించి సోదాలు జరపొచ్చు. ►ఆయుధాలు కలిగి ఉండటాన్ని నిషేధించొచ్చు. ఏది కల్లోలిత ప్రాంతమంటే... భిన్న మతాలు, జాతులు, భాషలు, కులాలు, ప్రాంతాల ప్రజల మధ్య వైషమ్యాలు పెరిగి ఘర్షణలు తలెత్తితే... ఆ ఏరియాను ‘కల్లోలిత ప్రాంతం’గా ప్రకటించే వీలును ఏఎఫ్ఎస్పీఏ చట్టంలోని సెక్షన్–3 కల్పిస్తోంది. కేంద్ర ప్రభుత్వం (హోంశాఖ), లేదా రాష్ట్ర గవర్నర్ మొత్తం రాష్ట్రాన్ని లేదా కేంద్ర పాలిత ప్రాంతాన్ని కల్లోలిత ప్రాంతంగా ప్రకటించొచ్చు. శాంతిభద్రతలను కాపాడటానికి రాష్ట్ర యంత్రాంగానికి సైనిక బలగాల సాయం అవసరమైన చోట్ల ఈ చట్టాన్ని ప్రయోగించవచ్చు. కేంద్ర ప్రభుత్వం ఏఎఫ్ఎస్పీఏను ప్రయోగించే అధికారాన్ని రాష్ట్ర ప్రభుత్వాల నిర్ణయానికే వదిలివేయవచ్చు. ఎక్కడెక్కడ అమలులో ఉంది? అస్సాం, నాగాలాండ్, మణిపూర్ (మణిపూర్ మున్సిపల్ కౌన్సిల్ ఏరియాను మినహాయించి), అరుణాచల్‌ప్రదేశ్‌లోని చాంగ్లాంగ్, లాంగ్డింగ్, తిరప్ జిల్లాల్లో ఈ చట్టం అమలులో ఉంది. నాగాలాండ్‌లో డిసెంబరు 31 దాకా దీన్ని పొడిగిస్తూ ఈ ఏడాది జూన్ 30నే ఆదేశాలు జారీ అయ్యాయి. అస్సాంలో రాష్ట్ర ప్రభుత్వం సెప్టెంబరు 11న మరో ఆరునెలలు ఈ చట్టం అమలును పొడిగిస్తూ ఆదేశాలు జారీచేసింది. మేఘాలయలో ఏప్రిల్ 1, 2018న ఈ చట్టాన్ని కేంద్రం ఎత్తివేసింది. 16 ఏళ్ల పోరాటం ఇరోమ్ షర్మిల... మణిపూర్ ఉక్కుమహిళగా ఖ్యాతికెక్కిన ఈ పేరు చిరపరిచితమే. 2000 నవంబరులో మణిపూర్‌లోని మలోమ్ పట్టణంలో బస్సు కోసం వేచిచూస్తున్న 10 మంది సాధారణ పౌరులను అస్సాం రైఫిల్స్ దళం కాల్చి చంపింది. ఈ మలోమ్ ఊచకోతకు నిరసనగా, ఏఎఫ్ఎస్పీఏను ఉపసంహరించాలనే డిమాండ్‌తో 28 ఏళ్ల ఇరోమ్ షర్మిల నిరాహార దీక్షకు దిగారు. మూడు రోజులకే ఆత్మహత్యకు ప్రయత్నించిందనే అభియోగంపై ఆమెను పోలీసులు అరెస్టు చేశారు. 2000 నవంబర్ నుంచి 2016 ఆగస్టు దాకా పోలీసు కస్టడీలోనే ఇరోమ్ షర్మిల నిరాహారదీక్షను కొనసాగించారు. ఈ సమయంలో ట్యూబ్ ద్వారా ఆమెకు బలవంతంగా ద్రవాహారం అందించారు. కేంద్రం ఈ చట్టాన్ని ఎంతకీ ఉపసంహరించుకోకపోవడంతో ఆమె మనసు మార్చుకొని 2016 ఆగస్టు 9న తన దీక్షను విరమించారు. రాజకీయాల్లోకి అడుగుపెట్టిన ఇరోమ్ సొంత పార్టీ పెట్టి 2017 అసెంబ్లీ ఎన్నికల్లో ఆనాటి మణిపూర్ సీఎం ఓక్రమ్ ఇబోబీ సింగ్‌పై పోటీచేశారు. కేవలం 90 ఓట్లు మాత్రమే పడ్డాయి. తమ ప్రజలపై అకృత్యాలను ఎండగడుతూ... ప్రపంచం దృష్టిని అకర్షించి, ఏకధాటిగా 16 ఏళ్లు దీక్ష చేసినా... సొంత జనమే ఆదరించలేదు. సాయుధ బలగాల అకృత్యాలకు ఊతమిచ్చే ఈ నిరంకుశ చట్టం ఇంకా కొనసాగుతూనే ఉంది. -
మాలిలో ఉగ్ర దాడి.. 31మంది పౌరులు మృతి
బమాకో: ఆఫ్రికా దేశం మాలిలో ఉగ్రవాదులు జరిపిన దాడిలో 31 మంది అమాయకపౌరులు బలయ్యారు. బండియగర పట్టణ సమీపంలో శుక్రవారం ఈ దారుణం చోటుచేసుకుంది. సుమారు 50 మంది పౌరులతో వెళ్తున్న ట్రక్కుపై అల్‌ఖైదా అనుబంధ సంస్థకు చెందిన ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఈ సందర్భంగా ట్రక్కులో మంటలు చెలరేగి 31 మంది చనిపోయారు. వీరిలో ఎక్కువమంది సజీవ దహనమైనట్లు బండియగర మేయర్ హొస్సేనీ తెలిపారు. పలువురు గాయాలపాలయ్యారని, ఇద్దరు గల్లంతయ్యారని ఆయన తెలిపారు. స్థానిక సాయుధ బృందాల హింసాత్మక చర్యల కారణంగా మాలిలో వివిధ వర్గాల మధ్య ఉద్రిక్తతలు పెరిగిపోయాయి. (చదవండి: ఇంటికి కాళ్లుంటే.. అది ఎంచక్కా నడుచుకుంటూ వెళుతుంటే..!) -
మయన్మార్‌లో ఘర్షణలు, 25 మంది మృతి
యాంగాన్: మయన్మార్‌లో ప్రజాస్వామ్యాన్ని కాలరాసి, పెత్తనం సాగిస్తోన్న జుంటా సైనిక చర్యకు వ్యతిరేకంగా సెంట్రల్ మయన్మార్‌లో జరిగిన ఘర్షణల్లో ఇరవై ఐదు మంది మృతి చెందారు. ప్రాణాలు కోల్పోయిన వారిలో యాంటీ జుంటా ఉద్యమకారులతో పాటు సామాన్య పౌరులు కూడా ఉన్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఆంగ్ సాన్ సూకీ ప్రభుత్వాన్ని కూలగొట్టి, పాలనా పగ్గాలు చేపట్టిన జుంటా సైన్యం.. నిత్యం తుపాకుల మోత మోగిస్తూ అరాచకం సృష్టిస్తుంది. ఇప్పటి వరకు సైనిక బలగాల చేతుల్లో 890 మంది ప్రాణాలు కోల్పోయారని అసిస్టెంట్ అసోసియేషన్ ఫర్ పొలిటికల్ ప్రిజనర్స్ సంఘం తెలిపింది. కాగా, జుంటా సైన్యం చేపడుతున్న చర్యలు సిరియాలో మాదిరిగా పౌర సంఘర్షణలకు దారి తీయవచ్చని ఐక్యరాజ్య సమితి హక్కుల కార్యాలయం ఆందోళన వ్యక్తం చేస్తుంది. -
అమెరికాలో కాల్పుల కలకలం..!
చికాగో : చికాగోలో కాల్పుల ఘటన కలకలం రేపింది. ఓ దుండగుడు జరిపిన కాల్పుల్లో ఐదుగురు మృతి చెందిన ఘటన శుక్రవారం చోటుచేసుకుంది. పోలీసులు ఎదురుకాల్పులు జరిపి ఆ ఉన్మాదిని మట్టుబెట్టారు. చికాగోకు కొద్ది మైళ్ల దూరంలో ఉన్న అరోరాలోని ఓ ఫ్యాక్టరీలో ఈ ఘటన చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది. -
దారి తప్పిన ఎన్కౌంటర్
శ్రీనగర్: కశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలో భద్రతాబలగాలకు, ఉగ్రవాదులకు మధ్య శనివారం భీకరమైన కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఎన్కౌంటర్లో ముగ్గురు ఉగ్రవాదుల్ని భద్రతాబలగాలు హతమార్చగా, ఉగ్రమూకల కాల్పుల్లో ఓ ఆర్మీ జవాన్ అమరుడయ్యారు. మరోవైపు ఉగ్రవాదులకు మద్దతుగా భారీ సంఖ్యలో అక్కడకు చేరుకున్న స్థానికులు భద్రతాబలగాలపై దాడికి దిగారు. దీంతో ఆత్మరక్షణ కోసం బలగాలు జరిపిన కాల్పుల్లో ఏడుగురు పౌరులు ప్రాణాలు కోల్పోగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఎన్కౌంటర్లో సామాన్య పౌరులు ప్రాణాలు కోల్పోవడంతో రాజకీయ పార్టీలన్నీ గవర్నర్ సత్యపాల్మాలిక్పై దుమ్మెత్తిపోశాయి. దీంతో గవర్నర్ ఘటనపై దర్యాప్తునకు ఆదేశించారు. ఈ విషయమై పోలీస్ ఉన్నతాధికారి ఒకరు మాట్లాడుతూ..‘పుల్వామాలోని సిర్ణూ గ్రామంలో ఉగ్రవాదులు నక్కినట్లు నిఘావర్గాల నుంచి మాకు పక్కా సమాచారం అందింది. దీంతో భద్రతాబలగాలు ఈ ప్రాంతాన్ని చుట్టుముట్టి గాలింపు ప్రారంభించాయి. అయితే బలగాల కదలికల్ని పసిగట్టిన ఉగ్రవాదులు కాల్పులు జరుపుతూ పరారయ్యేందుకు యత్నించారు. వెంటనే అప్రమత్తమైన భద్రతాబలగాలు ఎదురుకాల్పులు ప్రారంభించాయి. ఈ ఎన్కౌంటర్లో ముగ్గురు ఉగ్రవాదులు ప్రాణాలు కోల్పోగా, ఓ జవాన్ అమరుడయ్యారు. మృతుల్లో గతేడాది జూలైలో ఆర్మీ నుంచి పారిపోయి ఉగ్రవాదుల్లో చేరిన సిర్ణూవాసి జహూర్ అహ్మద్ ఉన్నాడు. జహూర్ అహ్మద్‌ను బలగాలు చుట్టుముట్టినట్లు తెలుసుకున్న సిర్ణూ గ్రామస్తులు భారీ సంఖ్యలో ఘటనాస్థలికి చేరుకున్నారు. బలగాలపై రాళ్లదాడికి దిగారు. ఆర్మీ వాహనాలను ధ్వంసం చేశారు. ఆందోళనకారుల్ని చెదరగొట్టేందుకు గాల్లో కాల్పులు జరిపినా ఫలితం లేకపోయింది. దీంతో భద్రతాబలగాలు ఆత్మరక్షణ కోసం రాళ్లమూకపై కాల్పులు జరిపాయి. ఈ ఘటనలో ఏడుగురు పౌరులు ప్రాణాలు కోల్పోయారు’ అని తెలిపారు. అది ఊచకోతే: విపక్షాలు పౌరులు ప్రాణాలు కోల్పోవడంపై కశ్మీర్‌లోని రాజకీయ పార్టీలు తీవ్రంగా మండిపడ్డాయి. కశ్మీర్లో భద్రతాబలగాలు పౌరుల ఊచకోతకు పాల్పడ్డాయని నేషనల్ కాన్ఫరెన్స్ ఉపాధ్యక్షుడు, మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా విమర్శించారు. సొంత ప్రజలను చంపుకోవడం ద్వారా ఏ దేశం కూడా యుద్ధంలో విజయం సాధించలేదని పీడీపీ చీఫ్ మెహబూబా ముఫ్తీ అన్నారు. -
శ్రీనగర్ డౌన్టౌన్లో బీభత్సకాండ
శ్రీనగర్: రంజాన్ మాసంలో దూకుడు వద్దన్న కేంద్రం ఆదేశాలకు విరుద్ధంగా సీఆర్పీఎఫ్ వాహనంతో పౌరులను తొక్కి చంపేసిన ఘటన జమ్ముకశ్మీర్‌లో మళ్లీ అలజడికి దారితీసింది. శ్రీనగర్ డౌన్టౌన్లో బీభత్సం సృష్టించి, ముగ్గురి దుర్మరణానికి కారణమైన సీఆర్పీఎఫ్ వాహనాన్ని ఆందోళనకారులు ధ్వంసం చేశారు. అతిత్వరలోనే అమర్నాథ్ యాత్ర ప్రారంభంకానున్న నేపథ్యంలో తాజా ఘటనపై పెద్ద ఎత్తున విమర్శలు చెలరేగుతున్నాయి. ఏం జరిగింది?: ఓ ఉన్నతాధికారిని ఇంట్లో దిగబెట్టిన సీఆర్పీఎఫ్ వాహనం.. నౌహట్టా ప్రాంతం మీదుగా తిరిగివెళుతున్నప్పుడు ఈ ఘటన జరిగింది. రంజాన్ మాసం, అందునా శుక్రవారం కావడంతో స్థానికులు పెద్ద సంఖ్యలో రోడ్లపై గుమ్మికూడారు. సాధారణంగా అటువైపునకు రాని సీఆర్పీఎఫ్ వాహనాన్నిచూసి అక్కడివారు ఒకింత ఆగ్రహానికి గురై, జిప్సీకి ఎదురెళ్లారు. దీంతో ఆ డ్రైవర్ ఒక్కసారే వేగం పెంచి, జనంపైకి దూసుకెళ్లాడు. ఈక్రమంలో జీపుకింద నలిగిపోయి ఇద్దరు చనిపోగా, తీవ్రంగా గాయపడ్డ మరొకరు ఆస్పత్రిలో కన్నుమూశారు. నిరసన కారులు సీఆర్పీఎఫ్ వాహనాన్ని ధ్వంసం చేయగా, డ్రైవర్ చాకచక్యంగా అక్కడినుంచి ప్రాణాలతో బయటపడగలిగాడు. బుల్లెట్లతో చేసే పనిని జీపుతో చేస్తున్నారా?: ‘‘రంజాన్ మాసంలో ఉద్రిక్తతలకు తావు ఇవ్వరాదని కేంద్రం చెప్పింది. అయినాసరే ఆందోళనకారుల్ని రెచ్చగొట్టేరీతిలో డౌన్‌టౌన్ మీదుగా సీఆర్పీఎఫ్ వాహనానికి అనుమతించారు. కాల్పుల విరమణ అంటూనే బుల్లెట్లతో రోజూ చేసే(చంపేసే) పనిని జీపుతో చేస్తున్నారా?’’ అని మాజీ సీఎం, ఎన్సీ నేత ఒమర్ అబ్దుల్లా ప్రశ్నించారు. మొత్తం ఫుటేజీ చూశాక మాట్లాడండి: కాగా, జరిగిన ఘటనలో సీఆర్పీఎఫ్ తప్పుపట్టాల్సిన పనిలేదని, కొన్ని క్లిప్పింగ్స్ మాత్రమే బయటికొచ్చాయని, మొత్తం వీడియో ఫుటేజీ చూస్తే తప్పు ఎవరిదో తెలుస్తుందని జమ్ముకశ్మీర పోలీసు అధికారులు అన్నారు. జూన్ 28 నుంచి అమర్నాథ్ యాత్ర: హిందువులు అత్యంత పవిత్రంగా భావించే అమర్నాథ్ యాత్ర జూన్ 28 నుంచి ఇదే జమ్ములో ప్రారంభంకానుంది. ఇందుకోసం ఇప్పటికే సుమారు 1.8 లక్షల మంది భక్తులు పేర్లను నమోదు చేయించుకున్నారు. గతేడాదితో పోల్చుకుంటే ఈ దఫా మూడు వారాలు అదనంగా యాత్ర కొనసాగనుండటం విశేషం. అమర్నాథ్ ఏర్పాట్ల పర్యవేక్షణలో భాగంగా కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఒకటిరెండు రోజుల్లో శ్రీనగర్ వెళ్లనున్నారు. భద్రతా బలగాలతోపాటు పలువురు వేర్పాటువాద నేతలతోనూ ఆయన మంతనాలు చేయనున్నారు. శుక్రవారం నాటి సీఆర్పీఎఫ్ వాహన బీభత్సకాండపై హోం మంత్రి ఓ ప్రకటన చేసే అవకాశంఉంది. -
శవాలదిబ్బ ; సిరియాలో 700 మంది హతం
మనిషి విజ్ఞానం రాశులు పోసినట్లు కనిపిస్తుందక్కడ.. శిథిలాలు, శవాలదిబ్బల రూపంలో! అత్యాధునిక టెక్నాలజీతో అత్యంత శక్తిమంతంగా తయారైన ఆయుధాలను పసిపిల్లల్ని చంపడానికి వినియోగిస్తున్నారక్కడ!! అదేమంటే, ఉగ్రవాద విముక్తి పోరాటంలో ‘నరబలి’ తప్పదన్నట్లు ప్రభుత్వాలు వ్యాఖ్యానిస్తున్నాయి!!! డమస్కస్ : గడిచిన కొద్ది రోజులుగా సిరియాలోని గౌటా నగరంపై ప్రభుత్వ దళాల దాడుల్లో కనీసం 700 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారు. చనిపోయినవారిలో 200 మంది చిన్నారులు, 110 మంది మహిళలు కూడా ఉన్నారు. వైమానిక దాడుల్లో ఆస్పత్రి భవనాలు, వందకొద్దీ ఇళ్లు నేలమట్టమయ్యాయి. ముందస్తుగా ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించి, ఆ తర్వాత మిలిటెంట్లపై దాడులు చేయాల్సిన ప్రభుత్వాలు.. ఏకబిగిన జనావాసాలపై బాంబులు జారవిడుస్తున్నాయి. దీంతో గౌటాలో ఎక్కడిక్కడ నెత్తురు ఏరులైపారుతోంది. (సిరియా అంతర్యుద్ధానికి సంబంధించి ప్రస్తుతం ట్రెండ్ అవుతోన్న ఓ పాత ఫొటో) అసలేం జరుగుతోంది? దేశ రాజధాని డమస్కస్ శివారు నగరమైన గౌటా 2013లో ప్రభుత్వ బలగాల ఆధీనంలో ఉండేది. అయితే మిగతా ప్రాంతాల్లో చావుదెబ్బతిన్న మిలిటెంట్లు వేలమంది.. సాధారణ జనంతో కలిసిపోయి గౌటా నగరంలోకి చొచ్చుకొచ్చారు. 2017నాటికి వారు తిరిగి ఆయుధ సంపత్తిని పోగేసి గౌటాలో సొంత పెత్తనం చెలాయించే స్థితికి చేరుకున్నారు. ప్రస్తుతం తిరుగుబాటు దళాలు గౌటా నగరాన్ని రొట్టెను పంచుకున్నట్లు పంచుకున్నాయి. తహ్రీర్ అల్ షమ్, అల్ రహమాన్ లీజియన్, జైష్ అల్ ఇస్లామ్ అనే గ్రూపులు తమలోతాము కలహించుకుంటూ, ప్రభుత్వ బలగాలతోనూ తలపడుతూ జనాన్ని కాల్చుకు తింటున్నాయి. (యుద్ధక్షేత్రంలో ఓ అమాయక బాలిక) దేశరాజధాని డమస్కస్‌కు 10 కిలోమీటర్ల దూరంలో 100 చదరపు కిలోమీటర్ల వైశాల్యంలో విస్తరించి ఉన్న గౌటా నగరంపై పట్టుసాధిస్తే తప్ప సిరియా ప్రభుత్వం మనలేని పరిస్థితి. ఉగ్రవాదుల చెర నుంచి మిగతా ప్రాంతాలను కైవసం చేసుకున్నట్లే గౌటాను కూడా ఆధీనంలోకి తెచ్చుకోవాలనే లక్ష్యంతో సిరియా సైన్యం పనిచేస్తున్నది. ఆ సైన్యాలకు రష్యా పూర్తిస్థాయిలో అండగా నిలవడమేకాక, వైమానిక దాడులు సైతం నిర్వహిస్తున్నది. తాజా సమాచారం ప్రకారం గౌటా యుద్ధక్షేత్రంలో సుమారు 4లక్షల మంది జనం చిక్కుకుపోయారు. రోజుకు ఐదు గంటల విరామం : పుతిన్ మానవ హక్కులను కాలరాస్తూ సిరియా-రష్యాలు సాగిస్తోన్న బాంబు దాడులపై అంతర్జాతీయంగా ఆగ్రహావేశాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఫిబ్రవరి 25న ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి సమావేశం జరిగింది. ‘తక్షణమే సిరియాలో కాల్పుల విరమణ ఒప్పందం అమలు చేయాలి’ అని మండలి తీర్మానించింది. రష్యా కూడా ఆ తీర్మానానికి అనుకూలంగా ఓటేసింది. కానీ క్షేత్ర స్థాయిలో మాత్రం కాల్పుల విరమణపై రష్యా వెనక్కితగ్గలేదు. ‘మానవతా దృక్పథంతో రోజుకు ఐదు గంటలు మాత్రమే దాడుల్ని ఆపుతాం. ఆ సమయంలోనే జనం సురక్షిత ప్రాంతాలకు చేరుకోవాల్సి ఉంటుంది’’ అని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మంగళవారం ఒక ప్రకటన చేశారు. -
వైమానిక దాడి: బస్సులోని 8 మంది మృతి
సనా : యెమెన్ దక్షిణ ప్రాంతం టైజ్ ప్రావిన్స్‌లో సౌదీ సంకీర్ణ దళాలు గురువారం వైమానిక దాడులు జరిపింది. ఈ నేపథ్యంలో ఎనిమిది మంది పౌరులు మరణించారు. మరో 16 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఉన్నతాధికారులు వెంటనే స్పందించి... క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అయితే వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. సంకీర్ణ దళాలు విడిచిన ఆయుధాలు రహదారిపై వెళ్తున్న బస్సుపై పడింది. కాగా బస్సులో 24 మంది కార్మికులు ఉన్నారని చెప్పారు. సదరు బస్సు కార్మికులను కంపెనీకి తీసుకువెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందని ఉన్నతాధికారులు వివరించారు. -
అమరులైన సైనికులకు స్వస్ధలంలో ఘనంగా నివాళులు