జబాలియా శిబిర శిథిలాల్లో చిక్కుకున్న బాలికను బయటకు తీసి ప్రథమ చికిత్స చేశాక ఆస్పత్రికి తరలిస్తున్న దృశ్యాలు
ఖాన్ యూనిస్/రఫా/జెరూసలేం: గాజాపై ఇజ్రాయెల్ సైన్యం భీకర స్థాయిలో దాడులు కొనసాగిస్తోంది. భూతల దాడులతోపాటు వైమానిక దళం బాంబులు ప్రయోగిస్తోంది. గాజా రక్తసిక్తంగా మారుతోంది. హమాస్ మిలిటెంట్లతోపాటు వందలాది మంది సాధారణ ప్రజలు మృత్యువాత పడుతున్నారు. మృతుల సంఖ్య నానాటికీ పెరిగిపోతోంది. గాజా సిటీ సమీపంలో జబాలియా శరణార్థి శిబిరంలోని అపార్టుమెంట్లపై ఇజ్రాయెల్ సైన్యం రెండో రోజు బుధవారం కూడా దాడులు సాగించింది. పలు భవనాలు నేలమట్టమయ్యాయి.
క్షతగాత్రులుగా మారి రక్తమోడుతున్న మహిళలను, చిన్నపిల్లలను శిథిలాల నుంచి బయటకు తీసుకొస్తున్న దృశ్యాలు కనిపించాయి. జబాలియాలో సాధారణ నివాస గృహాల మధ్య ఏర్పాటు చేసిన హమాస్ కమాండ్ సెంటర్‌ను, మిలిటెంట్ల సొరంగాలను ధ్వంసం చేశామని ఇజ్రాయెల్ సైన్యం వెల్లడించింది. ఇక్కడ హమాస్ కీలక కమాండర్‌తోపాటు చాలామంది మిలిటెంట్లు హతమయ్యారని ప్రకటించింది. సాధారణ ప్రజలు 50 మందికిపైగానే మరణించినట్లు, వందలాది మంది గాయాలపాలైనట్లు తెలుస్తోంది. శరణార్థి శిబిరంలో ఇజ్రాయెల్ వైమానిక దాడులను ఖతార్, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ)తోపాటు పాకిస్తాన్ ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది.
హమాస్ చెరలో 240 మంది బందీలు
ఇజ్రాయెల్ సైన్యం–హమాస్ మిలిటెంట్ల మధ్య ఘర్షణ మొదలై మూడు వారాలు దాటింది. ఇజ్రాయెల్ దాడుల్లో గాజాలో ఇప్పటిదాకా 8,700 మందికిపైగా పాలస్తీనియన్లు మరణించారని, 22,000 మంది గాయపడ్డారని గాజా ఆరోగ్య శాఖ బుధవారం ప్రకటించింది. ఇజ్రాయెల్ ఆక్రమిత వెస్ట్‌బ్యాంక్‌లో 122 మంది పాలస్తీనియన్లు చనిపోయారని వెల్లడించింది. హమాస్ చెరలో దాదాపు 240 మంది బందీలుగా ఉన్నారు. ఇప్పటివరకు నలుగురు బందీలను హమాస్ విడుదల చేసింది. బందీగా ఉన్న ఒక ఇజ్రాయెల్ మహిళా జవాన్‌ను ఇజ్రాయెల్ ప్రత్యేక దళాలు విడిపించాయి.
34 మంది జర్నలిస్టులు బలి
ఇజ్రాయెల్–హమాస్ యుద్ధంలో 34 మంది జర్నలిస్టులు మరణించారని ‘రిపోర్టర్స్ వితౌట్ బార్డర్స్’ సంస్థ వెల్లడించింది. ఇరు పక్షాలూ యుద్ధ నేరాలకు పాల్పడుతున్నాయని ఆరోపించింది. ఈ మేరకు బుధవారం ఒక ప్రకటన విడుదల చేసింది. గాజాలో పాలస్తీనియన్ జర్నలిస్టులు దారుణ హత్యలకు గురవుతున్నారని, వీటిపై అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు విచారణ జరపాలని పేర్కొంది. సాధారణ ప్రజలు నివాసం ఉండే ప్రాంతాల్లో హమాస్ మిలిటెంట్లు మకాం వేస్తున్నారని, తద్వారా ప్రజల ప్రాణాలకు ముప్పు కలిగిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేసింది.
గాజాలో భారత సంతతి ఇజ్రాయెల్ సైనికుడు మృతి
గాజాలో హమాస్ మిలిటెంట్లతో జరుగుతున్న ఘర్షణలో భారత సంతతి ఇజ్రాయెల్ సైనికుడు హలెల్ సోలోమాన్ (20) బుధవారం మృతిచెందాడు. దక్షిణ ఇజ్రాయెల్‌లోని డొమోనా పట్టణానికి చెందిన సోలోమాన్ హమాస్ మిలిటెంట్లపై వీరోచితంగా పోరాడుతూ ప్రాణాలు కోల్పోయాడు. అతడి మృతిపట్ల డిమోనా మేయర్ సంతాపం ప్రకటించారు. డిమోనా పట్టణాన్ని ‘లిటిల్ ఇండియా’గా పిలుస్తుంటారు. భారత్ నుంచి వలస వచి్చన యూదులు ఇక్కడ స్థిరపడ్డారు. గాజాలో మిలిటెంట్ల దాడుల్లో ఇప్పటివరకు 11 మంది ఇజ్రాయెల్ సైనికులు మృతిచెందారు. బుధవారం ఒక్కరోజే 9 మంది మరణించారు.
ఇంటర్నెట్, ఫోన్ సేవలకు అంతరాయం
గాజాలో ఇంటర్నెట్, మొబైల్ ఫోన్ సేవలు బుధవారం కొన్ని గంటలపాటు నిలిచిపోయాయి. సాయంత్రానికల్లా పునరుద్ధరించారు. ఇంటర్నెట్, ఫోన్ల సేవలకు తరచూ అంతరాయం కలుగుతుండడం వల్ల సహాయక చర్యలకు ఆటంకాలు ఎదురవుతున్నాయని స్వచ్ఛంద సంస్థలు చెబుతున్నాయి.
ఇజ్రాయెల్‌కు ఆహారం, ఇంధనం ఎగుమతులు ఆపేయండి
గాజాలో సాధారణ పాలస్తీనియన్ల ప్రాణాలను బలిగొంటున్న ఇజ్రాయెల్‌కు తగిన బుద్ధి చెప్పాలని ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ అన్నారు. ఇజ్రాయెల్‌కు ఆహారం, ఇంధనం ఎగుమతులను తక్షణమే నిలిపివేయాలని బుధవారం ఆస్లామిక్ దేశాలకు పిలుపునిచ్చారు. గాజాలో ఇజ్రాయెల్ సాగిస్తున్న నేరాలకు తక్షణమే అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఉందన్నారు. ఇజ్రాయెల్‌ను ఏకాకిని చేయాలని, ఆర్థిక సంబంధాలు తెంచుకోవాలని ఇస్లామిక్ దేశాలకు సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment