దాడుల్లో సర్వం కోల్పోయి విలపిస్తోన్న సిరియన్ బాలిక
మనిషి విజ్ఞానం రాశులు పోసినట్లు కనిపిస్తుందక్కడ.. శిథిలాలు, శవాలదిబ్బల రూపంలో! అత్యాధునిక టెక్నాలజీతో అత్యంత శక్తిమంతంగా తయారైన ఆయుధాలను పసిపిల్లల్ని చంపడానికి వినియోగిస్తున్నారక్కడ!! అదేమంటే, ఉగ్రవాద విముక్తి పోరాటంలో ‘నరబలి’ తప్పదన్నట్లు ప్రభుత్వాలు వ్యాఖ్యానిస్తున్నాయి!!!
డమస్కస్ : గడిచిన కొద్ది రోజులుగా సిరియాలోని గౌటా నగరంపై ప్రభుత్వ దళాల దాడుల్లో కనీసం 700 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారు. చనిపోయినవారిలో 200 మంది చిన్నారులు, 110 మంది మహిళలు కూడా ఉన్నారు. వైమానిక దాడుల్లో ఆస్పత్రి భవనాలు, వందకొద్దీ ఇళ్లు నేలమట్టమయ్యాయి. ముందస్తుగా ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించి, ఆ తర్వాత మిలిటెంట్లపై దాడులు చేయాల్సిన ప్రభుత్వాలు.. ఏకబిగిన జనావాసాలపై బాంబులు జారవిడుస్తున్నాయి. దీంతో గౌటాలో ఎక్కడిక్కడ నెత్తురు ఏరులైపారుతోంది.
(సిరియా అంతర్యుద్ధానికి సంబంధించి ప్రస్తుతం ట్రెండ్ అవుతోన్న ఓ పాత ఫొటో)
అసలేం జరుగుతోంది?
దేశ రాజధాని డమస్కస్ శివారు నగరమైన గౌటా 2013లో ప్రభుత్వ బలగాల ఆధీనంలో ఉండేది. అయితే మిగతా ప్రాంతాల్లో చావుదెబ్బతిన్న మిలిటెంట్లు వేలమంది.. సాధారణ జనంతో కలిసిపోయి గౌటా నగరంలోకి చొచ్చుకొచ్చారు. 2017నాటికి వారు తిరిగి ఆయుధ సంపత్తిని పోగేసి గౌటాలో సొంత పెత్తనం చెలాయించే స్థితికి చేరుకున్నారు. ప్రస్తుతం తిరుగుబాటు దళాలు గౌటా నగరాన్ని రొట్టెను పంచుకున్నట్లు పంచుకున్నాయి. తహ్రీర్ అల్ షమ్, అల్ రహమాన్ లీజియన్, జైష్ అల్ ఇస్లామ్ అనే గ్రూపులు తమలోతాము కలహించుకుంటూ, ప్రభుత్వ బలగాలతోనూ తలపడుతూ జనాన్ని కాల్చుకు తింటున్నాయి.
(యుద్ధక్షేత్రంలో ఓ అమాయక బాలిక)
దేశరాజధాని డమస్కస్‌కు 10 కిలోమీటర్ల దూరంలో 100 చదరపు కిలోమీటర్ల వైశాల్యంలో విస్తరించి ఉన్న గౌటా నగరంపై పట్టుసాధిస్తే తప్ప సిరియా ప్రభుత్వం మనలేని పరిస్థితి. ఉగ్రవాదుల చెర నుంచి మిగతా ప్రాంతాలను కైవసం చేసుకున్నట్లే గౌటాను కూడా ఆధీనంలోకి తెచ్చుకోవాలనే లక్ష్యంతో సిరియా సైన్యం పనిచేస్తున్నది. ఆ సైన్యాలకు రష్యా పూర్తిస్థాయిలో అండగా నిలవడమేకాక, వైమానిక దాడులు సైతం నిర్వహిస్తున్నది. తాజా సమాచారం ప్రకారం గౌటా యుద్ధక్షేత్రంలో సుమారు 4లక్షల మంది జనం చిక్కుకుపోయారు.
రోజుకు ఐదు గంటల విరామం : పుతిన్
మానవ హక్కులను కాలరాస్తూ సిరియా-రష్యాలు సాగిస్తోన్న బాంబు దాడులపై అంతర్జాతీయంగా ఆగ్రహావేశాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఫిబ్రవరి 25న ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి సమావేశం జరిగింది. ‘తక్షణమే సిరియాలో కాల్పుల విరమణ ఒప్పందం అమలు చేయాలి’ అని మండలి తీర్మానించింది. రష్యా కూడా ఆ తీర్మానానికి అనుకూలంగా ఓటేసింది. కానీ క్షేత్ర స్థాయిలో మాత్రం కాల్పుల విరమణపై రష్యా వెనక్కితగ్గలేదు. ‘మానవతా దృక్పథంతో రోజుకు ఐదు గంటలు మాత్రమే దాడుల్ని ఆపుతాం. ఆ సమయంలోనే జనం సురక్షిత ప్రాంతాలకు చేరుకోవాల్సి ఉంటుంది’’ అని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మంగళవారం ఒక ప్రకటన చేశారు.
Comments
Please login to add a commentAdd a comment