
బీరుట్ : నిరంతరం బాంబుల వర్షంతో అల్లకల్లోలంగా మారిన సిరియాలో నరమేధం ఆగడం లేదు. తాజాగా ఆఫ్రిన్ సిటీపై జరిగిన దాడిలో 18 మంది మృతి చెందారు. ఉత్తర సిరియాలో కుర్దిశ్ వర్గానికి చెందిన ప్రజలు అధికంగా నివసించే ఆఫ్రిన్ సిటీపై టర్కీ ఫిరంగి దాడులు చేయడంతో వీరంతా మరణించినట్లు సిరియా మానవ హక్కుల సంఘం తెలిపింది. మరణించిన వారిలో ఐదుగురు చిన్నారులు కూడా ఉన్నట్లు పేర్కొంది.
ఈ ఏడాది జనవరి 20న టర్కీ, సిరియాకు చెందిన తిరుగబాటు ప్రతినిధులు ఆఫ్రిన్ ప్రాంతంలో ప్రమాదకరమైన ఫిరంగులను ఏర్పాటు చేశారు. వీటి మూలంగానే ఆఫ్రిన్ ప్రాంతంలో అలజడులు చెలరేగుతున్నాయి. యూఎస్ మద్దతు గల కుర్దిశ్ పీపుల్స్ ప్రొటెక్షన్ యూనిట్స్(వైపీజీ) నియంత్రణలో ఉన్న ఈ ప్రాంతం ఇప్పటికే టర్కీకి చెందిన బలగాల చేతిలో చిక్కుకోవడంతో రోజుకో ఘటన జరుగుతోంది. నగర ప్రజలు పారిపోయేందుకు వీలుగా ఒకే ఒక రోడ్డు మార్గం మాత్రమే ఉండటంతో వారంతా బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు. కాగా గురువారం నాటికే 30 వేల మంది ఆఫ్రిన్ ప్రజలు మరణించినట్లు ఒక నిఘా సంస్థ తెలిపింది.