దాడుల్లో గాయపడ్డ చిన్నారిని తరలిస్తున్న సిరియన్ యువత(ఫైల్)
డమస్కస్ : కల్లోల సిరియాలో నరమేధం ఇంకా ఆగలేదు. అంతర్జాతీయ సమాజం అభ్యర్థను పక్కనపెడుతూ, ఐక్యరాజ్యసమితి ఆదేశాలను బేఖాతరుచేస్తూ సిరియా సైన్యం మరోసారి వైమానిక దాడులు జరిపింది. తూర్పుగౌటాలోని నివాస సముదాయాలపై శుక్ర, శనివారాల్లో బాంబుల వర్షం కురిపించింది. తాజా దాడుల్లో 25 మందికిపైగా పౌరులు చనిపోయారు. ప్రస్తుతం తూర్పు గౌటాలో సహాయ కార్యక్రమాలు నిర్వహిస్తున్న పలు ఏజెన్సీలు ఈ విషయాన్ని వెల్లడించాయి.
కాల్పుల విరమణకు విరుద్ధంగా : ఫిబ్రవరి చివరివారంలో ఐక్యరాజ్యసమితి భద్రతామండలి.. ‘తూర్పుగౌటాపై దాడులను తక్షణమే నిలిపేయాలి’ అని ఏకగ్రీవ తీర్మానం చేసింసింది. నెల రోజుల కాల్పులు జరపరాదంటూ సిరియా-రష్యాలను ఆదేశించింది. ఆ నిర్ణయం తర్వాత పలు స్వచ్ఛంద సంస్థలు రంగంలోకి దిగాయి. మూడు నెలలుగా సరైన ఆహారం, వైద్యసేవలు లేక అలమటిస్తోన్న గౌటా వాసులను ఆదుకునే ప్రయత్నం చేశాయి. ఇంతలోనే కాల్పుల విమరణ ఒప్పందానికి విరుద్ధంగా అసద్ సైన్యాలు మళ్లీ జనావాసాలపై దాడులకు తెగబడ్డాయి.
సేవ్ సిరియా : రాజధాని డమస్కస్‌కు తూర్పుభాగంలో ఉండే గౌటా నగరంపై గడిచిన మూడు నెలలు భీకర దాడులు జరిగాయి. ఫిబ్రవరి 19 తర్వాత సిరియా సైన్యం-రష్యన్ వైమానిక దళాలు సంయుక్తంగా నిర్వహించిన దాడుల్లో 200 చిన్నారులు, 150 మంది మహిళలు సహా మొత్తం 700 మంది వరకు చనిపోయారు. మరో 1500 మంది తీవ్రంగా గాయపడ్డారు. బాంబు దాడుల్లో 25కుపైగా ఆస్పత్రి భవనాలు కుప్పకూలడంతో వైద్యం చేయించుకునే దిక్కులేక జనం అల్లాడిపోయారు. సిరియన్ బాలల ఆర్తనాదాలకు చలించిన మిగతా ప్రపంచం ‘సేవ్ సిరియా’ అంటూ గట్టిగా నినదించింది. ఈ నేపథ్యంలోనే సిరియా సంక్షోభంపై ఐక్యరాజ్యసమితి జోక్యం చేసుకోవడం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment