సీఆర్‌పీఎఫ్ వాహనాన్ని ధ్వంసం చేస్తోన్న నిరసనకారులు, జిప్సీ కింద నలిగిపోయిన యువకుడు.
శ్రీనగర్: రంజాన్ మాసంలో దూకుడు వద్దన్న కేంద్రం ఆదేశాలకు విరుద్ధంగా సీఆర్‌పీఎఫ్ వాహనంతో పౌరులను తొక్కి చంపేసిన ఘటన జమ్ముకశ్మీర్‌లో మళ్లీ అలజడికి దారితీసింది. శ్రీనగర్ డౌన్‌టౌన్‌లో బీభత్సం సృష్టించి, ముగ్గురి దుర్మరణానికి కారణమైన సీఆర్‌పీఎఫ్ వాహనాన్ని ఆందోళనకారులు ధ్వంసం చేశారు. అతిత్వరలోనే అమర్‌నాథ్ యాత్ర ప్రారంభంకానున్న నేపథ్యంలో తాజా ఘటనపై పెద్ద ఎత్తున విమర్శలు చెలరేగుతున్నాయి.
ఏం జరిగింది?: ఓ ఉన్నతాధికారిని ఇంట్లో దిగబెట్టిన సీఆర్‌పీఎఫ్ వాహనం.. నౌహట్టా ప్రాంతం మీదుగా తిరిగివెళుతున్నప్పుడు ఈ ఘటన జరిగింది. రంజాన్ మాసం, అందునా శుక్రవారం కావడంతో స్థానికులు పెద్ద సంఖ్యలో రోడ్లపై గుమ్మికూడారు. సాధారణంగా అటువైపునకు రాని సీఆర్‌పీఎఫ్ వాహనాన్నిచూసి అక్కడివారు ఒకింత ఆగ్రహానికి గురై, జిప్సీకి ఎదురెళ్లారు. దీంతో ఆ డ్రైవర్ ఒక్కసారే వేగం పెంచి, జనంపైకి దూసుకెళ్లాడు. ఈక్రమంలో జీపుకింద నలిగిపోయి ఇద్దరు చనిపోగా, తీవ్రంగా గాయపడ్డ మరొకరు ఆస్పత్రిలో కన్నుమూశారు. నిరసన కారులు సీఆర్‌పీఎఫ్ వాహనాన్ని ధ్వంసం చేయగా, డ్రైవర్ చాకచక్యంగా అక్కడినుంచి ప్రాణాలతో బయటపడగలిగాడు.
బుల్లెట్లతో చేసే పనిని జీపుతో చేస్తున్నారా?: ‘‘రంజాన్ మాసంలో ఉద్రిక్తతలకు తావు ఇవ్వరాదని కేంద్రం చెప్పింది. అయినాసరే ఆందోళనకారుల్ని రెచ్చగొట్టేరీతిలో డౌన్‌టౌన్ మీదుగా సీఆర్‌పీఎఫ్ వాహనానికి అనుమతించారు. కాల్పుల విరమణ అంటూనే బుల్లెట్లతో రోజూ చేసే(చంపేసే) పనిని జీపుతో చేస్తున్నారా?’’ అని మాజీ సీఎం, ఎన్సీ నేత ఒమర్ అబ్దుల్లా ప్రశ్నించారు.
మొత్తం ఫుటేజీ చూశాక మాట్లాడండి: కాగా, జరిగిన ఘటనలో సీఆర్‌పీఎఫ్ తప్పుపట్టాల్సిన పనిలేదని, కొన్ని క్లిప్పింగ్స్ మాత్రమే బయటికొచ్చాయని, మొత్తం వీడియో ఫుటేజీ చూస్తే తప్పు ఎవరిదో తెలుస్తుందని జమ్ముకశ్మీర పోలీసు అధికారులు అన్నారు.
జూన్ 28 నుంచి అమర్‌నాథ్ యాత్ర: హిందువులు అత్యంత పవిత్రంగా భావించే అమర్‌నాథ్ యాత్ర జూన్ 28 నుంచి ఇదే జమ్ములో ప్రారంభంకానుంది. ఇందుకోసం ఇప్పటికే సుమారు 1.8 లక్షల మంది భక్తులు పేర్లను నమోదు చేయించుకున్నారు. గతేడాదితో పోల్చుకుంటే ఈ దఫా మూడు వారాలు అదనంగా యాత్ర కొనసాగనుండటం విశేషం. అమర్‌నాథ్ ఏర్పాట్ల పర్యవేక్షణలో భాగంగా కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఒకటిరెండు రోజుల్లో శ్రీనగర్ వెళ్లనున్నారు. భద్రతా బలగాలతోపాటు పలువురు వేర్పాటువాద నేతలతోనూ ఆయన మంతనాలు చేయనున్నారు. శుక్రవారం నాటి సీఆర్‌పీఎఫ్ వాహన బీభత్సకాండపై హోం మంత్రి ఓ ప్రకటన చేసే అవకాశంఉంది.
Comments
Please login to add a commentAdd a comment