
కీవ్: ఉక్రెయిన్-రష్యా మధ్య భీకర యుద్ధం నడుస్తోంది. రష్యాపై ఉక్రెయిన్ సైన్యం దాడులను తీవ్రతరం చేసింది. ఇదే సమయంలో రష్యా బలగాలు కూడా ఉక్రెయిన్‌పై బాంబుల వర్షం కురిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్క్ స్కీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ యుద్ధంలో రష్యా సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుంటే మాత్రం వారి దాడులను ఆపగలిగే అవకాశముందని చెప్పుకొచ్చారు.
ఇక, తాజాగా ఓ వీడియోలో జెలెన్ స్కీ మాట్లాడుతూ.. రష్యాపై దాడులను తీవ్రతరం చేసి ఆస్తులను ధ్వంసం చేసినప్పుడు మాత్రమే వారు వెనక్కి తగ్గుతారు. అప్పుడు యుద్ధానికి ముగింపు పలికేందుకు రష్యా ముందుకు వచ్చే అవకాశం ఉందన్నారు. రష్యా భూభాగంలో సైనిక లక్ష్యాలను ధ్వంసం చేయడానికి ఉక్రెయిన్ సైన్యానికి అనుమతించాలని అమెరికాను కోరారు. రష్యాలో సుదూర క్షిపణులు ప్రయోగించడానికి తమకు అనుమతి ఇవ్వాలన్నారు. ఈ విషయమై తమ భాగస్వామ్య దేశాలతో చర్చిస్తున్నామని, వారిని ఒప్పించేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు. ఇదే సమయంలో ఉక్రెయిన్‌పై రష్యా దాడులను కూడా ప్రస్తావించారు. ఈనెల 30వ తేదీన ఉక్రెయిన్‌పై రష్యా జరిపిన దాడిలో ఆరుగురు పౌరులు మరణించారు. 97 మంది గాయపడ్డారని చెప్పారు.
Il discorso del Presidente d’Ucraina Volodymyr Zelenskyy. pic.twitter.com/5UzBII0WdS
— Ukr Embassy to Italy (@UKRinIT) September 1, 2024
ఇదిలా ఉండగా.. ఆగస్టు 30-31 తేదీల్లో ఉక్రెయిన్ రక్షణ మంత్రి రుస్టెమ్ ఉమరోవ్ వాషింగ్టన్‌లో అమెరికా అధికారులు, నిపుణులతో సమావేశమయ్యారు. రష్యాతో పోరులో ఉక్రెయిన్‌కు కావాల్సిన ఆయుధాలు గురించి చర్చించారు. ఈ నేపథ్యంలోనే జెలెన్ స్కీ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. మరోవైపు.. ఉక్రెయిన్ సైన్యం రష్యా భూభాగంలో అడుగుపెట్టిన విషయం తెలిసిందే. ఈక్రమంలో రష్యాలోని కుర్స్క్ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకుంది.