వాషింగ్టన్: ఉక్రెయిన్‌లో రష్యా భీకర దాడులు కొనసాగుతున్న వేళ మరో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్.. రష్యా, ఉక్రెయిన్ దేశాల్లో పర్యటన ఖరారైంది. ఈ నెల 26న రష్యాలో, 28న ఉక్రెయిన్‌లో గుటెరస్ పర్యటించనున్నారు. ఈ పర్యటన విషయంపై రెండు దేశాలకు ఆయన లేఖలు రాశారు.
కాగా, రెండు దేశాల మధ్య శాంతి చర్చలు జరిపేందుకు ఆంటోనియో గుటెరస్ రంగంలోకి దిగారు. ఈ క్రమంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో ఆయన వేర్వేరుగా సమావేశం కానున్నారు. అటు రష్యా విదేశాంగ మంత్రి సెర్గే లావ్రోవ్‌తో, ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి దిమిత్రో కులేబాతోనూ ఆయన భేటీ కానున్నారు.
మరోవైపు.. కాల్పుల విరమణ కోసం వివిధ పక్షాలు చేసిన ప్రయత్నాలు ఫలితమివ్వకపోవడంపై విచారం వ్యక్తం చేశారు. ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయిన ప్రజలను తరలించేందుకు వీలుగా రష్యా యుద్ధానికి విరామం ఇవ్వాలని సూచించారు. ఈ సందర్భంగా గుటెరస్ మాట్లాడుతూ.. ఉక్రెయిన్‌లో 1.2 కోట్ల మందికి మానవతా సాయం అవసరం ఉందన్నారు. డొనెట్స్క్, లుహాన్స్క్, మరియుపోల్, ఖేర్సన్ వంటి నగరాల్లోనే చాలా మంది ఉక్రేనియన్లు బిక్కుబిక్కుమంటూ జీవితం గడుపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలా చావు బతుకుల మధ్య ఉన్న ప్రజల కోసం రష్యా, ఉక్రెయిన్ దేశాలు తుపాకులు వదిలాలని పిలుపునిస్తున్నానని అన్నారు.
ఇది కూడా చదవండి: రక్షణ విషయంలో రష్యాపై భారత్ ఆధారపడొద్దు
Comments
Please login to add a commentAdd a comment