Russia Ukraine war: ఆశలపై నీళ్లు! | Russia Ukraine war: Russia-Ukraine war Russia says de-escalation not a ceasefire | Sakshi
Sakshi News home page

Russia Ukraine war: ఆశలపై నీళ్లు!

Published Thu, Mar 31 2022 4:43 AM | Last Updated on Thu, Mar 31 2022 9:26 AM

Russia Ukraine war: Russia-Ukraine war Russia says de-escalation not a ceasefire - Sakshi

లారైసా కొలెసింక్‌(82) అనే వృద్ధురాలిని బుధవారం ఇర్పిన్‌ పట్టణం నుంచి సురక్షిత ప్రాంతానికి తరలించారు. ఈ సందర్భంగా భావోద్వేగానికి గురైన తల్లీ, తనయుడు

కీవ్‌: తాజా చర్చల నేపథ్యంలో ఉక్రెయిన్‌ సంక్షోభానికి తెర పడవచ్చన్న ఆశలపై రష్యా నీళ్లు చల్లింది. మంగళవారం నాటి చర్చల్లో పెద్ద పురోగతేమీ లేదంటూ రష్యా అధ్యక్షుడు పుతిన్‌ అధికార ప్రతినిధి ద్మిత్రీ పెస్కోవ్‌ పెదవి విరిచారు. ఉక్రెయిన్‌ తన ప్రతిపాదనలను చర్చల సందర్భంగా లిఖితపూర్వకంగా తమ ముందుంచింది తప్ప అంతకంటే పెద్దగా ఏమీ జరగలేదన్నారు. ఉక్రెయిన్‌పై రష్యా దాడులు బుధవారం తీవ్రస్థాయిలో కొనసాగాయి.

కీవ్, చెర్నిహివ్‌ నగరాల్లో సైనిక మోహరింపులను తగ్గిస్తామని చెప్పినా అవి దాడులతో మోతెక్కిపోయాయి. చెర్నిహివ్‌పైనా భీకర దాడులు కొనసాగినట్టు నగర మేయర్‌ చెప్పారు. దాడుల్ని తగ్గిస్తామన్న హామీని రష్యా నిలబెట్టుకోలేదని ఉక్రెయిన్‌ అధ్యక్షుడు వొలొదిమిర్‌ జెలెన్‌స్కీ మండిపడ్డారు.  బుధవారం ఆయన నార్వే పార్లమెంటును ఉద్దేశించి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ప్రసంగించారు. యూరప్‌ భవితవ్యాన్ని నిర్ణయించే యుద్ధంలో తాము ఒంటరిగా పోరాడుతున్నామని వాపోయారు.

అయితే, తటస్థంగా ఉండేందుకు ఉక్రెయిన్‌ అంగీకరించడం ద్వారా తమ ప్రధాన డిమాండ్లలో ఒకదానికి ఒప్పుకుందని చర్చల్లో రష్యా బృందానికి నేతృత్వం వహించిన వ్లాదిమిర్‌ మెడిన్‌స్కీ అన్నారు. అణ్వస్త్రరహితంగా దేశంగా కొనసాగడం వంటి ప్రతిపాదనలన్నింటినీ చర్చల సందర్భంగా సమర్పించిందన్నారు. సెంట్రల్‌ ఉక్రెయిన్‌లో మరో రెండు సైనిక ఆయుధాగారాలను లాంగ్‌ రేంజ్‌ క్రూయిజ్‌ మిసైళ్లతో ధ్వంసం చేసినట్టు రష్యా రక్షణ శాఖ అధికార ప్రతినిధి ఇగోర్‌ కొనషెంకోవ్‌ చెప్పారు. ప్రకటించింది. మైకోలేవ్‌లోని ఉక్రెయిన్‌ ప్రత్యేక దళాల ప్రధాన కార్యాలయాన్ని డోనెట్స్‌క్‌ ప్రాంతంలోని ఆయుధ డిపోను ఇస్కండర్‌ మిసైళ్లతో ధ్వంసం చేశామన్నారు. ఉక్రెయిన్‌ నుంచి వలసలు 40 లక్షలు దాటినట్టు ఐరాస వెల్లడించింది.

మరో కల్నల్‌ మృతి
రష్యా మోటరైజ్డ్‌ రైఫిల్‌ బ్రిగేడ్‌ కల్నల్‌ డెనిస్‌ కురిలోను ఖర్కీవ్‌ వద్ద హతమార్చినట్టు ఉక్రెయిన్‌ సైన్యం ప్రకటించింది. దీంతో రష్యా కోల్పోయిన కల్నల్‌ ర్యాంక్‌ అధికారుల సంఖ్య 8కి పెరిగింది.

నేడు భారత్‌కు లావ్రోవ్‌
రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్‌ గురు, శుక్రవారాల్లో భారత్‌లో పర్యటించనున్నారు. రష్యా చమురు దిగుమతులకు రూపాయి–రూబుల్‌ పద్ధతిలో చెల్లింపులు చేయాలని ఆయన ప్రతిపాదించనున్నారు. ఇప్పటికే సరఫరా ఒప్పందాలు కుదిరిన మిలిటరీ హార్డ్‌వేర్, ఎస్‌–400 మిసైల్‌ వ్యవస్థ విడిభాగాలను సకాలంలో అందించాల్సిందిగా భారత్‌ కోరే అవకాశముంది. లావ్రోవ్‌ ప్రస్తుతం చైనాలో రెండు రోజుల పర్యటనలో ఉన్నారు. ఇంగ్లండ్‌ విదేశాంగ మంత్రి లిజ్‌ ట్రుస్‌ కూడా గురువారం భారత్‌ రానున్నారు. అమెరికా జాతీయ భద్రతా ఉప సలహాదారు దలీప్‌సింగ్, జర్మనీ విదేశాంగ, భద్రతా వ్యవస్థ సలహాదారు జెన్స్‌ ప్లాట్నర్‌ బుధవారమే భారత్‌ చేరుకున్నారు.

రష్యా చమురుకు గుడ్‌బై: పోలండ్‌
రష్యా నుంచి చమురు దిగుమతులకు ఈ ఏడాది చివరికల్లా పూర్తిగా మంగళం పాడతామని పోలండ్‌ ప్రధాని మాటెజ్‌ మొరావికి ప్రకటించారు. బొగ్గు దిగుమతులను మే కల్లా నిలిపేస్తామని చెప్పారు. ఇతర యూరప్‌ దేశాలు తమ బాటలో నడవాలని సూచించారు. అమెరికా, సౌదీ, ఖతర్, కజాకిస్థాన్, నార్వే తదితర దేశాల నుంచి చమురు, గ్యాస్‌ దిగుమతులను పెంచుకునేందుకు టెర్మినళ్లను విస్తరించేందుకు పోలండ్‌ చర్యలు చేపట్టింది.

జర్మనీ కూడా రష్యా దిగుమతులను వీలైనంతగా తగ్గించుకుంటామని చెప్పింది. గ్యాస్, చమురు, బొగ్గు తదితర రష్యా దిగుమతులకు రూబుల్స్‌లో చెల్లింపులు చేయాలన్న పుతిన్‌ డిమాండ్‌ను యూరప్‌ దేశాలు నిరాకరించడం తెలిసిందే. అయినా రష్యా మాత్రం రూబుల్స్‌ చెల్లింపు పథకానికి రూపకల్పన చేస్తోంది. దీని వివరాలను త్వరలో వెల్లడిస్తామని పుతిన్‌ అధికార ప్రతినిధి ద్మిత్రీ పెస్కోవ్‌ చెప్పారు.

యుద్ధ నష్టాలను పుతిన్‌కు చెప్పలేదు
ఉక్రెయిన్‌తో యుద్ధం వల్ల రష్యాకు జరుగుతున్న సైనిక, ఆర్థిక నష్టాలను కప్పిపుచ్చడం ద్వారా పుతిన్‌ను ఆయన సలహాదారులు తప్పుదోవ పట్టించారని అమెరికా నిఘా విభాగం అభిప్రాయపడింది. ‘‘బహుశా నిజం తెలిస్తే పుతిన్‌ ఎలా స్పందిస్తారోనని వాళ్లు భయపడి ఉంటారు. ఆయనకు ఇప్పుడిప్పుడే వాస్తవాలు తెలిసొస్తున్నాయి. దాంతో సీనియర్‌ సైనికాధికారులకు, పుతిన్‌కు మధ్య టెన్షన్‌ నెలకొంది’’ అని చెప్పుకొచ్చింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement