ఉక్రెయిన్ నుంచి తనవారితో కలిసి వలస వచ్చిన డేవిడ్‌తో మాట్లాడుతున్న సాక్షి ప్రతినిధి ఇస్మాయిల్
రష్యా దండయాత్ర ఉక్రెయిన్‌ను అన్ని విధాలా కుంగదీస్తోంది. 27 రోజులుగా వచ్చిపడుతున్న బాంబుల వర్షంలో దేశం శిథిలాల దిబ్బగా మారిపోయింది. మళ్లీ కోలుకోడానికి దశాబ్దాలు పట్టేలా కన్పిస్తోంది. రేపటి పౌరులుగా ఎదగాల్సిన బాలలు యుద్ధంలో సమిధలుగా మారుతున్నారు. లక్షలాది మంది ఉక్రెయిన్ చిన్నారుల భవిష్యత్తును యుద్ధం అంధకారమయం చేసేసింది...
హంగరీ నుంచి సాక్షి ప్రతినిధి ఇస్మాయిల్
యుద్ధం మొదలైనప్పటి నుంచి ఉక్రెయిన్ వీడిన వారి సంఖ్య ఇప్పటికే 40 లక్షలు దాటేసింది. వీరిలో సగం మంది 18 ఏళ్లు దాటని వాళ్లేనని గణాంకాలు చెప్తున్నాయి. వీరంతా తల్లులతో పాటు పోలండ్, హంగరీ, స్లొవేకియా, మాల్దోవా, రుమేనియా తదితర దేశాలకు చేరారు. ఏ కొందరో ఎన్జీవోల సాయంతో విదేశాల్లోని తమ బంధువుల ఇళ్లకు చేరుతుండగా మిగతా వారంతా శరణార్థి శిబిరాల్లోనే బిక్కుబిక్కుమంటూ తలదాచుకుంటున్నారు. ఎవరిని కదిలించినా కన్నీటి కథలే వినిపిస్తున్నారు.
ఎన్జీవోలు, ప్రభుత్వాల సాయంపై ఆధారపడి కాలం వెళ్లదీయాల్సిన దుస్థితి! ఏదోలా యుద్ధం ఆగిపోతే తమ దేశానికి తిరిగి వెళ్తామని వీరంతా ఆశగా ఉన్నా అలాంటి పరిస్థితి కనిపించడం లేదు. కళ్లముందే యుద్ధం సృష్టించిన బీభత్సాన్ని తలచుకుని వీరంతా ఇప్పటికీ వణికిపోతున్నారు. మారియుపోల్‌లో తమ ఇంటి ముందే బాంబులు పడటంతో పిల్లలను ఎలాగైనా కాపాడుకోవాలని కుటుంబంతో సహా వలస వచ్చినట్టు హంగరీ రాజధాని బుడాపెస్ట్‌కు వచ్చిన డేవిడ్ ‘సాక్షి’కి చెప్పాడు. ‘‘కానీ మా ఇద్దరు పసికందుల భవిష్యత్తు ఎలా ఉంటుందన్న ఆందోళన ఇప్పుడు మమ్మల్ని వెంటాడుతోంది. మెకానిక్‌గా పనిచేసిన నాకు హంగరీలో ఏ పని చేయాలో తెలియడం లేదు. భవిష్యత్తు అంధకారంగా ఉంది’’ అంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు.
పోలండ్ ఆపన్నహస్తం
రష్యా, బెలారస్ తరువాత ఉక్రెయిన్‌తో ఎక్కువ సరిహద్దు పంచుకునేది పోలండ్. యుద్దం మొదలవుతూనే పోలండ్‌కు భారీగా వలసలు మొదలయ్యాయి. సరిహద్దు నగరం ల్యుబ్లిన్‌తో పాటు రాజధాని వార్సాకు శరణార్థుల తాకిడి భాగా పెరిగింది. ఇప్పటికే 21 లక్షలకు పైగా పోలండ్ చేరుకున్నారు. ఆ దేశం వారిని సాదరంగా అక్కున చేర్చుకుంటోంది. శరణార్థులకు పోలిష్ నేషనల్ ఐడెంటిటీ నంబర్ (పెసెల్) అనే రిజిస్ట్రేషన్ నంబర్ ఇచ్చి ఆర్నెల్ల పాటు తమ దేశంలో ఉండేందుకు అవకాశం కల్పిస్తోంది. ఈ సమయంలో వారు ఉద్యోగాలు చేసుకోవచ్చు. ఉచితంగా వైద్యం అందిస్తారు. పిల్లలకు నెలకు 110 యూరోలు ఇస్తుంది. లక్షన్నరకు పైగా దీనిద్వారా లబ్ధి పొందినట్టు పోలండ్ చెబుతోంది.హంగరీ, రుమేనియా, స్లోవేకియా కూడా శరణార్థుల పట్ల ఉదారంగా వ్యవహిస్తున్నాయి. అయితే శరణార్థులతో పోలండ్ పూర్తిగా నిండిపోతోంది. ఒక్క వార్సాకే 4 లక్షల మంది దాకా వచ్చినట్టు సమాచారం. నగర జనాభాలో ఇది ఐదో వంతు! వీరిని ఎక్కడుంచాలన్నది కూడా సమస్యగా మారింది. ముఖ్యంగా రాత్రిళ్లు మైనస్? డిగ్రీల చలిలో పిల్లలు, మహిళలు అల్లాడుతున్నారు. స్టేడియాలు, కమ్యూనిటీ హాళ్లతో పాటు చాలా ఎన్జీవోలు తమ ఇళ్లను ఉక్రేయినియన్ల కోసం తెరిచిపెట్టాయి. పౌరులు కూడా తోచింది తెచ్చి శిబిరాల్లో ఇస్తున్నారు. విద్యార్థులు, యువకులు సోషల్ మీడియాలో కమ్యూనిటీగా ఏర్పడి సాయం చేస్తున్నారు.
భేష్ హంగరీ
హంగరీకి కూడా 4 లక్షల దాకా శరణార్ధులు వచ్చారు. గతంలో శరణార్థులను అనుమతించని హంగరీ విధానం మార్చుకుని మరీ ఉక్రేనియన్లకు ఆశ్రయమిస్తోంది. రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు సన్నిహితుడిగా పేరున్న హంగరీ ప్రధాని విక్టర్ అర్బన్ ఈ నిర్ణయం తీసుకోవడం విశేషమే. రాజధాని బుడాపెస్ట్, జహోని, డెబ్రిసెన్ లాంటి నగరాల్లోనూ శరణార్థులు భారీగా ఉన్నారు. ప్రభుత్వం కంటే ఎన్జీవోలే వీరికి ఎక్కువగా సాయం చేస్తున్నాయి.
టాక్సీ డ్రైవర్ల ఔదార్యం
శరణార్థులను టాక్సీ డ్రైవర్లు సరిహద్దుల నుంచి పెద్ద నగరాలకు ఉచితంగా చేరేస్తూ పెద్ద మనసు చాటుకుంటున్నారు! ఎయిర్‌పోర్టులకు, శిబిరాలకు తీసుకెళ్తున్నారు. 8 గంటలు పని చేసుకున్నాక వారికోసం ఉచితంగా ఈ పని చేస్తున్నట్టు చెప్తున్నారు.
ఛిన్నాభిన్నమయ్యాం
యుద్ధం మొదలవగానే కీవ్ నుంచి పోలండ్ వచ్చా. మా నాన్న, అన్నయ్య అక్కడే ఉండిపోయారు. మా అమ్మను తీసుకువచ్చే ప్రయత్నం చేసినా సరిహద్దు దాకా రాలేకపోయింది. ఆమెను సరిహద్దుల్లో బంధువుల ఊళ్లో వదిలొచ్చా. మా కుటుంబం బాగా గుర్తుకు వస్తోంది. కనీసం వాళ్లతో మాట్లాడే పరిస్థితి కూడా లేదు. ఎక్కడున్నారో, అసలున్నారో లేదో తెలియదు. బాధ మర్చిపోయేందుకు వలంటీర్‌గా నాలాంటివారికి సాయం చేస్తున్నాను. ఈ యుద్ధం చాలా క్రూరమైంది. ఇది చేసిన గాయం ఇప్పట్లో మానదు.
– మేరీ, శరణార్థి, వార్సా
Comments
Please login to add a commentAdd a comment