(సాక్షి ప్రత్యేక ప్రతినిధి, హైదరాబాద్)
దేశం వ్యవసాయపరంగా అభివృద్ధి సాధిస్తోంది. గత ఆరేళ్లలో దేశం నుంచి ఆహార ధాన్యాల ఎగుమతులు బాగా పెరిగాయి. ఇంకా పెరుగుతూనే ఉన్నాయి. ఇలా వృద్ధి సాధించడం ఏ దేశానికికైనా శుభసూచకమే. ఈ ఎగుమతులతో రైతులు బాగుపడితే, వారి ఆర్థిక పరిస్థితి మెరుగైతే అది శుభం. కానీ దేశంలోని రైతాంగం పరిస్థితి ఏమాత్రం మారడం లేదు.
వేల కోట్ల రూపాయల ఎగుమతులు జరుగుతున్నా.. ఆ ప్రయోజనం అన్నదాతలకు అందడం లేదు. పైగా అప్పుల పాలవుతున్నారు. ఎందుకంటే చాలా వరకు ప్రైవేట్ సంస్థలే ఎగుమతులు చేస్తున్నాయి. ఆ లాభాన్ని వ్యాపారులే పొందుతున్నారు. ఇలా ఎగుమతులు పెరిగిన కొద్దీ ఆహార ధాన్యాల ధరలు మండుతున్నాయి. ఈ లాభమూ దళారులకే వెళ్తుంటే... వినియోగదారులపై భారం పడుతోంది.
మార్కెట్ మాయాజాలంతో..
ఐదారేళ్లుగా దేశమంతటా వర్షాలు విస్తారంగా కురవడంతో పంటల దిగుబడులు విపరీతంగా పెరిగాయి. ఇదే సమయంలో ఆహార ధాన్యాల ఎగుమతులు పెరుగుతూ వస్తున్నాయి. వరి, గోధుమ, పప్పు దినుసులు, నూనె గింజలు. కాఫీ. జనపనార (జ్యూట్), చెరుకు, తేయాకు, పొగాకు, వేరుశనగ, డెయిరీ పదార్థాలు, పళ్లు ఎగుమతి అవుతున్నాయి.
అయితే దేశంలో ఎగుమతులు, దిగుమతులకు సంబం«ధించి సరైన విధానం లేని కారణంగా రైతులకు నష్టం జరుగుతోంది. మార్కెట్‌లోకి ఆహార ధాన్యాలు రావడానికి ముందు దిగుమతులను పెంచడం, రైతుల నుంచి ఆహార ధాన్యాలు వ్యాపారుల చేతుల్లోకి వెళ్లాక దిగుమతులు నిలిపేసి, ఎగుమతులకు అవకాశం ఇవ్వడం వల్ల వ్యాపారులకే లబ్ధి జరుగుతోందన్న విమర్శలు ఉన్నాయి. మధ్యలో దళారీ వ్యవస్థ రెండు చేతులా సంపాదిస్తోంది.
గణనీయంగా ఎగుమతులు..
ప్రస్తుతం దేశం నుంచి బియ్యం ఎగుమతులు ఎక్కువగా ఉన్నాయి. 2021–22 సంవత్సరంలో జరిగిన ఆహార ఉత్పత్తుల ఎగుమతుల్లో బియ్యం వాటా 19 శాతం. తర్వాత చక్కెర (9 శాతం), స్పైసెస్ (8శాతం), మాంసం (7శాతం) ఉన్నట్టు భారత పరిశ్రమలు, వాణిజ్య శాఖ లెక్కలు చెప్తున్నాయి. ఇక గోధుమల ఎగుమతులు కూడా పెరుగుతున్నా యి. 2020–21లో వీటి ఎగుమతుల విలువ 568 మిలియన్ డాలర్లు కాగా.. 2021–22లో ఏకంగా 2.1 బిలియన్ డాలర్లకు పెరగడం గమనార్హం.
ఇదే సమయంలో తొలిసారిగా కాఫీ పొడి ఎగుమతులు బిలియన్ డాలర్లు దాటాయి. కర్ణాటక, తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో కాఫీ తోటల వారికి ఎక్కువ ప్రయోజనం కలుగుతుంది. చేపల ఎగుమతులు కూడా భారీగా పెరిగాయి. సముద్ర తీరం అధికంగా ఉన్న పశ్చిమబెంగాల్, ఏపీ, ఒడిశా, తమిళనాడు, కేరళ, మహారాష్ట్ర, గుజరాత్‌ల నుంచి ఏకంగా 7.7 బిలియన్ డాలర్ల మేర ఎగుమతులు జరుగుతున్నాయి.
ఆరుగాలం కష్టపడే రైతులు.. మనకు అన్నం పెడుతున్నారు.. ఆహార ధాన్యాల ఎగుమతులతో ఇతర దేశాలకూ తిండి పెడుతున్నారు.. లక్షల కోట్ల విలువైన ఉత్పత్తులతో దేశ ఆర్థికవ్యవస్థకు ఊతంగా నిలుస్తున్నారు.. కానీ వారు మాత్రం అప్పుల్లో కూరుకుపోతున్నారు. అవి తీర్చలేక, కుటుంబాన్ని పోషించలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు.
ఏయే దేశాలకు ఎగుమతులు?
భారత్ నుంచి ఆహార ధాన్యాలు ఎక్కువగా తీసుకుంటున్న దేశాల్లో అమెరికా, బంగ్లాదేశ్, చైనా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, వియత్నాం, ఇండోనేసియా, సౌదీ అరేబియా, ఇరాన్, నేపాల్, మలేసియా దేశాలు ప్రధానంగా ఉన్నాయి. వీటితోపాటు కొరియా, జపాన్, ఇటలీ, యునైటెడ్ కింగ్‌డమ్ తదితర దేశాలూ మన నుంచి దిగుమతి చేసుకుంటున్నాయి. మొత్తంగా చూస్తే మన దేశం నుంచి అత్యధికంగా ఆహార ధాన్యాలు దిగుమతి చేసుకుంటున్న దేశం అమెరికా. మన ఆహార ఉత్పత్తుల ఎగుమతుల్లో ఏకంగా 11.5 శాతం ఒక్క అమెరికాకే వెళ్తున్నాయి. వాటి విలువ 5.7 బిలియన్ డాలర్లు.
విదేశాల్లోని భారత ఎంబసీల్లో అగ్రిసెల్స్‌తో..
భారత వ్యవసాయ, దాని అనుబంధ రంగాల ఉత్పత్తుల ఎగుమతులను పెంచడానికి వీలుగా.. కేంద్రం వియత్నాం, అమెరికా, బంగ్లాదేశ్, నేపాల్, యూఏఈ, ఇరాన్, సౌదీ అరేబియా, మలేషియా, ఇండోనేసియా, సింగపూర్, చైనా, అర్జెంటీనాల్లోని భారత ఎంబసీల్లో అగ్రిసెల్స్‌ను ఏర్పాటు చేసింది. వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులకు కృషి చేయడంతోపాటు వ్యాపార, పర్యాటక, సాంకేతిక, పెట్టుబడుల ప్రోత్సాహానికి ఈ విభాగాలు పనిచేస్తున్నాయి.
రైతుల పరిస్థితి మారడం లేదు
రైతులు బంగారం తాకట్టు పెట్టి, అప్పులు చేసి వ్యవసాయ వృద్ధికి దోహదం చేస్తున్నారు. 2021–22లో బ్యాంకులు రూ.16 లక్షల కోట్లు రుణాలు ఇస్తాయని ఆర్థిక మంత్రి చెప్పారు. కానీ రూ.8 లక్షల కోట్లు మాత్రమే ఇచ్చారు. సేవలు, పారిశ్రామిక రంగాల్లో వేల పరిశ్రమలు మూతపడినా.. వ్యవసాయ రంగం దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నుదన్నుగా నిలిచింది.
దేశంలో 2022–23కు సంబంధించి వానాకాలంలో 11 కోట్ల ఎకరాల్లో వరి వేయాల్సి ఉంటే.. 10 కోట్ల ఎకరాల్లోనే వేశా రు. ఆశించిన దిగుబడి రావట్లేదు అదే జరిగితే ఇబ్బందే. దేశవ్యాప్తంగా 2021–22లో 12,600 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నా.. ప్రభుత్వాలు మాత్రం పట్టించుకోవడం లేదు.
– సారంపల్లి మల్లారెడ్డి, అఖిల భారత కిసాన్ సభ జాతీయ నాయకుడు
ఎగుమతులున్నా.. గిట్టుబాటు ధర ఏది?
దేశం నుంచి ఆహార ఉత్పత్తుల ఎగుమతులు పెరుగుతున్నాయి. కానీ రైతులకు గిట్టుబాటు ధర లభించడం లేదు. రైతులు ధాన్యం అమ్మేశాక ఎగుమతుల నిర్ణయాలు తీసుకుంటున్నారు. తద్వారా రైతులకు ఎలాంటి ప్రయోజనం ఉండదు. ఎగుమతుల విధానం సరిగా లేదు. భారీ వర్షాల కారణంగా ఈసారి పంటల దిగుబడి తగ్గుతుంది. పత్తికి సంబంధించి కాటన్ అడ్వయిజరీ బోర్డు సమావేశంలో పత్తి ఉత్పత్తి, నిల్వ, ఎగుమతులను సమీక్షించేవారు. ఇప్పుడా అడ్వయిజరీ బోర్డు లేక సమస్య తలెత్తింది. పత్తిధర తగ్గిపోయింది.
– దొంతి నర్సింహారెడ్డి, జాతీయ వ్యవసాయరంగ నిపుణుడు
Comments
Please login to add a commentAdd a comment