పచ్చని పండుగ  | Food Grains Production on record level at 2019-20 in AP | Sakshi
Sakshi News home page

పచ్చని పండుగ 

Published Thu, Apr 30 2020 3:15 AM | Last Updated on Thu, Apr 30 2020 9:58 AM

Food Grains Production on record level at 2019-20 in AP - Sakshi

కృష్ణాజిల్లా నున్నలో వరి కోస్తున్న దృశ్యం

‘రైతుకు ఎంత చేసినా తక్కువే. వారు బాగుంటేనే మనందరం బాగుంటాము. అందుకే విత్తనం మొదలు.. పంట కొనుగోలు దాకా ప్రతి అడుగులోనూ వారికి అండగా నిలబడాలన్నదే నా లక్ష్యం’ అని చెప్పే సీఎం జగన్‌.. తొలి నుంచీ ఆ దిశగానే అడుగులు వేస్తున్నారు. వెరసి వ్యవసాయం మళ్లీ పండుగలా మారింది. అన్నదాతల లోగిళ్లు కళకళలాడుతున్నాయి. 

మొన్నటి దాకా కనుచూపు మేర పచ్చటి పంటలు.. ఇప్పుడు పంట కోతలు.. నూర్పిళ్లు.. ధాన్యం రాసులు.. మార్కెట్‌కు తరలింపు దృశ్యాలు..కష్టానికి ఫలితం దక్కిందన్న ఆనందం ప్రతి రైతు మొహంలోనూ ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. 

సాక్షి,అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ రంగానికి పెద్ద పీట వేయడం వల్ల 2019–20లో రికార్డు స్థాయిలో ఆహార ధ్యాన్యాల ఉత్పత్తి సాధ్యమైంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి వ్యవసాయ రంగానికి, రైతులకు పెద్ద పీట వేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఆయన తనయుడు, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మరో రెండు అడుగులు ముందుకు వేసి వ్యవసాయ, అనుబంధ రంగాలతో పాటు మార్కెటింగ్, రైతుల పంటలకు కనీస మద్ధతు ధర కల్పించేందుకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. 2019–20 ఆర్థిక ఏడాదిలో రాష్ట్రంలో సాగు విస్తీర్ణం, పంటల వారీగా ఉత్పత్తి గమనిస్తే ఈ విషయం ఇట్టే అర్థమవుతుంది. ఒక్కమాటలో చెప్పాలంటే నాడు రాజన్న రాజ్యంలో పండుగలా మారిన వ్యవసాయం.. నేడు వైఎస్‌ జగన్‌ ప్రభుత్వంలోనూ రైతులకు పండుగైంది.  

ఆహార ధాన్యాలు  
► రాష్ట్ర ప్రభుత్వం 2019–20 ఆర్థిక సంవత్సరంలో వ్యవసాయ రంగంలో పలు చర్యలు తీసుకుంది. రైతులకు వైఎస్సార్‌ రైతు భరోసా ద్వారా పెట్టుబడి సాయం అందించడం, సకాలంలో విత్తనాలు, ఎరువులు సరఫరా చేయడంతో రైతుల పంట పండింది.  
► రికార్డు స్థాయిలో ఆహార ధాన్యాల ఉత్పత్తి నమోదైంది. గత ఐదేళ్లలో ఎన్నడూ లేని విధంగా 2019–20 
ఆర్థిక ఏడాదిలో ఆహార ధాన్యాల ఉత్పత్తి 172 లక్షల మెట్రిక్‌ టన్నులుగా ఉంటుందని అధికారులు అంచనా వేశారు. 
► గత ఐదేళ్లలో ఆహార ధాన్యాల ఉత్పత్తిలో ఇదే రికార్డు కావడం విశేషం. 2018–19లో 150 లక్షల మెట్రిక్‌ టన్నుల ఆహార ధాన్యాలు ఉత్పత్తి అయ్యాయి.  

ధాన్యం
► ప్రధానమైన వరి పంట సాగు విస్తీర్ణంతో పాటు ఉత్పత్తిలోనూ 2019–20లో రికార్డు స్థాయికి చేరనుంది. 2019–20 ఆర్థిక ఏడాదిలో వరి సాగు విస్తీర్ణం 23.29 లక్షల హెక్టార్లకు చేరింది.   
► ధాన్యం ఉత్పత్తి కూడా రికార్డు స్థాయికి చేరింది. 2019–20 ఆర్థిక ఏడాదిలో ధాన్యం ఉత్పత్తి 137 లక్షల మెట్రిక్‌ టన్నులుగా అంచనా వేశారు.   
► ధాన్యం దిగుబడి 2019–20లో హెక్టార్‌కు 5,886 కేజీలు నమోదైంది.   

కందులు 
► కందుల సాగు విస్తీర్ణం, ఉత్పత్తి, దిగుబడి 2019–20లో రికార్డు స్థాయిలో ఉండనుంది. 2.38 లక్షల హెక్టార్లలో కంది సాగు అయింది. ఉత్పత్తి 2.01 లక్షల మెట్రిక్‌ టన్నులు రానుంది. ఇది 2018–19తో పోల్చి చూస్తే 136 శాతం ఎక్కువ. 2018–19లో కందుల ఉత్పత్తి కేవలం 0.46 లక్షల మెట్రిక్‌ టన్నులు మాత్రమే.  
► హెక్టార్‌కు కందుల దిగుబడి 2019–20లో 820 కేజీలు. ఇదే 2018–19లో కేవలం 182 కేజీలే. 

మొక్క జొన్న 
► మొక్క జొన్న సాగు విస్తీర్ణంతో పాటు ఉత్పత్తిలో 2019–20లో రికార్డు నమోదైంది. 2.83 లక్షల హెక్టార్లలో సాగు అయింది.  
► 2019–20లో మొక్కజొన్న ఉత్పత్తి 19 లక్షల మెట్రిక్‌ టన్నులు. హెక్టార్‌కు 6,633 కేజీలు దిగుబడి వచ్చింది. 

మినుములు 
► 2019–20లో మినుములు 2.95 లక్షల హెక్టార్లలో సాగు అయ్యాయి. ఉత్పత్తి 2.72 లక్షల మెట్రిక్‌ టన్నులుగా, హెక్టార్‌కు దిగుబడి 928 కేజీలుగా అంచనా వేశారు. 

పెసలు
► 2019–20లో పెసలు 1.01 లక్షల హెక్టార్లలో సాగు కాగా, ఉత్పత్తి 0.85 లక్షల మెట్రిక్‌ టన్నులుగా అంచనా వేశారు. హెక్టార్‌కు దిగుబడి 820 కేజీలుగా అంచనా వేశారు.   
 
శనగలు 
► 2019–20లో శనగ 4.54 లక్షల హెక్టార్లలో సాగైంది. 4.84 లక్షల మెట్రిక్‌ టన్నుల ఉత్పత్తి రానుంది. ఇది 2018–19తో పోల్చి చూస్తే 99 శాతం ఎక్కువ. 2018–19లో శనగల ఉత్పత్తి 2.43 లక్షల మెట్రిక్‌ టన్నులే. హెక్టార్‌కు దిగుబడి 2019–20లో 1,073 కేజీలుంటే 2018–19లో కేవలం 508 కేజీలే ఉంది.

వేరుశనగ 
► 2019–20లో వేరుశనగ 6.61 లక్షల హెక్టార్లలో సాగు కాగా, ఉత్పత్తి 8 లక్షల మెట్రిక్‌ టన్నులుగా అంచనా వేశారు. హెక్టార్‌కు దిగుబడి 1,269 కేజీలుగా అంచనా వేశారు. 2018–19లో వేరుశనగ హెక్టార్‌కు దిగుబడి కేవలం 618 కేజీలు వచ్చింది.  
 
పత్తి 
► 2019–20లో పత్తి సాగు విస్తీర్ణం, దిగుబడి బాగా పెరిగింది. 6.54 లక్షల హెక్టార్లలో సాగైంది. ఉత్పత్తి 24 లక్షల బేళ్లు. 2018–19తో పోల్చితే పత్తి ఉత్పత్తి 60 శాతం మేర పెరిగింది.  
► హెక్టార్‌కు పత్తి దిగుబడి కూడా బాగా పెరిగింది. 2019–20లో హెక్టార్‌కు 622 కేజీల దిగుబడి రాగా, 2018–19లో కేవలం 409 కేజీలే. అంటే 52 శాతం మేర ఎక్కువ దిగుబడి వచ్చింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement