ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమక్షంలో ఒప్పందం చేసుకున్న పత్రాలతో ఎంఎస్ స్వామినాథన్ రీసెర్చ్ ఫౌండేషన్ ప్రతినిధి, వ్యవసాయ విభాగ అధికారి. చిత్రంలో మంత్రులు కొడాలి నాని, కన్నబాబు, మోపిదేవి వెంకటరమణ
సాక్షి, అమరావతి : వ్యవసాయం, అనుబంధ రంగాల్లో ఉత్తమ పద్ధతులు పాటించినప్పుడే రైతులకు పెట్టుబడి వ్యయం తగ్గి, అధిక ఆదాయం వస్తుందని సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి స్పష్టం చేశారు. ఈ లక్ష్య సాధన కోసం వ్యవసాయం, అనుబంధ రంగాల అధికారులు, ప్రఖ్యాత శాస్త్ర, సాంకేతిక పరిశోధన సంస్థల నిపుణులందరూ కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పుల దిశగా కీలక చర్యలు చేపట్టామని, ఇందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలన్నారు. రాష్ట్రంలో వైఎస్సార్ రైతు భరోసా కేంద్రాల ఏర్పాటు నేపథ్యంలో విజ్ఞాన మార్పిడి, శిక్షణ కోసం దేశంలోని 11 జాతీయ సంస్థలతో సోమవారం తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమక్షంలో అవగాహన ఒప్పందాలు కుదిరాయి. ఈ సంస్థలతో భాగస్వామ్యాన్ని హర్షిస్తూ రాష్ట్రంలో వ్యవసాయాభివృద్ధికి ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను, అమలు చేస్తున్న ముఖ్య పథకాలను ముఖ్యమంత్రి వివరించారు. పరిపాలనను గ్రామ స్థాయికి తీసుకువెళుతున్నామని చెప్పారు. గ్రామ సచివాలయాలకు అనుబంధంగా 11,158 రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని, జూన్ నాటికి అందుబాటులోకి వస్తాయన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ఇంకా ఏమన్నారంటే..
స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్
‘రైతు భరోసా కేంద్రాల్లో అగ్రికల్చర్ అసిస్టెంట్లు, హార్టికల్చర్ అసిస్టెంట్లు, వెటర్నరీ, ఆక్వా అసిస్టెంట్లు ఉంటారు. ఈ కేంద్రాల్లో నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు అందుబాటులో ఉంచుతాం. వీటికి ప్రభుత్వం గ్యారెంటీ ఇస్తుంది. సేంద్రీయ వ్యవసాయం, నేచురల్ ఫార్మింగ్‌లో రైతులకు శిక్షణ ఇచ్చి, ఉత్తమ యాజమాన్య విధానాలను అందుబాటులోకి తీసుకొస్తాం. పంట వేసే ముందే కనీస మద్దతు ధర ప్రకటిస్తాం. దీనివల్ల మార్కెట్లో పోటీ పెరుగుతుంది. రైతుకు మంచి ధర లభించే అవకాశాలు ఉంటాయి. అయినా సరైన ధర రాకపోతే రైతు భరోసా కేంద్రాల ద్వారా కనీస మద్దతు ధరలతో రైతులను ఆదుకుంటాం. ఆకాశమే హద్దుగా రైతు భరోసా కేంద్రాలు పని చేస్తాయి. ఈ నేపథ్యంలో ప్రకృతి, సేంద్రియ సాగు, వ్యవసాయ మార్కెటింగ్‌లలో మెళకువల కోసం దేశంలోని ప్రఖ్యాత సంస్థల భాగస్వామ్యాన్ని తీసుకోవాలని భావించాం. రైతు భరోసా కేంద్రాలకు వివిధ అంశాల్లో స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్ ఉండేలా చూస్తున్నాం. రాష్ట్రంలో 50 శాతం మంది రైతులు 1.25 ఎకరాల కన్నా తక్కువ విస్తీర్ణం ఉన్నవారే. 70 శాతం మంది రైతులు హెక్టారు కన్నా తక్కువ విస్తీర్ణం ఉన్నవారే.
గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో విప్లవానికి జాతీయ సంస్థల సహకారం
రైతు భరోసా ద్వారా ప్రతి రైతు కుటుంబానికీ ఏటా రూ.13,500 ఇస్తున్నాం. ఈ రూపంలో దాదాపుగా 80 శాతం పెట్టుబడి ఖర్చు ఇస్తున్నాం. మధ్యవర్తుల ప్రమేయం లేకుండా నేరుగా నగదు బదిలీ చేస్తున్నాం. ఈ డబ్బును బ్యాంకులు మినహాయించకుండా చర్యలు తీసుకుంటున్నాం. రైతులు కట్టాల్సిన పంటల బీమాను ప్రభుత్వమే చెల్లిస్తుంది. 60 శాతం ఫీడర్లలో 9 గంటల పాటు రైతులకు ఉచిత విద్యుత్ అందిస్తున్నాం. వచ్చే జూలై నాటికి మిగిలిన ఫీడర్లలో కూడా అందించడానికి చర్యలు చేపట్టాం. పశువులకు మంచి వైద్య సేవలు అందాలి. మత్స్య రంగాన్నీ పటిష్టం చేసి రైతులు నష్టపోకుండా చూడాలి. మంచి విత్తనం, ఫీడ్ అందేలా ఏర్పాటు చేస్తున్నాం. గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో విప్లవానికి ఇవన్నీ దోహదపడతాయి. ఇందుకు జాతీయ సంస్థల సహకారం మాకు ఎంతో కీలకం’ అని సీఎం వైఎస్ జగన్ వివరించారు.
ఇవన్నీ సీఎం మానస పుత్రికలే
వ్యవసాయ రంగంలో ప్రవేశపెట్టిన కార్యక్రమాలన్నీ ముఖ్యమంత్రి మానస పుత్రికలే. రైతు భరోసా కేంద్రాలు చాలా వినూత్నమైనవి. 24 గంటల్లో రైతులు ఆర్డర్ చేసిన విత్తనాలు సహా అన్ని రకాల ఉత్పాదకాలను ఈ కేంద్రాల ద్వారా అందిస్తాం.
– కన్నబాబు, వ్యవసాయ శాఖ మంత్రి
మత్స్య ఉత్పత్తుల్లో అగ్రస్థానం
మత్స్య ఉత్పత్తుల్లో దేశంలోనే అగ్రస్థానంలో ఉన్నాం. మరింత అభివృద్ధి చేయాలని ప్రయత్నిస్తున్నాం. క్వాలిటీ విత్తనం, నాణ్యమైన ఫీడ్ అందించాలన్నది లక్ష్యం. అవసరమైన ప్రతిచోటా ప్రయోగ శాలలను ఏర్పాటు చేస్తున్నాం.
– మోపిదేవి వెంకటరమణ, పశు సంవర్థక, మత్స్య శాఖ మంత్రి
కొత్తగా 19 వేల మంది సిబ్బంది
వ్యవసాయాన్ని పండుగగా మార్చడానికి ఆలోచనే కాదు.. ఆచరణలో తీసుకురావడానికి ముఖ్యమంత్రి జగన్ విశేషంగా కృషి చేస్తున్నారు. కొత్తగా 19 వేల మంది సిబ్బందిని ఇచ్చారు. దేశంలోని ఏ రాష్ట్రంతో పోల్చినా ఏపీలో వ్యవసాయ సిబ్బంది ఎక్కువ.
– పూనం మాలకొండయ్య, స్పెషల్ చీఫ్ సెక్రటరీ
డైనమిక్ సీఎం..
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి సమక్షంలో ఒప్పందాలు కుదరడం పట్ల ఆయా సంస్థల ప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి ఆశయానికి అనుగుణంగా శక్తి వంచన లేకుండా కృషి చేస్తామని వారు హామీ ఇచ్చారు. సీఎం చాలా డైనమిక్‌గా ఉన్నారని ప్రశంసించారు. ఇతర రాష్ట్రాలకు ఆదర్శప్రాయంగా ఉంటారన్నారు. ఈ కార్యక్రమంలో ఆయా సంస్థల ప్రతినిధులు, మంత్రి కొడాలి నాని, వ్యవసాయ శాఖ ప్రత్యేక కమిషనర్ హెచ్.అరుణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
అవగాహన ఒప్పందం కుదుర్చుకున్న సంస్థల ప్రత్యేకత, హాజరైన వారి వివరాలు
ఎం.ఎస్.స్వామినాథన్ రీసెర్చ్ ఫౌండేషన్, చెన్నై
వ్యవసాయం, పర్యావరణం, పౌష్టికాహారం సహా వివిధ రంగాలలో పని చేస్తున్న ప్రముఖ స్వచ్ఛంద సంస్థ. తమిళనాడు రాజధాని చెన్నై కేంద్రంగా పని చేస్తోంది. పంటలపై తీవ్ర ప్రభావం చూపుతున్న వాతావరణ మార్పులపై ఏపీ ప్రభుత్వంతో కలిసి పని చేస్తుంది.
ఈ సమస్యను అధిగమించేందుకు సూచనలు, సలహాలు ఇస్తుంది. ఈ సంస్థ తరఫున ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ జి.ఎన్.హరిహరన్ హాజరయ్యారు.
సెంట్రల్ ఫెర్టిలైజర్ క్వాలిటీ కంట్రోల్ అండ్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్ ఫరీదాబాద్
ఈ సంస్థ ప్రధాన ఉద్దేశం నాణ్యమైన ఎరువులు అందుబాటులో ఉండేలా చేయడం. ఎరువుల నాణ్యతను నిర్ధారించి రైతులకు సిఫార్సు చేస్తుంది. ఈ సంస్థ తరఫున డైరెక్టర్ డాక్టర్ శ్యాంబాబు ప్రాతినిధ్యం వహించారు.
జాతీయ విత్తన పరిశోధన, శిక్షణ సంస్థ వారణాసి
రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి ఏడాదికి 20 వేల శాంపిళ్లను పరీక్షిస్తుంది. విత్తనాల నాణ్యతను నిర్ధారిస్తుంది. విత్తన రంగంలో రైతు భరోసా కేంద్రాలకు అండగా నిలుస్తుంది. ఈ సంస్ధ తరఫున డైరెక్టర్ అరవింద్ ఎన్.సింగ్ హాజరయ్యారు.
నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ప్లాంట్ హెల్త్ మేనేజ్‌మెంట్ హైదరాబాద్
పంటల తెగుళ్ల నివారణలో సమర్థవంతమైన సంస్థ. మొక్కల సంరక్షణకు తీసుకోవాల్సిన చర్యలపై రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పని చేస్తుంది. రైతులకు శిక్షణ ఇస్తుంది. మానవ వనరుల అభివృద్ధి కోసం శిక్షణా కోర్సులను నిర్వహిస్తుంది. ఈ సంస్థ తరుపున డైరెక్టర్ జనరల్ జి.జయలక్ష్మీహాజరయ్యారు.
ఐసీఏఆర్, వ్యవసాయ విస్తరణ విభాగం, న్యూఢిల్లీ
వ్యవసాయ విద్య, పరిశోధనలలో ప్రపంచంలోనే అతిపెద్ద నెట్‌వర్క్ కలిగి ఉన్న సంస్థ. విత్తనాల ఉత్పత్తి, భూసారం, నీటి నాణ్యత పరీక్ష, ఉత్తమ యాజమాన్య పద్ధతుల్లో రైతులకు శిక్షణ ఇస్తుంది. ఈ సంస్థ తరఫున వ్యవసాయ విస్తరణ విభాగం అసిస్టెంట్ డైరెక్టర్ రణధీర్ సింగ్ పోస్వాల్ హాజరయ్యారు.
భారతీయ వ్యవసాయ పరిశోధన సంస్థ న్యూఢిల్లీ
అధిక దిగుబడులను ఇచ్చే వంగడాలను తయారు చేస్తుంది. తెగుళ్లను గుర్తించే పరికరాలను రూపొందిస్తుంది. భూసార పరీక్షలు చేసి ఎరువుల వినియోగంలో సిఫార్సులు చేస్తుంది. ఈ సంస్థ తరఫున సాయిల్ సైన్స్ విభాగం అధిపతి డాక్టర్ బీఎస్ ద్వివేదీ హాజరయ్యారు.
సెంట్రల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డ్రైల్యాండ్ అగ్రికల్చర్ హైదరాబాద్
వర్షాధార వ్యవసాయంలో పరిశోధనలు దీని లక్ష్యం. అనూహ్య వాతావరణ మార్పుల వల్ల వస్తున్న విపరిణామాలను అధిగమించడానికి ఎలాంటి చర్యలు చేపట్టాలనే దానిపై ఏపీ ప్రభుత్వంతో కలిసి పని చేస్తుంది. పరిశోధన, సాంకేతిక సహకారం అందిస్తుంది. ఈ సంస్థ తరఫున డైరెక్టర్ డాక్టర్ రవీంద్ర చారీ పాల్గొన్నారు.
సదరన్ రీజియన్ యానిమల్ డిసీజ్ డయాగ్నోస్టిక్ ల్యాబ్ బెంగళూరు
ఏపీ సహా దక్షిణాది రాష్ట్రాలలో సేవలు అందిస్తుంది. పశువుల వ్యాధులను అరికట్టడంలో రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి కృషి చేస్తుంది. ఈ సంస్థ తరఫున జాయింట్ డైరెక్టర్ డాక్టర్ శోభారాణి హాజరయ్యారు.
జాతీయ పాడి పరిశోధన సంస్థ కర్నాల్
దేశంలోనే అతి ముఖ్యమైన పాల పరిశోధన సంస్థ. ఏపీ రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పాలలో విష పూరిత, రసాయన పదార్థాలను కనిపెట్టడానికి మంచి విధానాలను అందుబాటులోకి తీసుకు వచ్చేందుకు కృషి చేస్తుంది. స్వచ్ఛమైన పాలను అందించే దిశగా ప్రయత్నాలు చేస్తుంది. ఈ సంస్థ తరఫున జాయింట్ డైరెక్టర్ డాక్టర్ త్యాగి హాజరయ్యారు.
ఇండియన్ వెటర్నరీ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ పూణే
రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పశువులకు వచ్చే వ్యాధులను గుర్తించడానికి ఉత్తమ వైద్య విధానాలను ప్రవేశపెడుతుంది. వీటిపై ప్రత్యేక శిక్షణ ఇస్తుంది. పశువులకు టీకాల విషయంలోనూ సహకరిస్తుంది. ఈ సంస్థ తరఫున జాయింట్ డైరెక్టర్ డాక్టర్ మహేష్ చందర్ హాజరయ్యారు.
సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫ్రెష్‌వాటర్ ఆక్వాకల్చర్ భువనేశ్వర్
మంచినీటితో చేపల పెంపకంలో ఈ సంస్థ దిట్ట. మంచినీటి ఆక్వాకల్చర్‌లో ఇదో ఆధునిక పరిశోధనా సంస్థ. ఆక్వా రంగంలో శిక్షణ ఇస్తుంది. శాస్త్రవేత్తలు, సాంకేతిక నిపుణులు క్షేత్ర స్థాయిలో ఉండేలా పర్యవేక్షిస్తుంది. గంటల్లోనే పరీక్షా ఫలితాలు తేల్చుతుంది. ఈ సంస్థ తరఫున ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ బి.శేషగిరి హాజరయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment