తెలుగు రాష్ట్రాల నుంచి అక్కడికి రైళ్లు.. ఎందుకంటే! | Trains Move from Punjab Haryana AP to Grain Deficit States | Sakshi
Sakshi News home page

లాక్‌డౌన్‌: కొరత రాకుండా కేంద్రం అన్ని ఏర్పాట్లు

Published Thu, Apr 2 2020 3:06 PM | Last Updated on Thu, Apr 2 2020 4:33 PM

Trains Move from Punjab Haryana AP to Grain Deficit States - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: కరోనా వైరస్‌ వ్యాప్తి చెందకుండా దేశంలో 21 రోజుల లాక్‌డౌన్‌ ప్రకటించిన క్రమంలో పేదవారు ఆకలితో ఉండకూడదనే ఉద్దేశంతో కేంద్రప్రభుత్వం వారికి ఆహారధాన్యాలు అందించనున్నట్లు ప్రకటించింది. ఈ క్రమంలో ఆహారధాన్యాల కొరత ఉన్న బీహార్‌, ఉత్తరప్రదేశ్‌, పశ్చిమ బెంగాల్‌ వంటి రాష్ట్రాలకు ఫుడ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా(ఎఫ్‌సీఐ) ప్రజా పంపిణీ ద్వారా రెండు రెట్లు అధిక ధాన్యాన్ని సరఫరా చేస్తోంది. గత రెండు రోజుల్లోనే 85 రైళ్ల ద్వారా అవసరమైన ధాన్యాన్ని ఆయా రాష్ట్రాలకు అందించింది.

ఆహారధాన్యాలు అధికంగా లభిస్తున్న పంజాబ్‌, హర్యానా, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల నుంచి కొరత ఉన్న రాష్ట్రాలకు తరలిస్తున్నారు. పంజాబ్‌ రాష్ట్రం నుంచి అధికంగా 60 శాతం వరకు తరలించినట్లు అధికారులు తెలిపారు. లాక్‌డౌన్‌ విధించిన క్రమంలో ప్రస్తుతం ఇచ్చే 5 కేజీల ఆహారధాన్యాలకు అదనంగా మరో 5 కేజీలను ఉచితంగా అందిస్తానని మార్చి 24న కేం‍ద్ర ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే మిలియన్‌టన్నులు ఆహారధాన్యాలను కొరత ఉన్న ఆయా రాష్ట్రాలకు ఎఫ్‌సీఐ సరఫరా చేస్తోంది. 

ఏప్రిల్‌లో అందించేందుకు కావల్సిన ధాన్యాలను ఇప్పటికే ఎఫ్‌సీఐ సరఫరా చేసింది. ఏప్రిల్‌ నెలలో 5 మిలియన్‌ టన్నుల ధాన్యాన్ని తరలించనున్నామని ఎఫ్‌సీఐ చైర్మన్‌ డీవీ ప్రసాద్‌ తెలిపారు.  ప్రభుత్వం అదనంగా ఇస్తానన్న ధాన్యంతో కలిసి అన్ని రాష్ట్రాలకు సరిపడ ఆహారధాన్యాలు ఎఫ్‌సీఐ దగ్గర ఉన్నాయని ఆయన తెలిపారు. సాధారణంగా నెలకు 5 కేజీల చొప్పున సరఫరా చేయడానికి అన్ని రాష్ట్రాల వద్ద 4నుంచి 6 నెలలకు సరిపడా రేషన్‌ ఉందని అయితే లాక్‌డౌన్‌ కారణంగా అదనంగా  అందిస్తామని కేంద్ర ప్రభుత్వం పేర్కొనడంతో ఈ పరిస్థితులు ఏర్పడ్డాయని తెలిపారు. 

దీంతో పాటు పంజాబ్‌, ఒడిశా, మధ్యప్రదేశ్‌ వంటి రాష్ట్రాలు మూడు నెలల రేషన్‌ను ఒకేసారి అందించనున్నట్లు ప్రకటించాయి. అదేవిధంగా వినియోగదారులు ఎక్కువగా ఉన్న ఉత్తరప్రదేశ్‌, బీహార్‌, పశ్చిమ బెంగాల్‌, మహారాష్ట్ర ప్రభుత్వాలు కూడా అదనంగా 5 కేజీల ధాన్యాలు ఇవ్వడానికి అంగీకరించాయి. దీనితో ఆహారధాన్యాలను ఎక్కువగా సరఫరా చేయాల్సి వచ్చిందని తెలిపారు. దీనితో పాటు ఏప్రిల్‌ మధ్యలో నుంచి ఆహారధాన్యాల సేకరణ మొదలుపెట్టనున్నట్లు ఆయన తెలిపారు. దీంతో పేదలకు ఆహారధాన్యాలు సమకూర్చడానికి అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలుస్తోంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement