
కంపెనీల గుప్పిట్లో ‘ఆహారం’!
పంటను పండించిన రైతులు ఆహార ధాన్యాలతో వ్యాపారం చేయటం లేదు, ప్రభుత్వాలూ చేయడం లేదు. ఈ పని చేస్తున్నది కేవలం 4 బహుళజాతి కంపెనీలే. అవి: ఆర్చెర్ దానియల్స్, బంగె, కార్గిల్, లూయిస్ డ్రైఫస్. 89 శాతం వాటాతో ఇవి ప్రపంచ ఆహార ధాన్యాల వ్యాపారాన్ని శాసిస్తున్నాయి. అభివృద్ధి చెందుతున్న, వెనుకబడిన దేశాలన్నీ ఏకమై డబ్ల్యూటీవో నిబంధనల్లో సవరణ తేకపోతే ఆహార భద్రతకు ముప్పు తప్పదు.
ఆహార వాణిజ్యం అతికొద్ది కార్పొరేట్ కంపెనీల గుప్పెట్లో కేంద్రీకృతం కావడం అభివృద్ధి చెందుతున్న దేశాల ప్రయోజనాలకు గొడ్డలిపెట్టుగా మారింది. ప్రపంచ వాణిజ్య సంస్థ(డబ్ల్యూటీవో) నిబంధనల పుణ్యమా అని రాజ్యమేలుతున్న అసమ వాణిజ్య పరిస్థితులు ఇందుకు దోహదపడుతున్నాయి. డబ్ల్యూటీవో ముఖ్య ఆశయం స్వేచ్ఛా వాణిజ్యం ద్వారా అభివృద్ధిని అంతర్జాతీయం చేయటం. కానీ నిరాటంకంగా కొనసాగుతున్న ‘అసమ వాణిజ్యం’ ఫలితంగా డబ్ల్యూటీవో పేదరికాన్ని అంతర్జాతీయం చేస్తోంది.
అభివృద్ధి చెందిన, అభివృద్ధి చెందుతున్న దేశాల మధ్య తీవ్రమైన వాణిజ్య అసమానతలు పెచ్చుమీరాయి. ప్రపంచ వాణిజ్యంలో అభివృద్ధి చెందుతున్న దేశాల వాణిజ్య వాటా 31 శాతం అయితే, ఈ దేశాలు ప్రపంచ వాణిజ్య సుంకాలలో 40 శాతం చెల్లిస్తున్నాయి. అమెరికా, ఫ్రాన్స్ నుంచి వచ్చే కొన్ని వస్తువుల దిగుమతులపై కన్నా బంగ్లాదేశ్ నుంచి వచ్చే దిగుమతులపై 10 రెట్లు అధికంగా సుంకాలను విధిస్తోందంటే పేద దేశాలకు మార్కెట్ అందుబాటు ఏ మేరకు ఉందో అర్థమవుతుంది.
లోపభూయిష్టంగా సబ్సిడీలు లెక్కించే విధానం
కోట్లాది పేద ప్రజల ఆహార భద్రతకు కట్టుబడి ఉన్న భారత్ ప్రతి ఏటా ఆహార ధాన్యాల నిల్వల కోసం 16 బిలియన్ డాలర్లను వెచ్చిస్తోంది. ఆహార భద్రతా చట్టం నేపథ్యంలో రానున్న రోజుల్లో ఈ వ్యయం మరింత పెరగనుంది. అయితే, భారత్ తన రైతులకు చెల్లించే కనీస మద్దతు ధరల వల్ల, దేశంలోని ఆహార నిల్వల వల్ల ప్రపంచ వాణిజ్యంలో సమతౌల్యత దెబ్బతింటుందని అమెరికా వాదిస్తోంది.
వాస్తవానికి భారత్ తన 40 కోట్ల రైతులకు ఇచ్చే సబ్సిడీ 16 బిలియన్ డాలర్లుంటే, అమెరికా తన 30 లక్షల మంది రైతులకు 120 బిలియన్ డాలర్ల సబ్సిడీ ఇస్తోంది. మన వ్యవసాయ సబ్సిడీ లెక్కలను 1986-88 నాటి ధరల ఆధారంగా కాకుండా.. ద్రవ్యోల్బణాన్ని పరిగణనలోకి తీసుకోవాలని, గడచిన మూడేళ్ల సగటును లెక్కించి అసమానతలను తొలగించాలని భారత్ గట్టిగా వాదిస్తోంది. భారత్ వాదనను అంతర్జాతీయ వ్యవసాయాభివృద్ధి నిధి(ఐఎఫ్‌ఏడీ) ఈ మధ్యనే సమర్థిస్తూ.. అభివృద్ధి చెందిన దేశాలకు అనుగుణంగా వ్యవసాయ సబ్సిడీలు లెక్కించే ప్రస్తుత విధానాన్ని సమూలంగా మార్చాలని సూచించింది.
గమ్యం లేని భారత్ విధానాలు
ఇక మన దేశంలో వ్యవసాయ రంగానికిస్తున్న రూ. లక్షా ఇరవై వేల కోట్ల సబ్సిడీతో రసాయనిక ఎరువుల కంపెనీలే ఎక్కువ లాభపడుతున్నాయి. ఒక పక్కన అమెరికా, ఈయూ పరిమితులున్న ‘అంబర్ బాక్స్’ (రసాయనిక ఎరువులు, విద్యుత్ వంటి) సబ్సిడీలను తగ్గించుకొని, పరిమితులు లేని ‘గ్రీన్ బాక్స్’ (సేంద్రియ సాగు, పర్యావరణ పరిరక్షణకు సంబంధించిన) సబ్సిడీలను పెంచుకొంటూ పోతుంటే, మన ప్రభుత్వం ఇంకా గమ్యం లేని విధానాలతో మన రైతాంగాన్ని నట్టేట్లో ముంచుతోంది.
4 కంపెనీల చేతుల్లోనే 89% ఆహార వాణిజ్యం
అభివృద్ధి చెందిన దేశాలు తమ వ్యవసాయ రంగాలకు భారీ సబ్సిడీలు ఇస్తూ తమ వ్యవసాయ ఉత్పత్తులను అంతర్జాతీయ మార్కెట్లలో కారుచౌక ధరలకు కుమ్మరిస్తున్నాయి. అమెరికా గత కొంత కాలంగా 65 శాతం డంపింగ్ మార్జిన్ (ఉత్పత్తి వ్యయానికి - ఎగుమతి ధరకు మధ్య వ్యత్యాసం)తో పత్తిని అంతర్జాతీయ మార్కెట్లలో కుమ్మరిస్తోంది. దీని వల్ల పత్తి ధరలు పతనమై వర్ధమాన దేశాల్లో రైతులు తీవ్రమైన సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారు. ఈ పరిస్థితుల్లో ప్రపంచ ఆహారోత్పత్తుల వాణిజ్యంలో బహుళజాతి కంపెనీల ఆధిపత్యం నెలకొనటం మనముందున్న ప్రధానమైన సమస్య. పంటను పండించిన రైతులు ఆహార ధాన్యాలతో వ్యాపారం చేయటం లేదు, ప్రభుత్వాలు వ్యాపారం చేయటం లేదు, బహుళజాతి కంపెనీలు వ్యాపారం చేస్తున్నాయి. ప్రపంచ ఆహార ధాన్యాల వ్యాపారంలో నాలుగు బహుళజాతి కంపెనీలు ఆర్చెర్ దానియల్స్, బంగె, కార్గిల్, లూయిస్ డ్రైఫస్ (ఎ, బి, సి, డి కంపెనీలు) ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. ఈ నాలుగు కంపెనీలే ప్రపంచ ఆహార ధాన్యాల వ్యాపారంలో 89 శాతం వాటాను కలిగి ఉన్నాయి. ప్రపంచ ఆహార ధాన్యాల వ్యాపారాన్ని శాసిస్తున్న ఈ నాలుగు కంపెనీలు.. లాభాలే పరమావధిగా భారత్ వంటి అభివృద్ధి చెందుతున్న దేశాల ఆహార నిల్వలను, నిరుపేదల ఆహార భద్రతకు మోకాలడ్డుతున్నాయి.
ఆహార భద్రతకు విఘాతం కలగనివ్వకూడదు
డబ్ల్యూటీవో వ్యవసాయ ఒప్పందం ప్రపంచ రైతాంగానికి రెండు విధాలుగా నష్టం కలిగిస్తూ ఉంది. ధనిక దేశాల వ్యవసాయ సబ్సిడీలను తగ్గించలేక పోవటం మొదటిది. వర్ధమాన, నిరుపేద దేశాల వ్యవసాయ సబ్సిడీలను నియంత్రించి, ఆయా దేశాల ఆహార భద్రతను దెబ్బతీయడం రెండోది. నిరుపేదల ఆహార భద్రత కన్నా బహుళజాతి కంపెనీల లాభాలకే డబ్ల్యూటీఓ ప్రాధాన్యతనిస్తున్నట్లుంది. కరువులొచ్చినప్పుడు ప్రభుత్వాలు ఆహార ధాన్యాల కోసం బహుళజాతి కంపెనీలపై ఆధారపడవలసిన రోజులు ఎంతో దూరంలో లేవు. ఈ ముప్పు తప్పాలంటే.. అభివృద్ధి చెందుతున్న, వెనుకబడిన దేశాలు ఒక్క తాటిపైకి వచ్చి.. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆహార భద్రతకు విఘాతం కలగని విధంగా డబ్ల్యూటీవో నిబంధనలను సవరించడమే పరిష్కారం. ‘ప్రపంచ కుటుంబ వ్యవసాయ సంవత్సరం’లోనే ఈ దిశగా ముందడుగేయాలి. (నేడు అంతర్జాతీయ ఆహార దినోత్సవం సందర్భంగా..)
డా. కే క్రాంతి కుమార్‌రెడ్డి
వ్యవసాయ రంగ విశ్లేషకుడు