ప్యాంగ్యాంగ్: ఉత్తర కొరియా అధినేత కిమ్ జాంగ్ ఉన్‌కు సంబంధించిన వీడియో ఒకటి నిన్నంత సోషల్ మీడియాలో వైరలయిన సంగతి తెలిసిందే. వీడియోలో కిమ్ గతంతో పోలిస్తే చిక్కినట్లు కనిపించాడు. దీనిపై అనేక అనుమానాలు వ్యక్తం చేశారు. ముఖ్యంగా అనారోగ్య సమస్య వల్లే కిమ్ ఇలా అయ్యాడంటే.. కాదు.. బరువు తగ్గేందుకు ప్రయత్నిస్తున్నాడు.. అందుకే ఇలా చిక్కిపోయినట్లు కనిపించాడని మరో వర్గం తెలిపింది. ఏది ఏమైనా కిమ్ బరువు తగ్గడంపై పెద్ద చర్చే నడిచింది.
తాజాగా మరో ప్రతిపాదన తెర మీదకు వచ్చింది. కరోనా కారణంగా గతేడాది నుంచి ఉత్తర కొరియాలో లాక్‌డౌన్ అమల్లో ఉండటంతో తీవ్ర ఆహార కొరత ఎదుర్కుంటుందనే వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో దేశంలో నెలకొన్న ఆహార కొరత వల్ల కిమ్ ఇలా చిక్కిపోయాడని ఉత్తర కొరియా వాసులు భావిస్తున్నారట. నార్త్ కొరియా అధికారక మీడియా ప్రకారం పేరు తెలియని ప్యాంగ్యాంగ్ వాసి ఒకరు కిమ్ బరువు తగ్గడంపై ఆ దేశ ప్రజలు తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నారని తెలిపాడు. ‘‘చిక్కిపోయినట్లు ఉన్న గౌరవనీయ ప్రధాన కార్యదర్శి (కిమ్ జాంగ్ ఉన్)ను చూసి మా దేశ ప్రజల గుండె బద్దలయ్యింది’’ అని తెలిపాడు.
ఈ సందర్భంగా ఉత్తర కొరియా కదలికలను గమనించే అమెరికాకు చెందిన 38 నార్త్ కొరియా డైరెక్టర్ జెన్ని టౌన్ మాట్లాడుతూ.. ‘‘కిమ్ బరువు తగ్గడం వెనక ప్రధాన కారణం తెలియదు. అనారోగ్య సమస్యలు లేదా ఫిట్‌గా మారడం కోసం ఇలా బరువు తగ్గి ఉండవచ్చు. అలా కాకుండా ప్రస్తుతం దేశం ఎదుర్కొంటున్న ఆహార కొరత సమస్యపై ప్రజల్లో సానుభూతి పొందడం కోసం కిమ్ ఇలా ప్రచారం చేస్తున్నారేమో అనిపిస్తుంది’’ అన్నారు. మొత్తానికి కిమ్ బరువు తగ్గడంపై ప్రపంచవ్యాప్తంగా చర్చ నడుస్తుందన్నమాట.
Comments
Please login to add a commentAdd a comment