సాక్షి, అమరావతి: ఆహార ధాన్యాల ఉత్పత్తిలో రాష్ట్రం రికార్డు సృష్టించింది. రాష్ట్ర విభజన అనంతరం ఈ స్థాయిలో ఉత్పత్తి సాధించడం ఇదే ప్రథమం. ఆహార భద్రతకు సంబంధించి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం తీసుకున్న విధాన నిర్ణయాలు, అనుసరించిన పద్ధతులతో ఈ రికార్డు సాధ్యమైంది. 2019–20 సంవత్సరానికి నాలుగవ, తుది ముందస్తు అంచనా ప్రకారం రాష్ట్రంలో 180.54 లక్షల మెట్రిక్ టన్నుల ఆహార ధాన్యాల ఉత్పత్తి (వాణిజ్య పంటలు, నూనె గింజలు మినహా) వచ్చింది.
► గత ఏడాది కంటే ఇది 30.98 లక్షల టన్నులు ఎక్కువ కావడం గమనార్హం. రాష్ట్ర విభజన అనంతరం చంద్రబాబు అధికారంలోకి వచ్చిన 2015–16 నాటి కంటే 36.76 లక్షలటన్నులు ఎక్కువ.
► నాలుగో ముందస్తు అంచనా ప్రకారం 2019–20 ఖరీఫ్‌లో వరి దిగుబడి హెక్టార్‌కు 5,248 కిలోల చొప్పున మొత్తం 79,98,000 టన్నులు.. రబీలో హెక్టార్‌కు 5,846 కిలోల చొప్పున 59,75,000 టన్నులు.. మొత్తం 1,39,73,000 టన్నుల వరి దిగుబడి వచ్చింది.
► వరి, చిరుధాన్యాలు, తృణధాన్యాలు అన్నీ కలిపి 1,68,67,000 టన్నులు ఉత్పత్తి అయ్యాయి. పప్పు ధాన్యాలు రెండు సీజన్లలో కలిపి 11,87,000 టన్నులు వచ్చాయి. మొత్తం ఆహార ధాన్యాల దిగుబడి 1,80,54,000 టన్నులుగా వ్యవసాయ శాఖ అంచనా వేసింది.
► నూనె గింజల దిగుబడి 28,47,000 టన్నులుగా, పత్తి 25,12,000 బేళ్లుగా అంచనా వేసింది. చంద్రబాబు ప్రభుత్వం ఉన్న ఐదేళ్ల కాలంలో ఇటువంటి దిగుబడి రాలేదని గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.
► 2019–20లో మొత్తం 42.15 లక్షల హెక్టార్లలో ఆహార పంటలు సాగయ్యాయి. నూనె గింజలు 8.53 లక్షల హెక్టార్లో, ఇతర పంటలు 9.85 లక్షల హెక్టార్లలో సాగయ్యాయి.
ఇదే స్ఫూర్తి కొనసాగాలి
విభజనానంతర ఏపీలో ఈ స్థాయిలో ఆహార ధాన్యాల దిగుబడి రావడం సంతోషకరం. ఇది ఆల్‌టైమ్ రికార్డ్. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు, కలిసివచ్చిన వాతావరణం, వానలు, రుతుపవనాలతో రైతులు సాధించిన విజయం ఇది. తెలంగాణ రాష్ట్రం కన్నా అధిక దిగుబడి నమోదైంది. ఇదే స్ఫూర్తితో అధికారులు పని చేయాలి. రైతులకు తలలో నాలుకలా ఉండాలి. ప్రభుత్వ ఆశయాన్ని సాధించాలి. అన్నదాతలకు అధిక ఆదాయం వచ్చేలా చూడాలని కోరుతున్నా.
–అరుణ్‌కుమార్, వ్యవసాయ శాఖ కమిషనర్
Comments
Please login to add a commentAdd a comment