ఆహార ధాన్యాలకు ఢోకా లేదు..
Published Mon, Sep 11 2017 4:58 PM | Last Updated on Mon, Aug 20 2018 9:18 PM
న్యూఢిల్లీ: దేశంలో ఈసారి వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేకపోవడం వల్ల పంటల దిగుబడి, ముఖ్యంగా వరి ధాన్యం దిగుబడి తగ్గిపోతుందని రైతన్నలు ఆందోళన చెందుతుండడంతో ధాన్యం ధరలు పెరగడం వల్ల మార్కెట్‌లో అధిక ధరలను చెల్లించాల్సి వస్తుందని వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు. దేశంలోని 18 రాష్ట్రాల్లో వాతావరణ పరిస్థితులు అనుకూలించక పోవడం వల్ల వ్యవసాయ సాగు గణనీయంగా తగ్గిందని వ్యవసాయ నిపుణులు చెబుతున్నారు.
2016 సంవత్సరంలో దేశంలో 3.72 కోట్ల హెక్టార్లలో వరిని సాగుచేయగా, ఈ ఏడాది 3.66 కోట్ల హెక్టార్లలో వరిని సాగుచేస్తున్నారు. చాలా ప్రాంతాల్లో వరి, పప్పు దినుసులు, చమురు గింజల సాగు గణనీయంగా పడిపోగా, పత్తి, జౌళి, చెరకు పంటల సాగు పెరిగింది. అస్సాం, బీహార్, గుజరాత్, రాజస్థాన్, పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్, త్రిపుర, మణిపూర్, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో వరదల బీభత్సం, పంజాబ్, ఆంధ్రప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూకశ్మీర్, మిజోరం రాష్ట్రాల్లో అధిక వర్షపాతం, కర్ణాటక, తమిళనాడు, కేరళ, తెలంగాణ రాష్ట్రాల్లో కరవు పరిస్థితులు నెలకొనడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఎప్పటిలాగే 2016–17 సంవత్సరానికిగాను దేశంలో ఆహారధాన్యాల ఉత్పత్తి 13.80 కోట్ల టన్నులు ఉంటుందని కేంద్ర వ్యవసాయ శాఖ అంచనా వేసింది. ఈసారి వరి ఉత్పత్తిలో కూడా పెద్ద తేడా ఉండకపోవచ్చని, ఒకవేళ ఉన్నప్పటికీ ప్రజలకు ఎలాంటి ఢోకా ఉండదని కేంద్ర వ్యవసాయ శాఖ కార్శదర్శి ఎస్కే పట్నాయక్ తెలిపారు. దేశంలో చాలినంత బియ్యం నిల్వలు ఉన్నాయని ఆయన అన్నారు.
Advertisement
Advertisement