సాక్షి, హైదరాబాద్: సమగ్ర విధానం లేకపోవడం వల్లే దేశంలో ఆహార ధాన్యాల కొరత ఏర్పడిందని, ఇది మోదీ ప్రభుత్వ వైఫల్యమని మంత్రి కేటీ రామారావు విమర్శించారు. 140 కోట్ల జనాభా కలిగిన దేశానికి ఆహార భద్రత లేకపోవడం వెనుక బీజేపీ ప్రభుత్వానికి ముందు చూపులేదని అర్థమవుతోందన్నారు. దేశ వ్యవసాయ రంగం, ఆహార అవసరాల కోసం స్పష్టమైన విధానం రూపొందించి, ‘వన్ నేషన్–వన్ ప్రొక్యూర్మెంట్ పాలసీ’ని అమలు చేయాలని శనివారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు.
రాష్ట్రాల నుంచి ధాన్యం సేకరించి కొరత లేకుండా చూడాలని కేటీఆర్ సూచించారు. ‘తెలంగాణను విఫల రాష్ట్రంగా చూపించే తొందరలో మోదీ ప్రభుత్వం తాను తీసుకున్న గోతిలో తానే పడింది. దేశంలో నాలుగేళ్లకు సరిపడా గోధుమలు, బియ్యం నిల్వలు ఉన్నాయని చెప్పిన కేంద్రం తాజాగా బియ్యం ఎగుమతులపై 20శాతం ఎగుమతి సుంకాన్ని విధించింది. గోధుమల ఆధారిత ఉత్పత్తులపై గతంలోనే ఆంక్షలు విధించిన మోదీ ప్రభుత్వం, ప్రస్తుతం నూకల ఎగుమతిపైనా నిషేధం పెట్టింది. ఎఫ్‌సీఐ గోదాముల్లో బియ్యం, నూకలు, గోధుమల నిల్వలు భారీగా తగ్గడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నారు’ అని కేటీఆర్ విమర్శించారు.
బీజేపీ అధికారంలో ఉండటం దురదృష్టకరం
‘అవసరానికి మించి ఆహార ధాన్యాల నిల్వలున్నాయని 6 నెలల క్రితం ప్రకటించిన కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ఈ కొరతకు కారణం చెప్పాలి. దేశంలో ఆహార ధాన్యాల అవసరాలు, వాటి సేకరణలో కేంద్రానికి స్పష్టమైన విధానం లేనందునే ప్రస్తుత కొరత తలెత్తింది. తెలంగాణ ప్రజలకు నూకలు తినిపించడం అలవాటు చేయాలని అవమానించిన పీయూష్ గోయల్ ఇప్పుడు నూకల ఎగుమతిని నిషేధించి వాటిని తింటారేమో.
కేంద్రం నుంచి ఎలాంటి సాయం అందకపోయినా రికార్డు సమయంలో సాగునీటి ప్రాజెక్టులు పూర్తి, ఉచిత కరెంటు, రైతుబంధు వంటి పథకాలతో రాష్ట్రంలో లక్షల ఎకరాలు సాగులోకి వచ్చాయి. అయినా రైతులు వరిసాగు చేయకుండా కేంద్రం ఒత్తిడి తేవడంతో గత వానాకాలం సీజన్‌తో పోల్చితే ఈ సీజన్‌లో దేశవ్యాప్తంగా సుమారు 95 లక్షల ఎకరాల్లో వరిసాగు తగ్గింది.
దీంతో దేశంలో 12 నుంచి 15 మిలియన్ టన్నుల బియ్యం ఉత్పత్తి తగ్గిపోయే అవకాశం ఉంది. అందుకే బియ్యం ఎగుమతులపై కేంద్రం నిషేధం విధించింది’ అని మంత్రి కేటీ రామారావు లేఖలో పేర్కొన్నారు. దేశాభివృద్ధి, ప్రజా సంక్షేమంపై కనీస అవగాహన, ప్రణాళిక లేని మందబుద్ధి బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో ఉండటం ప్రజల దురదృష్టమని వ్యాఖ్యానించారు.
Comments
Please login to add a commentAdd a comment