ఖరీఫ్‌ సాగు.. మరింత బాగు | Department of Agriculture announces Kharif-21 production target | Sakshi
Sakshi News home page

ఖరీఫ్‌ సాగు.. మరింత బాగు

Published Tue, Jun 8 2021 3:35 AM | Last Updated on Tue, Jun 8 2021 3:35 AM

Department of Agriculture announces Kharif-21 production target - Sakshi

సాక్షి, అమరావతి: ఖరీఫ్‌–2021 పంటల ఉత్పత్తి లక్ష్యాన్ని వ్యవసాయ శాఖ ప్రకటించింది. గడచిన ఖరీఫ్‌ సీజన్‌లో 90.86 లక్షల ఎకరాల్లో పంటలు సాగవగా.. ఈ ఖరీఫ్‌లో 94.20 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగు చేయించాలని లక్ష్యంగా నిర్దేశించుకుంది. తద్వారా 94.01 లక్షల టన్నుల ఆహార ధాన్యాలు ఉత్పత్తి అవుతాయని అంచనా వేసింది. గత ఖరీఫ్‌తో పోలిస్తే.. ఈ ఖరీఫ్‌లో 3.34 లక్షల ఎకరాలను అదనంగా సాగులోకి తీసుకు రావడం ద్వారా 7.23 లక్షల టన్నుల ఆహార ధాన్యాలను అదనంగా పొందాలని లక్ష్యంగా నిర్దేశించుకుంది.

ఖరీఫ్‌–2021 సాగు లక్ష్యానికి అనుగుణంగా దిగుబడి అంచనాలను వ్యవసాయ శాఖ సోమవారం రాత్రి ప్రకటించింది. మొత్తంగా ఈ ఖరీఫ్‌ సీజన్‌లో 94.20 లక్షల ఎకరాల్లో వివిధ పంటలను సాగు చేయించాలని నిర్ణయించగా.. అందులో వరి విస్తీర్ణం అత్యధికంగా 39.50 లక్షల ఎకరాలుగా ఉంది. 5.21 లక్షల ఎకరాల్లో తృణధాన్యాలు, 8.97 లక్షల ఎకరాల్లో అపరాలు కలిపి మొత్తం ఆహార ధాన్యాలు 53.68 లక్షల ఎకరాల్లో సాగు చేయించాలని వ్యవసాయ శాఖ నిర్దేశించింది. 19.72 లక్షల ఎకరాల్లో నూనె గింజలు, 14.81 లక్షల ఎకరాల్లో పత్తి, 3.69 లక్షల ఎకరాల్లో మిరప, లక్ష ఎకరాల్లో చెరకు, మరో 1.31 లక్షల ఎకరాల్లో ఇతర పంటలు సాగు చేయించాలని లక్ష్యంగా నిర్ణయించింది.

గతం కంటే ఘనంగా..
టీడీపీ హయాంలో సగటున ఏటా ఖరీఫ్‌ సీజన్‌లో ఆహార ధాన్యాల ఉత్పత్తి 80.51 లక్షల టన్నులు కాగా, అందులో 73.86 లక్షల టన్నుల వరి దిగుబడి ఉంది. ఖరీఫ్‌–2019లో ఆహార ధాన్యాల ఉత్పత్తి 87.77 లక్షల టన్నులు కాగా, అందులో వరి దిగుబడి 80.13 లక్షల టన్నులు. ఖరీఫ్‌–2020లో ఆహార ధాన్యాల ఉత్పత్తి 86.78 లక్షల టన్నులు కాగా, ఇందులో వరి దిగుబడి 78.89 లక్షల టన్నులు.

పెరగనున్న దిగుబడులు 
ఈ ఖరీఫ్‌లో 39.50 లక్షల ఎకరాల్లో వరి సాగు చేయించాలని లక్ష్యంగా నిర్దేశించగా.. ఎకరాకు 2,156 కేజీల చొప్పున 85.16 లక్షల టన్నుల దిగుబడి వస్తుందని అంచనా వేశారు. తృణధాన్యాల దిగుబడి 6.74 లక్షల టన్నులు, అపరాల దిగుబడి 2.11 లక్షల టన్నుల దిగుబడి వస్తుందని లెక్క వేశారు. ఈ విధంగా 53.68 లక్షల ఎకరాల్లో ఆహార ధాన్యాల దిగుబడి 94.01 లక్షల టన్నుల దిగుబడి వస్తుందని అంచనా. ఆయిల్‌ సీడ్స్‌ 8.34 లక్షల టన్నులు, చెరకు 29.70 లక్షల టన్నులు, పత్తి 10.43 లక్షల టన్నులు, మిరప 8.48 లక్షల టన్నుల దిగుబడి వస్తుందని లెక్కలేశారు. రానున్న ఖరీఫ్‌–21 సీజన్‌లో మొత్తంగా 94.20 లక్షల ఎకరాల్లో ఆహార ధాన్యాలతో పాటు అన్నిరకాల పంటల ద్వారా 154.50 లక్షల టన్నుల దిగుబడి వస్తుందని అంచనా వేశారు.

రెండేళ్ల కంటే మిన్నగా దిగుబడులు
గడచిన రెండేళ్ల కంటే మిన్నగా రానున్న ఖరీఫ్‌లో దిగుబడులు సాధించాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నాం. ఆహార ధాన్యాలు ఖరీఫ్‌–2019లో 87.77 లక్షల టన్నులు, ఖరీఫ్‌–2020లో 86.78 లక్షల టన్నుల దిగుబడులు రాగా, ఈ ఖరీఫ్‌లో 94.01 లక్షల టన్నుల దిగుబడులొస్తాయని అంచనా వేశాం. గత ఖరీఫ్‌లో 78.89 లక్షల టన్నుల వరి దిగుబడి రాగా, వచ్చే ఖరీఫ్‌లో 85.16 లక్షల టన్నుల దిగుబడి వస్తుందని అశిస్తున్నాం.    
– హెచ్‌.అరుణ్‌కుమార్, కమిషనర్, వ్యవసాయ శాఖ  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement