Rice yields
-
దిగుబడి వరిస్తోంది
సాక్షి అమలాపురం: వర్షాభావ పరిస్థితులు.. గోదావరి నదిలో అరకొరగా వచ్చిన ప్రవాహ జలాలు గోదావరి డెల్టాల్లో ఖరీఫ్‌కు కలిసొచ్చింది. దశాబ్ద కాలంలో ఎన్నడూ లేనంతగా రికార్డు స్థాయిలో వరి దిగుబడి వస్తోంది. వర్షాలు లేకున్నా ప్రభుత్వ యంత్రాంగం గోదావరి కాలువలకు సంవృద్ధిగా సాగునీరు అందించడంతో డెల్టాల్లో ప్రాంతాన్ని బట్టి 34 బస్తాలు (బస్తా 75 కేజీలు) నుంచి 48 బస్తాల వరకు దిగుబడి లభిస్తోంది. ఇప్పటికే కోతలు మొదలైన తూర్పు డెల్టాలోని రాయవరం, మండపేట, పశ్చిమ డెల్టా పరిధిలోని నిడదవోలు వంటి మండలాల్లో కొన్నిచోట్ల 48 బస్తాల వరకు దిగుబడిగా వస్తుండటంతో రైతులు సాగుపై ఆశలు పెట్టుకున్నారు. ఈశాన్యం వల్ల భారీ వర్షాలు, వాయుగుండాలు, తుపానులు రాకుండా ఉంటే ఈ ఖరీఫ్‌లో లాభాలు కళ్లజూస్తామని ఆయకట్టు రైతులు చెబుతున్నారు. ఉమ్మడి ‘తూర్పు’లో 3.90 లక్షల ఎకరాలు ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా పరిధిలోని తూర్పు గోదావరి, కాకినాడ, కోనసీమ జిల్లాల్లో ప్రస్తుతం 3.90 లక్షల ఎకరాల్లో వరి ఆయకట్టు ఉంది. కోనసీమ జిల్లాలో 1.58 లక్షల ఎకరాల్లో వరి సాగు చేయగా.. అధికారుల అంచనా ప్రకారం ఇక్కడ 3.80 లక్షల టన్నులు. వ్యవసాయ శాఖ గణంకాల ప్రకారం డెల్టాలో ఖరీఫ్ దిగుబడి సగటున 28 బస్తాలు. కానీ.. కోనసీమ జిల్లాలో ఇక్కడ ఎకరాకు సగటున 32.50 బస్తాల వరకు దిగుబడి వస్తుందని అధికారుల చెబుతున్నారు. వాస్తవానికి ఈ జిల్లా పరిధిలో అంచనాలకు మించి దిగుబడి వస్తోంది. జిల్లాలోని ఆత్రేయపురంలో నిర్వహించిన పంట కోత ప్రయోగంలో ఎకరాకు సగటు 34 బస్తాల దిగుబడిగా తేలింది. రాయవరం మండలంలో వరి కోతలు ప్రారంభం కాగా.. ఇక్కడ 42 నుంచి 46 బస్తాల వరకు దిగుబడి వస్తోంది. జిల్లాలోని సముద్ర తీర ప్రాంత మండలాల్లో 32 బస్తాల నుంచి 35 బస్తాల వరకు దిగుబడి వస్తుందని అంచనా. తూర్పు గోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం పరిధిలో వరి కోతలు కొనసాగుతున్నాయి. ఇక్కడ సగటున 35 బస్తాల దిగుబడిగా వస్తుండగా.. పశ్చిమ డెల్టా పరిధిలోని పెరవలి మండలంలో 38 నుంచి 42 బస్తాల వరకు దిగుబడి వస్తోంది. కాకినాడ జిల్లాలో పిఠాపురం పరిధిలో ప్రాంతాన్ని బట్టి 32 నుంచి 40 బస్తాల వరకు పండింది. గత కొన్నేళ్లుగా ఖరీఫ్ సాగు అనుకున్న స్థాయిలో దిగుబడి రావడం లేదు. పంట కోతకు వచ్చే సమయంలో భారీ వర్షాలు రైతులను ముంచేస్తున్నాయి. పంట పండినా దిగుబడి రావడం లేదు. కోనసీమ జిల్లాలో గత ఖరీఫ్ కొన్ని ప్రాంతాల్లో 24 బస్తాలు మించి పండలేదు. వర్షాభావం కలిసొచ్చింది ఈ ఏడాది వర్షాలు తక్కువగా ఉండటం వల్ల డెల్టాలో మంచి దిగుబడి వస్తోంది. ఎండల వల్ల కిరణజన్య సంయోగ క్రియ బాగా జరగటం దిగుబడి పెరగడానికి కారణమైంది. మండపేట, రాయవరం వంటి మండలాల్లో నిర్వహించిన పంట కోత ప్రయోగాలలో సగటు 40 బస్తాల వరకు దిగుబడి వచ్చింది. – బోసుబాబు, జిల్లా వ్యవసాయశాఖ అధికారి, బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా -
ఖరీఫ్ సాగు.. మరింత బాగు
సాక్షి, అమరావతి: ఖరీఫ్–2021 పంటల ఉత్పత్తి లక్ష్యాన్ని వ్యవసాయ శాఖ ప్రకటించింది. గడచిన ఖరీఫ్ సీజన్లో 90.86 లక్షల ఎకరాల్లో పంటలు సాగవగా.. ఈ ఖరీఫ్‌లో 94.20 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగు చేయించాలని లక్ష్యంగా నిర్దేశించుకుంది. తద్వారా 94.01 లక్షల టన్నుల ఆహార ధాన్యాలు ఉత్పత్తి అవుతాయని అంచనా వేసింది. గత ఖరీఫ్‌తో పోలిస్తే.. ఈ ఖరీఫ్‌లో 3.34 లక్షల ఎకరాలను అదనంగా సాగులోకి తీసుకు రావడం ద్వారా 7.23 లక్షల టన్నుల ఆహార ధాన్యాలను అదనంగా పొందాలని లక్ష్యంగా నిర్దేశించుకుంది. ఖరీఫ్–2021 సాగు లక్ష్యానికి అనుగుణంగా దిగుబడి అంచనాలను వ్యవసాయ శాఖ సోమవారం రాత్రి ప్రకటించింది. మొత్తంగా ఈ ఖరీఫ్ సీజన్లో 94.20 లక్షల ఎకరాల్లో వివిధ పంటలను సాగు చేయించాలని నిర్ణయించగా.. అందులో వరి విస్తీర్ణం అత్యధికంగా 39.50 లక్షల ఎకరాలుగా ఉంది. 5.21 లక్షల ఎకరాల్లో తృణధాన్యాలు, 8.97 లక్షల ఎకరాల్లో అపరాలు కలిపి మొత్తం ఆహార ధాన్యాలు 53.68 లక్షల ఎకరాల్లో సాగు చేయించాలని వ్యవసాయ శాఖ నిర్దేశించింది. 19.72 లక్షల ఎకరాల్లో నూనె గింజలు, 14.81 లక్షల ఎకరాల్లో పత్తి, 3.69 లక్షల ఎకరాల్లో మిరప, లక్ష ఎకరాల్లో చెరకు, మరో 1.31 లక్షల ఎకరాల్లో ఇతర పంటలు సాగు చేయించాలని లక్ష్యంగా నిర్ణయించింది. గతం కంటే ఘనంగా.. టీడీపీ హయాంలో సగటున ఏటా ఖరీఫ్ సీజన్లో ఆహార ధాన్యాల ఉత్పత్తి 80.51 లక్షల టన్నులు కాగా, అందులో 73.86 లక్షల టన్నుల వరి దిగుబడి ఉంది. ఖరీఫ్–2019లో ఆహార ధాన్యాల ఉత్పత్తి 87.77 లక్షల టన్నులు కాగా, అందులో వరి దిగుబడి 80.13 లక్షల టన్నులు. ఖరీఫ్–2020లో ఆహార ధాన్యాల ఉత్పత్తి 86.78 లక్షల టన్నులు కాగా, ఇందులో వరి దిగుబడి 78.89 లక్షల టన్నులు. పెరగనున్న దిగుబడులు ఈ ఖరీఫ్‌లో 39.50 లక్షల ఎకరాల్లో వరి సాగు చేయించాలని లక్ష్యంగా నిర్దేశించగా.. ఎకరాకు 2,156 కేజీల చొప్పున 85.16 లక్షల టన్నుల దిగుబడి వస్తుందని అంచనా వేశారు. తృణధాన్యాల దిగుబడి 6.74 లక్షల టన్నులు, అపరాల దిగుబడి 2.11 లక్షల టన్నుల దిగుబడి వస్తుందని లెక్క వేశారు. ఈ విధంగా 53.68 లక్షల ఎకరాల్లో ఆహార ధాన్యాల దిగుబడి 94.01 లక్షల టన్నుల దిగుబడి వస్తుందని అంచనా. ఆయిల్ సీడ్స్ 8.34 లక్షల టన్నులు, చెరకు 29.70 లక్షల టన్నులు, పత్తి 10.43 లక్షల టన్నులు, మిరప 8.48 లక్షల టన్నుల దిగుబడి వస్తుందని లెక్కలేశారు. రానున్న ఖరీఫ్–21 సీజన్లో మొత్తంగా 94.20 లక్షల ఎకరాల్లో ఆహార ధాన్యాలతో పాటు అన్నిరకాల పంటల ద్వారా 154.50 లక్షల టన్నుల దిగుబడి వస్తుందని అంచనా వేశారు. రెండేళ్ల కంటే మిన్నగా దిగుబడులు గడచిన రెండేళ్ల కంటే మిన్నగా రానున్న ఖరీఫ్‌లో దిగుబడులు సాధించాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నాం. ఆహార ధాన్యాలు ఖరీఫ్–2019లో 87.77 లక్షల టన్నులు, ఖరీఫ్–2020లో 86.78 లక్షల టన్నుల దిగుబడులు రాగా, ఈ ఖరీఫ్‌లో 94.01 లక్షల టన్నుల దిగుబడులొస్తాయని అంచనా వేశాం. గత ఖరీఫ్‌లో 78.89 లక్షల టన్నుల వరి దిగుబడి రాగా, వచ్చే ఖరీఫ్‌లో 85.16 లక్షల టన్నుల దిగుబడి వస్తుందని అశిస్తున్నాం. – హెచ్.అరుణ్‌కుమార్, కమిషనర్, వ్యవసాయ శాఖ -
పాలకంకి పరవశం
సాక్షి, అమరావతి: పంట చేలో పాలకంకి నవ్వుతోంది. స్వేదాన్ని చిందించి సేద్యం చేసిన అన్నదాతకు దిగుబడుల రూపంలో మంచిరోజు రాబోతోంది. రాష్ట్ర ప్రభుత్వ కృషితో పెట్టుబడి కోసం చేతినిండా సొమ్ములు అందటం.. నాణ్యమైన సాగు ఉత్పాదకాలు గడప వద్దకే చేరడం.. వాతావరణం కరుణించి కరువుతీరా వర్షాలు కురవడం.. ప్రాజెక్టులు నిండుకుండల్ని తలపిస్తున్న తరుణాన రెండో ఏడాది కూడా రైతు కష్టం ఫలించబోతోంది. ప్రస్తుత రబీలో పంటల విస్తీర్ణం పెరగ్గా.. దిగుబడుల్లోనూ అన్నదాతలు రికార్డుల్ని తిరగరాయబోతున్నారు. గణాంక శాఖ తాజాగా విడుదల చేసిన రబీ–2021 దిగుబడి అంచనాలు ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. ‘వరి’oచనున్న దిగుబడి ధాన్యం దిగుబడులు సాధారణంగా ఖరీఫ్‌లోనే ఎక్కువగా ఉంటాయి. అలాంటిది రెండేళ్లుగా రబీలోనూ దిగుబడులు పెరిగి అన్నదాత గాదెలు ధాన్యం రాశులతో నిండుతున్నాయి. ఈ ఏడాది రబీలో ముందెన్నడూ లేనివిధంగా అపరాలతో పోటీగా వరి సాగు విస్తీర్ణం పెరిగింది. రబీ–2020లో 8.30 లక్షల హెక్టార్లలో వరి సాగవగా.. హెక్టారుకు 6,868 కేజీల చొప్పున 57 లక్షల టన్నుల ధాన్యం దిగుబడులొచ్చాయి. రబీ–2021లో సాగు విస్తీర్ణమే కాదు.. సరాసరి దిగుబడులు కూడా గణనీయంగా పెరగనున్నాయి. ఈ ఏడాది 8.81 లక్షల హెక్టార్లలో వరి సాగవగా.. హెక్టారుకు సగటున 7,025 కేజీల చొప్పున 61.89 లక్షల టన్నుల ధాన్యం దిగుబడులు వస్తాయని అంచనా వేశారు. గతేడాదితో పోలిస్తే హెక్టారుకు సగటున 157 కేజీల దిగుబడి పెరగనుండగా.. మొత్తంగా 4.89 లక్షల టన్నుల దిగుబడి పెరగబోతోందని గణాంక శాఖ అంచనా వేసింది. సాధారణంగా గణాంక శాఖ అంచనాతో పోలిస్తే దిగుబడి 20 శాతం అదనంగా ఉంటుందని వ్యవసాయ శాఖ చెబుతోంది. ఇతర పంటలు సైతం.. సాధారణంగా ఏటా రబీలో అపరాల సాగు అధికంగా ఉంటుంది. గతేడాది 8.94 లక్షల హెక్టార్లలో అపరాల పంటలు వేయగా.. 9.90 లక్షల టన్నుల దిగుబడులొచ్చాయి. ఈ ఏడాది 9.78 లక్షల హెక్టార్లలో అపరాలను సాగు చేశారు. మొత్తంగా 10.41 లక్షల టన్నుల మేర అపరాల దిగుబడులొస్తాయని గణాంక శాఖ లెక్క తేల్చింది. మరోవైపు ఇతర ఆహార ధాన్యాల పంటలు గత రబీలో 20.63 లక్షల హెక్టార్లలో సాగవగా.. 87.35 లక్షల టన్నుల మేరకు దిగుబడులొచ్చాయి. ఈ ఏడాది 21.59 లక్షల హెక్టార్లలో ఆహార ధాన్యాలు పండిస్తుండగా.. 90.10 లక్షల టన్నుల మేర దిగుబడులొస్తాయని గణాంక శాఖ అంచనా వేసింది. ఆయిల్ సీడ్స్ దిగుబడులూ ఘనమే వేరుశనగ, పొద్దు తిరుగుడు వంటి ఆయిల్ సీడ్స్ పంటల విషయానికి వస్తే గతేడాది 1.14 లక్షల హెక్టార్లలో సాగవగా.. 2.51 లక్షల టన్నుల దిగుబడులొచ్చాయి. ఈ ఏడాది రబీలో ఆయిల్ సీడ్స్ సాగు విస్తీర్ణం 1.50 లక్షల హెక్టార్లకు పెరిగింది. వీటి దిగుబడులు 3.18 లక్షల టన్నులు వస్తాయని అంచనా వేశారు. వీటిలో ప్రధానంగా రబీలో ఎక్కువగా సాగయ్యే వేరుశనగ గతేడాది రబీలో 93 వేల హెక్టార్లలో సాగవగా, 2.28 లక్షల టన్నుల దిగుబడి లభించింది. ఈ ఏడాది ఏకంగా 1.13 లక్షల హెక్టార్లలో వేరుశనగ పంట సాగవగా, 2.76 లక్షల టన్నుల దిగుబడి వస్తుందని అంచనా. మిరప.. రెపరెప గతేడాది 17 వేల హెక్టార్లలో మిరప పంట సాగు చేయగా.. 80 వేల టన్నుల దిగుబడులొచ్చాయి. ఈ ఏడాది 39 వేల హెక్టార్లలో రైతులు మిరప వేయగా.. 1.84 లక్షల టన్నుల దిగుబడులొస్తాయని అంచనా. గత రబీ సీజన్లో 23.02 లక్షల హెక్టార్లలో సాగవగా, 92.43లక్షల టన్నుల దిగుబడులొచ్చాయి. కాగా ఈ ఏడాది రబీ–2021 సీజన్లో 24.13లక్షల హెక్టార్లలో పంటలు సాగవగా, 97.10లక్షల టన్నుల దిగుబడు లొస్తాయని అంచనా వేశారు. గతేడాదితో పోలిస్తే సాగు విస్తీర్ణం 1.11లక్షల హెక్టార్ల మేర పెరగగా, 4.67లక్షల టన్నులకు పైగా దిగుబడులు పెరగనున్నాయని గణాంక శాఖ అంచనా వేసింది. మంచి దిగుబడులు రానున్నాయ్ రబీ–2020తో పోలీస్తే రబీ–2021లో సాగు విస్తీర్ణం పెరిగింది. దిగుబడులు కూడా గత రబీ కంటే గణనీయంగా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇటీవల గణాంక శాఖ విడుదల చేసిన మూడో అంచనా దిగుబడులు ఇందుకు అద్దం పడుతున్నాయి. ఇవి మరింత పెరిగే అవకాశాలు లేకపోలేదు. రబీలో ఈ స్థాయిలో పంటలు సాగవడమే కాదు.. రికార్డు స్థాయి దిగుబడులు రానుండటం కూడా చరిత్రలో ఇదే ప్రథమం. – హెచ్.అరుణ్‌కుమార్, కమిషనర్, వ్యవసాయ శాఖ 55 బస్తాల వరకు దిగుబడి వచ్చేలా ఉంది పదేళ్లుగా రబీలో సాగునీటి కోసం చాలా ఇబ్బందులు పడేవాళ్లం. రెండేళ్లుగా రెండో పంటకు సాగు నీరివ్వడంతో ఎలాంటి ఆందోళన లేకుండా సాగు చేసుకోగలిగాం. గత రబీలో మూడెకరాలు కౌలుకు తీసుకుని వరి వేశా. ఎకరాకు 45 బస్తాల దిగుబడి వచ్చింది. ఈ రబీలో ఐదెకరాలు కౌలుకు తీసుకుని ఎంటీయూ–1021 సాగు చేశా. పంట ఏపుగా ఎదిగింది. ఇప్పటివరకు తెగుళ్ల బెడద కూడా పెద్దగా లేదు. 50–55 బస్తాల మధ్య దిగుబడి వచ్చే అవకాశాలు కన్పిస్తున్నాయి. –ఏసురత్నం,నంగవరం, తూర్పు గోదావరి జిల్లా తొలిసారి రబీ సాగు చేశా మేం చరిత్రలో ఎప్పుడూ రబీ సాగు చేయలేదు. గతంలో ఎప్పుడూ లేనివిధంగా కడప–కర్నూలు కాలువ (కేసీ కెనాల్) ద్వారా ప్రభుత్వం సాగునీరివ్వడంతో తొలిసారి రబీ పంట సాగు చేశాం. నాలుగు ఎకరాల్లో నెల్లూరు సన్నాలు (జీలకర్ర మసూరి) వేశా. పంట బాగుంది. మా పక్క రైతుల పొలంలో కోతలు పూర్తయ్యాయి. ఎకరాకు 25 బస్తాలొచ్చాయి. నాకు 25 బస్తాలకు మించే వస్తుందని ఆశిస్తున్నా. మంచి దిగుబడులొచ్చే అవకాశం ఉండటంతో చాలా సంతోషంగా ఉంది. – నాగేశ్వరరెడ్డి, పాత కడప, వైఎస్సార్ జిల్లా -
రసాయనేతర సస్యరక్షణ
వరిని ఆశించే క్రిమికీటకాల నివారణ వరినాట్లు వేసిన తర్వాత 30 రోజులకు 10కిలోల వేప పిండిని లేదా కానుగ పిండిని పొడి చేసి ఎకరం పొలంలో చల్లాలి. ఇది గొంగలి పురుగులను నివారిస్తుంది. వేప ఆకులను కట్టగా కట్టి ఎకరం పొలంలో పలు ప్రదేశాల్లో 10 చోట్ల పెట్టడం ద్వారా కూడా ఈ పురుగులను తరిమివేయవచ్చు. 5కిలోల ఆముదం గింజలను పెనంపై వేయించి, పొడి చేసి, దీనికి తగువిధంగా నీరు కలిపి పేస్టు(ముద్ద)గా తయారు చేయాలి. - దీన్ని మట్టి కుండలో ఉంచి ఎకరా పొలంలో 5, 6చోట్ల పెట్టాలి. ప్రతి పది రోజులకోసారి పేస్టును మారుస్తుండాలి. మట్టి కుండలపై మూత పెట్టకూడదు. ఇది రెక్కల పురుగులను ఆకర్శించడానికి ఎరగా ఉపయోగపడుతుంది. వరి పొలాల్లో నిండా నీరు పెట్టడం వల్ల నేలల్లో దాగి ఉన్న డింబక, కోశస్థ దశ క్రిములు బయటకు రావడంతో పక్షలు వీటిని తినేస్తాయి. దీనికోసం ఎకరం పొలంలో నాలుగైదు చొప్పున పక్షి స్థావరాలను ఏర్పాటు చేయాలి. వరి ఈనిన తర్వాత టీ ఆకారంలో కర్రలను క ట్టి పొలంలో అక్కడక్కడ పాతాలి. వీటిపై వాలే పక్షులు పంటలను పాడు చేసే పురుగులను తినేస్తాయి. లీటరు కిరోసిన్(గ్యాస్‌నూనె)లో అర కిలో వెళ్లుల్లిని రాత్రంతా నాబెట్టాలి. ఉదయం దీనికి పావు కిలో అల్లం, పావుకిలో పచ్చిమిర్చిని కలిపి తగినంత నీటిని వేసుకుని దీన్ని పేస్టుగా నూరుకోవాలి. దీనిలో కొన్ని మిరపకాయలు వేసి తగినంత నీటితో కలిపి పేస్టుగా చేసుకోవాలి. దీన్ని 60లీటర్ల నీటిలో కలిపి ఎకరం పైరుపై పిచికారీ చేయాలి. మిడతలు, నల్ల నల్లులు, తాటాకు తెగులు నివారణ పొలంలోని పలు ప్రదేశాల్లో కొన్ని జిల్లేడు ఆకులను ఒకదానిపై ఒకటి పేర్చాలి. వీటి ప్రభావం వల్ల మితడత లు, నల్లనల్లు, తాటాకు తెగులు నుంచి పంటలను కాపాడుకోవచ్చు. ఎకరానికి 10-15 కిలోల విప్ప పిండి లేదా వేప చెక్కలతో పదిహేను రోజులకు ఒకసారి పొలంలో పొగబెట్టాలి. 5లీటర్ల కిరోసిన్‌ను 30లీటర్ల నీటిలో కలిపి సాయంత్రం వేళల్లో పొలంలో స్రే చేస్తే చేలకు హానిచేసే పురుగులు నివారించబడుతాయి. పిండి నల్లి, ఎర్ర నల్లి నివారణ వేపగింజల పొడిని ఒక గుడ్డ సంచిలో రాత్రంతా నీటిలో నానబెట్టి, మరుసటి రోజు ఆ సంచిని పిండగా వచ్చిన కషాయాన్ని వడబోసి 50-60 లీటర్ల నీటిలో కలిపి ఎకరం పైరుపై పిచికారీ చేస్తే ఫలితం కనిపిస్తుంది. గింజలు మగ్గే దశలో ఆశించే కంపు నల్లి నివారణ సైకస్ పువ్వును 5-10 ముక్కలుగా చీల్చి కర్రలకు కట్టి ఎకరా పొ లంలో 15-20చోట్ల ఉంచితే చిన్న, పెద్ద కంపు నల్లులు ఆ పూల వాసన భరించలేక నివారించడుతాయి. 3 శాతం వేప నూనె ద్రా వకాన్ని గానీ, 5శాతం వేప గింజల కషాయాన్ని గానీ కంకి ఏ ర్పడే దశలో స్ప్రే చేస్తే ఈ కంపు నల్లి బెడదను నివారించవచ్చు.