సాక్షి, అమరావతి: పంట చేలో పాలకంకి నవ్వుతోంది. స్వేదాన్ని చిందించి సేద్యం చేసిన అన్నదాతకు దిగుబడుల రూపంలో మంచిరోజు రాబోతోంది. రాష్ట్ర ప్రభుత్వ కృషితో పెట్టుబడి కోసం చేతినిండా సొమ్ములు అందటం.. నాణ్యమైన సాగు ఉత్పాదకాలు గడప వద్దకే చేరడం.. వాతావరణం కరుణించి కరువుతీరా వర్షాలు కురవడం.. ప్రాజెక్టులు నిండుకుండల్ని తలపిస్తున్న తరుణాన రెండో ఏడాది కూడా రైతు కష్టం ఫలించబోతోంది. ప్రస్తుత రబీలో పంటల విస్తీర్ణం పెరగ్గా.. దిగుబడుల్లోనూ అన్నదాతలు రికార్డుల్ని తిరగరాయబోతున్నారు. గణాంక శాఖ తాజాగా విడుదల చేసిన రబీ–2021 దిగుబడి అంచనాలు ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి.
‘వరి’oచనున్న దిగుబడి
ధాన్యం దిగుబడులు సాధారణంగా ఖరీఫ్‌లోనే ఎక్కువగా ఉంటాయి. అలాంటిది రెండేళ్లుగా రబీలోనూ దిగుబడులు పెరిగి అన్నదాత గాదెలు ధాన్యం రాశులతో నిండుతున్నాయి. ఈ ఏడాది రబీలో ముందెన్నడూ లేనివిధంగా అపరాలతో పోటీగా వరి సాగు విస్తీర్ణం పెరిగింది. రబీ–2020లో 8.30 లక్షల హెక్టార్లలో వరి సాగవగా.. హెక్టారుకు 6,868 కేజీల చొప్పున 57 లక్షల టన్నుల ధాన్యం దిగుబడులొచ్చాయి. రబీ–2021లో సాగు విస్తీర్ణమే కాదు.. సరాసరి దిగుబడులు కూడా గణనీయంగా పెరగనున్నాయి. ఈ ఏడాది 8.81 లక్షల హెక్టార్లలో వరి సాగవగా.. హెక్టారుకు సగటున 7,025 కేజీల చొప్పున 61.89 లక్షల టన్నుల ధాన్యం దిగుబడులు వస్తాయని అంచనా వేశారు. గతేడాదితో పోలిస్తే హెక్టారుకు సగటున 157 కేజీల దిగుబడి పెరగనుండగా.. మొత్తంగా 4.89 లక్షల టన్నుల దిగుబడి పెరగబోతోందని గణాంక శాఖ అంచనా వేసింది. సాధారణంగా గణాంక శాఖ అంచనాతో పోలిస్తే దిగుబడి 20 శాతం అదనంగా ఉంటుందని వ్యవసాయ శాఖ చెబుతోంది.
ఇతర పంటలు సైతం..
సాధారణంగా ఏటా రబీలో అపరాల సాగు అధికంగా ఉంటుంది. గతేడాది 8.94 లక్షల హెక్టార్లలో అపరాల పంటలు వేయగా.. 9.90 లక్షల టన్నుల దిగుబడులొచ్చాయి. ఈ ఏడాది 9.78 లక్షల హెక్టార్లలో అపరాలను సాగు చేశారు. మొత్తంగా 10.41 లక్షల టన్నుల మేర అపరాల దిగుబడులొస్తాయని గణాంక శాఖ లెక్క తేల్చింది. మరోవైపు ఇతర ఆహార ధాన్యాల పంటలు గత రబీలో 20.63 లక్షల హెక్టార్లలో సాగవగా.. 87.35 లక్షల టన్నుల మేరకు దిగుబడులొచ్చాయి. ఈ ఏడాది 21.59 లక్షల హెక్టార్లలో ఆహార ధాన్యాలు పండిస్తుండగా.. 90.10 లక్షల టన్నుల మేర దిగుబడులొస్తాయని గణాంక శాఖ అంచనా వేసింది.
ఆయిల్ సీడ్స్ దిగుబడులూ ఘనమే
వేరుశనగ, పొద్దు తిరుగుడు వంటి ఆయిల్ సీడ్స్ పంటల విషయానికి వస్తే గతేడాది 1.14 లక్షల హెక్టార్లలో సాగవగా.. 2.51 లక్షల టన్నుల దిగుబడులొచ్చాయి. ఈ ఏడాది రబీలో ఆయిల్ సీడ్స్ సాగు విస్తీర్ణం 1.50 లక్షల హెక్టార్లకు పెరిగింది. వీటి దిగుబడులు 3.18 లక్షల టన్నులు వస్తాయని అంచనా వేశారు. వీటిలో ప్రధానంగా రబీలో ఎక్కువగా సాగయ్యే వేరుశనగ గతేడాది రబీలో 93 వేల హెక్టార్లలో సాగవగా, 2.28 లక్షల టన్నుల దిగుబడి లభించింది. ఈ ఏడాది ఏకంగా 1.13 లక్షల హెక్టార్లలో వేరుశనగ పంట సాగవగా, 2.76 లక్షల టన్నుల దిగుబడి వస్తుందని అంచనా.
మిరప.. రెపరెప
గతేడాది 17 వేల హెక్టార్లలో మిరప పంట సాగు చేయగా.. 80 వేల టన్నుల దిగుబడులొచ్చాయి. ఈ ఏడాది 39 వేల హెక్టార్లలో రైతులు మిరప వేయగా.. 1.84 లక్షల టన్నుల దిగుబడులొస్తాయని అంచనా. గత రబీ సీజన్‌లో 23.02 లక్షల హెక్టార్లలో సాగవగా, 92.43లక్షల టన్నుల దిగుబడులొచ్చాయి. కాగా ఈ ఏడాది రబీ–2021 సీజన్‌లో 24.13లక్షల హెక్టార్లలో పంటలు సాగవగా, 97.10లక్షల టన్నుల దిగుబడు లొస్తాయని అంచనా వేశారు. గతేడాదితో పోలిస్తే సాగు విస్తీర్ణం 1.11లక్షల హెక్టార్ల మేర పెరగగా, 4.67లక్షల టన్నులకు పైగా దిగుబడులు పెరగనున్నాయని గణాంక శాఖ అంచనా వేసింది.
మంచి దిగుబడులు రానున్నాయ్
రబీ–2020తో పోలీస్తే రబీ–2021లో సాగు విస్తీర్ణం పెరిగింది. దిగుబడులు కూడా గత రబీ కంటే గణనీయంగా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇటీవల గణాంక శాఖ విడుదల చేసిన మూడో అంచనా దిగుబడులు ఇందుకు అద్దం పడుతున్నాయి. ఇవి మరింత పెరిగే అవకాశాలు లేకపోలేదు. రబీలో ఈ స్థాయిలో పంటలు సాగవడమే కాదు.. రికార్డు స్థాయి దిగుబడులు రానుండటం కూడా చరిత్రలో ఇదే ప్రథమం.
– హెచ్.అరుణ్‌కుమార్, కమిషనర్, వ్యవసాయ శాఖ
55 బస్తాల వరకు దిగుబడి వచ్చేలా ఉంది
పదేళ్లుగా రబీలో సాగునీటి కోసం చాలా ఇబ్బందులు పడేవాళ్లం. రెండేళ్లుగా రెండో పంటకు సాగు నీరివ్వడంతో ఎలాంటి ఆందోళన లేకుండా సాగు చేసుకోగలిగాం. గత రబీలో మూడెకరాలు కౌలుకు తీసుకుని వరి వేశా. ఎకరాకు 45 బస్తాల దిగుబడి వచ్చింది. ఈ రబీలో ఐదెకరాలు కౌలుకు తీసుకుని ఎంటీయూ–1021 సాగు చేశా. పంట ఏపుగా ఎదిగింది. ఇప్పటివరకు తెగుళ్ల బెడద కూడా పెద్దగా లేదు. 50–55 బస్తాల మధ్య దిగుబడి వచ్చే అవకాశాలు కన్పిస్తున్నాయి.
–ఏసురత్నం,నంగవరం, తూర్పు గోదావరి జిల్లా
తొలిసారి రబీ సాగు చేశా
మేం చరిత్రలో ఎప్పుడూ రబీ సాగు చేయలేదు. గతంలో ఎప్పుడూ లేనివిధంగా కడప–కర్నూలు కాలువ (కేసీ కెనాల్) ద్వారా ప్రభుత్వం సాగునీరివ్వడంతో తొలిసారి రబీ పంట సాగు చేశాం. నాలుగు ఎకరాల్లో నెల్లూరు సన్నాలు (జీలకర్ర మసూరి) వేశా. పంట బాగుంది. మా పక్క రైతుల పొలంలో కోతలు పూర్తయ్యాయి. ఎకరాకు 25 బస్తాలొచ్చాయి. నాకు 25 బస్తాలకు మించే వస్తుందని ఆశిస్తున్నా. మంచి దిగుబడులొచ్చే అవకాశం ఉండటంతో చాలా సంతోషంగా ఉంది.
– నాగేశ్వరరెడ్డి, పాత కడప, వైఎస్సార్ జిల్లా
Comments
Please login to add a commentAdd a comment